ఛాటింగూ.. ఛీటింగూ.. జర కేరింగూ.! - ..

chating..cheating

దేనికైనా మంచీ, చెడూ ఉండాలంటారు మన పెద్దలు. అవును నిజమే, అన్నింట్లోనూ కొంత మంచి, కొంత చెడూ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మనం చర్చించుకోబోయే టాపిక్‌ సోషల్‌ మంచి చెడులు. సోషల్‌ మీడియా వచ్చాక, ప్రపంచం చిన్నదైపోయింది. సాంకేతికత అందరికీ అందుబాటులోకి వచ్చేసిందనే ఫీలింగ్‌ వచ్చేసింది. అయితే, సర్వరోగాలకూ మూలం ఇదే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది సరే. గుట్టూ, మట్టూ కూడా లేకుండా పోయింది. బాత్రూమ్‌, బెడ్రూమ్‌ అనే తేడా లేకుండా, సంసారాలు బజారుకెక్కేశాయి ఈ సోషల్‌ వాడకంతో. అక్కడే అసలు తంటా మొదలైంది. జస్ట్‌ ఫోటోపై క్లిక్‌ చేస్తే చాలు, ఫుల్‌ బయోడేటా వచ్చేస్తోంది. ఇంకేముంది, మన గుట్టంతా తీసుకెళ్లి అవతలి వ్యక్తి చేతిలో పెట్టేసినట్లే కదా. ప్రైవేట్‌ విషయాలనూ, పర్సనల్‌ విషయాలనూ కూడా పబ్లిక్‌ చేసేసుకుంటున్నాం. అక్షరాలా ఇది మన చేతులారా చేస్తున్న తప్పే. ఈ తప్పుకు భారీ మూల్యం సరిపోదు.

విచ్చలవిడిగా ఫేస్‌బుక్‌ అకౌంట్లు, ట్విట్టర్‌ అకౌంట్లు ఇన్‌స్టాగ్రామ్స్‌ ఓపెన్‌ చేసేసి, ఇస్టైల్‌గా వాటిలో నచ్చిన ఫోటోలు, మన పర్సనల్‌ డేటా పోస్ట్‌ చేసేస్తున్నారు. దాంతో నడి బజాల్లో నిలబడుతున్నారు. తట్టుకున్న వాళ్లు నెట్టుకొస్తున్నారు. తట్టుకోలేని వాళ్లు ప్రాణాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల పరువు బజారున పడుతోంది. ఫేస్‌ బుక్‌ ఛాటింగ్స్‌, మార్ఫింగ్‌ ఫోటోస్‌ మనకి తెలియకుండానే పోర్న్‌ సైట్స్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఓ మహిళ తన మార్ఫింగ్‌ ఫోటో పోర్న్‌ సైట్‌లో కనిపించడంతో అవాక్కయ్యి హైకోర్టుకెక్కిన వార్త వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, కొన్ని రోజులు మన మీడియా సంస్థలు ఈ విషయమై స్పెషల్‌ డిబేట్స్‌ పెట్టి కాసేపు కాలక్షేపం చేసింది. ఇది కాదు, కావాల్సింది. ఇంటర్నెట్‌ వాడకంపై అవేర్‌నెస్‌ పెంచాలి.

ఈ అంశాన్ని ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోవాలి. చెడును ప్రచారం చేసే కొన్ని వెబ్‌సైట్లను నియంత్రణ చేయాలి. మరికొన్నింటిని ఫిల్టర్‌ చేయాలి. ఈ రూల్‌ సీరియస్‌గా ఫాలో చేసేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. గతంలో కొన్ని సైట్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. కానీ, మళ్లీ మళ్లీ ఈ తరహా వెబ్‌ సైట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వైరల్‌ అవుతూనే ఉన్నాయి. ఆయా వెబ్‌ సైట్లలో వస్తున్న ఫేక్‌ న్యూస్‌, బ్లూవేల్‌, పబ్‌జీ వంటి ఆన్‌లైన్‌ గేమ్స్‌ పట్ల ప్రభుత్వాలు విధించే నిషేధాజ్ఞలు కంటి తుడుపు చర్యలుగానే ఉంటున్నాయి. అందుకే ప్రజల్లో ఎవరికి వారికే సొంత అవగాహన ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. తప్పదు పిల్లి మెడలో గంట కట్టాల్సిందే. కానీ ఆ గంట కట్టేదెవరు.? గంట కట్టాల్సిన గవర్నమెంట్‌ చేతులెత్తేస్తే జనం మాత్రం ఏం చేయగలరు.? మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. అందంగా ఉంది కదా.. అని పులి దగ్గరికెళ్లి నోట్లో వేలు పెట్టలేం కదా. సోషల్‌ మీడియా కూడా అంతే. అప్రమత్తతే శ్రీరామరక్ష. అతిసర్వత్రా వర్జయేత్‌ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఆ అతి ఇకనైనా తగ్గించుకుందామా మరి.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి