ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు - భమిడిపాటిఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

జయంతులు

ఆగస్ట్ 23
శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు :  వీరు ఆగస్ట్ 23,1872 న , వినోదరాయనిపాలెం లో జన్మించారు. ప్రముఖ స్వాతంత్ర యోధులు. ఆంధ్రరాష్ట్ర ప్రధమ ముఖ్యమంత్రి. మద్రాసు లో సైమన్ కమిషన్ కి వ్యతిరేక ప్రదర్శనలో, తుపాకి కి ఎదురు నిలిచి, “ ఆంధ్ర కేసరి” అనే బిరుదుపొందారు.

ఆగస్ట్ 26
శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం :  వీరు ఆగస్ట్ 26, 1920 న  నరసరావుపేట లో జన్మించారు.  ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు. ఆయన తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత వహించిన అభ్యుదయ కవిత్వోద్యమానికి ఆద్యుల్లో ఒకరు. నయాగరా కవులుగా ప్రసిద్ధి పొందిన ముగ్గురిలో ఒకరు.  అనేక ప్రగతిశీల ఉద్యమాలలో పాల్గొన్నారు. వందలాది రష్యన్ కవితలను ఆంగ్లమాధ్యమం ద్వారా అనువదించారు.

ఆగస్ట్ 28
శ్రీ దాట్ల సత్యనారాయణ రాజు : వీరు ఆగస్ట్ 28, 1904 న పొట్లూరు లో జన్మించారు.  Col. D S Raju  గా ప్రసిధ్ధులు. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు. వైద్య విద్య అభ్యసించి,  1934- 45 కాలంలో , భారతసైన్యం లో పనిచేసారు.. కేంద్ర కాబినెట్ లో కూడా పనిచేసారు. కాకినాడ లోని, రంగరాయ మెడికల్ కాలేజీ స్థాపనలో ముఖ్యపాత్ర వహించారు.

ఆగస్ట్ 29
శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు :  వీరు ఆగస్ట్ 29, 1863 న పర్వతాలపేట లో జన్మించారు.  గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు.  పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.

వర్ధంతులు

ఆగస్ట్ 26
శ్రీ చింతా దీక్షితులు :  ప్రముఖ కథా రచయిత మరియు బాల గేయ వాజ్మయ ప్రముఖులు.  బాల గేయ వాజ్మయంపై తన దృష్టి నిల్పి "లక్క పిడతలు" అనే గేయ సంపుటిని ప్రచురించారు. వీరు కొన్ని నాటకాలు కూడా రచించారు.  ఎన్నో కథలను రచించారు. "బాలానందం" అనే పేరుతో పిల్లలకోసం దీక్షితులు కొన్ని కథలను రాశారు. వీరు ఆగస్ట్ 26, 1960 న స్వర్గస్థులయారు.

ఆగస్ట్ 27
శ్రీ కంభంపాటి స్వయంప్రకాశ్ :  ప్రముఖ లైంగిక సమస్యల నిపుణుడు (సెక్సాలజిస్ట్‌).. .ఆయన శృంగారంపైనెలకొన్న అపోహాలను తొలగించేందుకు విశేష కృషి చేశారు.  లైంగిక విజ్ఞానంపై సుమారు 14 పుస్తకాలు, దాదాపు 5 వేల వ్యాసాలు వ్రాశారు.
వీరు ఆగస్ట్ 27, 2010 న స్వర్గస్థులయారు.

ఆగస్ట్ 28
శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు : ప్రముఖ తెలుగు హాస్య రచయిత, నటుడు, నాటక కర్త.  ఆయన నాటికలకు చాలాభాగం ప్రముఖ ఫ్రెంచి నాటక కర్త మోలియర్ వ్రాసిన నాటికలు ఆధారం.  ఆయన హాస్యం చదువరికి చురుక్కుమనినిపిస్తుంది.. వీరు ఆగస్ట్ 28, 1958 న స్వర్గస్థులయారు.

ఆగస్ట్ 29
శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి :  ప్రముఖ తెలుగు కవి, భాష పరిశోధకుడు, చరిత్రకారుడు, రచయిత, విమర్శకుడు, రేడియో నాటక రచయిత మరియు తెలుగు, సంస్కృత పండితుడు.  ఆయన వట్టి మేధావి కాదు..తెలుగు భాషా, చారిత్రక సాహిత్య నిర్మాణానికి అక్షరాలు మోసిన కూలీ! ఆయన వట్టి రచయిత కాదు..విమర్శనా వ్యాస రచనకు ఆద్యుడు. పన్నెండో ఏటే పరభాషలో కవితా సుమాలు వెదజల్లిన అనన్యుడు. వీరు ఆగస్ట్ 29, 1950 న స్వర్గస్థులయారు.

మరిన్ని వ్యాసాలు