కేరళ తీర్థయాత్రలు/ విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

kerala viharayatralu

 ( గురువాయూరు )

కొచ్చిన్ ఎయిర్ పోర్టు కి సుమారు నూరు కిలోమీటర్ల దూరంలో త్రిషూరు జిల్లాలో వుంది గురువాయూరు . గురువాయూరు లో వున్న కృష్ణ మందిరం భారతదేశంలో ప్రాముఖ్యతను పొందింది .

గురువాయూరు కృష్ణ మందిరం 5 వేల సంవత్సరాల కిందటిదని అంటారు . ఇప్పుడు వున్న యీ మందిరం 1970 లలో తిరిగి కట్టినది . కట్టడం అంతా కేరళా స్టైల్ కర్రతో చేసిన కట్టడం .

మేము కొచ్చిన్ నుంచి టాక్సీలో వెళ్లేం , కేరళాలో ప్రయాణం అంటేనే చాలా బాగుంటుంది , త్రిషూరు జిల్లా అనగానే పాతకాలపు యిళ్లు , మనుషులు యెక్కడా పశ్చాత్య పోకడలు కనిపించవు . పిల్లలు పెద్దలూ అంతా సాంప్రదాయకంగా వుంటారు . కొచ్చిన్ లో పాతకొత్త కలయికగా వుంటుంది , యిక్కడ ఒక్క పాతపోకడలే వుంటాయి , గురువాయూరు చేరగానే కేరళా చీరల దుకాణాలు రోడ్డుకి రెండువాపులా దర్శనమిస్తాయి . మందిరం వీధిలోకి అడుగు పెట్టగానే దూరం నుంచే ముఖద్వారం కనిపిస్తూ వుంటుంది . గేటు , గేటు దాటగానే క్యూ లైనులు వుంటాయి , మేము వెళ్లినది రద్దీ లేని రోజులలో ,  బయట జోళ్లు , సెల్ ఫోనులు పర్సులు , బెల్టులు వదిలి పెట్టెయ్యాలి . దర్శనానికి వెళ్లేవారు పంచలే ధరించాలి , ఆడవారు సాంప్రదాయ దుస్తులు ధరించాలి , యితర మతస్తులకు , పేంటులు , నిక్కర్లు వేసుకున్నవారికి ప్రవేశం లేదు .

మేం వెళ్లినప్పుడు పెద్దగా రద్దీ లేకపోయినా భక్తుల తోపులాట చాలా యెక్కువగా వుంది . చాలా సార్లు చికాకు కూడా కలిగింది . శివమందిరాలలో రద్దీ తక్కువగా వుంటుంది , విష్ణు మందిరాలలో రద్దీ తో సంబంధం లేకుండా తోపుడు యెక్కువగా వుంటుంది , యెందుకో అర్దంకాదు .ద్వారక , మధుర , పూరీ , నాథ్ ద్వార్ లలో యీ తోపులాట చూసేను , మళ్లా యిక్కడ .

క్యూలో గర్భగుడిలోకి ప్రవేశించేక లోపల ద్వజస్థంబం , లోపల పరిక్రమలో వినాయకుడు , అయ్యప్ప , భగవతి , నాగదేవతల అంతరాలయాలు వున్నాయి . గర్భాలయంలో కృష్ణడు నాలుగు చేతులతో గద , శంఖం , చక్రం , గద , తామరపుష్పం ధరించి తులసిమాల మెడలో వున్నట్లుగా వుంటుంది . శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు తాను విష్ణుమూర్తినని రుజువులు చూపించినపుడు యీ రూపంలో దర్శనమిచ్చేడట . ఈ విగ్రహం నాలుగడుగులు యెత్తువుంటుంది . ఇక్కడ కృష్ణుడు బాలరూపంలో లేకపోయినా పూజారులు బాలకృష్ణునిగానే పూజిస్తారు .

ఈ మందిరం 5 వేల సంవత్సరాల పురాతనమైనదని చెప్తారు , చరిత్రకారుల ప్రకారం గురువాయూరు , యీ మందిరం చంద్రగుప్తుని కాలానికే వున్నట్లు చెప్తారు .ఈ కోవెల 108 దివ్యదేశాలలో ఒకటి , అయిదు కృష్ణమందిరాలలో ఒకటి .ముందుగా మనం యీ కోవెల యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం . ఈ విగ్రహం హరిహరాదులచే పూజింపబడిందట . విష్ణుమూర్తి యీ విగ్రహానికి పూజలు చేసేవాడట , అందుకే దీనిని భూలోకవైకుంఠం అని పిలుస్తారు . శివుడు తన పరివారంతో వచ్చి విష్ణుమూర్తిని సేవించుకున్నాడట , శివుడు తన పరివారంతో విడిదిచేసిన ప్రదేశం యిప్పుడు రుద్రతీర్ధంగా పిలువబడుతోంది . విష్ణుమూర్తి బ్రహ్మకు యీ విగ్రహాన్నిచ్చేడట , సుతప ప్రజాపతి , అతని భార్య పృశ్ని లు బ్రహ్మదేవుని సలహాతో విష్ణుమూర్తిని పుతృనిగా పొందడానికి యీ విగ్రగానికి పూజలు చేయగా వారి భక్తికి మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమై యేంకావాలో కోరుకో మంటాడు ,

విష్ణుమూర్తిని చూసిన ఆనందంలో పుతృడు కావాలని ముమ్మారు అంటారు , విష్ణుమూర్తి మూడు జన్మలలో ముమ్మారు వారికి పుతృడుగా జన్మిస్తానని మూడు జన్మలలోనూ యిదే విగ్రహం వారు పొందుతారని చెప్తాడు ఆవరం ఫలితంగా సత్యయుగంలో పృశ్నిగర్భగా జన్మించి బ్రహ్మచర్యం యొక్క ప్రాముఖ్యతని ముల్లోకాలకు తెలియ జేస్తాడు . రెండవ జన్మలో వారు కశ్యప , అతిధిలుగా జన్మించగా విష్ణుమూర్తి వామనుడిగా వారికి జన్మిస్తాడు . ద్వాపరయుగంలో వారు వసుదేవుడు , దేవకిగా జన్మించగా విష్ణుమూర్తి కృష్ణావతారం యెత్తుతాడు . కృష్ణావతారంలో యీ విగ్రహం కంసుని చెరశాలలో దేవకీవసుదేవులు వుండగా కృష్ణుడు తానే విష్ణుమూర్తినని చెప్పి యిచ్చేడట , అప్పటి నుండి దేవకీ వసుదేవులు యీ విగ్రహానికి పూజలు చేసుకుంటూ కంససంహారం కొరకు వేచివుంటారు . కంసవధ తరవాత కృష్ణుడు యీ విగ్రహాన్ని ద్వారకకు తీసుకువెళ్లి పెద్ద మందిరాన్ని కట్టించి అందులో యీ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తూవుంటాడు , కృష్ణావతారం పూర్తయి వైకుంఠానికి వెళ్లిపోతున్నప్పుడు కృష్ణుడు తన పరమభక్తుడైన ఉద్దవునికి యీ విగ్రహాన్నిచ్చి ద్వారక అంత పవిత్రమైన ప్రదేశంలో యీ విగ్రహాన్ని ప్రతిష్టించమని కోరుతాడు . ఉద్దవుడు దేవగురువైన బృహస్పతికి యీ బాధ్యతను అప్పగిస్తాడు . బృహస్పతి వాయు మొదలైన దిక్పాలకుల సహాయంతో సముద్రానికి దగ్గరగా వున్న యీ ప్రాంతం ద్వారక అంతపవిత్రమైనదిగా గుర్తించి విగ్రహ ప్రతిష్ఠగావిస్తారు . గురువు , వాయువు లచే ప్రతిష్టించ బడడం వల్ల దీనిని గురువాయూరు గా పిలువబడసాగింది .

ఆది శంకరా చార్యులు యీ మందిరంలో జరపవలసిన పూజలు , సేవలు నిర్దేశించేరు , యివాల్టకి కూడా అవన్నీ అలాగే జరుపుతున్నారట . 14 శతాబ్దం వరకు యీ మందిరం నిత్యపూజలతో కళకళలాడేదట , తరవాత కేరళని పరిపాలించిన పెరుమాళ్ రాజులు శైవులు కావడంతో యీ కోవెల మాన్యాలు ఆపివేసేరు , దాంతో కోవెల నిత్యపూజలుకూడా నిలిపివేయబడ్డాయి .

ఈ కోవెల తిరిగి యెలా వెలుగులోకి వచ్చిందీ అన్నదానికి కూడా ఓకథ చెప్తారు స్థానికులు . ఓ నాడు ఓ మహాను భావుడు యీ మార్గం గుండా ప్రయాణిస్తూ ఆకలి బడలికతో మమ్మియూరు శివకోవెల చేరుకొని తనకు ఆతిథ్యం యిమ్మని అడుగగా అక్కడి పూజారులు వేళాకోళంగా మమ్మియూరు కోవెలకు యేవిధమైన జరుగుబాటూలేని పేద కోవెలని , అక్కడకి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో అడవిలో వున్న గురువాయూరు కృష్ణమందిరానికి చాలా మాన్యాలున్నయని అక్కడ అతనికి కావలసినవన్నీ లభిస్తాయని చెప్పిపంపివేస్తారు మూడు కిలోమీటర్లు ప్రయాణించి గురువాయూరు కోవెల చేరుకోగానే ఓ వింతకాంతితో మెరుస్తున్న యువకుడు సాదరంగా బాటసారిని ఆహ్వానించి రుచికరమైన పదార్ధములతో భోజనంపెట్టి ఆశ్రయమిస్తాడు . బాటసారి గురువాయూరు లో లభించిన ఆథిధ్యానికి సంతోషించి మమ్మియూరు బ్రహ్మణుల నోటివెంట వచ్చిన వాక్కు నిజమవుగాకక అని గురువాయూరుని ఆశీర్వదించి తనదారిన వెడలిపోతాడు . కొద్ది కాలానంతరం మహానుభావుని వాక్కు నిజమై గురువాయూరు పూర్వపు వైభవాన్ని తిరిగి పొందిందట .

ఈ కోవెల మహత్యాన్ని తెలియజేసే యెన్నో కధలు ప్రచారంలో వున్నాయి , అవేంటో కూడా తెలుసుకుందాం .

సర్పయాగం చేసిన జయమేజయ మహారాజుకి ఆయాగం వల్ల రెండు శాపాలు పొందుతాడు ఒకటి నివారణ లేని కుష్టువ్యాధితో బాధపడాలని , రెండవది పాముకాటు వల్ల మరణం . కుష్టు వ్యాధి సోకగానే జయమేజయమహరాజు పురోహితులను జ్యోతిష్కులను రప్పించి తనకు ఆయుష్షు యెంతవుందో చెప్పమనగా వారు అతను ఒక యేడాదిలోపల పాముకాటుకు గురై మరణిస్తాడని చెప్తారు . మహారాజు రాజ్యాన్ని వీడి తీర్ధయాత్రలు చేస్తూ మిగిలిన జీవితాన్ని గడప నిశ్చయించుకుంటాడు . అలా పవిత్ర తీర్ధాలను దర్శించుకుంటూ గురువాయూరు చేరుకొని రుద్రతీర్థంలో స్నానం చేసుకుంటూ కోవెలలోస్వామికి పూజలు చేస్తూ గడుపుతూ వుండగా అతని కుష్టువ్యాధి నయమవడం గమనిస్తాడు , అలా స్వామిని కొలుచుకుంటూ సంవత్సరాలు గడిపుతూ ఓ రోజు తన మరణ విషయంలో జ్యోతిష్కులు పెట్టిన గడువు యెప్పడో తీరిపోయిందని స్మరణకు రాగా జ్యోతిష్కులను దండించే వుద్దేశ్యంతో రాజ్యానికి వచ్చి తాను గడువు లోపల మరణించలేదేమని అడుగుతాడు . దానికి జ్యోతిష్కులు సర్వప్రాణ కోటికీ రాజైన అనంతుని నీడలో వున్నవారికి విషజంతువల వల్ల ప్రాణాపాయం యెలా కలుగుతుంది అని ప్రశ్నిస్తారు .

ప్రచేతులు అని పిలువబడే ప్రాచీన బర్హి , సువర్ణల పదిమంది పుతృలు రాజాధిరాజులు కావాలనే కోరికతో స్వామిని కొరకు పదివేల సంవత్సరాలు తపస్సుచేస్తారు , వారి తపస్సుచూసి వారికి సహాయపడాలని శివుడు రుద్రతీర్థం నుంచి ప్రత్యక్షమై వారికి రుద్రగీతాన్ని వుపదేశిస్తాడు , రుద్రగీతాన్ని ఆలపించగానే విష్ణుమూర్తి ప్రత్యక్షమై ప్రచేతుల కోర్కెను తీర్చేడట . రుద్రునిచే ఆలపించబడింది కాబట్టి దీనికి రుద్రగీతం అనే పేరొచ్చింది .

1970 నవంబరు 30 వ తేదీన కోవెలలో వెలిగించిన లక్షదీపాలవలన పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది , బయట ప్రాకారంలో వున్న అన్ని కట్టడాలూ అగ్నికి ఆహుతి అయేయి కాని గర్భగుడి కి యెటువంటి క్షతీ కలుగలేదు .

ఈ కోవెలలో స్వామికి జరిపే సేవలలో యేనుగులసేవ ప్రత్యేకమైనది . స్వామి సేవలో మొత్తం 56 యేనుగలు పాల్గొంటాయి ,ఈ  యేనుగులను కోవెలకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో వున్న పున్నత్తురకొట్ట అనే ప్రదేశం లో వుంచుతారు . ఏనుగలను వుంచుతారు కాబట్టి దీనిని ఆనకొట్ట అనికూడా పిలుస్తారు .

ఈ కోవెలలో అష్టమి , జన్మాష్టమి , ఏకాదశి లలో విశేష పూజలు చేస్తారు . మాఘమాసంలో పది రోజుల విశేషపూజలు జరుపుతారు .     కోవెల బయట వున్న షాపులలో వస్త్రాలు కొనే వారు జాగ్రత్త , మీరు చూసి యెంచుకున్న చీర చేతులు మారి మీ దగ్గరకి వచ్చేసరికి నాసి రకంగా మారుతుంది .

కోవెల వీధిలో బస భోజన సదుపాయాలు వున్నాయి .

వచ్చేవారం మరికొన్ని విశేషాలతో మీ ముందుంటాను , అంతవరకు శలవు .    

 

 

 

 

 

 

మరిన్ని వ్యాసాలు