తెలుగోడి సత్తా: ఇండియన్‌ బాక్సాఫీస్‌ బద్దలవ్వాల్సిందే.! - ..

indian box office

తెలుగు సినిమా బౌండరీస్‌ మారిపోయాయి. ఆ మాటకొస్తే, తెలుగు సినిమానే కాదు, భాషతో సంబంధం లేదు. టోటల్‌గా సినిమా ఈక్వేషన్సే మారిపోయాయి. సినిమాని ఇప్పుడంతా ప్యాన్‌ ఇండియా కోణంలోంచి చూస్తున్నారు. 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా ఎల్లలు దాటేసింది. బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద 'బాహుబలి' క్రియేట్‌ చేసిన ఇంపాక్ట్‌ అంతా ఇంతా కాదు. 'బాహుబలి' తర్వాత ఆ ఇంపాక్ట్‌ మరోసారి క్రియేట్‌ చేయడానికి తెలుగు సినిమా కాలు దువ్వుతోంది 'సాహో' సినిమాతో. 'బాహుబలి' తర్వాత, ఆ స్థాయి స్టామినాతో రూపొందింది 'సాహో'. బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని శాసించేందుకు సిద్ధమవుతోంది. 'సాహో' సందడిలా ఉంటే, 'సైరా' స్టార్ట్‌ అయ్యింది. 'సైరా' కూడా ప్యాన్‌ ఇండియన్‌ మూవీనే. అయితే, ఈ సినిమాని మొదట్లో తెలుగుకే పరిమితం చేయాలనుకున్నారు.

కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్యాన్‌ ఇండియన్‌ మూవీగా మార్చేశారు. ఆకాశాన్ని అంటే అంచనాలతో సౌత్‌ భాషలతో పాటు, బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటేందుకూ 'సైరా' గ్రాండ్‌గా ముస్తాబవుతోంది. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. చరిత్ర మర్చిపోయిన, మరుగున పడిపోయిన స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత గాధను తెలుసుకుని దేశం మొత్తం గర్వించాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాని తెరకెక్కించారు. కమర్షియల్‌ యాంగిల్‌ అస్సలు కాదు, డబ్బులు రావాలన్న ఆశ లేదు. సక్సెస్‌, ఫెయిల్యూర్‌ అన్న ఈక్వేషన్‌ అంతకన్నా లేదు. కేవలం ప్యాన్‌ ఇండియా లక్ష్యంగా ఈ సినిమాని చిత్రీకరించారు. ఇదిలా ఉంటే, నెక్ట్స్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' వస్తోంది. ఇది కూడా ప్యాన్‌ ఇండియన్‌ స్థాయిలోనే రూపొందుతోంది. ప్యాన్‌ ఇండియా స్థాయి మూవీని తెరకెక్కించడమంటే అంత ఆషామాషీ కాదు. ఆ స్థాయిని అందుకోవాలంటే, అందుకు తగ్గ కరెక్ట్‌ ప్లానింగ్‌ ఉండాలి. ఆ ప్లానింగ్‌ 'బాహుబలి' తర్వాత 'సాహో'కి సెట్టయ్యింది. ఆ తర్వాత 'సైరా నరసింహారెడ్డి', 'ఆర్‌ఆర్‌ఆర్‌'లతో ఈ లెగసీ కంటిన్యూ కావాలి. ఆ తర్వాత మన టాలీవుడ్‌ నుండి మరిన్ని ఇలాంటి చిత్రాలు రావాలి.

బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఈ పోటీ ఇలాగే ఉండాలని ఆశిద్దాం. ఒకప్పుడు ఒకప్పుడు బాలీవుడ్‌ సినిమాతో పోటీ అంటే, వేగం, క్వాలిటీ, బడ్జెట్‌ పరిమితులు, సాంకేతిక పరిజ్ఞానం ఇలా ఒక్కటేమిటి వంద సమస్యలు. కానీ, మారిన ట్రెండ్స్‌ పరంగా, అలాంటి సమస్యలన్నింటినీ తెలుగు సినిమా అధిగమించేసింది. అందుకే సమ ఉజ్జీగా బాలీవుడ్‌ సినిమాతో పోటీకి దిగుతోంది. దాంతో ఒకప్పుడు తెలుగు సినిమాపై ఉన్న చిన్న చూపు పూర్తిగా పోయింది. మన తెలుగు సినిమానే బాలీవుడ్‌కి పెద్ద దిక్కుగా మారుతోందిప్పుడు. 'బాహుబలి' సృష్టించిన రికార్డుల్ని బద్దలుకొట్టే అవకాశం మళ్లీ మన తెలుగు సినిమాకే కల్పించింది బాలీవుడ్‌ సినిమా. భారీ బడ్జెట్‌ చిత్రాలే కాదు, చిన్న సినిమాగా తెరకెక్కిన 'అర్జున్‌రెడ్డి' రీమేక్స్‌ వంటివి కూడా బాలీవుడ్‌లో ఘన విజయం సాధిస్తున్నాయి. ఇక్కడితో ఆగేది కాదు ఈ ప్రస్థానం. అన్నట్లు ప్రస్థానం అంటే గుర్తొచ్చింది. త్వరలోనే మన తెలుగు 'ప్రస్థానం' సినిమాని బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

మరిన్ని వ్యాసాలు