ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు - భమిడిపాటిఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

.ఈ వారం ( 30/8 – 5/9 ) మహానుభావులు.

జయంతులు

ఆగస్ట్ 31

1.శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు : వీరు ఆగస్ట్ 31,1864 న అజ్జాడ లో జన్మించారు. “ హరికథ పితామహుడు “ గా ప్రసిధ్ధి వెందారు.
సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్" మరియు "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం..

2. శ్రీమతి తురగా జానకీ రాణి : వీరు ఆగస్ట్ 31, 1936 న , మందపాకల లో జన్మించారు.. రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశి ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే వ్యక్తి. మంచి రచయిత్రి, సంఘ సంస్కర్త . పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను ఆవిడ రూపొందించి వాటిలో చిన్నారులతో ప్రదర్శింపచేశారు.

సెప్టెంబర్ 3
శ్రీ కొసరాజు రాఘవయ్య చౌదరి : వీరు సెప్టెంబర్ 3, 1905 న కొర్రాయపాలెం లో జన్మించారు.  “ కొసరాజు “ గా ప్రసిధ్ధి చెందారు.తెలుగు సినిమా పాటల రచయితగా వీరిది ఒక ప్రత్యేక స్థానం. వందలాది గీతాసుమాల్ని గుచ్చి ప్రకాశ పరిమళభరితం చేశారు. జానపదగీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టేవారు.

సెప్టెంబర్ 4
శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు  : వీరు, సెప్టెంబర్ 4, 1935 న విజయవాడలో జన్మించారు. ప్రఖ్యాత తెలుగు రచయిత.  ఆకాశవాణి కోసం ఎన్నో నాటికలు రచించారు. వీరు రచించిన “ మరమనిషి “ వివిధభాషల్లోకీ అనువదించారు.

సెప్టెంబర్ 5
డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణన్  : వీరు సెప్టెంబర్ 5, 1888 న తిరుత్తణి లో జన్మించారు. మనదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతిగా విధులు నిర్వహించారు, ప్రముఖ తత్వవేత్త. భారతీయ తత్వమును అర్ధం చేసుకోవడమన్నది ఒక సాంస్కృతిక చికిత్సగా దేశవిదేశాల్లో, తమ ప్రసంగాల ద్వారా బోధించారు. వీరి జన్మదినం “ ఉపాధ్యాయ దినోత్సవం “ గా జరుపుకుంటున్నాము.

వర్ధంతులు

ఆగస్ట్ 31
శ్రీ సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ :  “ బాపు “ గా ప్రసిధ్ధి చెందారు. ప్రముఖ చిత్రకారులు. వారు వేసిన కార్టూన్లు చూసి , సిగ్గూ ఎగ్గూలేకుండా హాయిగా నవ్వుకోవచ్చు. వారి గీత లో ఓ అందం ఉంది. “ తెలుగు ఆడబడుచు” కి ఓ నిర్వచనం చెప్పారు. అందమైన అమ్మాయిని “ బాపూబొమ్మ “ అనడం తెలుగునాట ఓ అలవాటుగా మారిపోయింది.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.

వీరు ఆగస్ట్ 31, 2014 న స్వర్గస్థులయారు.

సెప్టెంబర్ 1
శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు :  తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి . ఇంతహొయలుగా గేయంసాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానం ఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది. ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త, తెలుగు సాహిత్యకారుల్లో అగ్రగణ్యుడు, బహుభాషాకోవిదుడు. వీరు సెప్టెంబర్ 1, 1990 న స్వర్గస్థులయారు.

సెప్టెంబర్ 3

శ్రీ నండూరి రామ్మోహన రావు  :  తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు. పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా ప్రసిద్ధులు. ."నరావతారం", "విశ్వరూపం" ఈయన ప్రముఖ రచనలు. సామాన్య జనాలకు సైన్సు సంగతులు పరిచయం చేయడంలో వీరి కృషి ఎన్నదగ్గది. ఇవికాక వీరు ఆంధ్రపత్రికలో మార్క్ ట్వేయిన్ నవలలకు తెలుగు అనువాదాలు కూడా చేసారు.

వీరు సెప్టెంబర్ 3, 2011 న స్వర్గస్థులయారు.

సెప్టెంబర్ 4

శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ  :  ప్రముఖ నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర  నిపుణుడు.. బహుముఖ ప్రజ్ఞశాలి. భమిడిపాటి రాధాకృష్ణ 3 నాటకాలు, 6 నాటికలు రచించగా అవి కన్నడ, తమిళ, హిందీ భాషల్లోకి అనువాదమయ్యాయి. . ఎన్నో విజయవంతమైన  తెలుగు సినిమాలకు కథలు కూడా రాసారు.

వీరు సెప్టెంబర్ 4, 2007 న స్వర్గస్థులయారు.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి