ఈవారం ( 26/7—1/8 ) మహానుభావులు.
జయంతులు
జూలై 26
శ్రీ ప్రగడ కోటయ్య : వీరు జూలై 26, 1915 న నిడుబ్రోలు లో జన్మించారు. ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు మరియు చేనేత పరిశ్రమ రక్షణ కోసం పోరాటం చేసిన యోధుడు. ప్రాధమిక చేనేత సహకారసంఘాలు ప్రారంభించేందుకు విశేషమైన కృషి చేసారు. చేనేతరంగ అభివృధ్ధికి ఎంతో సేవ చేసారు.
జూలై 27
శ్రీ M V S హరనాథ రావు : వీరు జూలై 27, 1948 న గుంటూరు లో జన్మించారు. ప్రముఖ నాటక రచయిత, సినీ మాటల రచయిత, మరియు నటుడు. . 150 సినిమాలకు పైగా సంభాషణలు రాసారు. 20 సినిమాలలో నటించారు కూడా. 4 సినిమాలకి నంది పురస్కారం అందున్నారు.
జూలై 30
1.శ్రీ వడ్డాది సుబ్బారాయుడు : వీరు జూలై 30, 1854 న పాసర్లపూడి లో జన్మించారు. తొలితరం నాటకకర్తలలో వీరికి విశిష్ట స్థానం ఉంది. వసురాయ కవిగా ప్రసిధ్ధులయారు. వీరు ముఖ్యంగా శతకరచనకు పేరుపొందారు. సృష్టికర్త లీలను 350 పద్యాలలో వర్ణించారు. ఎన్నో సంస్కృతనాటకాలను తెలుగులోకి రసవత్తరంగా అనువదించారు.
2.శ్రీ రాచకొండ విశ్వనాధ శాస్త్రి. : రా వి శాస్త్రిగా ప్రసిధ్ధిచెందిన వీరు, జూలై 30, 1922 న శ్రీకాకుళం లో జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన వీరు తన కథల్లోకూడా న్యాయవాదే. . శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో, సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా, పాఠకుల హృదయాలకు హత్తుకు పోయేలా పదునైన రచనలు చేసారు.
3. శ్రీ పులికంటి కృష్ణారెడ్డి : వీరు జూలై 30, 1931 న జక్కిదోన లో జన్మించారు. కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్ర కథ గాయకుడు. ఆయన దాదాపు 200 కథలు, 60 వచన కవితలు, 5 దృశ్యనాటికలు, 6 శ్రవ్యనాటికలు, పది బుర్రకథలు, 4 సంగీత రూపకాలు, జానపద శైలిలో 43 అమ్మిపదాలు, 60 లలిత గేయాలు రాసారు.
వర్ధంతులు
జూలై 26
శ్రీ గోపరాజు రామచంద్రరావు : “ గోరా “ గా ప్రసిధ్ధులు. సంఘసంస్కర్త, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత. అప్పటి తెలుగు సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన ఘనత గోరాదే. దైవకేంద్ర సమాజం నుంచి మానవ కేంద్రం సమాజంవైపు పురోగమించడానికి మతానంతర సామాజిక వ్యవస్థ నిర్మాణానికి ఆయన ఎంతగానో తపించారు.
జూలై 26, 1975 న వీరు తుదిశ్వాస విడిచారు.
జూలై 27
శ్రీ అయ్యలసోమయాజుల గణపతి శాస్త్రి : ప్రముఖ పండితుడు, జ్యోతిష్కుడు, ఆధ్యాత్మికవేత్త గా ప్రసిధ్ధి చెందారు. వసిష్ఠ గణపతి ముని అనీ కావ్యకంఠ గణపతిముని అని పేరుపొందారు. భగవాన్ రమణుని ముఖ్య శిష్యులలో ఒకరు. తెలుగు, సంస్కృత భాషలందును, వేదములు, తర్క శాస్త్రము, గణిత శాస్త్రము, జ్యోతిష శాస్త్రము మరియు ఆయుర్వేదములో అసమాన ప్రతిభ చూపినారు .
వీరు జూలై 27, 1936 న స్వర్గస్థులయారు.
జూలై 29
శ్రీ వెంపటి చినసత్యం : ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు.
కూచిపూడి నాట్యంలో నృత్యనాటికలను ఎన్నిటినో రూపొందించి విదేశాలలో ప్రదర్శించి వాటికి విశేష పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేసారు. 2,800 మంది కళాకారులతో ఏకకాలంలో నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నృత్య కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు వచ్చింది.
వీరు జూలై 29, 2012 న స్వర్గస్థులయారు.
జూలై 31
శ్రీ అల్లురామలింగయ్య : ప్రముఖ సినీ నటుడు, నిర్మాత. ఆయన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసారు. ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.
వీరు జూలై 31, 2004 న స్వర్గస్థులయారు.
ఆగస్ట్ 1
శ్రీ వావిలికొలను సుబ్బారావు : ప్రముఖ రచయిత, గ్రాంధిక వాది. రామాయణం ఆంధ్రీకరించి, “ ఆంధ్ర వాల్మీకి “ అనే బిరుదు పొందారు. ఒంటిమిట్టలోని కోదండరామాలయ పునరుధ్ధరణకు ఎంతో కృషి చేసారు. ఒక సభలో సభ అందరి ఎదురుగానే కొన్ని గంటలలో ఆశువుగా రంగనాయకునిపై నూరు పద్యాలు ఆశువుగా చెప్పి శతకాన్ని పూర్తిచేసిన ఘనుడు.
వీరు ఆగస్ట్ 1, 1936 న స్వర్గస్థులయారు.