మీరే కాపాడాలి - ఓట్ర ప్రకాష్ రావు

meere kapadaali

 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థుల వైపు చూస్తూ" ఈ సారి వినాయక చవితి పండుగ మన బడిలో చేసుకొందామా " హెడ్ మాస్టర్ భక్తవత్సలం అడిగారు.

" ఇంట్లో పండుగ జరుపుకొంటున్నాం, ఆరోజు బడికి సెలవులేదా సార్ "అంటూ నిరుత్సాహంతో ప్రశ్నించాడు ఒక విద్యార్థి  

"వినాయక చవితి పండుగ సోమవారం కదా మనం బడిలో శనివారం చేసుకొందామా" అన్నారు భక్తవత్సలం

"ఓ కె సార్ "పిల్లలందరూ ఆనందంతో గట్టిగా అన్నారు  

"ఎలా చెయ్యాలి "అమాయకంగా అడిగారు హెడ్ మాస్టర్  

"వినాయకుడి బొమ్మ తెచ్చి పూజ చెయ్యాలి సార్ " అన్నాడు

" వినాయకుడి  బొమ్మ పండుగ రోజు ఉదయం మాత్రమే దొరుకుతుంది అంతకు ముందు దొరకదు కదా " అన్నారు హెచ్ ఏం

" ఔను సార్ ఎలాగ ? "

" ఒక చిన్న పోటీ పెడతాను .  వినాయకుని  మట్టిబొమ్మలు మీరు చేసుకొని రావాలి. అందులో మంచి బొమ్మకు బహుమతి ఇస్తాను "అన్నారు హెచ్ ఏం

"సార్ వినాయకుడి బొమ్మను తయారు చేసే అచ్చు పలక ఎక్కడ దొరుకుతుందిసార్ .మట్టి గట్టిగా కలిపి అందులో పెట్టి తీస్తే వినాయకుడి బొమ్మ తయారు అవుతుంది"

"ఆ పలక ఉంటె అతి తక్కువ సమయంలో ఎన్నో వినాయక బొమ్మలు తయారు చేయవచ్చు .నేను మీకు చెప్పింది   ఒకే ఒక బొమ్మ. కానీ ఒక్క షరతు భూమాతకు, నీటికి  హాని కలిగించే వాటిని ఉపయోగించకూడదు ఉదాహరణకు ప్లాస్టిక్ లాంటివి ఉపయోగించామంటే  నిమజ్జనం అంటూ నీటిలో వేస్తే అవి నీటిని కలుషితం చేస్తుంది ." అన్నారు హెచ్ ఏం.

శని వారం ఉదయం సగం మంది పిల్లలు వినాయకుని బొమ్మను  తీసుకొని వచ్చారు . ఇద్దరు పిల్లలు  బొమ్మలకు రంగులు వేసి ఉండటం చూసి "ఈ రంగులు రసాయన పదార్థములు వీటివల్ల నీరు కలుషితమవుతుంది "అన్నారు భక్తవత్సలం.

"వినాయక చవితి రోజు రంగులు వేసిన బొమ్మలు కొంటున్నారు సార్"

"రసాయన రంగులతో పూసిన రంగులు నీటిని కలుషితం చేస్తుంది .పెద్దలు తప్పు చేస్తున్నారని మనం తప్పుచేయవచ్చా" అని సమాధానము ఇచ్చి మిగిలిన బొమ్మలను చూసారు .   

కృతిన్,అద్విక్ తెచ్చిన బొమ్మలు   వారిని  బాగా ఆకర్షించింది.  కృతిన్ వినాయకుడి బొమ్మపై మల్లెపూలు ,రోజాపూలు.చేమంతులు ,గన్నేరు పూల రేకులతో అందంగా అతికించాడు . అద్విక్ మట్టితో చేసిన బొమ్మకు చక్కగా సిరి ధాన్యాలతో అలంకరించాడు.హెడ్ మాస్టర్ ఆ రెండు బొమ్మలను ఫోటో తీసి తన పై అధికారులకు వాట్స్ అప్ లో పంపారు. మరో ఐదు నిముషాలకంతా విద్యాధికారి జయరాం గారు ఆ పిల్లలను అభినందించడానికి  వస్తున్నట్లు, ఫోన్ లో చెప్పారు
విద్యాధికారి వస్తున్నారనగానే పిల్లలందరిని ఒక చోట కూర్చొనపెట్టి మైక్ ఏర్పాటు చేశారు. విద్యాధికారి జయరాం గారు తహసీల్దారును మీడియా వారిని పిలుచుకొని  వచ్చారు .

" రసాయన రంగులుకల  వినాయక విగ్రహం నిమజ్జనం చేయడంవల్ల  బావులు చెరువులు నదులు కలుషితం అవుతోంది. రసాయన రంగులు వాడద్దన్నా వినడం లేదు.  మీలాగా అందరూ ప్రవర్తిస్తే పర్యావరణానికి ఎంతో ఉపయోగం " అంటూ  ఆ పిల్లలిద్దరినీ మెచ్చుకొన్నారు జయరాం గారు .తహసీల్దారు తన ప్రసంగం;లో "కృంగి పోతున్న  భూమాతను నేటి ప్రజలు పట్టించుకొనడం లేదు . భూమాతను బాలలైన  మీరే  కాపాడాలి “  అంటూ కృతిన్ ,అద్విక్ లకు ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. మరుసటి రోజు దినపత్రికలలో వచ్చిన ఆ వార్త అందరినీ ఆలోచింపజేసింది .

మరిన్ని వ్యాసాలు