'ఉషశ్రీ' గా పిలువబడే శ్రీ పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు గారు ప్రఖ్యాత రేడియో వ్యాఖ్యాత, పురాణ ప్రవచకులు, రచయిత. విలక్షణమైన ఆయన కంఠస్వరం, సలక్షణమైన భాష, శ్రోతలను ఆయన కార్యక్రమం పూర్తి అయ్యేదాకా రేడియో ముందు కట్టి పడేస్తాయి. పురాణాలు, భారత, భాగవత, రామాయణాల మీద ఆయన మంచి పట్టు సాధించారు. ఆయన ప్రత్యేకత ఏమిటంటే, చెప్పింది చూసినట్లుంటుంది. ఆ రోజుల్లో రేడియోలో వీరు నిర్వహించిన 'ధర్మ సందేహాలు' అనే కార్యక్రమం విశేష ప్రజాదరణ పొందింది. ఇంటింటా ఆయన గొంతు ఖంగుమనేది. ఆ గొంతుకు ఎంత గుర్తింపు వచ్చిందంటే, ఆ రోజుల్లో ప్రతి ధ్వన్యనుకరణ కళాకారుడు ఆయనను తప్పకుండా అనుకరించేవాడు. ఈ మంచి 'మాటకారి'ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం!
ఈయన 16-03-1928న పండితులకు నిలయమైన కాకరపర్రు అగ్రహారంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లి తండ్రుల వద్ద భారత, భాగవతాది గ్రంధాలను గురించి కూలంకషంగా తెలుసుకున్నారు. త్రికాల సంధ్యావందనం చేసేవారు. షోడశ కర్మలు చక్కగా చేయించే వైదిక విద్యను క్షుణ్ణంగా నేర్చుకున్నారు. అలానే ఆయుర్వేద వైద్యాన్ని కూడా నేర్చుకున్నారు. వీరి తండ్రి గారైన శ్రీ రామమూర్తి గారు జాతీయ్యోద్యమ నాయకుడు, కాంగ్రస్ సేవకుడు. తల్లి శ్రీమతి కాశీ అన్నపూర్ణమ్మ గారు. వారి పెద్దబ్బాయే శ్రీ ఉషశ్రీ గారు.
చిన్నతనంలోనే వారి నాన్నగారు ఈయన చేత సుందరకాండను పారాయణం చేయించారు. శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారి వద్ద వ్యాకరణాన్ని, తర్కాన్ని నేర్చుకున్నారు. శ్రీయుతులు నండూరి రామకృష్ణమాచార్యులు, దిగువర్తి సీతారామస్వామి గార్లు ఇతనిలోని వాక్పటిమను గుర్తించి, విషయాన్ని ఆకట్టుకునే విధంగా చెప్పటంలోని మెళుకువలు నేర్పారు. భీమవరం కళాశాలలో తెలుగులో పట్టాను పుచ్చుకొని, పొట్టకూటి కోసం హైదరాబాద్ కు పయనమయ్యారు. మొదట్లో ఆంధ్రభూమి, ఆంధ్రజనత, ప్రజాప్రభ పత్రికలలో కొంతకాలం పనిచేసారు. 1965లో ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రంలో నెలకు 200 రూపాయల జీతంతో సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆయనలోని ప్రతిభను ఇట్టే గుర్తించిన శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు, "మీరు బాగా నోరు పెట్టుకొని బతుకుతారు" అని చమత్కారంగా అన్న మాటలు అక్షరాలా నిజమయ్యాయి. శ్రీ ఉషశ్రీ గారు శ్రీ రజనీకాంతరావు గారిని జీవితాంతం గుర్తుంచుకున్నారు.
వీరు 1956 నుండే ప్రవచనాలు చెప్పేవారు. ఆ రోజుల్లో వీరు రాజమండ్రి, భీమవరాల్లో ప్రసిద్ధ దేవాలయ ప్రాంగణాలలో ప్రవచనాలు చెబుతుంటే, కొత్త సినిమా విదులైన మొదటి రోజు ప్రేక్షకులు సినిమా హాలుకి ఎలాగైతే చేరేవారో, అలా చేరేవారు ఈయన ప్రవచనాలు వింటానికి. కొత్త సినిమాకి మొదటి వారమే ఆ రద్దీ ఉండేది. కానీ, ఈయన ప్రవచనాలు పూర్తి అయ్యేదాకా జనం పెరుగుతుండేవారు. అలా ఆయన ప్రతిభ అఖిలాంధ్ర మహాశయులు రేడియోలో వింటానికి, అ తర్వాత దాదాపు ఒక దశాబ్దం పట్టింది. శ్రీ రజనీ గారు వీరిని బాగా ప్రోత్సహించారు. చదువుకునే రోజుల్లో, వీరిని ప్రభావితంచేసిన వారిలో జమ్మలమడక మాధవరాయ శర్మ, విశ్వనాధ సత్యనారాయణ గార్లు ముఖ్యులు. విశ్వనాధ వారంటే వీరికి ప్రాణం. విశ్వనాధ గారి వేయిపడగలు, రామాయణ కల్పవృక్షం పెక్కుసార్లు అధ్యయనం చేసారు. ఆ ప్రేరణతో వీరు మేనక అనే గ్రంధాన్ని వ్రాసారు. వీరు వ్రాసిన నృత్య నాటికలు, గేయాలు, కథలు... భారతి, కృష్ణాపత్రికలలో ప్రచురించబడ్డాయి. వీరు నటులు కూడా! ఆ రోజుల్లో ప్రఖ్యాత నాటకమైన శ్రీ బెల్లంకొండ రామదాసు గారు రచించిన 'పునర్జన్మ' నాటకంలో తండ్రి పాత్రను అద్వితీయంగా పోషించి బహుమతులు పొందారు.
ఇంతటి ప్రజ్ఞావంతుడు కనుకనే, శ్రోతలను ఆకట్టుకునే విధంగా రేడియోలో ప్రవచనాలు చెప్పగలిగారు. మొదటిసారిగా 1973 లో, భారతంలోని ఘట్టాలతో ఆయన ప్రవచనాలు రేడియోలో మొదలయ్యాయి. అప్పటినుండి వీరి నోటికి అదుపు, హద్దు లేదు! 1979 లో తిరుపతి దేవస్థానం వారు వీరి చేత వచన భాగవతాన్ని వ్రాయించారు. వీరు పూర్తి సాంప్రదాయవాది. ఆధునిక పోకడలన్నా, ఆధునిక కవులన్నా వీరికి పడదు. శ్రీశ్రీ తో సహా ఎందరినో విమర్శించే వారు. శ్రీ ఉషశ్రీ గారి సంతానంలో ఒకరైన డాక్టర్ పురాణపండ వైజయంతి గారు 'సాక్షి' పత్రికలో చక్కని ఆధ్యాత్మిక మరియు అన్నివిధాల వ్యాసాలు వ్రాస్తూ ,ఆ పత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. శ్రీ ఉషశ్రీ గారి అల్లుడైన శ్రీ K.V. సుబ్రహ్మణ్యం గారు విలేఖరిగా పనిచేస్తున్నారు. వీరు నాకు మంచి స్నేహితులు.
శ్రీ ఉషశ్రీ గారు నాకు తెలిసినంతవరకూ, చనిపోయేదాకా కూడా రేడియోలోనే పనిచేసారనుకుంటాను. ఈ గడుసరి మాటకారి 07-09-1990 న స్వర్గస్తులయ్యారు. రేడియో చాలాకాలం మూగబోయింది. ఈ పురాణపురుషునికి ఘనమైన నివాళిని సమర్పించుదాం!