కేరళ తీర్థయాత్రలు/ విహారయాత్రలు - కర్రా నాగలక్ష్మి

kerala viharayatralu

( తిరువనంతపురం )

 పద్మనాభస్వామి కోవెల గురించి తెలుసుకున్నాం కదా ? ఈ వారం తిరువనంతపురం లోని మరో కోవెల గురించి తెలుసుకుందాం . కేరళ అనగానే మనకి మరో మందిరం గుర్తుకొస్తుంది , ప్రతీ సంవత్సరం దేశవిదేశాలనుంచి వచ్చే భక్తుల  శరణు ఘోషతో మారుమ్రోగిపోతుంది . అయితే నేను చెప్పబోయే మందిరం శబరిమలై కాదు , ఈ కోవెల మళయాళీలలో ప్రాముఖ్యం పొందింది కాని మిగతా రాష్ట్రాలవారికి యీ మందిరం గురించి అంతగా తెలీదు . ఈ కోవెల గురించి చెప్పడానికి ముందు శబరిమల గురించి యెందుకు చెప్పాననుకుంటున్నారా ? , ఈ కోవెలని మహిళా శబరిమల అని అంటారు . ఇక్కడ మరో విషయం కూడా చెప్పదలచు కున్నాను , కేరళలోని అరుదైన కేరళలో మాత్రమే ప్రాముఖ్యత కలిగిన మందిరాలను గురించి తెలియజేసిన నేను శబరిమల గురించి రాయలేదేమనే అనుమానం మీకు రావొచ్చు . శబరిమల వెళ్లడానికి వున్న నియమాలవల్ల వెళ్లలేదు , అదీ కాకుండా మకరజ్యోతి దర్శనానికే అందరూ వెళతారు , మిగతాసమయాలలో వెళ్లకూడదా ? , కోవెల తెరచివుండదా ? , అన్నీ ప్రశ్నలే , స్థానికులని యెవరిని అడిగినా మకరజ్యోతి మకరజ్యోతి అంటారేతప్ప మిగతారోజులలో నిత్యపూజలుంటాయో వుండవో చెప్పరు . ఓ సారి టాక్సీ మాట్లాడుకొని కోవెల మూసేస్తే ఆ ప్రదేశం చూసి వస్తాం అంటే టాక్సీ అతను రావడానికి కూడా యిష్టపడలేదు .

సరే ప్రస్తుతం లోకి వస్తే మహిళా శబరిమల గురించి చెప్పుకుందాం . మహిళా శబరిమల అనగానే మగవారికి ప్రవేశం వుండదేమో అనే అనుమానం అక్కరలేదు , యెందుకీ విషయం ప్రస్తావించేనంటే ఆ మధ్య యెవరో ఈ కోవెలలో మగవారికి ప్రవేశం లేదు అనే పోష్టుపెట్టారు . అది తప్పు , చాలా సార్లు తప్పుడు పోష్టులు యిలాంటివి వస్తూ వుంటాయి . నేను మావారు వెళ్లాం . ఈ కోవెలలో జరిగే పొంగలి పండుగకి వచ్చే ఆడవారి సంఖ్య చాలా యెక్కువగా వుంటుంది , ఈ విషయం గిన్నిస్ బుక్ లో కూడా గ్రంథస్థం చెయ్యబడింది . అతి యెక్కువ మంది ఆడవారు ఒకే రోజు వచ్చే కోవెలగా చెప్పుకుంటారు . అలాగే మగవారు అధిక సంఖ్యలో మకరసంక్రాంతికి శబరిమల వస్తారు . ఈ పొంగలి పండగ సంవత్సరం లో రెండుసార్లు చేసుకుంటారు . ఈ కోవెల పద్మనాభ స్వామి కోవెలకి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో వుంటుంది .

కోవెల కేరళ స్టైల్ లో వుంటుంది . చిన్న గోపురం , గోపురంలో తమిళ శిల్పకళ కన్పిస్తుంది . గర్భగుడిలో పార్వతీ దేవి భద్రకాళి , భగవతిగా పూజలందుకుంటోంది , ఈమెని కణ్ణగిమాత అని కూడా అంటారు . కోవెల లోపల వినాయకుడు , కుమారస్వామి , శివుడు లకు ఉపమందిరాలున్నాయి , భద్రకాళితోపాటు భైరవుడు సమానపూజలందుకుంటూ వుంటాడు . మంగళవారం , శుక్రవారాలలో భక్తులు యెక్కువగా వస్తూ వుంటారు . ఈ కోవెల పగలు 4-30 నుంచి మద్యాహ్నం 12-30 వరకు తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 8-30 వరకు తెరచి వుంటుంది .

కుంభమాసంలో అంటే ఫిబ్రవరి 14 నుంచి మార్చి 13 వరకు అన్నమాట , వచ్చే కృత్తిక నక్షత్రం మొదలు మఖ నక్షత్రం వరకు సుమారు 10 రోజులు భద్రకాళి అమ్మవారి జాతర నిర్వహిస్తారు . దీనికి కేరళనుండేకాక దేశవిదేశాలలో వున్న మళయాళీలు వచ్చి శ్రద్దాభక్తులతో పాల్గొంటారు . భద్రకాళి అమ్మవారి జాతర అంటే అమ్మవారు పుట్టింటికి వచ్చినట్లుగా భావించి భక్తులు అమ్మవారికి యిష్టనైవేద్యాలు నివేదించి పసుపుకుంకుమలు నూతన వస్త్రాలు సమర్పిస్తారు . కొడుంగలూరు అమ్మవారు అటుకల్ వచ్చినట్లుగా భావించి పూజలు చేస్తారు . కృత్తిక నక్షత్రం రోజు ‘ కప్పుకెట్టు ‘ పండగచేస్తారు . అంటే గాజుల పండగ , మఖ నక్షత్రం రోజున గాని పున్నమి రోజున గాని పొంగలి నైవేద్యం సమర్పిస్తారు .          పొంగలి పండగకి కేరళ తమిళనాడు లలోని పల్లెపలెల్ల నుంచేకాక దేశవిదేశాలనుంచి మళయాళీలు వచ్చి పొంగలి పండుగలో పాల్గొంటారు . పాల్గోడానికి వచ్చిన వారి కంటే వీరిని చూడ్డానికి విదేశీయులు యెక్కువగా వస్తారు .

తమిళనాడులో కూడా అమ్మవారి జాతరలప్పుడు పొంగలి కోవెల ప్రాంగణంలో వండి అమ్మవారికి నివేదించడం చూసేం కాని అటుకల్ లో కూడా కోవెల ప్రాంగణంలో రాత్రి జాగారం తేస్తూ అమ్మవారికి పొంగలి వండి తెల్లవారు ఝామున నివేదించి పగలు యెవరిళ్లకు వారు వెళ్లి అమ్మవారి ప్రసాదం బంధుమితృలతో పంచుకొని తింటారు . ఇంతవరకు బాగానే వుంది కోవెలలో అమ్మవారికి పొంగలి వండడమే కదా ? అనుకుంటున్నారా ? మరి యిక్కడే వుంది అసలు విషయం ఓ పదిమందో పోనీ వందమందో అయితే ఫరవాలేదు అదే వేలల్లో అయితే కోవెల ప్రాంగణం దాటి కోవెలచుట్టూ లేదా కోవెలవీధిలో కూడా పొయ్యలు వేసుకొని కూర్చుంటారు మరి అదే లక్షలలో అయితే మొత్తం తిరువనంతపురం లో యెక్కడ జాగా వుంటే అక్కడ , రోడ్డుకి యిరువైపులా వరుసగా యెక్కడపడితే అక్కడ ఆడవారు పొయ్యపెట్టి పొంగలు వండుతూ కనబడతారు . 2016లో 45 లక్షలమంది పొంగలు వండి అమ్మవారికి నైవేద్యం పెట్టినట్లు గిన్నిస్ బుక్ వారు నమోదు చేసేరు , ప్రతీ సంవత్సరం ముందుసంవత్సరపు రికార్డుని బద్దలు కొట్టడం చెప్పుకోదగ్గ విశేషం . ఆ సంఖ్య యీ సంవత్సరం కోటికి దగ్గరగా వచ్చింది , పై సంవత్సరం కోటి దాటుతుందని అంచనా . తిరువనంతపురం వీధులన్నీ భక్తులతో నిండిపోతాయి , మూడుకొప్పులు కలిస్తేనే తగవులు మొదలవుతాయని సామెత , అలాంటిది యింతమందిని అదుపుచెయ్యాలంటే మాటలుకాదు . మొత్తం పోలీసు , రాష్ట్రంలో వున్న ఆర్మీ , నేవీ వారి సహకారంతో సమర్ధవంతంగా యీ జాతరని నిర్వహిస్తోంది . అక్కడక్కడ చిన్నచిన్న గొడవలు జరుగుతూ వుంటాయి .

స్థలపురాణం యేమిటంటే దానవరాజైన తారకుడిని సంహరించేందుకు శివుని మూడవ కన్ను నుంచి ఉధ్బవించిన కాళి తారకుని సంహరానంతరము భక్తుల కోరికపై భద్రకాళిగా యిక్కడ నివాసముందని అంటారు .ఒకటవ శతాబ్దం నుంచి మూడవ శతాబ్దాల మధ్య పాండ్యరాజులకాలంలో వారి రాజధాని మధుర దగ్గర పల్లెలో నివాసముండే ధనికవ్యాపారి కోవలం కి కణ్నగి అనే కన్యతో వివాహం జరుగుతుంది , కోవలం రాజనర్తకి మాధవి వలలో పడి వ్యాపారం , భార్యను విడిచిపెట్టి మాధవి వద్దగడుపుతూ ధనంయావత్తూ ఆమెకి సమర్పిస్తాడు . మహపతివ్రత అయిన కణ్నగి భర్తని ప్రశించక యెలాగో యిల్ల గడుపుతూ వుంటుంది . కోవలం దగ్గర ధనం లేదని తెలుసుకున్న నర్తకి అతనిని యింటినుండి గెంటివేస్తుంది . అక్కడ వుండే దారిలేక భార్యను వెతుకుతూ రాగా భార్య ఊరుఅవతల పాకలో ధరించేందుకు వస్త్రములు లేక తినడానికి తిండిలేక అతి దీనావస్థలో వుండటం చూచి కోవలం ‘ ఇక్కడ తిండిలేక వుండేబదులు నీపుట్టింటి వెళ్లవలసిందికదా , సమయం మించిపోలేదు యిప్పుడు మీవాళ్లింటికి వెళ్లి వారి సహాయంతో తిరిగి వ్యాపారం మొదలుపెడతాను ‘అంటాడు . కణ్నగి ‘ చెడిపుట్టింటికి చేరరాదు ‘ అని చెప్పి తన చేతికంకణాన్ని భర్తకి ఇచ్చి దీనిని మధురైలో విక్రయించి రమ్మని ఆ సొమ్ముతో తిరిగి వ్యాపారం చెయ్యవొచ్చని చెప్తుంది . కోవలం భార్య చేతికంకణం తీసుకొని మధురై కి బయలుదేరుతాడు , ఆరోజులలో మధుర పాండ్యరాజుల రాజధానిగా వెలుగొందుతోంది .

కోవలం మధురైలోని పెద్ద బంగారు వర్తకుని వద్దకు వెళ్లి కంకణం అమ్మజూపుతాడు , వర్తకుడు కంకణం చూసి రాణిగారు పోగొట్టుకున్న కంకణమని భావించి రాజుగారికి వర్తమానం పంపుతాడు . రాజు కోవలం దగ్గరవున్న కంకణాన్ని రాణిగారి కంకణంగా పొరబడి కోవలంకు శిరఛ్చేదన శిక్షవిధించి అమలు చేస్తాడు . భర్త రాకకోసం కళ్లుకాయలుకాచేలా చూస్తున్న కణ్ణగికి జరిగిన విషయం తెలుస్తుంది . కణ్నగి రాజు దర్బారులో వుండగా కోపోద్రేకంతో నిండు సభలో రాజును నిలదీస్తుంది . శిరఛ్చేదన శిక్ష విధించేటప్పుడు ముద్దాయిని ప్రశ్నించలేదా ? , న్యాయాన్యాయాలు నిరూపణ కానిదే యెలా శిక్షవేసేవు అని అడుగుతుంది . రాజు రాణిగారి కంకణం అతని చేతిలో దొరకడం దొంగతనం చేసేడనడానికి ఋజువుకాదా అని అడుగుతుంది , రెండు కంకణాలూ సభకి తెమ్మని కోరుతుంది , పెద్దలు పరీక్షించగా రెండింటికీ తేడా వున్నట్లు తెలుస్తుంది . కంకణం విప్పి చూడమంటుంది , రాణిగారి కంకణంలో ముత్యాలువుంటాయి , కణ్నగి కంకణంలో రత్నాలు వుంటాయి , కణ్నగి తన చేతిలోని రెండో కంకణాన్ని నేలకు విసిరికొట్టి నిర్దోషిని శిక్షించిన ఈ రాజు ఇతని పరివారము మొత్తం బూడిదవ్వాలని శపించి ఆత్మాహుతి చేసుకుంటుంది . కొద్దిరోజులకే కణ్నగి శాపం నిజమై మధురై నగరం కాలిబూడిదైపోతుంది , పాండ్యరాజుల వంశం అంతరించిపోతుంది . తమిళనాడులో కణ్నగి శిలాప్రతిమలు చాలా చోట్ల కనబడుతాయి . ఆమె ఆత్మ కొడుంగలూరు లో భద్రకాళి అమ్మవారిలో కలిసిందని ఇక్కడివారి నమ్మకం .

కొడుంగలూరు కణ్నగి ఓ సారి చిన్న బాలికరూపంలో అటుకల్ వచ్చి వూరి మొదలులో నదీతీరాన కూర్చొనివున్న ఓ ముసలివానిని నది దాటించమని కోరగా అతను చిన్నపిల్ల ఇంట్లో చెప్పకుండా వచ్చివుంటుంది ,  ఈ పాపను నదిదాటించి వదిలేడం విజ్ఞతకాదని తలచి తనఇంటికి తీసుకువెళ్లి పాపను వెతుకుతూ యెవరైనా వస్తారని యెదురుచూస్తూవుంటాడు . సాయంత్రం పాప అదృశ్యమౌతుంది . అటూయిటూ వెతికిన ముదుసలి అలసి నిద్రపోతాడు కలలో ఆపాప కనిపించి తాను కొండుగలూరు కణ్నగినని మీరాజ్యాన్ని కాపాడడానికి వచ్చేనని అతని తోటలో మూడు బంగారు గీతలు కనిపిస్తాయని వాటిమధ్య కోవెలనిర్మాణం చెయ్యమని చెప్తుంది . మరునాడు మదుసలి తోటలో వెళ్లిచూడగా మూడు బంగారు గీతలు కనిపిస్తాయి , వాటిమధ్యనే కోవెల నిర్మాణం చేసి భద్రకాళి అమ్మవారికి పూజలు చెయ్యసాగేడు .

ఇందండి మహిళా శబరిమల మందిరం గురించిన వివరాలు .

వచ్చే వారం మరో ప్రదేశం సందర్శిద్దాం , మరి అంతవరకు శలవు . 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి