కేరళ తీర్థయాత్రలు/ విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

kerala viharayatralu

( తిరువనంతపురం )

తిరువనంతపురం కేరళ రాజధాని , అంతేకాక తిరువనంతపురం బీచ్ లకు , అనంత పద్మనాభ స్వామి కోవెలకి ప్రసిధ్ది పొందింది .తిరువనంత పురం పట్టణం క్రీశ్తుపూర్వం వెయ్యి సంవత్సరాలకి పూర్వం నుంచే వుండేదని చరిత్రకారుల అంచనా , పదిహేడవ శతాబ్దంలో కేరళను పరిపాలించిన  మార్తాండవర్మ కాలం లో త్రివేన్ కోరు రాజ్యానికి తిరువనంతపురాన్ని రాజధానిగా చేసి రాజ్య విస్తరణ చేసి త్రివాంన్కోరు రాజ్యాన్ని అనంతపద్మనాభ స్వామికి అంకితమిచ్చేడు . 19 వ శతాబ్దాన్ని త్రివాన్కోరు రాజ్య స్వర్ణయుగంగా చరిత్రకారులు చెప్తారు . ఆ శతాబ్దంలోనే మొదటి ఆంగ్లపాఠశాల సుమారు 1834 ప్రాంతాలలో స్థాపించేరు . ఆ సమయంలోనే అబ్జర్వేటరీ , వైద్యశాల , ద ఓరియెంటల్ రీసెర్చ్ సెంటరు , లిఖిత పుస్తక భండాగారం స్థాపించబడ్డాయి . మొదటి మానసికరోగుల చికిత్సాలయం ప్రారంభించబడింది . సంసృత కళాశాల , న్యాయ కళాశాల , కన్యా కళాశాల కూడా ఆ సమయంలోనే ప్రారంభించబడ్డాయి .      తిరువనంతపురం సముద్రతీరాన 7 కొండలను ఆనుకొని నిర్మించిన పట్టణం , లక్షదీవి సముద్రపు వొడ్డున నిర్మింపబడింది . ఈ పట్టణం కరమన , కిల్లి నదుల వొడ్డున నిర్మింపబడింది . వెల్లయాని , తిరువల్లం , ఆకులం బేక్ వాటర్స్ తిరువనంతపురానికి చాలా దగ్గరగా వుంటాయి . తిరువనంతపురం సముద్రపు వొడ్డున వుంది కాబట్టి బీచ్ లే వుంటాయనుకుంటే పొరపాటే ‘ అగస్త్యమాల ‘ పర్వత శ్రేణులు, అభయారణ్యాలు కూడా వున్నయి . లక్షదీవి సముద్ర తీరాన వుండటం వల్ల వర్షపాతం అధికంగా వుంటుంది . వర్షాకాలంలో సముద్రం పట్టణంలోకి చొచ్చుకురావడం సముద్ర తీరానవున్న భవనాలు , రోడ్లు పాడవడం తరచూ జరుగుతూ వుంటుంది . లక్షదీవి సముద్రపు ఉష్ణోగ్రతలు సముద్రజీవులకు అనుకూలంగా వుండడం వల్ల యీ సముద్రజలాలలో జలచరాలు చాలా తేలికగా వృద్ది చెందుతూ వుంటాయి . దీనివల్ల చేపలవేట , చేపల వుత్పత్తి యిక్కడ ప్రజల ముఖ్యవృత్తని చెప్పవచ్చును . ప్రస్తుతం తిరువనంతపురం లో తుంబ రాకెట్ కేంద్రం , విక్రమ్ శారాభాయ్ స్పేస్ సెంటరు , ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ వున్నాయి , భారతదేశంలో మొదటి టెక్నో పార్క 1995 లో తిరువనంతపురంలో నిర్మింపబడింది .కేరళ బాగా వేడిగా వుండే ప్రదేశం కాబట్టి నవంబరు డిసెంబరు నెలలో తిరగడానికి కాస్త బాగుంటుంది . ఇక్కడ చూడవలసిన ప్రదేశాలగురించి తెలుసుకుందాం .

 తిరువనంతపురంలో ముఖ్యంగా చూడవలసినవి మూడు బీచ్ లు 1) కోవలమ్ 2)షన్ముఖమ్ 3) వర్కాల్ ,4) నెయ్యారు డేమ్ ,5) పోన్ ముడి వేసవి విడిది , 6) పూవర్ ద్వీపం , 7) అగస్త్యకూడం వేసవి విడిది వీటన్నిటి మించి హింధువులకు పవిత్రమైన అనంతపద్మనాభుని మందిరం కూడా వుంది .

 గోవా లోని బీచ్ లు కనుచూపు మేర వరకు యిసుకతిన్నెలు , ఒడ్డున రకరకాలైన బీచ్ ఆటలతో వుంటాయి , వైజాగ్ బీచ్ యెత్తుగా యెగసిపడే కెరటాలతో వుంటుంది . తిరువనంతపురం బీచ్ లు కొబ్బరి చెట్ల మధ్య ప్రశాంతంగా వున్న సముద్రంతో చాలా అహ్లాదకరంగా వుంటాయి . అన్ని రకాలైన బీచ్ ఆటలు యిక్కడ కూడా వుంటాయి , అయితే కొబ్బరి చెట్ల మధ్య వుండడం వల్ల బీచంతా నీడగా చల్లగా వుంటుంది , చెమట మాత్రం చంపుతుంది . ఇక్కడ అరటిపళ్ల రకాలు చెప్పుకోదగ్గవి , యెర్ర అరటి , పొడుగ్గా వుండే కేరళ అరటి పళ్లు ( ఈరకం పళ్లు కేరళ అరటి పళ్లనే అమ్ముతారు ) , యే ప్రాంతంలో వున్నా కేరళా వారు యీ పళ్లనే యిష్టపడతారు , చిన్న అరటి పళ్లు ( వీటిని అమృతవల్లి అంటారు ) యిలా యెన్నో రకాలు దొరకుతాయి , ఈ చిన్నరటిపళ్లు చాలా రుచిగా వుంటాయి . అలాగే తాటికాయలాగే వుండి లోపల చిన్నతొనలలగా వుండే పళ్లు యెప్పుడూ చూడని రకరకాల పళ్లు వుంటాయి . కొన్ని రుచిగా వున్నాయి , కొన్ని ఫరవాలేదనిపించేయి , కొన్ని పారేసేటట్టు వున్నాయి . ఆనపకాయలంతేసి అరటిపళ్లు కూడా చూసేం . అరేబియా సముద్రపు వొడ్డున వున్న కోవలం బీచ్ జనాలతో కళకళ లాడుతూ వుంటుంది , కోవలం బీచ్ మహారాణి సేతులక్ష్మీ బాయి కోసం నిర్మించిన ప్రైవేటు బీచు 1920 లో రాజవంశస్థులు దీనిని ప్రజలని అనుమతించేరు . త్రివేండ్రం వూరికి సుమారు 18 కిలోమీటర్ల దూరం లో వుంది , సిటీ బస్సుల సౌకర్యం వుంది .

షణ్ముఖ బీచ్ ——

తిరువనంతపురం విమానాశ్రయానికి దగ్గరగా వున్న బీచ్ యిది , ఈ బీచ్ తెల్లని యిసుకకి ప్రసిధ్ది . సంవత్సరమంతా చాలా నిశ్సబ్దంగా వుంటుంది . కోవలం బీచితో పోలుస్తే పర్యాటకులు చాలా తక్కువగా వచ్చే ప్రదేశమనే చెప్పుకోవాలి . ఈ బీచ్ లక్షద్వీప సముద్రవొడ్డున వుంది . మళయాళీలు ప్రతీ సంవత్సరం బలి తర్పణాలు షణ్ముఖ బీచ్ వొడ్డున విడవడం వారికి అనాదిగా వస్తున్న ఆచారం . అనంతపద్మనాభ స్వామి , నరసింహ స్వామి , శ్రీ కృష్ణుల విగ్రహాలను మందిరం నుంచి ఊరేగింపుగా షణ్ముఖ బీచ్ వరకు తీసుకువచ్చి విగ్రహాలకు లక్షద్వీప సముద్రంలో స్నానాలు చేయించి తిరిగి ఊరేగింపుగా మందిరానికి తీసుకు వెళతారు , ఈ ఉత్సవంలో త్రివాన్కోరు మహారాజ సంతతికి చెందిన రాజు ఊరేగింపుకి ముందు కత్తి పట్టుకొని రాజసైనికులు ఊరేగింపుకి ముందు వెనుకల బారులు తీరి ఊరేగింపులో పాల్గొంటారు . ఉత్సవ సమయాలలో తప్ప మిగతారోజులు నిర్మానుశ్యంగా వుంటుందీ బీచ్ . ఇక్కడ వున్న మరో ఆకర్షణ 36 మీటర్ల పొడవున నిర్మించిన మత్సకన్య విగ్రహం .

వెర్కాల్ బీచ్ -

తిరువనంతపురానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో వుంది , దీనిని పాపనాశం బీచ్ అని కూడా అంటారు . అరేబియా సముద్ర తీరానవున్న బీచ్ , ఇక్కడ యిసుక నల్లగా వుంటుంది , టూరిస్ట్ లకు కావలసిన బీచ్ ఆటలైన స్పీడ్ బోట్ పారా సైలింగ్ మొదలైన వన్నీ వున్నాయి . మామూలు బీచ్ లలో లా కాకుండా యీ తీరమంతా చిన్నచిన్న కొండలు గుట్టలతో కూడుకొని వుంటుంది . కొండలమీంచి జారుతున్న సన్నని జలధారలు , పచ్చని చెట్లు , చిన్నచిన్న గుట్టలపై కాలిదారులతో మంచి పిక్నిక్ స్పాట్ గా చెప్పుకోవచ్చు . ఈ జలధారలు చాలా స్వఛ్చంగా వుండి తాగాలనిపిస్తాయి , ఈ జలధారలకి ఔషధగుణాలున్నాయని స్థానికులు అంటారు .

ఈ కొండలలోనే ఓ యెత్తైన కొండమీద సుమారు 2 వేల సంవత్సరాలకి పూర్వం నిర్మింపబడ్డ జనార్ధనుని  కోవెల వుంది . ఇది పూర్తిగా కేరళ స్టైల్ లో కట్టబడింది . బయటి ప్రాకారంలో హనుమంతుడు , గరుత్మంతుడు కొలువై వుండగా గర్భగుడిలో నాలుగు చేతులలో గద, శంఖం , చక్రం , పాశం ధరించిన విష్ణుమూర్తి యిరువైపులా శ్రీదేవి భూదేవి లతో కొలువై వున్నాడు . మెట్లెక్కి కొండ చేరేసరికి కాస్త ఆయాసం అనిపిస్తుంది , స్వామి దర్శనంతో ఆ అలసట పారిపోతుంది .           ప్రతీ యేడాది జరిగే పదిరోజులు ‘ అరత్తు ‘ ఉత్సవాలకి కేరళలోని నలుమూలలనుంచి భక్తులు వేస్తారు . వెర్కాల్ దగ్గర చేసే సముద్ర స్నానం సర్వపాపాలను హరించి ఆరోగ్యాన్నిస్తుందని భక్తుల నమ్మకం . ఇక్కడ గుట్టలమీద కొండలమీద వున్న అనేక ఓషధులగుండా ప్రవహించిన సెలయేళ్ల వల్ల యిక్కడ సముద్రపు నీరు కూడా వ్యాధి నిరోధక గుణాలను కలిగివుందని  శాస్త్రవేత్తలు అంటారు . ఈ బీచ్ కి దగ్గరగా అతిపెద్ద ఆయుర్వేద సెంటరు స్థాపించేరు .

జనార్ధనుని కోవెల స్థలపురాణం యేమిటంటే బ్రహ్మదేవుడు యాగంచేయ తలపెట్టి భూలోకంలోని యీ ప్రదేశం అనువైనదిగా తలచి యాగం చేయనారంభిస్తాడు , యాగంలో మునిగిపోయి బ్రహ్మ తనను తాను మరచిపోయి సృష్టిచెయ్యడం మానివేస్తాడు . సృష్టి ఆగిపోవడంతో ముల్లోకాలు హాహాకారాలు చెయ్యగా విష్ణుమూర్తి ముక్కోటి దేవతలకు బ్రహ్మను కార్యోన్ముఖుని చేస్తానని మాటయిచ్చి భూలోకానికి వస్తాడు . బ్రహ్మ యాగం చేస్తూ వుంటే బ్రాహ్మణులు యధారీతి అతనికి సహకరిస్తూ వుంటారు . విష్ణుమూర్తి ముసలి బ్రాహ్మణ వేషధారియై యాగ మండపానికి వస్తాడు . అక్కడ వున్న బ్రాహ్మణులు విష్ణుమూర్తికి అథిధి మర్యాదలు చేసి అతనికి భోజనం పెడతారు , ముసలి బ్రాహ్మణుడు వారు యిచ్చినది తిని యింకా తన ఆకలి తీరలేదని అంటాడు . యాగ శాలలో వున్న పదార్ధాలన్నీ అయిపోయినా గాని యింకా ఆకలి తీరలేదని ముసలి బ్రాహ్మణుడు అనడంతో అతనిని బ్రహ్మ దగ్గరకు తీసుకొని వెడతారు . బ్రహ్మ ముసలి బ్రాహ్మణుని విష్ణుమూర్తిగా గుర్తించి తన తప్పు తెలుసుకొని బ్రహ్మలోకానికి మరలిపోతాడు . ఒకనాడు నారదుడు వైకుంఠానికి వెళ్లి విష్ణుమూర్తిని దర్శించుకొని గానంచేస్తూ బ్రహ్మలోకానికి బయలుదేరుతాడు . విష్ణుమూర్తి నారదుని గానం వింటూ అతని వెనుక బ్రహ్మలోకానికి అదృశ్య రూపంలో చేరుతాడు . నారదుడు బ్రహ్మ కొలువుకి చేరుతాడు వెనుకనే అదృశ్యరూపంలో వున్న విష్ణుమూర్తి కూడా వుంటాడు . నారదుని వెనుక అదృశ్యరూపంలో వున్న విష్ణుమూర్తిని చూచి బ్రహ్మ సాష్టాంగ ప్రణామము చెయ్యగా చూసిన నవ ప్రజాపతులు బ్రహ్మ తన పుతృనకు సాష్టాంగము చేసేడని అనుకొని ఫక్కున నవ్వుతారు . విష్ణుమూర్తి తాను అసంకల్పితంగా బ్రహ్మలోకం చేరడం గమనించి వైకుంఠానికి మరలిపోతాడు . తనని చూసి నవ్వారనే కోపంతో నవ ప్రజాపతలను భూలోకంలో వుంమని శపిస్తాడు నారదుడు . బ్రహ్మ నారదుని వారించి జరిగినది వారికి చెప్పి నారదుని శాపం వుపసంహరించుకోవలసినదిగా చెప్తాడు . దానికి నారదుడు ప్రజాపతులు భూలోకంలో పవిత్రప్రదేశంలో యాగం చేసుకుంటే శాపవిమోచన కలుగుతుందని చెప్తాడు . పవిత్రప్రదేశం యేదో తెలుసుకోడం యెలా అనే ప్రజాపతుల ప్రశ్నకు నారదుడు తన పై అంగవస్త్రమైన మృగచర్మాన్ని భూలోకంలో పడవేస్తాడు ఆ వస్త్రం పడ్డ ప్రదేశంలో యాగం చేయవలసినదిగా నారదుడు ప్రజాపతులకు చెప్తాడు . అలా నారదుడు పడవేసిన మృగచర్మం పడ్డ ప్రదేశం కాబట్టి అది ‘ వల్కాలం ‘ గా పిలువబడుతూ కాలాంతరాన అది వర్కాల్ గా మారింది .

త్రేతాయుగంలో బలరాముడు కన్యాకుమారి వెళుతూ వల్కాలం లో జనార్ధనుని మందిర నిర్మాణం చేసేడు .

దీనిని ‘ దక్షిణ గయ ‘ అని అంటారు . ఏడాది పొడవునా భక్తులు యిక్కడ కి వచ్చి స్వామిని దర్శించుకొని పితృదేవతలకు పిండప్రదానాలు చేస్తూవుంటారు .

14 వ శతాబ్ధానికి చెందిన పల్లవరాజు మందులేని రోగపీడితుడై రాజ్యం విడచి తిరుగుతూ వెర్కాల్ సముద్రతీరంలో తిరుగుతూ యిక్కడి సెయేటి నీళ్లు తాగుతూ వుండగా అతను తిరిగి ఆరోగ్యవంతుడౌతాడు . ఆరోగ్య ప్రధాత అయిన ఆప్రదేశంలో ఓమందిరనిర్మాణం చెయ్యానే తలంపుతో నిదురించగా ఆ రాత్రి అతని కలలో విష్ణుమూర్తి కనిపించి యెక్కడైతే నీటిలో పువ్వులు కనిపిస్తాయో అక్కడ తానున్నట్లు , ఆ మూర్తికి మందిర నిర్మాణం చెయ్యవలసినదిగా చెప్తాడు . మరునాడు రాజు సముద్రతీరంలో వెతుకగా స్వప్నంలో సూచించనట్లే పువ్వులు వున్న ప్రదేశంలో వెతుకగా యీ విగ్రహం దొరిందట , పల్లవరాజు కొండపై మందిరం కట్టించేడు .

తిరువనంతపురంలోని బీచ్ ల గురించి తెలుసుకున్నాం కదా , వచ్చేవారం మరికొన్ని ప్రదేశాలగురించి చదువుదాం అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి