వైకల్యం శరీరానికే కానీ, మనసుకు కాదు. ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను.. అన్న తపన లేకపోవడమే నిజమైన వైకల్యం. సంకల్పం ఉంటే, వైకల్యం విజయానికి ఎంత మాత్రమూ అడ్డంకి కాదు. అదే నిరూపించారు మన మానసి జోషి, వీరిద్దరూ తాము ఎంచుకున్న రంగాల్లో అత్యున్నత శిఖరాల్ని అధిరోహించారు. జాతి గర్వపడే ముద్దుబిడ్డలుగా కీర్తింపబడుతుతున్నారు. ఇటీవల జరిగిన పారా బ్యాడ్మింటన్ మహిళా నేషనల్ ఛాంపియన్ షిప్‌లో బంగారు పతకం సాధించి శభాష్ అనిపించుకుంది మానసి జోషి. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని, ప్రతీ ఏటా ప్రంపంచ క్రీడా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంటాం. ఈ ఏడాది ప్రపంచ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రపంచ స్థాయిలో పలు క్రీడల్లో సత్తా చాటిన క్రీడాకారుల్ని ప్రధాని నరేంద్ర మోడీ సత్కరించారు. వారిలో బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన పి.వి. సింధుతో పాటు, పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణం సాధించిన మానసి జోషి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.
అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్నవాళ్లు జీవితంలో ఏదీ సాధించలేకపోతున్నారు. అలాంటిది అవయవ లోపం ఉండీ, ఆ లోపానికి కుంగిపోకుండా, ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మానసి జోషి సంకల్పానికి హ్యాట్సాప్ అనాల్సిందే. ఈమెకు ఓ కాలు పూర్తిగా లేదు. చూడగానే ఆకట్టుకునే అందం ఆమె సొంతం. అంతేగా దేవుడు ఎంత చుప్పనాతి. అంతటి అందమైన అమ్మాయికి అంత పెద్ద లోపం పెట్టాడే అని అనుకునేంతలోపే, ఆమె సాధించిన ఘనతకు లోపం ఆమె శరీరానికే మనసుకు కాదు, మానసిక స్ధైర్యంతో ఆమె సాధించిన ఈ ఘనత ముందు ఆ లోపం ఏ పాటిది అనిపిస్తుంది. ఎందరిలోనో ఎంతో స్పూర్తిని నింపుతుంది. చిన్నతనం నుండీ బ్యాడ్మింటన్ అంటే అపారమైన ఇష్టం ఉన్న మానసి జోషి, ఆ క్రీడను తానూ పట్టుపట్టి నేర్చుకుంది. నేర్చుకోవడమే కాదు, ప్రపంచ స్థాయిలో విజేతగా నిలిచింది.
అవయవ లోపం ఉన్నా, ఆ వైకల్యం తన విజయానికి ఎప్పుడూ శాపం కాలేదని నిరూపిస్తూ, ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మరో వ్యక్తి ఆనంద్ ఆర్నాల్డ్. ఈయన ఎవరు.? అని అడగొద్దు. అందరికీ సుపరిచితుడే ఆనంద్ ఆర్నాల్డ్. 'సుప్రీమ్' సినిమాలో రెండు కాళ్లూ లేని ఓ ఫైటర్‌ని అంత త్వరగా మర్చిపోలేం. కాళ్లు లేకపోతేనేం ఆయన ప్రపంచం మెచ్చుకున్న ఓ బాడీ బిల్డర్. తనలాంటి ఎందరో అంగ వైకల్యం ఉన్నవాళ్లకు ఆదర్శంగా నిలిచాడు. 'ఏదో సాధించాలని అనుకుంటే చాలదే.. పట్టు పట్టి సాధించాలా. 'అని ఇటీవల ఓ సినిమాలో డైలాగ్ పదే పదే వినిపించిన సంగతి తెలిసందే. ఆ పట్టుదల, కృషి ఇలాంటి వారిలో రియల్‌గా నాటుకుపోయింది. ఆ అంకితభావమే వారిని ప్రపంచం దృష్టిలో విజేతలుగా నిలిచింది. ఇలాంటి వారి జీవితాలు ఎందరికో స్పూర్తిదాయకాలు. వీరే కాదు, ఇలా వైకల్యంతో బాధపడుతూ ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఎందరో, మరెందరో మన సమాజంలో మనతో పాటే మసలుతున్నారు. ప్రేమలో ఫెయిలయ్యామనీ, మార్కులు తక్కువ వచ్చాయనీ, ఇంకో కారణమో చెప్పి ఈ సమాజంలో బతికేందుకు అర్హులం కాదని బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న వారున్న ఈ సమాజంలో ఇలా పుట్టుకతో వచ్చిన వైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా, విజయాలు సాధిస్తున్నవారూ ఉన్నారు ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి యువత. సంకల్పం ఎంత బలమైనదైతే, విజయం అంత గొప్పగా ఉంటుందని తెలుసుకోవాలి.