శేషాచలం అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు . ఆకలనిపించినప్పుడు దొరికిన జంతువును తినడం హాయిగా నిదురించడం ఆ రాక్షసుడి అలవాటు . ఒక సారి ఆ రాక్షసుడికి మనిషి మాంసం తినాలన్న కొత్త కోరిక కలిగింది .
అడవిలో క్రూర మృగాలతో పాటు రాక్షసుడు ఉన్న సంగతి ప్రజలలో తెలిసినందు వల్ల ప్రజలతో పాటు వేటగాళ్లు అడవి వైపు పోవడం మానుకున్నారు. ఆ రాక్షసుడికి తన కోరిక నెరవేరడం కష్టమనిపించింది . ఒకసారి అడవి గుండా ఒక సాధువు వెళ్లడం చూసాడు .సాధువులను రాక్షసులైనా క్రూర జంతువులైనా ఏమీ చేయలేవు కావున దైర్యంగా వెళ్తారు .
రాక్షసుడు సాధువు దగ్గరకెళ్ళి "స్వామీ నాకు మానవులలో కలసి కొంత కాలం జీవించాలని ఉంది . నాకు మానవుడి రూపం ప్రసాదించండి " అడిగాడు సాధువు తన కమండలం లోని నీరు చేతిలోకి తీసుకొని ఒక్క సారి ప్రార్ధించి ఆ రాక్షసుడిపై చల్లాడు. ఒక్కసారిగా చక్కటి రూపుగల యువకుడిగా మారిపోయాడు.
"రాక్షస మానవా నీవు అనుకున్నపుడు రాక్షస రూపంలో లేక మానవ రూపంలో మారవచ్చు . మానవుల దగ్గర రాక్షస గుణంతో ప్రవర్తించితే నీవు మరణిస్తావు "అన్నారు
మానవ రూపంలో ఉన్న ఆ రాక్షసుడు అడవి నుంచి బయలు దేరి నగరానికి చేరుకొని సుబుద్ధి అన్న పేరుతో జీవించసాగాడు
మొదట కూలీగా పని చేసి అందులో వచ్చిన ధనంలో కొద్దీ భాగం కూడబెట్టసాగాడు .కొంతకాలానికి ఆ కూడబెట్టిన డబ్బుతో మిఠాయి వ్యాపారం ప్రారంభించాడు .
నగరానికి వెళ్లిన మొదట్లో మనిషిని తిందామన్న ఆశ కలిగినా ఆ తరువాత తనకు మరణం కలుగుతుందన్న భయంతో ఇకపై ఆలోచించకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మానవ జీవితం విసుగనిపిస్తే మరలా రాక్షస రూపంతో అడవికి వెళదామనుకొన్నాడు. మనిషి రూపంలో ఉన్న సుబుద్ధి మిఠాయి వ్యాపారస్థుడిగా , సమాజంలోనూ మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొన్నాడు. అతని మంచితనం నడవడిక చూసిన ఆ నగర వాసులు కొంతమంది "నీవు అంగీకరిస్తే మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాము "అంటూ అడిగారు .తన అసలు రూపం గురించి వీరికి తెలిస్తే ఇలా అడగరు అనుకొని సమాధానం చెప్పడానికి కొంత సమయం అడిగాడు.
చిన్నారులను చాలా ప్రేమతో పలుకరించి తన అంగడిలో మిఠాయిని ఉచితంగా పంచేవాడు. సుబుద్ధి అంగడికి ఎదురుగా ఉన్న ఇంటిలో ఒక కుటుంబం జీవించసాగింది. ఆ ఇంటిలోని దంపతులకు జ్యోతి అను ఒక తొమ్మిదేళ్ల అమ్మాయి సుబుద్ధిని ' మిఠాయి అన్నయ్యా 'అంటూ చనువుగా మాట్లాడుతూ వ్యాపారంలో వద్దన్నా వినకుండా చిన్న చిన్న సహాయం చేయడంతో పాటు వ్యాపారం లేని సమయంలో భారత రామాయణ కథలను చెప్పసాగింది. జ్యోతిని తన సొంత చెల్లెలులా భావించసాగాడు సుబుద్ధి .
ఒకరోజు ఉదయం సుబుద్ధి నిదుర లేచి కాలకృత్యములు తీర్చుకొని పూజ చేసుకొంటున్న సమయాన ఇద్దరు యువకులు వచ్చి "సుబుద్ధీ ,మీ అంగడి ఎదురుగా ఉన్న ఇంటిలోని జ్యోతిని ఇద్దరు దుండగులు ఎత్తుకొని గుర్రం బండిలో వెళ్తున్నారు .అడ్డు పడిన వారిని తమ దగ్గరున్న ఆయుదాలతో తీవ్రంగా గాయ పరచి నగరం దాటడానికి వెళ్తున్నారు " .అన్నారు . ఆ మాటలు విన్న మరుక్షణమే మెరుపు వేగంతో నగర పొలిమేరలో ఆ కీచకుల కోసం ఎదురుచూడసాగాడు
గుఱ్ఱంబండి రాగానే అడ్డుగా నిలిపాడు.
"రేయ్ దుర్మార్గుల్లారా మర్యాదగా జ్యోతిని విడిచిపెడతారా ....లేక మీ అంతం చూడాలా "బిగ్గరగా సుబుద్ధి అన్నాడు
"ఒరే... మిఠా యీ నిన్ను మిఠాయి చప్పరించినట్లు చప్పరిస్తాము మా దారికి అడ్డులే ......" అన్నాడు ఒకడు సుబుద్ధి ఓపికతో ఎన్నోవిధాల చెప్పిచూసినా ఆ కిరాతుకులు జ్యోతిని విడిచిపెట్టడానికి అంగీకరించలేదు
"జ్యోతిని విడిచిపెట్టు నీకెంత సొమ్ములు కావాలన్న ఇస్తాము "అన్నాడు సుబుద్ధి "సొమ్ములు మాకెందుకురా మేము జమీందారు బిడ్డలం .అందమైన ఈ జ్యోతి కావాలి .ఒక వారంరోజులు ఆ తరువాత విడిచిపెడతాము "అన్నారు వికృతంగా నవ్వుతూ సుబుద్ధి ఒక్క క్షణం ఆలోచించాడు కనులు మూసుకొని తన రాక్షస రూపం కావాలని కోరుకున్నాడు అతను రాక్షస ఆకారం ధరించాడు .ఆ కీచకులను తరుముకొంటూ వచ్చిన ప్రజలు సైనికులు అక్కడకు వచ్చి సుబుద్ధి రాక్షస రూపం చూసి భయంతో ఆశ్చర్యంతో చూడసాగారు .
"ఓరే, అభం శుభం తెలియని చిన్నారి బాలికను మీ కోరికకు ఛీ ....మానవత్వం అణు మాత్రమయినాలేని మీ కాళ్ళూ చేతులు విరిచి చంపగలను .మీ లాంటి పాపుల రక్తం ఈ భూమాత పై పడగూడదు .అందుకే మీ ఇద్దరినీ నేనే నమిలి మింగుతాను. ఈ మధ్య బాలికలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.అలాంటి చేదు ఆలోచనలు ఉన్నవారికి మీకు విధించే శిక్ష తో మార్పు కలుగుతుంది.".
"మీరు ఇంతటి శక్తిమంతులని తెలీదు.మమ్మల్ని విడిచిపెట్టండి "భయంతో వణుకుతూ వేడుకొన్నారు
"మిమ్మల్ని విడిచిపెడితే నేను మరికొంత కాలం జీవించగలను.నాకు మరణం కలిగినా పరవాలేదు మరణించడానికి ముందు ఒక మంచి పని చేసాను అనుకొంటూ తృప్తిగా కనులు మూస్తాను "అంటూ ఇద్దరు కిరాతకుల్ని ఒక్కొక్క చేత్తో ఎత్తుకున్నాడు .ఇద్దరినీ నమిలి మిగగానే ఇక తనకు కొన్ని క్షణాల్లో మరణం తప్పదనుకొంటూ అక్కడున్న వారి వాపు చూస్తూ చేతులు జోడించి అక్కడే పడుకొని కనులు మూసుకున్నాడు .
కనులు తెరచి ఆశ్చర్యపోయాడు .మరలా సుబుద్ధి రూపంలో ఉన్నాడు .ఎదురుగా సాధువును చూస్తూ "స్వామీ నేను ఇంకా బ్రతికేఉన్ననా " ఆశ్చర్యంగా అన్నాడు
"సుబుద్ధీ నీవు రాక్షసుల దగ్గర రాక్షసంగా ప్రవర్తిస్తే మరణం ఎలా వస్తుంది. మానవుల దగ్గర రాక్షసంగా ప్రవర్తిస్తేనే నీకు మరణం కల్గుతుంది "అన్నాడు సాధువు ఒక వ్యాపారస్తుడు సుబుద్ధి దగ్గరకు వచ్చి"సాధువు మీ గత చరిత్ర అంతా చెప్పారు ఇంతకాలం మీరు పెండ్లికి ఎందుకు అంగీకరించలేదో ఇప్పుడు మాకు అర్థమైయింది. మనిషి లో దాగున్న రాక్షసుడికంటే , మానవత్వం గల మీలాంటి మనిషి ఎన్నోరెట్లు నయం .మీరు అంగీకరిస్తే మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు .
సాధువు సుబుద్ధి వైపు చూస్తూ అంగీకరించమని చిరునవ్వుతో సైగ చేశారు .