పప్పుసుద్ద - సరసి

pappusudda

అమ్మా సినిమాకి వెళదామంటున్నాడే బావ” అంది పద్దెనిమిదేళ్ళ సుబ్బలక్ష్మి గారంగా-వాళ్ళమ్మ చీర కొంగుని వేలికి చుట్టుకుంటూ.
“వెళ్ళండమ్మా దానికేం?” అంది పూర్ణమ్మ కందులు తిరగలిలో తిప్పుతూ.  సుబ్బలక్ష్మి అలియాస్ సుబ్బులు ఆనందంగా ఒక్క గెంతు గెంతి లోపలికి  పరుగెట్టింది. 

“నీ మేనల్లుడు ఇది అమిరికా అనుకుంటున్నాడేమో.. పెళ్లి కాకుండా ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరిగితే పల్లెటూళ్ళలో గుసగుసలాడుకుంటా రని తెలియదా” అంది తిరగలి సాయానికొచ్చిన పక్కింటి  పిన్ని గారు.

అనుకునే వాళ్లు ఎప్పుడైనా అనుకుంటారు.  వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామనుకుంటున్నాంగా. ఇలా విడిచిపెడితే ఒకళ్ళనొకళ్ళు అర్ధం చేసుకుంటారు” అంది పూర్ణమ్మ.

“బావా, చీర కట్టుకోనా, ఇలా లంగా ఓణీతోనే  వచ్చెయ్యనా?” అడిగింది  సుబ్బులు ముందు గదిలో.  “ఏదో ఒకటి.. అసలు  కట్టుకుంటే చాలు అన్నాడు రాకేశ్ పుస్తకంలోంచి తల పైకెత్తకుండా.   సుబ్బులు చిన్నబుచ్చుకోలేదు.  చీర కట్టుకుంది.  

సాయంత్రం నాలుగవుతుండగా  ఇద్దరూ  వీధిలోకొచ్చారు. పాలేరు  సైకిల్ తెచ్చి గుమ్మం ముందు స్టాండు వేసి  గుడ్డతో తుడుస్తున్నాడు.  “స్కూటర్ ఉంటే  బాగుండేది.” అన్నాడు రాకేశ్.

“మాకు స్కూటర్ లేదు. అన్నయ్య కూడా  సైకిలే తొక్కుతాడు. అయినా స్కూటర్ని కాలవ దాటించలేం. పోనీ నడిచివెళదామా కాలవ దాకా  సరదాగా? ఎంతో దూరం లేదు.” అంది సుబ్బులు  చిన్నగా నవ్వుతూ. పప్పుసుద్ద నవ్వినట్టు తోచింది రాకేశ్ కి .

“చాల్చాలు.. ఎక్కు సైకిలు. అంటూ తను సీటు మీద కూర్చుని ఆమెని  వెనక కూర్చోబెట్టుకున్నాడు. ఆమె కూర్చున్నాక పెడల్ మీద కాలేసి తొక్కి ముందుకు లాగించబోయాడు కానీ బేలన్సు కుదరక  అటూ ఇటూ ఊగిపోయింది సైకిలు. సుబ్బులు కింద పడిపోయింది.  

“తగిలిందా ఎక్కడైనా?” సైకిల్ దిగి అడిగేడు రాకేశ్.   మోచెయ్యి గీరుకుపోయి చుర్రు  మంటున్నా చూసుకుంటే బావకి తెలిసి, ఫీలై పోతాడని  “ఏం తగల్లేదు ” అంది సుబ్బులు చేతి వంక చూసుకోకుండా.  

“ సారీ .. చాలా కాలవైంది  సైకిల్ తొక్కి.  వెనక వొద్దులే ముందు కూర్చో” అంటూ ముందు కూర్చోబెట్టుకుని సైకిల్ ముందుకు లాగించేడు రాకేశ్.

“మీకు  సైకిల్ తొక్కడం వచ్చా సుబ్బలక్ష్మి గారూ?” అడిగేడు దారిలో. తల వంచుకుని చిన్నగా నవ్వింది సుబ్బులు.  “రాదని చెప్పొచ్చుగా? సైకిల్ రాదు.. మరేం వొచ్చు? కర్ర తీసుకుని  ఆవుల్నీ, గేదెల్నీ కాస్తావా?” అంటూ  నెత్తి మీద చిన్నగా  మొట్టేడు.  సుబ్బులు నవ్వింది గోళీసోడా కొట్టినట్టు .

కాలవ గట్టున రావి చెట్టుకి సైకిల్ ఆన్చి తాళం వేసి  దోనె (బల్లకట్టు) ఎక్కేరిద్దరూ.  “అల్లుడు గారాండీ” అడిగేడు దోనె  తోసే మనిషి. సుబ్బులు సిగ్గుతో అవునన్నట్టు తలూపి, “ బావా, గంగరాజనీ..  మేము హై స్కూల్ కి రోజూ ఇదే దోని దాటెళ్లి   అవతలి వూళ్ళో  ఐదేళ్ళు  చదువు కున్నాం అందరినీ దాటిస్తాడు కాని తను మాత్రం దాటడు పాపం” అంది సుబ్బులు. దోనె  అంచునున్న  కమ్మీకి ఒక ఇనప తీగె కట్టి, రెండో వైపు  నీళ్ళలో లోతుగా ఎక్కడో   కట్టినట్టుంది.  దాని వంకే చూస్తున్న రాకేశ్ తో ఆ ఏర్పాటు గురించి  చెప్పింది సుబ్బులు “కాలవ మధ్య  నేలలో  ఒక గుంజ పాతి, దాని నుంచి   ఈ ఇనపతీగెను లాగి దోనికి కట్టేరు.  ఇందువల్ల నీళ్ల వడికి  దోని కిందికి కొట్టుకుపోదు. కేవలం ఆ వొడ్డుకీ, ఈ వొడ్డుకీ   గెడ కర్ర సాయంతో సులభంగా  తోసుకోవడమే. ఇదోరకం టెక్నాలజీ!” 

‘ఓహో’ అన్నట్టు రాకేశ్ తలాడించి “ఏదీ ఆ కర్ర ఇలా ఇవ్వు నేను తోస్తా” అంటూ గంగరాజు చేతిలోంచి గెడ తీసుకున్నాడు.  “ మీకు అలవాటు లేదు బాబూ. కష్టం” అన్నాడు గంగరాజు.

“ఇదేవన్నా బ్రహ్మ విద్యా” అంటూ  ఆ  గెడ చివరని   నీళ్ళలో వేసాడు రాకేశ్.  అది  నీళ్ళ కింది  నేలని తాకకుండా ప్రవాహ వేగానికి నీళ్ళలో జారిపోతోంది.  “అలాక్కాదండి.  బులబులాగ్గా చెయ్యి పట్టు వొదిలి ఇలా బల్లెంతో పొడిచినట్టు జోరుగా వొదలాలండి”  అంటూ గంగరాజు గెడని తీసుకుని చూపించాడు.   రాకేశ్ మళ్ళీ  తీసుకుని బలంగా అయితే విసిరేడు కానీ గెడని పూర్తిగా వదిలేసాడు.  అది  జారిపోయి  నీళ్ళలో పడి, చూస్తూ ఉండగా  కొట్టుకుపోయింది దూరంగా. 

“బలే పని చేశారబ్బాయి గారూ” గంగరాజు గగ్గోలెట్టాడు. తల పట్టుకున్నాడు. రాకేశ్ గతుక్కుమన్నాడు.  మరో  కర్ర ‘స్పేర్’ లో ఉండబట్టి దోనె  నడిచింది. ఇద్దరూ గట్టెక్కారు.  దిగేటప్పుడు రాకేశ్ చూడకుండా గంగరాజు చేతిలో రెండు వందలు పెట్టింది సుబ్బులు. జరిగిన అవమానానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వనట్టు నటిస్తూ, తననెక్కడ అసమర్దుడనుకుంటుందోనని మాట మార్చేసి,  “కంప్యూటర్ కోర్సులు ఏవైనా చేసావా? ఊరికే కాలేజీకి వెళ్ళొచ్చి టీవీ చూస్తూ కూర్చోడమేనా? ఇంగ్లీష్ లో కొద్దిగానైనా  మాట్లాడగలవా? మీ టీచర్లకే  రాదు నీకెక్కడొస్తుంది? ఈ రోజుల్లో  కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం” అన్నాడు రాకేశ్.  అన్నిటికీ  ‘ఊ ఊ’ అంటూ తల ఎటూకాకుండా ఆడించింది సుబ్బులు.  “ఒట్టి పల్లెటూరి పప్పు సుద్ద” అన్నాడు రాకేశ్.  ఈలోగా బస్సొచ్చింది.

బస్సెక్కి టౌన్ చేరుకొని, హోటల్లో  టిఫిన్ తిన్నారు. తర్వాత   సినిమా హాల్ చేరుకొని   బాల్కనీకి టికెట్లు తీసాడు.  దారిలో మల్లెపూల దండ కొనిపించుకుంది సుబ్బులు. తలలో పెట్టుకుని  చేరువగా  పూల పరిమళం అతనికి   తగిలేలా కూర్చుంది. అతడి చేతి మీద  సుతారంగా వేలితో డిజైన్లు గీస్తోంది. బావలో స్పందన కరువైంది.  పక్క సీట్లలో ఎవరూ లేరు.  సినిమాలో కామెడీ సీన్లు వచ్చినపుడు పిచ్చిగా నవ్వుతున్న సుబ్బులు కేసి ఓరగా చూసి  నవ్వుకున్నాడు రాకేశ్.  ‘చీప్ కామెడీకి ఇంత నవ్వా?”  అనుకున్నాడు. సినిమా అయ్యేక  బయటికొచ్చి బస్సెక్కితే అది అరగంటలో   కాలవ గట్టున దింపింది.  అదే ఆ రూట్లో  చివరి బస్సు. అప్పటికి టైం తొమ్మిదిన్నర దాటింది. పుచ్చపువ్వులా వెలుగుతోంది వెన్నెల.   ప్రశాంతంగా పారుతోంది  కాలువలో నీరు.   దోనె  అవతలి గట్టునుంది.

“గంగరాజూ దోని తోసుకురా’ అని గొంతెత్తి గట్టిగా పిలిచింది సుబ్బులు. సమాధానం లేదు. అటువైపు  మనిషున్న జాడ లేదు. ఏ పక్కకైనా వెళ్లి ఉంటాడని కొద్దిసేపు చూసారిద్దరూ.

“బావా ఈ వెన్నెల, చల్లగాలి, నిశ్శబ్దంగా  పారుతున్న నీళ్ళు ఎంత బావున్నాయో కదా” అంది సుబ్బులు రాకేశ్ పక్కన తగుల్తూ  కూర్చుంటూ. “చూడు చూడు .. ఈ మిణుగురు పురుగు  నీ చేతి మీద కూర్చుని నీకేదో చెబుతోంది, విను” అంది. “ఏమంటోందో నువ్వు  విని చెప్పరాదూ..నాకు ఆ భాష రాదు” అన్నాడు రాకేష్. “ వాడు దోని తీసుకురాకపోతే  రాత్రి ఇక్కడే జాగారం చెయ్యాలి మనం” అన్నాడు రాకేశ్ చిరాగ్గా.  ‘అంతకన్నానా! ఆ పరిస్థితే వస్తే నిజంగా ఈ వెన్నెల్లో రాత్రంతా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ..ఎంత బాగుంటుందో కదా' అందామనుకుని అతని ‘మూడ్’ చూసి  విరమించుకుందామె.

ఎంతసేపటికీ అవతలి గట్టు మీద మనిషి ఉలుకూ పలుకూ లేదు. “ ఒకళ్ళం ఈదుకుంటూ వెళ్లి దోన్ని  తోసుకు రావాలి. అదే మార్గం” అంది సుబ్బులు తనలో అనుకుంటున్నట్లు. “సరే అయితే నే వెళతా” అంటూ షర్టు విప్పేడు రాకేశ్.   “వద్దు బావా.. కాసేపు చూద్దాం ఎవరైనా అటువైపు నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు” అంది సుబ్బులు.

“నాకు ఈత రాదనుకుంటున్నావా?” అన్నాడు రాకేశ్ నవ్వి.  ఇంటి దగ్గర సైకిల్ డబుల్స్ తొక్కలేక ఆమెను కింద పడెయ్యడం, దోనె  తోసే గెడని నీళ్ళలో వొదిలెయ్యడం -  ఈ అవమానాలు  మరిచిపోలేకపోతున్నాడతడు. ఇలా ఏదో ఒక సాహస చర్య ద్వారా తన ప్రతిష్టని నిలుపుకోవాలి.

“ మీ దగ్గర స్విమింగ్ పూల్లో ఈతకీ, ఇక్కడి  కాలవలో ఈతకీ  తేడా ఉంటుంది బావా. అవి నిలకడ నీళ్లు.  ఇది ప్రవాహం.” చిన్నగా అంది సుబ్బులు బావ నొచ్చుకోకూడదని. ఆమె వారిస్తున్నా వినకుండా ప్యాంటు కూడా విప్పి చిన్నలాగూ, బనీనుతో నీళ్ళలోకి దబ్బున దూకేసేడు.  కంగారు పడిపోయిందామె. అతనివైపే చూస్తూ ఉండిపోయింది.

పదిపదిహేను అడుగులు వేగంగా ఈదేడు.  బాగానే ఈదుతున్నాడని సుబ్బులు  తృప్తి పడింది. అయితే కొద్ది దూరం వెళ్ళేక అతని వేగం తగ్గింది. ప్రవాహం వడి  అతడి ప్రయత్నానికి అడ్డుపడుతూ  కిందికి నెట్టెయ్యసాగింది.  ముందుకు వెళ్ళడానికి అతడెంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడంలేదు. అయినా ప్రయత్నం ఆగలేదు. ప్రవాహం అతడి  శక్తిని హరించేస్తోంది.   అలసిపోయాడు. కొద్ది దూరం వెళ్ళగలిగేడు కాని అవతలి గట్టుకు చేరడం అసాధ్యం అని తేలిపోయింది. వెనక్కి మళ్ళాలి. అహం అడ్డు వచ్చింది. శక్తి నశించింది.  కళ్ళు తేలేసేడు.  

గట్టుమీద నించి చూస్తున్న సుబ్బులుకి పరిస్థితి అర్ధం అయి కంగారు పడింది.  బావని వెనక్కి తీసుకురావాలి.  చీరని గోచీలా పెట్టుకుని నీళ్ళలోకి అమాంతం దూకింది. చేతులు బారలు వేస్తూ ఈదుకుంటూ కిందికి కొట్టుకుపోతున్న అతడిని చేరుకుంది.   “ బావా కంగారు పడకు. నన్ను పట్టుకో” అంది. అతడికి  ఆమె చీర పట్టు దొరికింది. అది నిర్ధారించుకుని వెనక్కి తిరిగి  శక్తినంతా ఉపయోగించి ఈదసాగింది. ప్రవాహం వడిలో ఒకరు ఈదడమే కష్టం అయితే మరో మనిషిని లాక్కుంటూ ఈదడం ఎంత కష్టం!! ఇక్కడ శక్తి తో బాటు ‘టెక్నిక్ ‘ కూడా అవసరం. ఆ రహస్యం తెలిసిన సుబ్బులు ఏటవాలుగా ప్రవాహం సాగుతున్న దిశలో ఈదసాగింది. దీనివల్ల సగం   శక్తి ఆదా అవుతుంది. తాము బయలుదేరిన వైపు  బాగా దిగువన సుమారు  రెండు వందల గజాల దూరంలో గట్టుకు చేరుకోగలిగారిద్దరూ. ఆయాసంతో రొప్పుతూ చతికిలబడ్డారు.  ఇద్దరికీ నోట మాటలేదు. తేరుకున్నాక “రా బావా..టేక్ ఇట్ ఈజీ” అంటూ చెయ్యి ఊతం ఇచ్చి లేపి బయలుదేరిన చోటుకు  తీసుకొచ్చింది. అక్కడే అతడి బట్టలు, ఆమె బ్యాగూ ఉన్నాయి. 

సుయోధనుడు మయసభ నించి వచ్చేక కుమిలిపోయినట్టు బాధపడిపోసాగేడు రాకేశ్.  తను నీళ్ళలోకి దూకాలని ఎందుకు అనుకోవాలి? అనుకున్నాడు సరే సుబ్బులు చెప్పినపుడైనా ఎందుకు విరమించుకోలేదు? విరమించుకోలేదు సరే వడి వేగం అడ్డుపడుతున్నపుడైనా ఎందుకు వెనుతిరగలేదు? ఒక ఆడది వచ్చి తనని రక్షించడమా? తన శక్తి ఏమైపోయింది? ఈ రోజు ఎందుకిన్ని అవమానాలు!
“బావా” అతడి ఆలోచనలకు అంతరాయం కల్పిస్తూ సుబ్బులు “ రెస్టు తీసుకో. ఆలోచించకు. నేను దోని తోసుకొస్తా.. ఇద్దరం దాని మీద దాటుదాం ” అంటూ అతడు వారిస్తున్నా వినకుండా నీళ్ళ లోకి దూకింది.

‘షాకు మీద షాకు’! సుబ్బులు అవతలి గట్టుకు ఈదుకుంటూ వెళుతుందా? అవును. తనకి ఈత బాగా వచ్చని తెలిసిందిగా ఇపుడు. వెళ్ళగలదు. తరవాత దోనిని తోసుకొస్తుందా? అది మాత్రం అసాధ్యం!  అసలే ఆడపిల్ల! పైగా అర్భకురాలు.  తన వల్లే కానిది ఈమెతో అవుతుందా?

చూస్తూ ఉండగా సుబ్బులు అవతలి గట్టుకు చేరుకుంది.  గట్టెక్కి దోనికి కట్టిన తాడు విప్పింది. దోనెక్కి గెడ సాయంతో తోసుకురాసాగింది. రాకేశ్ కళ్ళూ, నోరు తెరుచుకున్నాయి అప్రయత్నంగా ఆశ్చర్యంగా.

ఈ దశలో అతడికి చిన్నప్పుడు చదువుకున్న కథ ఒకటి గుర్తుకొచ్చింది.  ఒక స్కాలర్ పడవ ఎక్కి పడవ నడిపేవాడిని “నీకు చదువొచ్చా” అని అడిగేడట.  “రాదు బాబయ్యా” అన్నాడతడు. దానికి ఆ పండితుడు నవ్వి “ చదువు రాకపోతే  నీ జీవితం సగం వేస్టు” అన్నాడు.  పడవ నది మధ్యలోకి వెళ్ళేక పెద్ద గాలి, వర్షం ప్రారంభమయ్యాయి.  “అయ్యా , మీకు ఈత వచ్చా” అని  పడవతను పండితుణ్ణి అడిగేడు.  రాదన్నాడాయన.  “ఈత రాకపోతే మీ పూర్తి జీవితం వృధా. . పడవ మునిగిపోతోంది” అంటూ నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయాడు పడవ మనిషి. ఆ కథ పూర్తిగా తనకి వర్తిస్తుంది అనుకున్నాడు రాకేశ్. ఆ స్కాలర్ పడవ మనిషిని చూసినట్టే తను సుబ్బుల్ని చూసాడు. తను ప్రాణ రక్షణ  విద్య నేర్చుకుని తనని కాపాడింది.  

గట్టుకు దోనె చేరుకోగానే రాకేశ్ ఎక్కాడు. కాలవ దాటుతున్నంత సేపూ సుబ్బులు ఎంత లాఘవంగా గెడ వేస్తోందో,  ఎంత చాకచక్యంగా నడుపుతోందో  చూస్తూనే ఉన్నాడు. దోనెని  నడపడానికి కావలసింది ‘శక్తి’ కాదు  ‘టెక్నిక్’ అని అర్ధవైందతనికి.  

అవతలి గట్టుకి  చేరుకున్నాక దోనెని తాడుతో కాట్టేసింది సుబ్బులు.  “ అయాం వెరీ సారీ సుబ్బులూ.  ఇంతకాలం నేను అమెరికాలో ఉన్నానని, ఇండియాలో పల్లెటూర్లో ఉన్న నువ్వు వట్టి ‘పప్పుసుద్ద’వనీ అనుకుంటూ నీ గురించి చాలా హీనంగా, తక్కువగా ఊహించుకున్నాను.  అది ఎంత తప్పో ఈ రోజు తెలిసింది.  ఒప్పుకోడానికి నేను సిగ్గు పడటం లేదు.  నువ్వు నాకన్నా ఎంతో ఎత్తులో ఉన్నావు. నాకెన్నో విద్యలొచ్చనుకున్నాను.  ఆ  విద్యలేవీ నా ప్రాణాన్ని కాపాడలేదు. నువ్వు కాపాడేవు.  నీ ఋణం ఎలా తీర్చుకోవాలి? ‘యు ఆర్ గ్రేట్’ సుబ్బులూ. ” అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు.  “ ఇందులో గ్రేట్ నెస్ ఏదీ లేదు బావా. ఈ పల్లెటూళ్లలో  స్వతస్సిద్ధంగా అందరికీ ఈ విద్యలొస్తాయి. 

మీ ఇంగ్లీషులో చెప్తారు చూడు ‘నెసెసిటీ ఈజ్  ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ‘ అని. మా అవసరాలే  మాకీ  విద్యల్ని నేర్పిస్తాయి. మా చుట్టూ ఉండేవి పొలాలు, పశువులు.  అందువల్ల వ్యవసాయం చేసే విద్య, పశువుల్ని సాకే విద్య వస్తాయి. కాలవల్లో యీతలొస్తాయి. చెట్ల పెంపకం వస్తుంది. అలాగే వెన్నెల్లో ఆడుకోవడం, పైరగాలి కోసం తహ తహ లాడిపోవడం, మట్టి వాసన నిచ్చే  తొలకరి కోసం ఆశగా చూడటం -  ఇవన్నీ సహజంగా అబ్బుతాయి.  మేము పల్లెటూరివాళ్ళం. ఆందువల్ల నువ్వు నన్ను ‘పల్లెటూరి పప్పుసుద్ద’ అని అన్నపుడల్లా నాకు ఆనందంగా ఉంటుంది తప్ప  చిన్నబుచ్చుతున్నావని ఎన్నడూ అనుకోను. అది గొప్ప కితాబుగాను, సర్టిఫికెట్ గాను కూడా అనుకుంటా.  నువ్వలా పిలిస్తే గర్వంగా కూడా ఉంటుంది.” అంది సుబ్బులు. 

రాకేష్ అచేతనంగా నిలబడిపోయాడు కొద్ది క్షణాలు. చీకట్లోంచి ఒక్కసారి వెలుగులోకి వచ్చినట్టనిపించింది అతనికి. కంట్లో ఒక  చిన్న నీళ్ల  చుక్క  మెరిసింది వెన్నెల్లో.  తరవాత,  చెట్టు కింద పెట్టిన సైకిల్ రోడ్డెక్కింది. ఆమె సీటు మీద కూర్చుని తొక్కుతోంది. అతడు ఆమె వెనకే కూర్చున్నాడు!

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి