సిరిపురం నది ఒడ్డున ఓ ఋషి పర్ణశాలను నిర్మించుకొని తన ఆరుగురి శిష్యులతో అక్కడ నివశిస్తున్నాడు.ఆయన ధ్యానం, యోగ, ఆసనాలు, యాగాలు,సత్ బోధనలు మొదలగు వాటిని శిష్యులకు నేర్పుకొంటూ కాలాన్ని గడుపుతున్నాడు.శిష్యులు కూడా ఆయన సత్ బోధనలను వింటూ సూచించిన మార్గంలోనే పయనిస్తుంటారు.
ఆ ఋషి కొన్ని సందర్భాలలో తన శిష్యులతోపాటు చుట్టు ప్రక్కలనున్న గ్రామాలను సందర్శిస్తూ అక్కడుండే గుళ్ళలో పూజలు, యాగాలు చేస్తూ ఊరి వారు ఇచ్చేటి ధాన్యం, డబ్బులతో కావలసిన వెచ్చాలు కొనుక్కువెళ్ళి వంట చేసుకొని శిష్యులతో కలసి భోంచేసి పడుకొని నిద్రపోవటం,మళ్ళీ మరుసటి రోజు అవసరం మేరకు యథాతధంగా వెళ్ళడం జరుగుతోంది.
ఒక రోజు పది మైళ్ళకావల వున్న రత్నగిరి గ్రామంలోని పురుషోత్తముడనే ధనవంతుడు తనకు పిల్లలు పుట్టే నిమిత్తం ఓ యాగాన్ని జరిపించటానికి వెంటనే రమ్మని కబురు పెట్టాడు.
ఆ మరుసటి రోజే శిష్యులతోపాటు వుదయానే లేచి ధ్యానం, స్నానపానాదులు అయిన తరువాత రత్నగిరి గ్రామానికి బయలు దేరాడు ఋషి. అడవి మార్గాన వెళుతుండగా అక్కడో సెలయేరు పారు తున్నది, దాని ప్రక్కనే ఓ మర్రిచెట్టు వున్నది గమనించాడాయన.చాలా దూరం నడిచిన కారణాన కాస్సేపు విశ్రాంతి తీసుకోవాలని యెంచి"శిష్యులారా!మనం వెళ్ళవలసిన రత్నగిరి గ్రామం ఇంకా అయిదు మైళ్ళ దూరం వుంది.ఇప్పటికే బాగా అలసి పోయాం కనుక ఈ మర్రిచెట్టు క్రింద కాస్సేపు సేద తీరి వెళదాం" అన్నాడు.
అందుకు శిష్యులు ఏక కంఠంతో "అలాగే గురువర్యా" అంటూ ఆ గలగల పారుతున్న సెలయేటి నీళ్ళను తాగి మర్రి చెట్టు నీడన కండువాలను పరుచుకొని హాయిగా విశ్రమించారు. ఋషి కూడా శిష్యబృందంతో పడుకొని కళ్ళు మూసుకున్నాడు.
సాయంత్రం ప్రొద్దటువాలుతుండగా మెలుకువ రావటంతో లేచి నడక సాగించారు రత్నగిరికి. నడుస్తూ నడుస్తూ వుండగా ఒక చోట అడ్డంగా, నిండుగా,లోతుగా పారుతున్న ఓ కాలువ రావటంతో అక్కడ ఆగిపోయి కాలువను దాటడమెలా అన్న ఆలోచనల్లో పడ్డాడు ఋషి.
"గురువర్యా!ఏమిటి ఆగిపోయి ఆలోచిస్తున్నారు?మనం ఆ పురుషోత్తంగారి ఇంట జరిపే యాగానికి వెళ్ళడం లేదా!" అని అడిగాడు ఒక శిష్యుడు.
"తప్పకుండా ఈ రాత్రికే వెళుతున్నాం.కాని ఈ మార్గాన వెళితే దాదాపు ఒక మైలు దూరం అదనంగా నడుస్తూ అటు దూరంగా తిరిగి వెళ్ళాలి.అలా అయితే బాగా పొద్దుపోయేలా వుంది.అదే ఆలోశిస్తున్నాను."అన్నాడు ఋషి.
"అయితే త్వరగా ఆ వూరికి చేరుకునే మార్గం మరొకటి లేదా గురువర్యా?"ప్రశ్నించాడు ఇంకో శిష్యుడు.
"వుంది.మన శక్తినంతా కూడదీసుకొని పెద్ద అంగతో ఇటునుంచి అటు దూకగలిగితే దాదాపు మైలు దూరం కలిసొచ్చి ఓ గంటలోనే ఆయనగారి ఇంటికి చేరుకోగలం.చెప్పండి ఏం చేద్దాం?" అని శిష్య బృందాన్ని అడిగాడు ఋషి. వెంటనే ముందు వెనుకలు ఆలోచించకుండా, " అయితే గురువర్యా!మీరు అన్నట్టు పెద్ద అంగతో ఆ ప్రక్కకు దూకేద్దాం"అంటూ ఒక శిష్యుడు టఫీమని అటు వేపుకు దూకేశాడు. అతనితో పాటు మరో నలుగురు శిష్యులు కూడా గబగబ దూకి అవతలి గట్టుకు చేరు కున్నారు.ఇక చివరిగా ఆరవ శిష్యుడు మాత్రమే గురువుతో వుండిపోయాడు.
"ఏమిటి శిష్యా!నువ్వు అటు వేపుకు దూకలేదేం?"అని అడిగాడు ఆరవ శిష్యుణ్ణి ఋషి.
అందుకు "నేను కుర్రాణ్ణి గురువర్యా!నా శక్తినంతా కూడదీసుకొని వాళ్ళలాగే చిటికలో అటువేపుకు వెళ్ళగలను. కాని వయస్సు మళ్ళిన తమరు మాలా దూకి అటువేపుకు రాలేరుగా!అదే ఆలోశిస్తున్నాను"అన్నాడు ఆరవ శిష్యుడు.
శిష్యుడికి తనపై వున్న గౌరవం,అభిమానానికి నవ్వుకొని "అయితే ఏంచేద్దామనుకొంటున్నావ్ ?" ప్రశ్నించాడు ఋషి. అందుకు ఆరవ శిష్యుడికి ఏమి చెప్పాలో తోచక దృష్టిని సారించి కాస్త దూరానికి చూశాడు. అప్పుడు అతని కళ్ళకు అల్లంత దూరాన మొడువారిన తాటి చెట్టు మొద్దు కనబడింది. వెంటనే చిన్నతనంలో తాతయ్యతో పాటు తను పొలానికి వెళ్ళినప్పుడు కాలువ గట్టు దాటటానికి తాతయ్య అక్కడున్న నాప బండను రెండు గట్లను కలుపుతూ వేసి అటువేపుకు వెళ్ళిన సంఘటన గుర్తుకు రాగా అలాగే చేయాలనుకున్నాడు.వెంటనే, 'గురువర్యా !ఇప్పుడే వస్తాను'అని పరిగెత్తుకొంటూ మొద్దు వద్దకు వెళ్ళి దానిని దొర్లించుకొంటూ వచ్చాడు. గురువుగారి సహాయంతో తనకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించి మొద్దును ఈ గట్టునుంచి ఆ గట్టుమీద పడేలా మెల్లగా జాగ్రత్తతో తోశాడు. అది ఆ గట్టుమీద పడి వంతెనలా తయారైంది.వెంటనే, "గురువర్యా! ఈ మొద్దు మీదుగా అటువేపుకు నడవండి మీ వెంట నేనూ నడుస్తాను" అన్నాడు ఆరవ శిష్యుడు.
శిష్యుడికి తనమీదున్న భక్తి శ్రధ్ధలకు,ప్రేమకు మనసులోనే ఉప్పొంగి పోయి ఆ మొద్దు మీదుగా అటువేపుకు నడిచాడు ఋషి.ఆరవ శిష్యుడు ఆయన్ను వెంబడించాడు. తతిమ్మా శిష్యులు జయకేతనం ఎగురవేసినట్టు చప్పట్లు కొట్టారు.
"బాగుంది.తప్పకుండా ఈ ఆరవ శిష్యుణ్ణి అభినందించాలి.అలాగే తను ఇలా చేయటంలో మరో లాభముంది.అదేమిటో మీలో ఎవరైనా చెప్పగలరా?"అని అడిగాడు ఋషి.అందుకు అందరూ మౌనంగా వుండి పోయారు.
కాని మళ్ళీ ఆరవశిష్యుడే, "వుంది గురువర్యా!ఇలా మనం వంతెనలా తయారు చేసిన ఆ మొద్దు సహాయంతో ఇటునుంచి అటు,అటునుంచి ఇటు రావటం మనతోనే ఆగిపోదు.ఇకపై ఎవరైనా సరే మనలా ఆ మొద్దుమీద నడుచుకొంటూ వెళతారు.తద్వారా వాళ్ళకు ఒక మైలు అదనంగా నడవవలసిన పని వుండదు"అని చెప్పాడు.
"భేష్ !నువ్వు చెప్పింది నిజం.పదండి పొద్దు కృంగేలోపు రత్నగిరి గ్రామానికి చేరుకుందాం" అంటూ నడక సాగించాడు ఋషి.వెంబడించారు శిష్యులు.