సంభాషణం ఒక గొప్ప భూషణం! - టీవీయస్. శాస్త్రి

sambhashanam oka goppa bhooshanam

మాట్లాడటం ఒక చక్కని కళ. కొంతమంది గంటలకొద్దీ మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. మరికొంతమంది మాట్లాడుతుంటే, వీళ్ళు మనల్ని ఎప్పుడు వదలి పెడతారా, అని అనుకుంటాం. సందర్భోచితంగా నలుగురికీ నచ్చేటట్లు ముచ్చటగా మాట్లాడటం నిజంగా ఒక కళ! కొంత వాగ్ధాటి, చక్కని భాష, మాట్లాడే విషయం -- ఇవన్నీకూడా కారణం కావచ్చు. మరి కొంతమంది, తమకు తెలిసినది, మళ్ళీ మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ, మాట్లాడే వాడికి అంతరాయం కలిగించి కూడా మాట్లాడుతుంటారు. నాకు అనిపిస్తుంది, వారికి మాట్లాడటమే కాదు, నలుగురిలో ఎలాప్రవర్తించాలో కూడా తెలియదేమోనని!

ఇక సంభాషణలలో చాలా రకాలు ఉన్నాయి. హిత భాషణం, మితభాషణం, స్మితభాషణం, ప్రియభాషణం, పూర్వ భాషణం. ఇలా చాలా విదాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకే మనిషి వద్ద ఉంటే, అతని చెంతనే మనకు ఉండాలనిపిస్తుంది. అటువంటి పురుషోత్తముడే, శ్రీ రాముడు. ఎవరినీ ఏ సందర్భంలో కూడా కించపరచి, బాధపెట్టే విధంగా, శ్రీరాముడు మాట్లాడినట్లు రామాయణం మొత్తంమీద భూతద్దం వేసి వెతికనా కనపడదు. ఇక, ఒక్కొక్క పద్ధతిని నాకు తెలిసినట్లు విశ్లేషిస్తాను.

హితభాషణం
అన్నిటిలోకి చాలా కష్టమైన విధానం, అవతలి వాడికి హితం చెప్పటం. అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే, సలహాలు ఎవరూ సంతోషంగా స్వీకరించరు, ఎవరికైతే అవి అవసరమో, వారు తిరస్కరిస్తారు కూడా! విదురుడు ధృతరాష్ట్రునికి ఎన్నో నీతులు చెప్పాడు. ధృతరాష్ట్రుడు ఏమన్నా విన్నాడా? అతనిలో మార్పు ఏమన్నా వచ్చిందా? అలాగే సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మ దుర్యోధనుని తన హిత వచనాలతో ఏమాత్రం మార్చకలిగాడు? ఎవరైనా సలహాలు అడిగితే తొందరపడి చెప్పకూడదు. అవతలి వాడికి ఫలానా పని చేయటం పూర్తిగా ఇష్టంలేకపోతేనే, మనల్ని సలహాలు అడుగుతాడు. ఇష్టముంటే ఆ పనిని తనంతట తానే చేస్తాడు. వాడికి ఇష్టంలేని పనులను గురించే మనల్ని సలహాలు అడుగుతాడు.

శ్రీ రాముడు అలా కాదు -- శత్రువికి కూడా హితవచనాలు చెప్పే సమర్ధతగల సంభాషణాచతురుడు. రావణ సంహారం ముందు అతను చెప్పిన హిత వచనాలు రావణుని చెవిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అటువంటి పురుషోత్తముడి చేతిలో చనిపోవటానికే నిశ్చయించుకున్నాడు. వాలికి కూడా అలా చాల హిత వచనాలు చెప్పాడు.

మితభాషణం
క్లుప్తంగా ఎంతవరకు మాట్లాడాలో, అంతవరకే మాట్లాడటం మిత భాషణం. 'economy of words' లేక పోవటం, దేశభక్తి లేకపోవటం కన్నా గొప్ప నేరం అని ఒక మహాకవి అన్నట్లు గుర్తు. అదీ గాక, అనవసరంగా, అతిగా మాట్లాడితే అపార్ధాలు రావటానికి చాలా అవకాశాలు వున్నాయి. అందువల్ల, బాగా ఆలోచించి క్లుప్తంగా మాట్లాడటం నేర్చుకుందాం.

స్మిత భాషణం
మాట్లాడే విషయాన్ని చిరునవ్వుతో మాట్లాడటం స్మిత భాషణం. పళ్ళు కనపడకుండా నవ్వటమే 'స్మితం'. 'నవ్వు మోము రాజిల్లెడు వాడు' అయిన శ్రీకృష్ణుడు, శ్రీ రాముడు అలానే మాట్లాడేవారు. చాలాసందర్భాలలో వారి స్మిత వదనమే మనతో మాట్లాడుతుంది. ముఖంలోచక్కని భావప్రకటనతో ఆహ్లాదపరిచే విధంగా మాట్లాడటం నేర్చుకుందాం.

ప్రియభాషణం
ప్రియ భాషణలో కొన్ని అసత్యాలు ఉండే అవకాశం ఉంది. అయితే, కొన్ని సందర్భాలలో అవి చాలా తప్పని సరి. ఇతరుల మనసు బాధ పెట్టకుండా ప్రియంగా మాట్లాడటం పెద్ద అసత్యం అనిపించదు నాకు. ఉదాహరణ చెబితే మీకు ఇంకా బాగా అర్ధం అవుతుంది. నా స్నేహితుడి కొడుకూ కోడలూ కొత్తగా మద్రాస్ లో కాపురం పెట్టారు. 'నీవు మద్రాస్ వెళ్ళుతున్నావు కదా, ఒక సారి వారి కాపురం ఎలా ఉందో చూసిరా !' అని నా స్నేహితుడు చెప్పాడు. ముచ్చటగా ఉంది కాపురం. ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే భోజనం. ఆ అమ్మాయి ఎంతో ప్రేమతో కష్టపడి చాలా వంటకాలు చేసింది. మరీమరీ అడిగి వడ్డించింది. 'అంకుల్ వంట ఎలా వుంది?' అని ఆ అమ్మాయి అడగగానే, 'బ్రహ్మాండంగా ఉంది' అని నేను వెంటనే చెప్పాను. నా స్నేహితుడు కొడుకు వెంటనే ఆ అమ్మాయిని ఉడికించటానికి 'అంకుల్ అన్నీ అబద్ధాలు ఆడుతున్నారు, బాగుంటే మళ్ళీ అడిగి వడ్డించమని ఎందుకు అడగలేదు?' ఆ అమ్మాయి ముఖం చిన్నబుచ్చుకుంది. వంకాయ కూర బాగా ఉంది, కొద్దిగా వడ్డించమని అడిగాను. అప్పుడు ఆ అమ్మాయి ముఖంలోని ఆనందం చూసి నాకు ఎంత సంతోషం కలిగిందో! నిజానికి వంకాయ కూర అంత బాగాలేదు. బాగాలేదని ఆ అమ్మాయిని చిన్నబుచ్చటం కన్నా, బాగుందనే 'ప్రియభాషణం' పెద్ద తప్పు కాదేమో అని నాకనిపించింది. అటువంటి 'అసత్య ప్రియ భాషణ' మన సంస్కారాన్ని కూడా తెలియ చేస్తుందని నా నమ్మకం.

పూర్వ భాషణం
దీనికి చక్కని సంస్కారం అవసరం. అవతలి మనిషితో ముందుగా మనమే మాట్లాడటమే 'పూర్వ భాషణం'. అవతలి మనిషి మనకన్నా గొప్పవాడా, చిన్నవాడా అని చూడకుండా పలకరించటం చాలా గొప్ప సుగుణం. కొంతమంది, చూసీ చూడనట్లు వెళుతుంటారు. మనం పలకరిస్తే, 'నేను హడావిడిగా వెళుతూ మిమ్మల్ని చూడలేదండి.' అని అబద్ధం కూడా ఆడేస్తారు. పలకరించటానికి అహం. (దేనికో!). మీరే చూడండి! మన దగ్గర పని చేసిన వారిని మనమే ముందుగా, 'బాగున్నావా!' అని పలుకరిస్తే చాలు వాళ్ళు ఎంత సంబరపడిపోతారో ! ఎంతమందికి మంచిగా చెబుతారో మనల్ని గురించి. అందుకే సంభాషణం ఒక గొప్ప భూషణం అన్నాను.

కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం
ఎక్కువగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతాం
అనవసరంగా మాట్లాడితే అపార్ధాలకు తావిస్తాం, స్నేహితులను కోల్పోతాం
అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతాం
అసత్యం మాట్లాడితే శీలాన్ని కోల్పోతాం
ఆలోచించి మాట్లాడితే వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకతను కాపాడుకుంటాం!

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు