ఈ మధ్యన దేశంలో చాలా ప్రదేశాలలో విపరీతమైన వర్షాలు కురవడంతో, రవాణా వ్యవస్థా, జనజీవనం అస్థవ్యస్థమయిపోయింది.రైళ్ళమాట సరే, విమానసర్వీసులు కూడా ఆగిపోయాయి. నగరాల్లో ఎక్కడచూసినా, నీళ్ళేనీళ్ళు.. నీళ్ళన్నీ జనావాసాల్లొకి చేరిపోయి,అక్కడుండే జనాల్ని, సురక్షిత ప్రదేశాలకి తరలించవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితేమీ కొత్తగా వచ్చిందికూడా కాదు.. గత కొన్నేళ్ళుగా, భారీ వర్షాలొచ్చాయంటే ఇదే తంతు. చిత్రమేమిటంటే, ఆ నగరాలకి సంబంధించిన, నగరపాలక ప్రతినిధులు, వరదలున్న నాలుగైదు రోజులూ, ఊరంతా తిరిగేసి, ఫలానా చర్యచేపడతామూ, ఫలానా మురుగుకాలవలు బాగుచేయిస్తామూ, ప్రభుత్వంనుండి నిధులు వచ్చేస్తున్నాయీ… etc..etc..అని ప్రక్కటనలు మాత్రం చేస్తాయి.. ఆ నిధులూ రావూ, drainage లూ బాగుపడవూ…అయినా మనం జీవిస్తూనే ఉన్నాము. నగరాల్లో , భారీ వర్షాలొచ్చినప్పుడల్లా , వచ్చే వరదలకి కారణాలు అందరికీ తెలుసు. అయినా, తప్పు ప్రభుత్వం మీదా, ప్రజలమీదా ఉండబట్టి, ఎవరూ నోరెత్తరు.
కానీ వీళ్ళందరూ చేసే ప్రకటనలకీ, జనాలు చేసే ఫిర్యాదులకీ అంతుండదు. ఈ annual exercise చూసినప్పుడల్లా నవ్వాలో, ఏడవాలో మాత్రం తెలియదు. నదీ తీరాల్లో ఎటువంటి నిర్మాణాలూ ఉండకూడదని చట్టాలైతే ఉన్నాయి. ఏదో పేరు, సాధారణంగా దేవుళ్ళ పేర్లు చెప్పి, ఏదో ఒక నిర్మాణం చేసేస్తారు, దాని అనుబంధ నిర్మాణాలు ( గుడి సంబంధిత ఆఫీసూ, ఓ ప్రసాదాల పంపిణీ గదీ, ఓ వంటగదీ, ప్రవచనాలు వినడానికి ఓ పేద్ద హాలూ) కట్టకపోతే ఎలాగా? మొత్తానికి చట్టాలు హాంఫట్. కొన్ని రోజులకి మరో స్వామీజీ మఠం, మరో గుడీ… ఇలాగ ఏదో పేరుచెప్పి నిర్మాణాలొచ్చేస్తాయి. ఇంతరద్దీగా ఉండే భక్తులకోసం, మరి నక్షత్ర హోటళ్ళుండొద్దూ?
జనాభా పెరగడంతో, ఎక్కడపడితే అక్కడ , భవన నిర్మాణాలకి అనుమతులు , చులాగ్గా దొరుకుతాయి… చేతులో డబ్బుండాలంతే.. దేశంలోని ఏ నదీ తీరం చూడండి ఇదే తంతు. నదుల మాట దేవుడెరుగు, సముద్రం విషయం చూస్తే, అదేదో reclamation అని పేరుపెట్టి అన్నిరకాల కట్టడాలూ కనిపిస్తాయి. అప్పుడెప్పుడో పదిహేనేళ్ళ పూర్వం వచ్చిన “ సునామీ” , ఈసారి పశ్చిమ తీరానికి వస్తే తెలుస్తుంది—ముంబాయి మహానగరం తుడిచిపెట్టుకుపోవడం ఖాయం.
ఈ వర్షాలూ, గాలివానలూ జనాలకి కొత్తేమీ కాదు.. తేడా ఏమిటంటే, ఇదివరకటి రోజుల్లో ఋతువులను బట్టి వచ్చేవి.. వేసవికాలం తరవాత.. వాతావరణంలోని వేడి, మేఘాలద్వారా… ఆ వచ్చిన వర్షం, నేలమీద మట్టి ఉండడం మూలాన, తొందరగా భూమిలోకి ఇంకిపోయేది. దానివలన భూగర్భ జలాలు కూడా పుష్కలంగా ఉండేవి. అందుకే, ఏ ఇల్లైనా కట్టుకున్నప్పుడు, నూతుల్లో, ఓ పది అడుగులు తవ్వేసరికి నీళ్ళు పడేవి. మరి ఈ రోజుల్లో బోరు బావులు ఎంత లోతు తవ్వినా నీళ్ళనేవి కనిపించడం లేదు. కారణం – భూగర్భ జలాలు ఇంకిపోవడం. వర్షపునీళ్ళు ఇంకడానికి మట్టి ఏదీ ? ఎక్కడచూసినా Concrete రోడ్డులూ, ఆకాశహర్మ్యాలూనూ… పట్టణ/ నగర ప్రధాన రహదారీలు Concrete చేసారంటే అర్ధం ఉంది.. రవాణా సౌకర్యం కోసం. కానీ ఊళ్ళో ఉండే రోడ్లన్నిటినీ చేసి, అసలు మట్టనేదే లేకుండా చేసేసారు. కారణం – ఈ రోజుల్లో జనాలకి మట్టంటే అసహ్యం… కాళ్ళకి మట్టంటుకుంటే, అదేదో పాపం అనుకుంటారు. మొట్టమొదట్లో పట్టణాలు, నగరాలూ నిర్మించినప్పుడు, పాపం అప్పటి పాలకులు, మురుగునీటి కోసం, కాలవల లాటివి కట్టడమైతే కట్టారు.. కానీ వరసా వావీ లేని భవన నిర్మాతలు, వాటిని కూడా, ఆక్రమించేసి డబ్బు చేసుకుంటున్నారు… వీటికి సాయం, ఎక్కడ చూసినా అనధికార పూరిగుడిసెలు.. పెద్దపెద్ద కాలనీల్లా తయారయాయి. చిత్రం ఏమిటంటే, రాజకీయ నాయకులకి కావాల్సిన ఓట్లు ఎక్కువగా అక్కడినుంచే..వర్షపు నీళ్ళు వచ్చినప్పుడు, అవి ప్రవహించడంకోసం కట్టిన మురుగుకాలవలు, అన్నీ చెత్తా చెదారంతో నిండుంటాయి. ఆ చెత్త వేసేదెవరూ? మనమే కదా.. నీళ్ళకి వెళ్ళేదారిలేక, జనావాసాల్లోకి వచ్చిచేరతాయి. ఓపికుంటే తోడుకోవడం, లేకపోతే ఆ నీళ్ళతోనే కాపరం చేయడం… పట్టణం/ నగరం లలో ఎక్కడ చూసినా ఇదేసమస్య.. వీటన్నిటికీ ముఖ్యకారణం స్వయంకృతమే కదా…
మరి జనాలూ, నాయకులూ వర్షాలొచ్చినప్పుడల్లా గొడవపెట్టడంలో అర్ధం లేదు. స్వభావాల్లో మార్పు వచ్చేదాకా భరించడమే.. అయినా అలవాటు పడ్డ జనాలు, మారుతారనుకోవడం కూడా అత్యాశే కదూ…
సర్వేజనా సుఖినోభవంతూ…