ప్లాస్టిక్ మన జీవితంలో భాగమైపోయింది. ప్రతీదీ ప్లాస్టిక్ తయారీనే. మన జీవితంలోనే కాదు, మనకు తెలియకుండా మన ఒంట్లో కూడా భాగమైపోతోంది ఈ ప్లాస్టిక్. ప్లాస్టిక్ వాడకంతో క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు సంభవిస్తున్నాయని తెలిసినా, వాటి వాడకాన్ని నియంత్రించడం అసాధ్యమైపోతోంది. పర్యావరణాన్ని సమూలంగా నాశనం చేసేస్తోంది ఈ ప్లాస్టిక్ మహమ్మారి.ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకంలో పెను ప్రమాదమైనవి ప్లాస్టిక్ సంచులు. చేతిలో ఈ ప్లాస్టిక్ సంచి లేనిదే రోజు గడవడం లేదు. కానీ, ఫ్యూచర్‌ని దృష్టిలోకి తీసుకుంటే, ఈ ప్లాస్టిక్ సంచులు ఎంతటి పెను ప్రమాదాన్ని కలిగిస్తాయో అని తెలుస్తుంది. తూచ్.. మనమొక్కరమే కదా.. అని ఎవరికి వారే లైట్ తీసుకుంటాం ప్లాస్టిక్ సంచుల వాడకంలో. అలా ఒక్కొక్కరే అనుకుంటూనే భూమి మొత్తం ప్లాస్టిక్ సంచులతో నింపేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ సంచుల్ని రీ సైకిల్ చేసే అవకాశం లేకపోవడంతో, ఎక్కడిక్కడ పడేయడంతో, భూమి సారాన్ని నాశనం చేసేస్తున్నాయి. ఇవి భూమిలో కలిసిపోవడానికి కొన్ని వందల ఏళ్లు పడుతున్నాయి. ఈ లోగా కొన్ని తరాల జీవితాలు నాశనమైపోతాయి.
ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన 'ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా' పిలుపుతో ప్రభుత్వం నిషేధం విధించినా, పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. కొంతమందిలో అవేర్‌నెస్ వచ్చినా, అది సరిపోదు. అక్కడక్కడా ప్లాస్టిక్ సంచుల్ని కొంతవరకూ బ్యాన్ చేశారు. జ్యూట్ సంచులు, క్లాత్ బ్యాగ్‌లు వాడేందుకు జనం ముందుకొస్తున్నారు. అలాగే డిస్పోజబుల్ ప్లేట్లూ, గ్లాసులూ కూడా పర్యావరణానికి తీరని హాని చేస్తున్నాయి. పెళ్లిళ్లూ, ఫంక్షన్లు, పార్టీలు తదితర వేడుకల నిమిత్తం డిస్పోజబుల్ ఐటెమ్స్ వాడకం బాగా పెరిగింది. వాటిని వాడేసి, ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా పడేస్తున్నారు. ఆ చెత్త భూమిపై కొండలా ఆవహించేస్తోంది. కొన్ని దేశాల్లో ప్లాస్టిక్‌కి బదులు జనపనారతో చేసిన సంచుల్ని, బంగాళాదుంపతో చేసిన ప్లాస్టిక్ తరహా ఐటెమ్స్‌ని వాడుతున్నారు. ఇవి భూమిలో ఈజీగా కలిసిపోతాయి. దాని వల్ల పర్యావరణానికి ఎటువంటి ఆటంకం ఉండదు. ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు ఇతరత్రా డిస్పోజబుల్ ఐటెమ్స్ వాడకంతో మనుషులే కాదు, పశువులు, పక్షులు కూడా చనిపోతున్నాయి. దాంతో పర్యావరణంలో సమతుల్యత దెబ్బతినడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోంది.
కొందరు మహిళలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా కొన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్లాస్టిక్ బదులు స్టీలు, మట్టి పాత్రలను ప్రిఫర్ చేస్తున్నారు. దీన్నో ట్రెండ్‌గా మార్చేశారు. వంట పాత్రలకు వాడే వస్తువుల్లో ఎక్కువగా మట్టి పాత్రలను వాడేందుకు గృహిణులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యువత కూడా దీనికి తగిన తోడ్పాటునందిస్తోంది. ప్లాస్టిక్ బదులు రకరకాల మట్టి పాత్రలు ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. కిట్టీ పార్టీలు వగైరా మహిళలకు సంబంధించిన చిన్న చిన్న ఫంక్షన్స్‌లో ప్లాస్టిక్ ప్లేట్లూ, గ్లాసులకు బదులు రకరకాల ఆకర్షణీయమైన మట్టి పాత్రలను, స్టీలు పాత్రలను వాడుతున్నారు. వాడి పాడేసిన ప్లాస్టిక్ వ్యర్థం, భూమిని కబలించేస్తోంది. కొండ చిలువలా మింగేస్తోంది. అందుకే ఉద్యమాలు ఎక్కడి నుండో పుట్టవు. ఒక ఇంటి నుండీ, ఒక మనిషి నుండే పుట్టొచ్చు. ఈ ఉద్యమానికి ఎవరికి వారే నాయకులు కావాలి. సోషల్ నెట్‌వర్క్ వాడే యువత ప్లాస్టిక్ వ్యర్ధాల వాడకాన్ని తగ్గించే దిశగా విలువైన సమాచారాన్ని ప్రచారం చేయాలి. ఈ క్రమంలో కొందరు యువత చెత్తను సేకరించి వాటితో బెస్ట్ ఆఫ్ వేస్ట్ ఐటెమ్స్ తయారు చేస్తున్నారు శభాష్ అనిపించుకుంటున్నారు. అలాంటి వారిని ఎంకరేజ్ చేయాలి. ప్లాస్టిక్ మహమ్మారి నుండి భావి తరాల్ని, పర్యావరణాన్ని కాపాడేందుకు మీరూ ఒక సమిద కావాలి. ఇంకెందుకాలస్యం ప్రతి ఒక్కరూ ఉద్యమించండి. మీదే పై చేయి.
తాజా సమాచారం ప్రకారం, అక్టోబర్ 2న ప్లాస్టిక్ వాడకాన్ని సమూలంగా నియంత్రించేందుకు కఠినమైన చట్టం తీసుకొచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ సారైనా ప్లాస్టిక్ మహమ్మారిపై బలమైన ఉక్కుపాదం పడుతుందేమో.