నరేంద్రమోడీని నడిపిస్తున్న 'యువ'తరంగం.! - ..

yuvatarangam

2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచింది యువతరం. సోషల్‌ మీడియా వేదికగా, యువతరం పెద్ద యుద్ధమే చేసింది.. నరేంద్ర మోడీ గెలుపు కోసం. ఇది అతిశయోక్తి కాదు. నిఖార్సయిన నిజమిది. భారతీయ జనతా పార్టీ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా వుందో, వుంటోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో. అధికారంలోకి వచ్చాక కూడా దేశానికి సంబంధించి అతి కీలక నిర్ణయాల విషయమై యువతరమే నరేంద్ర మోడీకి అండగా నిలిచింది. పెద్ద నోట్ల రద్దు విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. నరేంద్ర మోడీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం వెనుక ప్రధానమైన బలం 'యువతరమే'. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీలో తల పండిన సీనియర్‌ నేతలూ ఒప్పుకుంటారు.

2019 ఎన్నికల్లో మళ్ళీ నరేంద్ర మోడీని గెలిపింది కూడా ఈ యువతరమే. మీడియా చర్చా కార్యక్రమాల్లో సీనియర్‌ నేతల కంటే ఎక్కువగా యువ నాయకులు భారతీయ జనతా పార్టీ తరఫున పాల్గొన్నారు.. పార్టీ భావజాలాన్ని ప్రచారం చేశారు, పార్టీ వాయిస్‌ని బలంగా విన్పించారు. ఇక, ఇప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయేలా అత్యంత సంచలన నిర్ణయం నరేంద్ర మోడీ తీసుకున్నారంటే, అందుక్కారణం కూడా మోడీ వెనుకాల వున్న యువ శక్తి.. అన్నది నిస్సందేహం. లడఖ్‌కి చెందిన ఓ యువ బీజేపీ ఎంపీ జమ్‌యాంగ్‌ పార్లమెంటులో జమ్మూకాశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దుపై చేసిన ప్రసంగం ప్రపంచమంతా చూసింది. ఈ యువ ఎంపీ ఇప్పుడు స్టార్‌ పొలిటీషియన్‌గా పాపులర్‌ అయిపోయారనడం అతిశయోక్తి కానే కాదు.

ఏడు దశాబ్దాలుగా భారత్‌కీ, పాకిస్తాన్‌కీ మధ్య కాశ్మీర్‌ సమస్య నలుగుతూనే వుంది. భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌ అత్యుత్సాహం అందరికీ తెల్సిందే. కానీ, ఆ పాకిస్తాన్‌కి చుక్కలు చూపించింది మాత్రం నరేంద్ర మోడీ సర్కారే. పుల్వామా టెర్రర్‌ ఎటాక్‌ తర్వాత, పాకిస్తాన్‌కి ముచ్చెమటలు పట్టించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. దానికి కొనసాగింపుగా,, తెరవెనుకాల చక్కబెట్టాల్సిన వ్యవహారాలు చక్కబెట్టేసి, అణుబాంబు లాంటి నిర్ణయం జమ్మూకాశ్మీర్‌ విషయంలో నరేంద్ర మోడీ సర్కార్‌ తీసుకుంది. నిర్ణయాలు ఎంత ఖచ్చితత్వంతో తీసుకోవాలో, వాటిని ఎంత పకడ్బందీగా అమలు చేయాలో నరేంద్ర మోడీ పాలనని చూస్తే అర్థమవుతుంది. 
వయసు మీద పడుతున్నా నరేంద్ర మోడీ ఆలోచనలు మాత్రం, యువతకు దగ్గరగా వుంటాయి. అదే ఆయన గొప్పతనం. అందుకే, యువతరం ఆయన్ని రోల్‌ మోడల్‌గా భావిస్తుంటుంది. ఆ యువతరమే నరేంద్ర మోడీకి బలం. అవును, యువతే దేశానికి భవిష్యత్తు. పెద్ద నోట్ల రద్దు అనేది జస్ట్‌ ఓ శాంపిల్‌ మాత్రమే.. దేశం దశ, దిశ మార్చేసే నిర్ణయం.. ఇప్పుడు జరిగింది. అదీ మోడీ సత్తా. దేశమంతా.. ప్రత్యేకించి యువత అంతా ఇప్పుడు నరేంద్ర మోడీకి జయహో అంటోంది.

మరిన్ని వ్యాసాలు