బాలానందం - -

balanandam

రేడియో! అక్కయ్య, అన్నయ్య! బాలానందం! ఎందరికో ఇవి మధుర జ్ఞాపకాలు. మళ్ళీ మళ్ళీ తలచుకుని మురిసిపోయే అపురూప అనుభవాలు.

బాపు, ముళ్ళపూడి వెంకట రమణ వంటి ఎందరో మహానుభావుల ప్రతిభని గుర్తించి, వాటికి మెరుగులు పెట్టిన బాలానందాన్ని మొదట అప్పటి మదరాసులో ప్రారంభించి, 'బాల' అనే పత్రిక నెలకొల్పి చిన్నారులు ఎందరికో వారి కళాకౌశలంలో పునాదులు వేశారు - అక్కయ్య అన్నయ్య. సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, కవిత్వం, కథారచన, నాట్యం, నటన - ఒకటేమిటి లలిత కళలన్నింటినీ బాలానందం ముంగిట్లో ముగ్గులుగా పెట్టి చదువుతల్లి బాలలందర్నీ అక్కున చేర్చి ముద్దాడింది.

కాలక్రమంలో బాలానందం చిరునామా హైదరాబాదుకి మారింది. అక్కయ్య, అన్నయ్యల ఆశయాలకు అద్దం పడుతూ అవిరళ కృషి సల్పుతున్నారు నిర్వాహకులు. ప్రఖ్యాతి గాంచిన ఓ సంస్థలో తాము విద్యార్ధులం అని గర్వంగా చెప్పుకుంటూ భాగ్యనగరంలోని అనేక విద్యాసంస్థల బాలబాలికలు నారాయణగూడ లోని బాలానందానికి వచ్చి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ కళాభ్యాసం చేస్తున్నారు. అందులో భాగంగా -

ఇటీవల అక్టోబరు 27వ తేదీన ఇద్దరు ప్రసిద్ధ చిత్రకారులు శ్రీ ఉదయ భాస్కర్, శ్రీ మాధవ్ లచే బాలలకు చిత్రరచనలో మెళుకువలు చెప్పే కార్యక్రమం ఏర్పాటయ్యింది. వివిధ విద్యాసంస్థల నుంచి వచ్చిన పలువురి విద్యార్ధులను ప్రశ్నించి, వివిధ అంశాలతో వారి సృజనాత్మకతను వెలికి తీసే ప్రయత్నంతో బాటు వారి రేఖా విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించి, వాటికి మెరుగులు దిద్దే ప్రక్రియను కూడా చిత్రకారులు చేపట్టారు. బాలానందం నిర్వాహకులైన శ్రీమతి కామేశ్వరి, పూర్ణచంద్రరావు గార్లు ఏర్పాటు చేసిన ఆనాటి బాలల చిత్ర కళాభ్యాస కార్యక్రమంలో వ్యంగ్య చిత్రకారుడు శ్రీ సరసి కూడ పాల్గొని బాలబాలికలకు చిత్రరచనలో పలు మెళకువలను నేర్పారు. అనంతరం శ్రీ ఉదయ భాస్కర్, శ్రీ మాధవ్ లు గతంలో వారు చిత్రించిన కొన్ని చిత్రాలను విద్యార్ధులకు ప్రదర్శించారు.

ప్రసిద్ధ చిత్రకారుల సమక్షంలో తమ భావాలకు రేఖా రూపాలను కల్పించి, తమలోటుపాట్లను సరిదిద్దుకునే అవకాశం కల్పించినందుకు తామెంతో సంతోషిస్తున్నామని పలువురు బాలబాలికలు హర్షాతిరేకంతో తమ అభిప్రాయాలను వెల్లడించారు. చిత్రకారులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపి చిరు సత్కారం చేసిన అనంతరం ఆనాటి కార్యక్రమం ముగిసింది.

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు