భాద్రపద శుక్ల చవితిని మనం వినాయకచవితిగా జరుపుకుంటాం , ఈ సంవత్సరం సెప్టెంబరు 2 వతేదీన వినాయక చవితిని దేశవిదేశాలలో వున్న హిందువులందరూ జరుపుకుంటున్నారు .కిత్తాత్తమి అంటే కిత్నుని బర్తదే అన్నట్లు వినాయక చవితి అంటే వినాయకుడు పుట్టిన రోజు అని మనకి తెలుసు , మరి దేవతలు అలా వుత్తినే పుట్టెస్తారా ? ప్రతీదేవీ దేవతల ఉద్భవించడం వెనుక మన పురాణాలు ఓ కారణం చెప్తాయి , మరి వినాయకుని జన్మరహస్యం యేమిటో తెలుసుకుందాం . దానవ రాజైన గజాసురుడు శివుని కొరకై తపస్సు చేసి శివుని ప్రసన్నుని చేసుకొని శివుడు తనలో నివాసముండే వరాన్ని కోరుకుంటాడు . శంకరుడు గజాసురుని కోరిక మన్నించి అతనిలో నివాసముండసాగేడు . శివుడు లేక ముల్లోకాలు తల్లడిల్లసాగేయి ,
శివుడు లేని కైలాశం లో పార్వతి నివసించలేక విష్ణుమూర్తితో మొరపెట్టుకోగా విష్ణుమూర్తి మారువేషంలో నందిని వెంటపెట్టుకొని గజాసురుని వద్దకేగి తనవద్ద నాట్యమాడే నందివుందని చెప్పి గజాసురుని సభలో నందిచేత నాట్యం చేయిస్తాడు . నంది రకరకాలుగా నాట్యవిన్యాసాలు చూపిస్తూ వుంంటే గజాసురుడు మైమరిపోతాడు . అదే అదునుగా గుర్తించిన విష్ణుమూర్తి సైగ నందుకొన్న నంది ఒక్కసారి గజాసురుని మీదకి వురికి తన కొమ్ములతో అతని పొట్టను చీల్చుతాడు , పొట్టలోని శివుడు బయటకు రాగానే ఆకాశదుంధుభులు మ్రోగుతాయి , పుష్పవర్షం కురుస్తుంది . పొట్టచీలి మరణానికి దగ్గరగా వున్న గజాసపరుడు విష్ణుమూర్తిని గుర్తించి నమస్కరించి తన చర్మము శివుడు ధరించాలనే కోరికను చెప్పి మరణిస్తాడు .
గజాసురువి చెరనుండి శివుడు విముక్తుడైన సమాచారం విన్న పార్వతి భర్తను స్వాగతించాలనే కోరికతో అభ్యంగన స్నానం చేసి సర్వాలంకారు రాలవ్వాలని అభ్యంగన స్నాన సమయంలో నలుగు పెట్టుకుంటూ పసుపుతో చిన్న బొమ్మను చేసి చూడముచ్చటగా వున్న ఆ బొమ్మకు ప్రాణ ప్రతిష్ట చేస్తుంది . ప్రాణం వచ్చిన ఆ బొమ్మను మురిపెముగా చూచుకొని యింటిలోకి యెవ్వరూ రాకుండా కాపలా కాయమని చెప్పుతుంది అలా ఆబాలుడు గమ్మం లో కాపలా కాస్తూ వుండగా శివుడు వడివడిగా లోనకి రాబోతాడు . బాలుడు శివుని లోనికి రాకుండా అడ్డుకోగా కోపించిన శివుడు బాలుని తలనరికి లోపలికి వెళతాడు . లోనికి వచ్చిన శివుని గుమ్మం వద్ద నున్న బాలుడేడి అని పార్వతి అడుగగా అతని శిరస్సు ఖండించినట్లు చెప్తాడు శివుడు . ఆ బాలుడు తన మానసపుతృడని కన్నీరు మున్నీరు అవుతున్న పార్వతిని ఓదార్చి అతనికి ప్రాణం తిరిగిపోస్తానని మాటయిచ్చి అతని తలకొరకు వెతుకగా ఆ ఖండించ బడ్డ తల దొరకదు . సమయం గడచిపోతూ వుండడంతో గజాసురుని తలను బాలుని శరీరానిక తగిలించి ప్రాణప్రతిష్ట చేస్తాడు శివుడు . అలా వినాయకుడు గజముఖంతో వుంటాడు . పార్వతి ముందుగా వినాయకుని పసుపుతో చేసింది కాబట్టి యువాల్టకి కూడా మనం యే శుభకార్యం చేసినా ముందుగా పసుపు వినాయకుని పూజించి గాని మొదలుపెట్టం .
చిన్నికృష్ణుని చిలిపి చర్యలు యెలాయైతే ప్రసిధ్దమయేయో అలాగే వినాయకుని గురించిన యెన్నోకథలు మన పురాణాలలో కనిపిస్తాయి , తనని పూజించలేదని దేవతలమీద అలిగి వారిని యిబ్బందులకు గురిచేసినట్లు , పూజించగానే ప్రసన్నడైనట్లు యెన్నో పురాణకథలు వున్నాయి . వినాయక చవితి సందర్భంగా మనం అలాంటి ఓ మందిరం గురించి చెప్పుకుందాం .
ఇప్పడు నేను చెప్పబోయే ప్రదేశంలో మహశివుడు భీమాసురుని సంహరించేటప్పుడు వినాయకుని పూజించిన ప్రదేశం . ఆ ప్రదేశం యెక్కడుందో యేమిటో వివరాలు చూసెద్దాం .వినాయక పూజలు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చే రాష్ట్రం మహారాష్ట్ర , అదేమిటి దక్ష్ిణ భారతీయులు కాదా ? అనే సందేహం మీకురావొచ్చు , నా సమాధానం కాదు అనే , వినాయకచవితి అంటే అందరం చేసుకుంటాం . కాని మహారాష్ట్ర లో మొదటగా సామూహిక పూజలు మొదలుపెట్టేరు . వీధివీధిలోనూ వినాయకపూజలు కనిపిస్తాయి , అలాగేపెద్దపెద్ద విగ్రహాలను చెయ్యడం తొమ్మదిరోజుల ఉత్సవాలు నిర్వహించడం మనం వారినుండే దిగుమతి చేసుకున్నాం .మరాఠీ వారికి కులదైవం వినాయకుడు . అష్టవినాయక క్షేత్రాలు మహారాష్ట్రలోనే వున్నాయి .
ఈ క్షేత్రాలు పుణె నగరానికి చుట్టుపక్కల వుండడం విశేషం . పీష్వాల కాలంలో ఈ మందిరాలను పునః నిర్మించి మందిరాలకు మాన్యాలను యేర్పాటు చేసేరు . ముఖ్యంగా బాజీరావు కాలంలో అతని సహోదరుడైన చీమాజీరావు సైన్యాధికారిగా వున్న సమయంలో యుద్దానికి ముందు అష్టవినాయక మందిరాలలో వినాయకునికి పూజలుచేసి వెళ్లడం యుద్దం గెలవగానే వచ్చి వినాయకునికి కానుకలు సమర్పించడం చేసేవాడు . పోర్చుగీసువారిపై విజయం సాధించినప్పుడు వారికోటనుండి తెచ్చిన గంటను వినాయకుని కోవెలలో కట్టడం చీమాజీరావు అలవాటుగా చేసుకున్నాడు . పూణే అహ్మద్ నగర్ రోడ్డుమీద పూణే నగరానికి సుమారు 50 కిమీ. దూరం లో రంజణ్ గావ్ లో వుంది మహా గణపతి ఆలయం . మహదేవుడు త్రిపురాసురునితో యద్దానంతరం ప్రతిష్టించిన మహగణపతి .
మహా గణపతి అంటే అన్ని దేవీ దేవతల శక్తిని పొంది మహా శక్తివంతునిగా మారిన వినాయకుడు అని అంటారు . ఉషః కాలానికి ప్రతీక అయిన సింధూర వర్ణము వాడు . నుదుటన అర్ధ చంద్రుని ధరించి శివుని వలే మూడు కన్నులు గలిగి , దశ తొండములు , ఇరవై భుజములు కలిగి నటవంటి మహా ఆకారుడు యీ మహాగణపతి .విష్ణు మూర్తి ఆయుధ మైన చక్రం , వరాహ అవతారం లో ఆయుధమైన గద , లక్షీ దేవికి ప్రతీక అయిన తెల్ల తామర , పాశం , శృష్ఠి స్థితి లయలకి ప్రతీక అయిన దానిమ్మ పండు , మన్మధుని చెరుకు విల్లు , పృద్వికి ప్రతీకగా ధాన్యం కంకు , సంపదకు ప్రతీకగా బంగారు కలశం , నీలి కలువ మొదలయినవి చేతులలో ధరించి అష్ఠ ఐశ్వర్య ప్రదాత అనేదానికి ప్రతీకగా తామర పువ్వుపై కూర్చొని సిద్ధి ని తొడపై కూర్చో పెట్టుకుని ఉంటుంది యీ మహా గణపతి విగ్రహం . ఈ విగ్రహాన్ని పేష్వా మాధవరావు కాలంలో కోవెల లోని నెల మాళిగలో దాచినట్లు చరిత్రలో వుండగా యిక్కడి పూజారులు అలాంటివేమీ లేవని అంటున్నారు .
ఈ కోవెల తొమ్మిది లేక పదవ శతాబ్దానికి చెందిన కోవెల . ఈ కోవెల తూర్పు ముఖం గా వుంటుంది . ప్రతీ రోజు ఉదయిస్తున్న సూర్యుని కిరణాలు మహా గణపతి విగ్రహం మీద పడేటట్టుగా నిర్మాణం చేసేరు . సభా మండపం లో శివుని మందిరం వుంది . లోపలి కోవెల పేష్వా కాలం నాటి మందిరాలను గుర్తు చేస్తూ వుంటుంది . ఇక్కడ నిత్యాన్న దానం జరుగుతూ వుంటుంది . ఈ మధ్య కాలంలో కట్టిన సంతోషి మాత మందిరం కుడా చూడొచ్చు . నాలుగు సంవత్సరాల క్రిందట చేపట్టిన కోవెల పునః నిర్మాణపు పనులు యింకా కొనసాగుతున్నాయి . ఇందులో భాగం గా పూణే అహ్మద్ నగర్ రోడ్డు పైకి వో పెద్ద ద్వారం కళాత్మకంగా నిర్మించేరు . ద్వారానికి రెండు వైపులా పెద్ద ఏనుగులు భక్తులను స్వాగతిస్తున్నట్లుగా నిర్మించేరు .
ద్వారం పై అష్ఠ గణపతుల పేర్లు , కోవెల వున్న ప్రదేశం పేరు ఆయా గణపతుల బొమ్మల క్రింద రాసేరు .ఇక్కడి స్థల పురాణం గురించి తెలుసుకుందాం . త్రిపురాసురుడు ముల్లోకాలను తన ఉత్పాతం తో భయ భ్రాంతులను చేస్తూ లోకకంటకుడిగా పరిపాలిస్తూ వుంటాడు . త్రిలోక వాసులు శివుని త్రిపురాసుని సంహరించి తమని రక్షింప మని వేడుకొనగా శివుడు త్రిపురాసురిని పైకి యుధ్ధానికి వెళతాడు . యుద్ధం మధ్యలో శివుని రధచక్రం విరిగిపోతుంది . శివుడు వోడిపోయే పరిస్థితి రాగా నారద ముని శివునికియుధ్దానికి బయలు దేరినప్పుడు వినాయకుని పూజించని విషయం గుర్తు చేస్తాడు . శివుడు తన పొరపాటు తెలుసుకొని గణేషునికి మహారూపాన్ని తలచుకొని మనస్సులోనే నమస్కరించి తిరిగి త్రిపురాసురుని తో యుధ్ధం చేస్తాడు , ఆయుద్ధం లో శివుడు త్రిపురాసురుని సంరిస్తాడు . త్రిపురాసురుని సంహరించిన ప్రదేశమే భీమాశంకర్ . శివుడు విజయుడైన పిదప రంజణ్ గావ్ లో మహా గణపతిని ప్రతిష్టించి పూజించు కొన్నాడనేది యిక్కడి స్థల పురాణం .