కేరళ తీర్థయాత్రలు/ విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

kerala viharayatralu

 ( తిరువనంతపురం )

క్రిందటివారం మనం తిరువనంతపురంలోని బీచ్ లగురించి చదివేం , ఈ వారం తిరువనంతపురంలోని అనంతపద్మనాభ స్వామి కోవెల గురించి చదువుదాం .
హిందువులకి కేరళఅనగానే గుర్తుకు వచ్చేది అనంతపద్మనాభ స్వామి కొవెలే , ఈ మధ్య యీ కోవెల నేల మాళిగలలో దొరికిన నిధుల వల్ల దేశవిదేశాలలో ప్రాముఖ్యతను పొందింది . చరిత్ర ప్రకారం యీ కోవెల క్రీస్తుపూర్వం సుమారు 500 సంవత్సరాలనుంచి వున్నట్లు తెలుస్తోంది . క్రీశ్తుపూర్వం 500 నుంచి క్రీస్తుశకం 30 వ సంవత్సర మధ్యకాలానికి చెందినవిగా భావిస్తున్న రచనల ప్రకారం అప్పట్లో యీ మందిరాన్ని స్వర్ణమందిరంగా పిలిచేవారు , మొత్తం కోవెల అంతా బంగారం తో నిర్మింపబడిందని లిఖించబడింది . తిరువనంతపురాన్ని స్వర్గం తోను , మందిరాన్ని వైకుంఠంతోనూ పోల్చేరు . వైష్ణవుల అతి ముఖ్యమైన 108 దివ్యదేశాలలోనూ యిదివొకటి . 14 వ శతాబ్దానికి చెందిన ఆళ్వారులే కాక నాయనార్లు కూడా యీ మందిర విశిష్ఠతను తెలియజేస్తూ వారి ప్రబంధాలలో వివరించేరు . ఆళ్వారులవివరణ ప్రకారం తిరువనంతపురం కోట గోడలు కూడా బంగారంతో చెయ్యబడివుండేవని తెలుస్తోంది .

మందిరమంతా కేరళ , తమిళనాడు ల శిల్పకళల మేళవింపుగా కనబడుతుంది . గర్భగుడిలో స్వామి శేషశయనుడిగా పూజలందుకుంటున్నాడు .ఈ కోవెలలోకి అన్యమతస్థులను అనుమతించరు , మగవారిని పంచె కండువాలతోను , ఆడవారిని చీరతో మాత్రమే లోపలికి అనుమతిస్తారు . కోవెలలోపల వాయవ్యాన అనంతకాడు నాగరాజ మందిరం , బిల్వమంగళ కృష్ణమందిరం వుంటాయి . గర్భ గుడిలో శేషపాన్పుపై అనంతపద్మనాభుని దర్శించుకోడానికి మూడు తలుపులు వుంటాయి , మొదటి తలుపులోంచి మనం కటు సర్కార యోగం లో వున్న శేషుని అయిదుతలలు , విష్ణుమూర్తి నిద్రిస్తున్న మోము , శ్రీదేవి , విష్ణుమూర్తి కుడి చేతి క్రిందనున్న శివలింగాన్ని బృగుమహర్షిని చూస్తాం , రెండవ తలుపులోంచి కటుసర్కారయోగంలో వున్న విష్ణుమూర్తి కటిభాగాన్ని , నాభినుంచి ఉద్భవించిన బ్రహ్మని , నిత్యపూజలందుకొనే శ్రీదేవి భూదేవి సమేత పద్మనాభ స్వామి బంగారు మూర్తులను , వెండి ఉత్సవమూర్తులను చూస్తాం . మూడవ తలుపులోంచి కటరసర్కార యోగంలో వున్న విష్ణుమూర్తి దివ్యపాదపద్మాలను , భూదేవిని , మార్కండేయ ముని లను చూస్తాం , ఇవి కాక చామరం వీస్తున్న అపసరసలను , నారద తుంబురులను , స్వామి దివ్యాయుధాలను , సూర్యుడు , చంద్రుడు , సప్తఋషులు , మధుకైటభులను దర్శించుకుంటాం . గర్భగుడిలో భక్తులు సాష్టాంగ నమస్కారం చేసుకొనే అర్హత లేదు , ట్రెవాంకోర్ రాజులకు మాత్రమే ఆ అర్హత వుంది . కోవెల ప్రాకారంలోనే వున్న కృష్ణమందిరం , నృసింహ మందిరం ముఖ్యవైనవి .నమస్కారమంటపం , యితర విగ్రహాలున్న మంటపం , ద్వజస్థంబం , బలి మంటపం కూడా చూడొచ్చు .

ఇక్కడవున్న మరో ముఖ్యమందిరం ‘ తిరువంబాడి ‘ , గర్భగుడిలో ఒకచేత ఛర్నాకోల మరోచేత శంఖం పట్టుకొని వున్న ‘  పార్థసారధి ‘ విగ్రహాన్ని చూడొచ్చు . పద్మనాభుని కోవెలలో యీ మందిరం అంతరాలయంలా కాక మరో కోవెలలా అంటే వేరే ద్వజస్థంబం , బలిపీఠం , నమస్కార మండపాలతో వుంటుంది . ఈ విగ్రహం నల్లరాతితో మలచబడింది . ఈ విగ్రహాన్ని 72 గుజరాతికుటుంబాలు కేరళకు వలసవచ్చినప్పుడు వారితో కూడా యీ విగ్రహాన్ని తెచ్చుకున్నారట . వీరు కృష్ణుని సంతతికి చెందిన వారని అంటారు . ప్రతీ ఏకాదశికి స్వామిని ‘ మోహిని ‘ గా అలంకరించి పూజించుకుంటారు . ఈ కోవెలలో సీతారామలక్ష్మణులు హనుమంతుడు , విశ్వక్సేనుడు , నిర్మలైధారి విష్ణువు , వ్యాసుడు , గణపతి , గురువు , క్షేత్రపాలనకు ఉపమందిరాలు వున్నాయి . విమానం విగ్రహాలను ప్రతిష్ఠించిన ప్రదేశం మొత్తం ఏకశిలా నిర్మితం . మూలవిరాట్టుని గండకీ నది నుంచి తెచ్చిన 12008 శాలగ్రామాలను పేర్చి చేసినది . మూల విగ్రహాలకు కటు సర్కార యోగం ( ఒకవిధమైన ఆయుర్వేద లేపనం పూయడం ) చేసేరు . అందుకని మూల విగ్రహానికి అభిషేకాలు నిర్వహించరు . నిత్యా భిషేకాలు బంగారు విగ్రహానికి , వెండి ఉత్సవ విగ్రహాలకి చేస్తారు . 80 అడుగుల యెత్తున్న ద్వజస్థంబం , 365 చక్కని నగషీతో వున్న స్థంబాల మండపం చాలా చక్కగా వుంటాయి . ముఖద్వారం సుమారు 100 అడుగుల యెత్తులో ఏడంతస్థులలో నిర్మింపబడింది . ముఖద్వారం పల్లవుల కాలంలో నిర్మింపబడినట్లు దీనిపై గల శిల్పకళవల్ల తెలుస్తోంది . ముఖ్యద్వారం కింది అంతస్థుని నాట్యమండపం అని అంటారు , ఉత్సవ సమయాలలో యిక్కడ కథకళి నృత్యప్రదర్శనలు జరుగుతాయి .

మందిరానికి యెదురుగా వున్న కోవెల తీర్ధాన్ని పద్మతీర్ధం అని అంటారు . ట్రవాంకోర్ మహారాజు రాజా మార్తాండవర్మ పద్మనాభునికి తాను దాసుడనని , రాబోయే రాజవంశీకులు కూడా అదే పధ్దతిని అనుసరించాలని రాజశాసనం చెయ్యడం వల్ల రాజ్యాభిషిక్తుడైన రాజు ‘ పద్మనాభ దాస ‘ అని పేరులో కలుపుకొనేవారు . రాణీలకు పద్మనాభ సేవిని అనే పదాన్ని పేరులో జోడిస్తారు .ఇక స్థలపురాణానికి వస్తే ఈ కోవెల 5 వేల సంవత్సరాలకి పూర్వం బిల్వమంగళుడు అనే నంబూద్రి వంశానికి చెందిన ముని విష్ణుమూర్తి దర్శనంకొరకు నిత్య పూజలు చేస్తూ వుంటాడు . ఒకనాడు ఒక బాలుడు ముని వద్దకు వచ్చి తాను భగవంతుని సేవలో ముని కావలసిన సహాయం అందిస్తానని విష్ణుమూర్తి తప్పక దర్శన మిస్తాడని , కాని తాను యేమి చేసినా దండించరాదని , దండించిన మరుక్షణం తాను మునిని వదలి వెళ్లిపోతానని చెప్తాడు , ముని బాలుని షరతులకు వప్పుకొని తన వద్ద వుంచుకుంటాడు . బాలుడు రానురాను చాలా అల్లరి చేయసాగేడు .

ఓ రోజు స్వామి కైంకర్యానికితెచ్చినపదార్ధాలను   నైవేద్యానికి పూర్వమే తినెస్తాడు . అది చూచి కోపించిన ముని బాలుని దండించాలని రాగా బాలుడు కొంతదూరం పరుగెత్తి అంతర్ధానమౌతాడు . బాలుడు అంతర్ధానమవగానే మునికి అతడు సామాన్యబాలుడు కాడని విష్ణుమూర్తే బాలుగా వచ్చేడని అర్దమౌతుంది . మరొక్కసారి స్వామిని కనులారా చూడాలని ఆ అడవిలో స్వామిని వేడుకుంటూ తిరుగుతూ వుండగా ఆకాశవాణి స్వామి అనంతవనం ( అనంతకాడు ) లో తనకోసం వెతుకమని చెప్పగా ముని ఓ కోయస్త్రీ సహాయంతో అనంతవనానికి దారి తెలుసుకొని అరేబియా సముద్ర తీరంలో తిరుగుతూ వుండగా అక్కడ అడవిలో వున్న  ‘ ఇలూప ‘ వృక్షం కిందపడి ఆ మాను అనంతపద్మనాభుని రూపం సంతరించుకుంది . ఆ మూర్తి సుమారు 8 మైళ్ల పొడవు వుండడం వల్ల ముని స్వామిని చిన్నరూపంలో దర్శనమివ్వమని కోరగా స్వామి యిప్పుడున్న రూపానికి వచ్చేడట . స్వామి మూర్తిగా మారిన ప్రదేశం కుప్పకార పొట్టి , కురువ పొట్టిలకి చెందినది . బిల్వమంళుడు , దివాకరముని మరికొంతమంది బ్రాహ్మణుల సహాయంతో మందిరనిర్మాణం చేసేడట . తరువాత బ్రహ్మ నేపాలులోని గండకీ నదినుంచి 12008 శాలిగ్రామాలను తెచ్చి కర్ర విగ్రహానికి అతికించేడట .          బిల్వమంగళుడు స్వామిని పూజించుకుంటూ స్వామి సన్నిధిలోనే ప్రాణాలు విడిచేడట . అందుకే యీ కోవెలలో వాయవ్యాన బిల్వమంగళ కృష్ణ మందిరం అతని సమాధి పై నిర్మించేరు .

 పై కథలోని బిల్వమంగళుడు దివాకరముని ఒకరేనని కొందరి అభిప్రాయం .

 ద్వాపరయుగంలో బలరాముడు యీ మందిరాన్ని దర్శించుకువ్నాడని పురాణగాధ వుంది . ఈ మందిరం గురించిన వివరణ అష్టాదశ పురాణాలలోనూ , మహాభారతంలోనూ వుంది . ప్రపంచంలోనే అతి ధనవంతుడైన స్వామిగా పేరుంది . కొన్ని వేల కిలోల బంగారపు ఆభరణాలు స్వామి అలంకారానికి వుపయోగిస్తారు . కొన్ని సంవత్సరాల క్రిందట స్వామి వారి నేలమాళిగలను తెరువగా కొన్ని లక్షలకోట్ల విలువైన సంపద బయటపడడం మనందరకీ తెలిసినదే , కోవెలలో యింకా తెరువని రెండు గదులను కూడా కనుగొన్నారు . దీనివల్ల మందిరాలకు రాజులిచ్చిన మాన్యాలు యెంత వుండేవో తెలుస్తుంది . మన్యాలు , సంపద పక్కన పెడితే ప్రతీ హిందువు తప్పక చూడదగ్గ మందిరాలలో యిదొకటి అని మాత్రం చెప్పగలను . సరే వచ్చేవారం మరో ప్రదేశం వెళదాం , అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు