భయం భయం - పద్మావతి రాంభక్త

bhayam bhayam

వర్జీనియా యూనివర్సిటీలో ఎమ్మెస్ చేస్తున్న సమయం.ఇక్కడ ప్రదేశమూ,స్నేహితులూ అంతా కొత్తకొత్తగా ఉంది.ఇద్దరు అమ్మాయిలతో ఒక ఫ్లాట్ షేరింగ్ కి తీసుకుని ఉన్నాను.అమ్మానాన్నలకు ఒక్కదాన్నే కావడంతో వారి ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకుని ఉన్నారు.నన్ను ఇక్కడకు పంపడం వారికి అసలు ఇష్టం లేదు.కానీ నా మొండితనం  వల్ల తప్పనిసరై  పంపారు.

రోజూ అమ్మానాన్నా ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని పదిసార్లు చెప్పేవారు,ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీలో అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరా ల  క్రితం కొందరు విద్యార్ధులను ఎవరో నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపారు.అదీ వారి భయానికి కారణం. నేనే వారు జాగ్రత్తలు చెప్పినప్పుడల్లా బాగా విసుక్కునే దాన్ని.అలాగని నాకు వాళ్ళంటే ప్రేమ లేదనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.వాళ్ళు నా కన్నవాళ్ళు,నా మీదనే పంచప్రాణాలూ పెట్టుకుని బ్రతుకుతున్నవాళ్ళు.అసలు నేను ఇక్కడకు రావడానికి కారణమే  బాగా సంపాదించి వాళ్ళను సుఖపెట్టడానికి అంటే మీరు నమ్మి తీరాలి.ఈ యూనివర్సిటీకి కూడా చాలా మంచిపేరుంది.

ఆ రోజు ఉదయం లేవక మునుపే అమ్మానాన్నా ఫోన్ చేసారు.ఇంకా నా బ్రషింగ్ కూడా అవలేదు. అమ్మేమో”తల్లీ తిన్నావా,ఏం వండుకున్నావు? తిండి విషయంలో డబ్బుల గురించి ఆలోచించకు” అంది ఎప్పటిలాగే. నాన్నగారు”ఫీజ్ కోసం డబ్బులు ఎప్పుడు అకౌంట్ లో వేయాలి.నెల ఖర్చులకు ఎంత పంపమంటావమ్మా? సరిపోకపోతే మొహమాటపడకుండా అడుగు”అన్నారు.

“అయ్యో అమ్మా,మీకు అక్కడ రాత్రి అయితే, నాకు ఇప్పుడు పగలు అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి. మీరు ఫోన్ చేసిన శబ్దానికే నిద్రలేచాను.ఏదో ఒకటి తింటానులే నువ్వు బెంగపడకు”అన్నాను అమ్మతో. “ఇంకా ఫీజ్ కట్టడానికి టైం ఉంది నాన్నా.నెలకి డబ్బు ఎప్పటిలాగే పంపండి.పుష్కలంగా సరిపోతోంది”అన్నాను. మళ్ళీ జాగ్రత్తలు చెబుతూ ఫోన్ పెట్టేసారు.

పాపం నాన్న ఎంత ప్రయత్నించినా ఎడ్యుకేషనల్ లోన్ శాంక్షన్ అవలేదు.దాంతో నాన్న ఎప్పటి నుండో ఇల్లు కట్టుకుందామని ఉంచుకున్న స్ధలం అమ్మి ఆ డబ్బు నా చదువుకు పంపుతున్నారు.నేను అమెరికా వచ్చి చదువుకోవాలనే కలను ఇలా ఈ రకంగా తీర్చుకుంటున్నాను. అయినా ఇక్కడ చదువుకుని ఏ గూగుల్ లోనో ఉద్యోగం సంపాదించుకోగలిగితే వాళ్ళకి మంచి పేలస్ లాంటి  ఇల్లు తప్పక కట్టి ఇవ్వగలను.
నెమ్మదిగా చాలామంది ఇండియన్స్ ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి నాకు కాస్త భయం బెరుకు తగ్గాయి.స్వతహాగా నేను చాలా పిరికి దాన్ని.చీకటంటే చచ్చేంత భయం.అందుకే అమ్మానాన్నలు నన్ను వదలిపెట్టి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళేవారు కాదు.అయితే నన్ను కూడా వారితో తీసుకెళ్ళేవారు , ఒకవేళ నాకు వీలుకాకపోతే వారు కూడా వెళ్ళకుండా మానుకునేవారు.అటువంటిదాన్ని దేశంకాని దేశంలో ఒంటరిగా ఇలా సర్వైవ్ అవుతున్నానంటే కాస్త ధైర్యం పుంజుకున్నానన్న మాటే.విదేశంలో బ్రతకాలంటే ఆ మాత్రం గుండెధైర్యం ఉండక తప్పదు.

ఇంతలో సుమన ఫోన్ చేసింది”డూడ్ ఇంటర్న్ షిప్ ఎక్కడ పెట్టుకుంటున్నావు?నేను రేపు  చికాగో  మా చుట్టాలింటికి వెడుతున్నాను.త్వరగా అప్లైయ్ చేసుకో,మంచిది బై”అంది.తను ఇక్కడే ఎమ్మెస్ చేస్తోంది.మా ఎదురు ఫ్లాట్ లోనే ఉంటోంది.చాలా హెల్ప్ ఫుల్ గా స్నేహంగా  కలివిడిగా ఉంటుంది.ఇలా ఒక నలుగురి సహాయంతో,వారి ఆత్మీయతతో అమ్మానాన్నల మీద బెంగను కాస్త మర్చిపోయి బ్రతికేస్తున్నాను. ఒక వారం తరువాత డి.సి.లో ఇంటర్న్ షిప్ దొరకడంతో అక్కడ ఒక అకామడేషన్ చూసుకోవడంతో, షిఫ్ట్ అవడంలో బిజీ అయిపోయి సరిగ్గా అమ్మానాన్నల  కాల్స్ ఆన్సర్ చెయ్యలేదు.డి.సి.లో మళ్ళీ ఒక్కసారిగా ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది.ఈసారి కొంచెం ఎక్కువసేపు ఇండియాకి కాల్ చేసి మాట్లాడుతుంటే కాస్త ధైర్యంగా ఉంటుందనిపించింది.

కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది.నేను ఇక్కడ కొన్నాళ్ళ కోసం తీసుకున్న అకామడేషన్ నేను  ఇంటర్న్ షిప్ చేస్తున్న ప్లేస్ కి దాదాపు ఒకట్రెండు  కిలోమీటర్ల దూరంలో ఉంది.అద్దె కూడా కాస్త తక్కువగానే ఉంది.బస్ ఫెసిలిటీ లేదు కాబట్టి తప్పనిసరిగా నడిచి తిరగాలి.నడక అమెరికాకి వచ్చాక ఎలాగూ అలవాటై పోయింది.కానీ పని పూర్తై బయలుదేరేసరికి చీకటి పడిపోతుంది.ఒకొక్కసారి ఎవరూ తోడు ఉండరు.దారి పొడుగునా లైట్లు ఉండక పోవడం వల్ల,ఒంటరిగా టార్చ్ పట్టుకునో లేక సెల్ ఫోన్ లో లైట్ ఆన్ చేసుకునో పరుగులాంటి నడకతో నా స్టే దగ్గరకి చేరిపోవాలి.రోడ్డుకు రెండు వైపులా అడవిలా ఉంటుంది.అప్పుడప్పుడు దారిలో లేళ్ళు తారసపడతాయి కానీ ఎలుగుబంట్లు కూడా కనపడతాయని విన్నాను.ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని టార్చ్ వెలుగులో రోడ్డు చూసుకుంటూ,ఫోన్ లో అమ్మానాన్నలతో కబుర్లు చెబుతూ ఇల్లు చేరడమే ఇక చెయ్యగలిగినది.పొరపాటున కూడా ఇలా ఇక్కడ పరిస్ధితిని గురించి అమ్మానాన్నలకు చెప్పను,చెప్పలేను కూడా.

ఎందుకు అనవసరంగా వాళ్ళను ఖంగారు పెట్టి బాధ పెట్టడం అని నా ఉద్దేశం.నా భయానికి తగ్గట్టే ఒక రోజు నా ఒళ్ళు జలదరించే,ఎప్పటికీ మరచిపోలేని సంఘటన జరిగింది. ఒక పని మీద డి.సి.లోనే ఉన్న ఒక ఆఫీస్ కు వెళ్ళాల్సి వచ్చింది.కానీ అది ఒక పది కిలోమీటర్ల పైన దూరంలో ఉండడంతో బస్ ఎక్కి బయలుదేరాను.ఆ రోజు ఎందుకో బస్ లో జనం పెద్దగా లేరు.ఒక మెక్సికన్ లేడీ నేను ఎక్కిన బస్ కు డ్రైవర్.మనిషి చాలా రఫ్ గా పెద్ద పెర్సనాలిటీతో ఉంది.స్టాప్ లో బస్ ఆపినపుడల్లా ఆమె  ఎవరితోనో గట్టిగా ఫోన్ లో ”అయామ్ గోయింగ్ టు కిల్ యు నౌ.నో ఐ వోంట్ పే మోర్ దేన్ ఫిప్టీ డాలర్స్ “అంటూ అరుస్తూ గరుకు గొంతుతో  వాదిస్తోంది.చివరగా నేనే మిగలడంతో నేను అలా మౌనంగా వింటున్నాను.ఇక భరించలేక చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కళ్ళు మూసుకుని పాటలు వింటున్నాను.ఇంకా నేను దిగాల్సిన స్టాప్ కాస్త దూరంగానే ఉందని నాకు తెలుసు కాబట్టి రిలాక్స్ అవుతున్నాను.ఆమె వెనకాల సీట్లలో  కూర్చోవడం వలన ఆమెకు నేను కనబడే అవకాశమే లేదు.ఇంతలో బస్ సడన్ గా ఆగడంతో కళ్ళు తెరిచాను.చూసే సరికి  బస్ స్టేషన్ లో బస్ ఆగి ఉంది.  బస్ లు తిరగడం అయిపోగానే అన్నీ ఒక చోట పెట్టేసి వెళ్ళిపోతారు.

ఇదేమిటి ఆమె బస్ ఇక్కడ ఆపింది అని ఉలికిపడి గబగబా ఆమె వెనుకే బస్ దిగుతుంటే నన్ను చూసి “నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?”అని గద్దించి ఇంగ్లీష్ లో అడుగుతూ దగ్గరకొచ్చింది.అక్కడ చూస్తే ఒక్క మనిషీ కనబడలేదు,ఈవిడ చూస్తే భయంకరంగా ఉంది.ఒళ్ళు భయంతో జలదరిస్తుంటే”ఇదేమిటి బస్ ఇక్కడ ఆపారు?నా డెస్టినేషన్ కు బస్ వెళ్ళదా?” అని అడిగాను.ఆమె ఏదో కారణం చెప్పి”బస్ లు ఈ రోజు ఈ టైమ్ తరువాత రద్దు చేసారు.మళ్ళీ రేపు ఉదయాన్నే సర్వీస్ మొదలవుతుంది”అని చాలా సీరియస్ గా చెప్పింది.ఆమెకి బస్ లో నేను ఉన్నట్టు తెలీదనుకుంటాను.బహూశా ఆమె వెనుక ఉండడం వల్ల నేను అసలు కనబడి ఉండను.లేకపోతే ముందే వార్న్ చేసి ఉండేదేమో.అమ్మో ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఫోన్ తీసి ఫ్రెండ్ కి ఫోన్ చేద్దామని చూస్తే “ నో సిగ్నల్” అని ఉంది.నేను బయటకు దారి ఎటుందా అని నాలుగు అడుగులు ముందుకు వేసేసరికి “ఇది రెస్ ట్రిక్టడ్ ఏరియా,కదలకు...నువ్వు సిసి కెమేరాలో కనబడితే నాకు ప్రాబ్లం”అని అరిచింది.నేను “ఈవిడ అసలే కోపంగా ఉంది.ఇప్పుడు నన్ను కాల్చి పడేస్తుందో ఏమిటో.కొంపదీసి ఆమె పాంట్ జేబులో గన్ ఉందేమో”అనుకుంటూ లోపల వణికిపోతున్నాను.ఇదివరకు అకారణంగా సైకోలు కొందరు స్కూలు పిల్లలను కాల్చి చంపడం లాంటి ఆలోచనలు మెదడులో వద్దన్నా కందిరీగల్లా ముసురుకుంటున్నాయి.అయినా అలా కదలకుండా నిలబడి బయటకు బింకంగా “కాబ్ ఏమైనా దొరుకుతుందా?”అని పొలైట్ గా అడిగాను.”ఇక్కడకు కాబ్ సర్వీస్ ఉండదు”అంది.అప్పుడు మళ్ళీ  ఫోన్ లో సిగ్నల్ కూడా లేదనే విషయం గుర్తుకొచ్చింది.నా ముఖానికి ఏడుపు ఒకటే తక్కువ కానీ ఏ భావం కనబడనీయకుండా అలాగే కదలకుండా నిలబడ్డాను.

కాసేపాగి ఏమనుకుందో”నేను నా కారులో నిన్ను డ్రాప్ చేస్తానులే”అంది.నాకు ఇక వేరే ఆప్షన్ కూడా లేదు.సరేనంటూ ఆమె వైపు కదలబోతుంటే గట్టిగా అరుస్తూ “సిసి కెమేరాలో కనబడకుండా వచ్చి కార్లో కూర్చో”అంది.భగవంతుడా ఏమిటి ఈ పరీక్ష అనుకుంటూ ఆమె అన్ లాక్ చెయ్యగానే సిసికెమెరాలో కనబడకుండా జాగ్రత్తగా వచ్చి కార్లో కూర్చున్నాను.ఆమె మౌనంగా డ్రైవ్ చేస్తూ ఎక్కడ దింపాలని మాత్రం అడిగింది.నేను’ నన్ను కిడ్నాప్ చేస్తే నా పరిస్ధితి ఏమిటి?ఎవరికీ కూడా నేను ఏమయ్యానో,ఎలా మాయమయ్యానో కూడా తెలిసే అవకాశం లేదు”ఇలా ఆలోచిస్తూ ఫోన్ లో “లవ్ యు గుడ్ బై”అంటూ వాట్సాప్  మెసేజ్ లు టైప్ చేసాను.సిగ్నల్ అందలేదు కాబట్టి నా ఫ్రెండ్స్ కు అమ్మానాన్నలకు ఇంకా డెలివర్ కాలేదు.ఇంతలో ఒక షాపింగ్ మాల్ పేరు చెప్పి అక్కడ ఆపమన్నాను.నా అడ్రస్ ఈవిడకు ఎందుకు తెలియాలి అని మనసులో అనుకున్నాను.”పరవాలేదు ఇంటి దగ్గరే దింపుతాను” అని ఆమె అన్నా కూడా  నేను ఏవో కొనుక్కోవాలని చెప్పి, ఆమెకు ధాంక్యూ  చెప్పి షాపింగ్ మాల్ దగ్గర దిగిపోయాను .దిగగానే ఇంకా డెలివర్ అవని మెసేజస్ గబగబా డిలీట్ చేసేసి హమ్మయ్య అని అప్పుడు ఊపిరి పీల్చుకున్నాను.పాపం ఆమె రూపాన్నీ గొంతునూ చూసి నేనే అనవసరంగా భయపడ్డానేమో అనిపించింది.కానీ ఆ సమయంలో నా మనసు కండిషన్ అలా ఉంది మరి.నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన మాత్రం ఇదే.గుర్తుకొస్తే ముచ్చెమటలు పోయక మానవు. అమ్మానాన్నలకు ఈ విషయం మాత్రం ఎప్పటికీ చెప్పలేను. అయినా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని మనం ఎలా విభజించగలం.అసలు ఆవిడ నన్ను కారులో డ్రాప్ చెయ్యకుండా నా మానాన నన్ను వదిలేసి పోయుంటే నా పరిస్ధితి ఇంకా దారుణంగా ఉండి ఉండేది కదా.పాపం ఆమె ఎంతో మంచి మనసుతో కన్సర్న్ చూపించి నన్ను కారులో ఎక్కించుకుంది.”ఆమె గురించి అంత చెడుగా ఆలోచించిన నువ్వే ఆమె కన్నా చెడ్డదానివేమో కదా” అని నా లోపలి నుండి ఎవరో అరిచారు.

మరిన్ని వ్యాసాలు