అమోహం పుస్తక సమీక్ష...!! - మంజు యనమదల

amoham book review

 " వసంతాన్ని మోసుకొచ్చి విరగపూసిన వెదురుపువ్వుల పరిమళం ఈ అమోహం "

ఇదంతా ఏమిటని అనుకోవద్దంటూనే ఎప్పుడు ఏది ఎలా మొదలవుతుందో తెలియదంటూనే, భాషకెరుగని భావాన్ని చిక్కించుకోలేని నిశ్చలమైన అనిశ్చితితో కొట్టుకుపోయిన నిజమైన ముగింపెరుగని ఓ హృదయ నిజమైన సంవేదనే ఈ అమోహం. సున్నిత, సునిశిత వ్యక్తిత్వం గల శ్రీసుధ మోదుగు తన మనసుకు నచ్చినట్లుగా రాసిన అక్షరాలు, మనతో మనం పంచుకున్న మాటల భావాలై, ఇదేంటీ మనమే మాట్లాడేసుకుంటున్నాం మనతో అనిపించేటట్లుగా అతి సరళంగా రాసిన కవనాలు ఈ అమోహం కవితా సంపుటి నిండా ఎన్నో ఉన్నాయి.       తెల్లారుఝామున రాలిన నక్షత్రధూళితో వేకువ పొడిచిన వెలుగులో ఈ ప్రపంచాన్ని చూడటంతో మొదలై కలల ప్రపంచం,  అందమైన ప్రకృతి పరవశాలు, నిశ్శబ్ద ప్రవాహాలు, క్షణాల ఏకాంతాలు, ఏది పట్టని నిశ్చలత్వం ఇలా కంటికి కనిపించేది, మనసు స్పందించే ప్రతిదీ భాష లేని భావమై మిగిలిపోతుంది.

ఇవన్నీ చీకటి, శూన్యం తెలియని సూర్యుడితో చెప్తూ " ప్రతిసారీ అక్షరాలు దొరుకుతాయా అనుభూతిని ఒంపుకోడానికి " అంటూ నర్మగర్భ భావుకతను సుకుమారంగా మన మనసుల్లోనికి యుగాల ఏకాంతపు ప్రేమను ఒంపేస్తారు అతి నేర్పుగా. ప్రియమైన అవస్థను పద్యం, పాటగా మనం అంటూ కాసింత బాల్యాన్ని అద్దేసి పిచుక చిప్పిన ఆదిమరహస్యాన్ని పూలమొక్కలో విరబూయిస్తారు. మరోచోట " కొన్ని ఊహలు నిజాయితీగా నీతో వుండిపోవడంతో రాత్రి ఉదయిస్తుంది " . ఎక్కడైనా రాత్రి ఉదయిస్తుందా అని  మనం అనుకుంటాం కానీ ఇది అనితర సాధ్యమైన ప్రేమకు, ఇష్టానికి మనసుకున్న ఆశను తెలియజేస్తుంది. చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయంటారు మరోచోట. చీకటిని గోప్యంగా గుప్పెట్లో దాచుకోమంటారు. అంతిమంగా తెలుస్తుంది జీవితమంటే ఏమిటో, పరుగెత్తి అలసిపోయాక చావుపుట్టుకల రహస్యం అంటారు.  ప్రేమ ఎలా పుడుతుందో, ఎందుకు పుడుతుందో తెలియదంటారు. జీవిత పరమార్థాన్ని చెప్తారు చివరగా ఈ మొదటి అంకంలోనే.

ఇక రెండవ అంకం " మొదలంటూ తెలుసుకోలేని ముగింపే లేని అద్భుతానివి నువ్వు" అంటూ " ఇసుక రేణువులను వేణువుగా చేసి ఊదడం నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు " అంటూ మనసు లగ్నమైన ప్రేమను " ధ్యాసలో ధ్యానంలా దోసిట్లో నువ్వు నెమ్మదిగా నాలోకి జారడం " నా స్పందనలు అనుభూతులు భాషై, ప్రేమై, బాధై రాత్రి వర్షమై కురుస్తాయి  కలచి కలత పెట్టె కలలై నిదుర కౌగిలిని విడిపిస్తాయి. " ఇలాంటి అద్భుత భావనలు చదువుతున్న మనకు ప్రతి పేజీలోనూ కనిపిస్తాయి. ఇది చుడండి ఎంత అమోఘమైన అనుభూతో

" నువ్వు లేని క్షణం
యుగయుగాల

నిరంతర ధ్యానం " ఎన్నో రకాల పూల సుగంధాలను మనకు పరిచయం చేస్తూ ఒంటరితనాన్ని ఏకాంతంగా ఎంత  అద్భుతంగా మలచుకోవచ్చో చెప్తారు, అదీ మనకు అలవాటైన అతి సాధారణ వ్యక్తీకరణతోనే. మూడవ అంకంలో " చినుకు చినుకుకూ మధ్య దారిని చేసుకున్న వెలితి రాత్రి రజాయిలో చుట్టుకుని గుసగుసలాడింది " అని చెప్తూ " చీకటిని మరచిన కాంతికి దుఃఖాన్ని అద్ది సాయంత్రపు గ్గాలికి తోడై కడలిని వణికించింది " అంటూ తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూఛాయగా చెప్తారు. మనసు కొంచం కొంచంగా ఖాళీ అయినప్పుడు వచ్చి చేరే ఆలోచనల పరంపర, జ్ఞాపకాల రొద, ప్రశ్నలకే ప్రశ్నగా మిగిలిన జీవితమనే ప్రశ్న ఎప్పటికి తేల్చుకోలేనిది అంటారు. గాయాలను, కన్నీళ్ళను, అన్యాయాలను, దిగులు గుబులును, కథ మొదలైన సంగతిని, కనుమరుగైన జ్ఞాపకాలను తల్చుకుంటూ ఎన్నో అనుభవాలను, ఆశలను పంచుకుంటారు.

నాలుగవ అంకంలో జీవితమొక లెక్కల పట్టీ కాదని ఏదీ ఎవరినీ నిర్వచించలేదని ప్రపంచంలో మనం, మనలో ప్రపంచం లేదని ఎప్పటికి తెలుసుకుంటామో ! " అని కించిత్ ఆందోళనకు లోనవుతారు. ఆ వివరాలలోనికి వెళితే  " ఆకాశాన్ని ఈదడం సముద్రాన్ని ఒంపుకోవడం తేలికేమి కాదు " అని ఓ హెచ్చరికగా చెప్తూ నిన్ను నువ్వు తెలుసుకునే క్రమంలో నీకు ఏదీ అంట ముఖ్యం కాదు, మనం అన్న మనుగడ తప్ప అని చెప్తారు. మన ప్రయత్నమేమీ లేకుండానే విషాదం ఎక్కడినుంచైనా వస్తుంది. ప్రపంచ దుఃఖాన్ని మనమే ఓదార్చాలని దయను భుజాన వేసుకుని బయలుదేరుతాం కాని మనకు పొలమారితే గ్లాసెడు నీళ్ళ కోసం వెదుక్కుంటాం అంటూ మనలో లోపాన్ని ఎత్తిచూపుతారు, మనకు నచ్చకపోయినా." నేనొక నిజం నువ్వొక అనుభూతి జీవితమొక అనుభవం "  అని చెప్తూ హృదయం పచ్చనితోట కాదు నెర్రెలిచ్చి రక్తం ఓడుతున్న ఓ అశాంతి పుష్పం అంటూ జీవితపు బాధలు, అశాంతులు వెళ్లగక్కుతారు. పిరికితనం, భయం, నష్టం మొదలైనవి మనిషి తెలివిని ఎలా గెలుస్తాయో వివరిస్తారు, భారాన్ని దైవంపై మోపమంటారు.

ఐదవ భాగంలో జేవితాన్ని ఎలా ఆస్వాదించాలో ఇలా చెప్తారు. " కొంచం కొంచంగా వలుచుకుంటూ కొసరికొసరి జీవితాన్ని రుచి చూసుకుంటూ అపురూప నిశ్శబ్ద మమేక క్షణాలివి... ఏదీ పట్టదు.. ఎంతకూ తరగదు " అని చెప్పడం, " ఎంత ప్రయత్నించినా సముద్రాన్ని తవ్వలేమను కుంటాం...  నువ్వే సముద్రమై చేపపిల్ల కళ్లలో తప్పిపోయిన అద్భుతమిది " అని వర్ణించడం ఎక్కడా చదవని అభివ్యక్తి." సన్నని చేతి రేఖలు చెపుతాయి

స్మృతిలో వున్నవాళ్ళు
ఆపైన వెళ్లిన వాళ్ళు
ఏమీ మిగలకుండా
ఏదీ అంటకుండా
ఎవరికీ చెందకుండా వెళ్ళడం
ఒక వరమని
ఓ సాధారణ సూర్యాస్తమయమే
కాలం ఇచ్చే ముగింపని ."

అని ఓ తాత్వికతని చెప్తూ యుగాల ఎదురుచూపులు, మరెన్నో మనసు చెప్పలేని ఆరాధనా భావనలు, నిరీక్షణలో నీరెండలా తాకే జ్ఞాపకాల గురుతులు, మునుపెన్నడో పంచుకున్న ముచ్చట్లు, చివరికి మిగిలేది నీకు నువ్వే అని, కాలం మాయలో అందరు అన్ని మర్చిపోతారు నీతో సహా అని సులభంగా  చెప్పేస్తారు అనుబంధాల జీవిత సత్యాన్ని. ఓ శాంతి సందేశాన్ని ఆరవ అంకంలో ఇలా చెప్తారు. " కల్మషం లేని ఓ ఆలా నిండిన మనసుతో దొరికిన నక్షత్రాన్ని దోసిట్లో పెట్టుకొని ఆకాశం ముందు మోకరిల్లుతా .. ఎగురుతున్న పావురాళ్లను క్షేమంగా ఇంటికి చేర్చమని హత్తుకునే హృదయాలకు శాంతివ్వమని " ఈ మాటల్లో కవయిత్రి ఎంత సున్నిత మనస్కురాలో తెలుస్తోంది. సూర్యుడు అస్తమించే కాలమెప్పుడు మనోహరమే అని అంటూ యదార్ధానికి, ఊహలకు మధ్యన మిగిలిన కాలాన్ని ఆరాధనలో మమేకమైన మనసుని, కొన్ని సంశయాలను, సందిగ్ధతలను అక్షరీకరిస్తూ, కొద్దిగా జీవించడమో, లేదాయే పూర్తిగా నటించడమో నేర్చుకోవాలంటారు. కొత్త తొడుగులేసుకున్న కాలంలో కొంచం నమ్మకం, ధైర్యం, ప్రేమతో పూజించే చేతులను, ప్రార్థించే మనసును ఇచ్చినందుకు దైవానికి దూపం వెలిగించి కృతజ్ఞతలు చెప్పుకుంటానంటారు. 

ఇక చివరిది ఏడవది అయిన అంకంలో ప్రత్యేకంగా సముద్రం లక్కకున్న ఇసుకను లెక్కలేయడం,  ఒడిలో నిద్ర పోయిన సూర్యుడిని మరిచిపోయిన ఊహను రాతల్లో నిక్షిప్తం చేయడంలో విసుగు చూపిస్తూ " ఏమైనా కాళ్ళతోనే నడవాలి కళ్ళతోనే చూడాలి ఒకానొక ఆఖరి మలుపులో సత్యం స్వప్నమౌతుంది. " అని చెప్పడం లెక్కలేన్నన్ని రాత్రుళ్ళు, పగళ్ళు రాలిపోయి అంతుచిక్కని అరణ్యం తప్పిపోయింది అంటూ చాలా కొత్తగా జీవితపు స్థితులను, నిర్భావస్థితి అనుభవాలను, మనసు తోలుబొమ్మలాటలను, అంతిమ సమాధి అసలైన సమ్మోహనమనడం, ఎవ్వరిని పట్టి వుంచలేము, ఎవరికీ పట్టుబడలేము, విడదీసి, విచ్చిన్నం చేసి, వంచించి ఆదుకున్న ఆప్త మిత్రురాలు  కాలం అనడం, గాయాలను మాటలు నయం చేయలేవు, పీడకలలు రాకుండా ఏ కన్ను ఆపలేదు అనడం చివరిగా " Reality is nothing but life and lie "  అన్నది ఎంత వాస్తవమో మీకీపాటికి అర్థం అయ్యే ఉంటుంది. అమోహం మొదలు పెట్టినప్పుడు ఇదంతా ఏమిటని అనుకోకండి అని తన మనసు ఊసులను, భావోద్వేగాలను, ఆశలను, అనుభూతులను మరెన్నో ఆలోచనలను మనతో పంచుకున్న కవయిత్రి... ఇది ఇంతేనా అని వదిలేయకండి అంటూ హృదయంలో ఏ మూలో పూసిన గడ్డిపూల దుఃఖాన్ని, ఆ దుఃఖాన్ని ఓదార్చే ఓదార్పును, క్షమించం ఎలానో మనసుకు తెలిసే వుంటుందంటూ, తెలిసిన అర్ధాన్ని, ప్రేమను వదులుకోకుండా ఓ చిన్న భావాన్నైనా కవితగా ప్రేమగా హృదయానికి హత్తుకోమంటూ విన్నవిస్తారు చాలా సున్నితంగా.

శ్రీసుధ మోదుగు  రాసిన అమోహం చదువుతుంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ప్రేమలు, ఆరాధనలు, కోరికలు, కోపాలు, కన్నీళ్ళు ఇలా జీవితంలోని ప్రతి చిన్న ఆలోచనకు అక్షర రూపం కనిపిస్తుంది. మనం చెప్పలేని ఎన్నో అనుభూతులను హృద్యంగా సరికొత్తగా అక్షరా భావాలను ఆవిష్కరించి ప్రతిష్టాత్మక ఉమ్మిడిశెట్టి పురస్కారాన్ని తన తొలి కవితా సంపుటికి తీసుకున్న కవయిత్రికి హృదయపూర్వక అభినందనలు.

మరిన్ని వ్యాసాలు