చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

ఒకానొకప్పుడు ఆత్మహత్యలనేవి అరుదుగా వినేవాళ్ళం. ఏవో ఆర్ధిక సమస్య వచ్చినప్పుడో, మరో దిక్కు లేక ప్రాణాలు తీసుకునేవారు.. గత కొన్ని సంవత్సరాలుగా, అప్పుల బారిన పడిన రైతుల ఆత్మహత్యలు చాలా జరిగాయి. ప్రభుత్వాలు, ఏవేవో చేస్తారని, చెప్తారు కానీ, అవన్నీ ప్రకటనలకే పరిమితం. జరిగేవి జరుగుతూనే ఉన్నాయి.

కానీ ఈ మధ్యన, ఏదో కారణం చేత ఆత్మహత్యలు చేసుకునేవారు చాలా ఎక్కువయారు. వీటన్నిటికీ ఆర్ధిక ఒత్తిళ్ళు ఓ కారణమయితే, మానసిక ఒత్తిళ్ళు కూడా తోడయినట్టు కనిపిస్తోంది.

ఆర్ధిక ఒత్తిళ్ళకి ముఖ్యకారణం—ఉన్నదాంట్లో సరిపెట్టుకోక, స్వర్గానికి అర్రులు చాచడం.భగవంతుడు  మనకెంత ప్రాప్తమో అంతే రాస్తాడని, దేవుడిని నమ్మే ప్రతీవాళ్ళకీ తెలుసు. అయినా ఎలాగోలాగ రాత్రికి రాత్రే ఐశ్వర్యవంతుడినవాలని ఆశ. దానికోసం ఎటువంటి పనికైనా సిధ్ధం.. ఓ ప్రణాలిక ప్రకారం చేసుకున్నా, పని అయేదేమో… వాటికి సాయం ప్రచారసాధనాల్లో, ఏవేవో ప్రకటనలు చూసి, వాటివైపు ఆకర్షించబడ్డం. దీనికి విద్యతో సంబంధం లేదు. చదువుకున్నవాడు కూడా ఈ ప్రలోభాలకి బానిసవుతూండడం చూస్తే బాధ / ఆశ్చర్యం వేస్తుంది. ఈ మధ్యన , మా అమలాపురంలో ఓ డాక్టరుగారు, కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారుట. కారణం అప్పుల ఊబిలో కూరిపోవడం. ఎవరో ఏదో చెప్పారుట, ఫలానాదేదో చేస్తే ఉన్న అప్పులన్నీ తీరిపోతాయని, దానికి ముందు కొంతడబ్బు కట్టాలనీ, ఈయనేమో ఓ బలహీన క్షణం లో ఆడబ్బు కట్టేసారు.. అంత చదువు చదివి, ఊళ్ళో మంచి ప్రాక్టీసు ఉన్నాయన, అసలు ఇలాటివి ఎలా నమ్మారో అర్ధం కాదు.  ఆ డబ్బు కట్టడానికి మరో అప్పు..మరో అప్పూ… ఇలా తడిపిమోపెడయిందిట. ఈ అప్పుల్లోంచి బయటపడే మార్గం లేక ఆత్మహత్య. సాధారణంగా ఎవరికైనా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వస్తే, ఈ డాక్టర్లే, వారికి కౌన్సెలింగ్ చేసి, వారి మనస్థితిని సక్రమ మార్గంలో పెడుతూంతారు. అలాటిది డాక్టరే ఆత్మహత్య చేసుకోవడం చూస్తే, చాలా బాధేసింది. కొందరనొచ్చు—ఆత్మహత్యకి ఎవరి కారణాలు వారికుంటాయీ..మీరేమైనా ఆర్చేవారా తీర్చేవారా అని…నిజమే..కాని ఆ కారణాలవెనుకనుండే ప్రేరణ తెలిస్తే, దానిగురించి రాస్తే, పోనీ మరొకరు ఆత్మహత్య చేసుకోరేమోననీ..

ఒకానొకప్పుడు, సమాజంలో పేరుప్రతిష్టలకి ప్రాణం ఇచ్చేవారు. ఏదైనా అపనింద వచ్చినా, అనవసరమైన నిందమోపబడినా, తట్టుకోలేక ఆత్మహత్యలు చెసుకున్న ఉదాహరణలు ఎన్నో చూసాము.సున్నితమైన మనస్థత్వం దీనికి కారణం. ముందుగా, ఆ మనసుని గట్టిపరుచుకోవాలి, మన రాజకీయనాయకులూ, పాలకులూల్లాగా, కొందరు వ్యాపారవేత్తల్లాగా… చూడండి, మనదేశంలో వీళ్ళు  సిగ్గూ ఎగ్గూ లాటివి ఎప్పుడో వదిలేశారు. కావాల్సినంత దోచుకోవడం, పట్టుబడితే జైలుకెళ్ళడం.. పోనీ బాగుపడతాడా అంటే అదీలేదూ, బయటకొచ్చి మళ్ళీ మొదలెట్టడం. పైగా వారి అభిమానులు కూడా వత్తాసు పలకడం. ఆత్మహత్యలనేవి వారి డిక్షనరీలో లేవంటే లేవు.

ఆశ అనేది సాధారణంగా, పత్రికల్లోనూ, టీవీ ల్లోనూ వచ్చే ప్రకటనలను చూసి వస్తూంటుంది. అదేదో యంత్రం వాడితే రాత్రికి రాత్రి కోటీశ్వరుడయిపోతారంటాడు. ఫలానా చోట పెట్టుబడి పెడితే , ఆరింతలు వస్తుందంటాడు… జనాలు పొలోమని వాటి వెనక పడతారు.. అప్పుడెప్పుడో అదేదో స్కీం లో డబ్బులు పెట్టినవాళ్ళు , ఆ డబ్బులు తిరిగిరాబట్టుకోలేక, ఇప్పటికీ ఉద్యమాలు చేస్తున్నారు, కొందరైతే ఆత్మహత్యలు కూడా  చేసుకున్నారు. అలాగని ప్రకటనలు వేయడం మానేసారా? అబ్బే ఆ ప్రకటనలే ఈ మాధ్యమాలకి ప్రాణం. పోనీ ఇలాటి ప్రకటనలు ప్రభుత్వాలు ఏమైనా నియంత్రిస్తాయా అంటే అదీ లేదూ..కారణం ఆ దందాలో ఎవరో పలుకుబడున్న రాజకీయ నాయకుడికి కూడా వాటా ఉండడం. దేశం లో ఏప్రాంతం తీసుకున్నా, ఇలాటి స్కామ్ములే.. అన్నీ అందరికీ తెలుసు, అయినా మోసపోతూంటారు. సాధారణంగా ఇలాటి మోసాలకు మధ్యతరగతి జనాలే గురవుతూంటారు. అయినా మధ్య, దిగువ తరగతి వాడికి కష్టం వస్తే ఎవడికీ? వీళ్ళు పాలకులకి గుర్తొచ్చేది ఎన్నికల సమయం లోనే..  అంతవరకూ నెలకో ప్రకటన “” ఫలానా బాధితులకి పరిహారం ఇచ్చే ఆలోచన ప్రబుత్వ దృష్టిలో ఉందీ..”  ఇచ్చేస్తే పాపం నిజమే అనుకుంటారు. ఎంతైనా అల్పసంతోషులు కదా.. ఈలోపులో దోచుకునేవాళ్ళు దోచుకుంటూనే ఉంటారు..

సర్వేజనా సుఖినోభవంతూ….

మరిన్ని వ్యాసాలు