మనసులోని కోరిక - పి.ఎల్.ఎన్. మంగారత్నం.

manasuloni korika

అది పిఠాపురం మహారాణీ కాలేజీకి చెందిన  ఖాళీ స్థలం. అయిదారు ఎకరాలకు పైనే ఉంటుంది.రోడ్డుకు అటు వైపున డిగ్రీ కాలేజీ ఉంటే, ఇటు వైపు ఉన్న స్థలంలో ఆడపిల్లలకి హాస్టలు కట్టాలని ఎన్నో సంవత్సారాలుగా  అనుకోవడమే గాని, కార్యరూపము దాల్చలేదు. కొంతమంది సంచార జాతుల వాళ్ళు అప్పుడపుడూ .. ఆ ఖాళీ స్థలంలో .. రోడ్డువారగా  తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని నెలో, రెండునెలలో ఉండి వాళ్ళ చేతి వృత్తులను ప్రదర్శించి .. అమ్ముకుని వెళుతుంటారు.

అలా .. ఈ సారి బుడగజంగాల కుటుంబాలు వచ్చి చేరినాయ్.  చెట్ల క్రింద తాటాకుతో గుడిసెలు వేసుకుని,    అక్కడే వంటలు చేసుకుంటూ పిల్లలతో జీవనం సాగిస్తారు. మగవాళ్ళు బుడగాలూ, గాలి చక్రాలూ, మొలతాళ్ళూ, నాఫ్తలిన్ బాల్స్ వంటివి అమ్మితే, ఆడవాళ్ళు ఊరిలొ తిరిగి సూదులూ, చెంప పిన్నీసులూ, దిష్టిబొమ్మలు లాంటి .. ఇళ్ళలోకి కావలిన చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటుంటారు.  పల్లెటూర్లలో ఇప్పటికీ ఇలాంటి వారికి ఆదరణ ఉంది. వచ్చిన వారిలో చిన్నపిల్లలూ, బడికి వెళ్లేవాళ్ళూ ఉన్నారు. ఎవరి మాట ఎలా ఉన్నా, అందరి కన్నా  పెద్దపిల్ల .. అయిదవ తరగతి చదువుతున్న కస్తూరికి మాత్రం అలా రావడం అస్సలు ఇష్టం లేదు.తమ స్వంత  ఊరిలొ ప్రభుత్వ౦ ఉచితంగా ఇళ్ళు కట్టించి ఇవ్వడంతో కొన్నాళ్ళు అక్కడే స్థిరంగా ఉన్నా ఆర్ధిక అవసరాలకి అప్పుడప్పుడూ ఇలా బయటకి రావాల్సి వస్తుంది.
ఆ జంగాలకు పెద్ద తలకాయ అయిన కస్తూరి తండ్రి సోమేశం “ పెద్దాపురంలో ఆషాడం మాసంలో.. ఊరి గ్రామదేవత అయిన మరిడమ్మ జాతర జరుగుతుంది.  అప్పుడు ఎక్కడెక్కడి వాళ్ళో అమ్మవారి దర్సనం చేసుకోవడానికి వస్తారు. ఇలాంటి సమయంలో మనమూ అక్కడికి వెళితే భుక్తికి లోటుండదు” అంటూ తీర్మానించాడు.ఆ తీర్మానానికి అందరూ కట్టుబడి ఉంటారు.

ఆ మాటకి గుండెల్లో రాయి పడింది కస్తూరికి. ఉన్న ఊరిలోనే బాగుంటుంది. బడికి వెళితే మధ్యాహ్నం .. భోజనం పెడతారు. సాయంత్ర మైతే స్నేహితులతో ఆడుకుంటూ హాయిగా ఇంటిపట్టునే ఉండి అమ్మతో కబుర్లు చెప్పుకోవచ్చు.

అదే బయటకి వెళితే, ఎండకు ఎండి, వానకి తడవాలి. సరిగ్గా పడుకోవడానికి వీలు ఉండదు. గాలివాటు బ్రతుకు అయిపోతుంది. ఈ నిముషం ఇలా జరిగింది అనుకునేలా.“ మాస్టారు బడి మానకూడదనీ, రోజూ వచ్చి చదువుకోవాలనీ చెప్పారు . నేను రాను ” అంది తన అయిష్టతను తెలియచేస్తూ.“ మాస్టారుకే అలాగే అంటారు. ఆయనలా మనకేమన్నా ఉద్యోగాలా? రెక్కాడితేగాని డొక్కాడదు” అంటూ  బయలుదేరదిసాడు.

***
ఆ రోజుకి అమ్మవారి గుడి చుట్టూ ఎన్నెన్నో అంగళ్లు వెలిశాయి. ఏది కావాలన్నాదొరికేలా.యాత్రకు వెళ్లి పాత్ర తేవాలన్న సామెతగా .. అంగడి వాళ్ళు చెప్పిన రేట్లకి సగానికి సగం తగ్గించి బేరాలాడి మరీ కొంటున్నారు వచ్చిన వాళ్ళు. ఆ క్రమంలో ..పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ప్లాస్టిక్కుతో తయారుచేసిన బూరలూ .. కళ్ళజోళ్ళూ, ముఖాలకి తగిలించుకునే  మాస్కులూ అమ్ముతారు జంగాలు. ఎండుగడ్డి చుట్టిన గెడకర్రకి నిండుగా కాగితపు చక్రాలు గుచ్చి,  గాలి వాలుకి పెడితే, పిల్లలకేంటి, పెద్దలకైనా మనసు తిరగాల్సిందే. తళతళలాడే రంగు కాగితాలు .. స్వేచ్చా విహంగాల్లా .. పూలచక్రాల్లా తిరిగేస్తూ చూపరులను  కట్టిపడేస్తాయి. అన్నీ తిరిగి చూసిన ఆనందం కన్నా.. వీటిని చూసిన ఆనందమే ఎక్కువ.  

క్షణ భంగురమే అయినా .. పిల్లలకి గాలికి అల్లల్లాడే  రబ్బరు బుడగలంటే ఇష్టం.బుడగలో బుడగ చేర్చి కట్టడం,  పొడుగాటి గాలి గొట్టాన్ని చెవులున్న కుక్క పిల్ల ఆకారంలో మడచడం చేస్తుంటారు.  వాటితోనే యాపిల్ బెలూన్స్,  లవ్ బెలున్సు  కూడా ఉంటాయి. వాటిని చూసి పిల్లలు గింగిరాలెత్తుతారు.

ఎరుపూ, పసుపూ, నీలం ఏ రంగు తీసుకోవాలో తెలీదు వాళ్ళకి. ఆ ఆనందమే పెట్టుబడి వీళ్ళకి. గురువారాలూ, ఆదివారాలూ  పోటేత్తుతారు.
ఆరోజు తల్లి కాసులమ్మతో పాటు..  కస్తూరీ కొన్ని బుడగలు అమ్మే పని తీసుకుంటుంది.  బూర ఊదుతూ పిల్లల్ని ఆకర్షిస్తుంది. తనూ వాళ్ళ కన్నా .. కాస్త  పెద్దపిల్ల అంతే. కుటుంబానికి సాయపడుతున్నందుకు సంతోషపడినా, స్కూల్ వదులుకోవలసి వచ్చినందుకు బాధ పడేది.  
చిన్నపిల్ల తక్కువకే ఇస్తుందనుకుని ఎగబడేవారు జనం.

గౌను జేబులోకి డబ్బులు వచ్చి చేరుతున్నా .. అంత సంతోషాన్ని కలిగించడం లేదు. స్కూల్ కి  దూరమయ్యానన్న బాధే  .. కళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది.స్కూల్లో మాస్టారు చెప్పిన మాటలే గుర్తుకు వస్తున్నాయి. “ ప్రభుత్వ౦ అట్టడుగు వర్గాలను పైకి తీసుకొచ్చే విధంగా మీలాంటి  సంచారజాతుల వాళ్ళకి ప్రయోజనం కలిగించేలా ఎన్నో ప్రణాళికలు రూపొందించింది. దానిని గుర్తెరిగి మీరంతా కష్టపడి చదువుకోవాలి. ఎంత వరకూ చదువుకుంటే అంతవరకూ చదివిస్తుంది ప్రభుత్వం ఉచితంగా. అందుకు మీకు రిజర్వేషన్లు కూడా కల్పించబడ్డాయి. మీ చదువే మిమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది. అప్పుడు ప్రజాస్వామ్యం మీరూ భాగస్తులవుతారు” అని. మాస్టారు ఏం చెప్పినా ఆమెకు నచ్చుతుంది.

వేసవి శెలవులు పూర్తయ్యి .. ఇక్కడి మహారాణీ కాలేజీ తెరిచేసారు. ఎంతోమంది విద్యార్ధులు రోజూ కాలేజీకి వచ్చి వెళుతున్నారు. కాలేజీకి వెళ్లేంత వయస్సు తనకి ఇంకా రాలేదు. అయినా తనూ వాళ్ళలాగే చదువు కోవాలనీ, మంచి బట్టలు కట్టుకోవలనీ అనుకుంటుంది. తండ్రి సోమేశం ఈ జాతర తరువాత ..

అక్కడికి దగ్గరలో .. కిర్లంపూడి మండలంలో జరిగే మరో జాతర .. గురించి మాట్లాడుతున్నాడు, బాబాయిలూ, మమయ్యలతో. ఊరుకు౦టే, ఇటు నుంచి ఇటే అనేలా ఉన్నాడు. దానికింకా పది రోజుల టైము ఉంది. అదీ రెండేళ్ళకు ఒకసారి జరిగే నూకాలమ్మ జాతర. వారం రోజులపాటు జరుగుతుంది. జాతర అయిపోయినా వీళ్ళు ప్రక్క గ్రామాలు తిరిగి మిగిలిన వస్తువులు అన్నీ అమ్ముకునే ఇళ్ళకు వెళతారు. అందుకే గట్టిగా ప్రతిఘటించింది. 

“ నాన్నా! బడి తెరిచి నెలరోజులు అయిపోతుంది. చాలా పాఠాలు అయిపోయి ఉంటాయి. నన్ను  మన ఊరు పంపించేయ్. నేను నాన్నమ్మ దగ్గర ఉండి చదువుకుంటా ” అంటూ గొడవ చేయసాగింది.“ మేమూ నానమ్మ దగ్గరే ఉంటాం పెదనాన్న” చెప్పారు వెంకటేష్, సుబ్బలక్ష్మి కూడా. వాళ్ళిద్దరూ నాలుగవ తరగతిలో ఉన్నారు.

“ అంతేనయ్యా! సదువంటే ఏమిటో మనకి తెలియకపోయినా .. మన పిల్లలు సదువుకుంటానని  ఆశ పడుతున్నారుగందా! వాళ్ళ కోసం అయినా మనం మారాలిగా. మన పిల్ల కస్తూరి అయితే .. ఇక్కడికి వచ్చింది మొదలు ‘బడి, బడి’ అని కలవరిస్తాంది.  అదిగో .. రోడ్డుకి అవతల .. కళ్ళ ముందు ఎంతమంది పిల్లలు ఆ పెద్ద కాలేజీలోకి పోయి చదువు కోవడం లేదు. మన పిల్లలు మాత్రం ఎఒదులో తక్కువ. మనకీ పైకి వెళ్ళే అవకాశాలున్నాయని  పంతులుగారు చెబుతూనే ఉన్నారాయే. అయినా ఇలా సంపాదించినది మీ మగాళ్ళు సాయంత్రం తాగుళ్ళకి తగలేయ్యక పొతే, మన జీవితాలూ బాగానే ఉంటాయి ” అంటూ తన మనోగతాన్నీ, కూతురి కోరికనూ తెలియచేసింది కాసులమ్మ.ఏ కళనున్నాడో సోమేశం భార్య మాటలకు మౌనంగా ఉండిపోయాడు. ఇక్కడికి వచ్చింది మొదలు తమ గుడిసె ముందున్న బరకం నీడలో కూర్చుని వచ్చే పోయే కాలేజీ పిల్లల్ని చూసి .. తన కూతురినీ ఇలా  చదివించగలనా అనుకున్నాడు. మనసులో తను అనుకున్నదే కూతురు కోరుకుంటుంది. మరి కాదనడం ఎందుకు? ఆ మరునాడే ఆ స్థలం .. ఖాళీ అయ్యింది. చదువుకునే పిల్లల్ని ఎవరి సంరక్షణలో అయినా ఉంచి, తమ జీవనం సాగించాలని అనుకున్నారు అంతా.

ఇప్పుడు కూతురి మనసులో ఆనందం కళ్ళలో కనిపించినట్లయ్యింది  సోమేశానికి.            

మరిన్ని వ్యాసాలు