"బాబు బొద్దుగా ముద్దొస్తున్నాడు" అని ముద్దు పెట్టుకునే రోజులు పోయాయి.
"ఎందుకో బాబు లావుగా అనిపిస్తున్నాడు డాక్టరు కు చూపించారా? అని అడిగే రోజులివి!
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వుండాలి, అప్పుడే సుఖమూ, సంతోషమూ. పిల్లలు చిన్నగా వున్నప్పటి నుండి వారి ఆరోగ్యం గురించి ఆలోచి౦చాలి. సమస్యల పరిష్కారానికి మగవారిపైనే ఆధారపడే రోజులు పోయాయి. భార్య గా తన అభిప్రాయాన్ని భర్తతో పంచుకుని ఏమీ చేయాలో నిర్ణయానికి వస్తారు ఇద్దరూ ఆధునిక సంసారంలో. అంతేకాదు టి వి లలో ఆరోగ్య సూత్రాలు, ఆరోగ్య సమస్యలు విపరీతంగా చూపించే కార్యక్రమాలని తప్పక చూసే ప్రజానీకం ఎక్కువ అయ్యారు. రాజకీయాలకంటే మన ఆరోగ్యం ప్రధానం అని న్యూస్ చానెల్ మార్చి ఆరోగ్య విషయాలలో డాక్టర్ చెప్పే సలహాలకు ప్రాధాన్యం ఇచ్చే పెద్దలూ వున్నారు ఇళ్ళల్లో.
అధిక బరువు వల్ల వచ్చే అనర్థాలు చెప్పకనే చూపుతాయి. అందుకే అధిక బరువు ఎక్కకుండా ఎలా వుండాలో, ఎందుకు వుండాలో చక్కగా అర్థం అవుతోంది. నాజూకుతనం అందానికే కాదు ఆరోగ్యానికే అనే దానికే ఓట్లు ఎక్కువ పడతాయి ఇక వార పత్రికలే కాకుండా దిన పత్రికలూ ప్రత్యేక ఆరోగ్య శీర్షికలు మొదలు పెట్టినప్పటి నుండి అనుకోకుండా కొన్ని సమస్యలకు హెచ్చరికలు, పరిష్కారాలు సులభంగా దొరుకుతున్నాయి.
తన పని తను చక్కగా నిర్వర్తించడానికి బరువు నియంత్రించుకోవడం అవసరమైనది. B.P, SUGAR లాటివే ప్రాబ్లెం కాదు అధిక బరువుకూడా ఒక జబ్బే అన్నది అనుభవించే వారికే అర్థం అవుతుంది. దాని వల్ల అవమానం పొందడం ఒక ఎత్తయితే దానితో పోరాడి గెలవడం అత్యంత ఆనందాన్ని ఇస్తుంది.
అధికబరువు వల్ల విస్తరి౦చాల్సి వచ్చే రక్తనాళాలకు సప్లయ్ చెయ్యలేక గుండెకు అలసట అయితే, అధిక ఆకలివల్ల ఎక్కువ తింటూంటే అది అరిగించుకోలేక జీర్ణ వ్యవస్థ కేకలు పెడితే, వ్యర్థాలను బయటకు పంపే సామర్థ్యం తగ్గి కిడ్నీలు అలసిపోతే.
బరువును భరించలేక వెన్నెముక వంగిపోతే, నరాలు వొత్తిడికి గురై అంతటా మంటలు రేపితే అనుభవించే దానికన్న చక్కగా వ్యాయామం చేసుకుంటూ శరీరంలో ప్రతి ఆర్గన్ని [organ] ఉత్తేజ పరుస్తూ ఉత్సాహంగా జీవించడం మంచిది కదా...
అందుకే
చెక్ చెయ్యండి మీ బరువును
విస్తరి౦ప చేయకండి శరీరాన్ని
వ్యాయామం చెయ్యండి ప్రతిదినం
వర్గీకరించండి మీ సమస్యలను
పెకలించండి కూకటి వేళ్ళతో,
జీవించండి కలకాలం ఆరోగ్యంగా ...