అమ్మా కుక్క కావాలి - కాశీవిశ్వనాధం పట్రాయుడు

amma kukka kavali

ఆ రోజు ఆదివారం కావడం తో మా పిల్లలు , పక్కవాళ్ళ పిల్లలు మా వీధి గుమ్మంలో లో కూర్చుని ఆటలు అడుకుంటున్నారు...ఇంతలో అమ్మా ..కుక్క కావాలి అంటూ ఏడుపులు రాగాలు వినబడేసరికి  ఏమి జరుగుతుందో చూద్దామని బయటకు వచ్చి చూసేసరికి  పక్కింటి సన్నీచేతిలో ఉన్న బొమ్మలను లాక్కుంటూ కనిపించాడు మా అబ్బాయి నిఖిల్.

"ఏమయింది చిన్నా  వాడి చేతిలోంచి బొమ్మలను ఎందుకు లాక్కుంటున్నావ్ ఆడుకోనివ్వు"  అన్నాను.

అలా అనేసరికి  సన్నీ మొహం వెయ్యి వోల్టుల బల్బులా వెలిగి పోయింది. మా అబ్బాయి మాత్రం ఏడుపు మొహం  పెట్టుకొని "నేనివ్వనమ్మా" అన్నాడు.

"ఎందుకు ఇవ్వవు" అని  అడిగా.

"మరేమో.. నేను, అక్క  సన్నీ వాళ్ళ కుక్కపిల్లతో ఆడుకుందామని  వాళ్ళింటికి వెళితే  దానిని గదిలో పెట్టి దాచేస్తున్నాడు ..తెలుసా అన్నాడు."

“అవునమ్మా “ అంటూ వాడికి తోడు  నిత్య కూడా వంతపాడింది.

"లేదాంటి కుక్కపిల్ల వీళ్ళని కరుస్తుందేమోనని భయపడి" అలా చేసాను అన్నాడు సన్నీ సంజాయిషీ గా.

"ఏం కాదు అమ్మా ..

ఆ కుక్కపిల్ల చాలా మంచిది. సన్నీ కావాలని మా దగ్గరకు రానివ్వడంలేదు" అంది మా అమ్మాయి నిత్య సన్నీమీద ఫిర్యాదు చేస్తూ.

"నాకేం మీ బొమ్మలొద్దు" అంటూ కోపంగా వెళ్ళిపోయాడు సన్నీ.

"పోనీలెండమ్మా ఆ కుక్క పిల్ల లేకపోతేనేమి! రిమోట్ తో నడిచే కుక్కపిల్ల ని డాడీ కొన్నారుగా దానితో ఆడుకోండి" అన్నాను నేను. మూలనున్న ఆ కుక్కబొమ్మని తీసి ఇస్తూ.

"అదా! అదేమన్నా నిజం కుక్కపిల్లనా.మాతో పరుగులు పెట్టడానికి. మా మీదకెక్కి ఆటలాడడానికి.మాకు నిజం కుక్కపిల్లేకావాలి" అన్నారు ఇద్దరూ ముక్తకంఠంతో.

"మనది అద్దె ఇల్లు, ఇంటి గలవాళ్ళు ఒప్పుకోరు".

"మేం ఏంచెప్పినా ఇలాగే చెప్తావ్. రోడ్డుపై న కుక్కలతో ఆడితే క‌రుస్తాయి అంటావు.మనం పెంచు కుందామంటే  వద్దంటావు. నువ్వు ఎప్పుడూ ఇంతే" అని అలిగారు ఇద్దరు పిల్లలూ....

"మీరు బంగారు కొండలు కదూ! అలకలు మాని నా మాట వినండి. ఇల్లు మారిపోయి మీకు నచ్చిన కుక్కని పెంచుకుందాం..సరేనా "

"ఓ సరే" అన్నారు ఆనందంగా.

"నిత్యా ఈ పేపర్ లో ఉన్న విషయాన్ని చదివి నిఖిల్ కి చెప్పు" అని ఆ రోజు న్యూస్ పేపర్ చేతికిచ్చాను.

"వీధి కుక్కలు కరవడం తో పలువురికి గాయాలు. వాక్సిన్ లేక భయాందోళనలో రోగులు."

"విన్నావా నిఖిల్ ..కుక్క కరిస్తే వ్యాక్సిన్ వేసుకోవాలి లేకుంటే ర్యాబిస్ అనే వ్యాధి వస్తుంది..దాని వలన మనిషి మరణిస్తాడు..అందుకే వీధి కుక్కలతో ఆడుకోవద్దన్నది."

"నిజమే కానీ మనం పెంచుకుంటే ఆ సమస్య ఉండదుగా!" అంది నిత్య.

"ఇదిగో ఇది చదువు అంటూ మరొక పేపర్ ఇచ్చాను.."యజమాని పై దాడి చేసిన పెంపుడు కుక్కలు తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలు" అనే వార్తని చదివింది నిత్య.

"అమ్మా మనం వాటిని బాగానే చూసుకుంటాం కదా! మరెందుకు దాడి చేస్తాయంటావు" అని అమాయకంగా ప్రశ్నించాడు నిఖిల్.

"మనల్ని ఎవరైనా గోలుసులతో బంధిస్తే ఉండగలమా చెప్పు నిఖిల్"

"అమ్మో ! ఉండలేం.. కోపం వస్తుంది"

"మరి వాటికి కూడా కోపం వస్తుంది కదా! ఆనందంగా ఉండటానికి ఆహారం ఒక్కటే సరిపోదు స్వేచ్చ కూడా ఉండాలి. మనం ఎలా స్వేచ్ఛగా ఉండాలనుకుంటామో అవి కూడా అలాగే అనుకుంటాయి. లేకపోతే అవి మన మీద తిరగబడతాయి..

ఒక్క కుక్కే కాదు వేటిని పెంచుకున్నా ప్రయాణాలప్పుడు వాటితో ఇబ్బందే..వాటి సంరక్షణ కోసం ఎవరో ఒకరు ఇంటి పట్టునే ఉండాలి."

"అయితే కుక్కలు మంచివి కావా అమ్మా?" అని మనసులోని సందేహాన్ని వెలిబుచ్చింది నిత్య".

"అయ్యో! ఎంత మాట కుక్క విశ్వాసం కలది. దొంగల నుంచి కాపాడుతుంది. అందుకే గ్రామసింహం అన్నారు. కొన్ని రకాల కుక్కలను మాత్రం స్వేచ్చాయుత వాతావరణం తో పాటు సుశిక్షితులైన వారి పర్యవేక్షణలో మాత్రమే పెంచుకోవాలి"

"సరే అమ్మా!  మనం ఇల్లు మారొద్దు.ఇక్కడే ఉందాం. కానీ వీధి కుక్కలకు అన్నం పెడదాం. అవి తాగడానికి నీళ్ళు పెడదాం" అన్నారు పిల్లలు.

"ఓ తప్పకుండా..."అన్నాను. మూగజీవాల పట్ల నా పిల్లలకున్న ప్రేమను చూసి మనసులోనే మురిసిపోయాను.

మరిన్ని వ్యాసాలు