( కెజిఎఫ్)
కొన్నికొన్ని సంఘటనలు మన ప్రమేయం లేకుండానే మనజీవితంలో జరిగిపోతూ వుంటాయి . అలాగే నా జీవితంలో కొన్ని సంఘటనలు అలా జరిగిపోయేయి . మా వారికి ప్రతీ మూడేళ్లకీ ఉద్యోగం మార్చడం ఓ హాబీ , అలాగే అతనికి అవకాశాలుకూడా వచ్చేవి . అలా మారేటప్పుడు కొత్త ప్రదేశం , కొత్త భాష , కొత్త హోదా , వాటికి అలవాటు పడడానికి నాకు సమయం పట్టేది . అలాంటప్పుడు నా యెదురుగా ప్రాంతీయ భాష ఛాలెంజ్ గా వుండేది . పుట్టి పెరిగిన ప్రదేశం ఒడిస్సా అవడం వల్ల మాకు పుట్టినప్పటినుండి ఒడియా మాట్లాడ్డం అలవాటైంది పెళ్లయాక వెస్ట్ బెంగాలు , మహారాష్ట్ర , చెన్నై , బెంగలారు తిరిగేం , ప్రతీ చోటా ప్రాంతీయభాష నేర్చుకోడం మామూలైపోయింది . బెంగళూరులో వుండగా మా వారికి బిఇఎమ్ఎల్ లో జాబ్ రావడంతో కెజిఫ్ కి మారవలసి వచ్చింది . కంపెనీ కి సంబంధించిన ఇళ్లు తప్ప మరేమీ లేవు . ప్రతీ ఆదివారం రాబర్ట్ సన్ పేట కి వెళ్లడానికి కంపెనీ బస్సులుండేవి . రాబర్ట్ సన్ పేట లో చిన్న సంత , అక్కడో నాలుగు దుకాణాలు మాత్రమే వుండేవి . అక్కడనుంచే అన్ని నిత్యావుసర వస్తువులు కొనిక్కోవాలి .
అప్పటికే కలకత్తా , చెన్నై , బెంగుళీరులలో వుండి వచ్చానేమో నాకు ఆ వూరు చాలా చిన్నగా అనిపించేది .ఉద్యోగరీత్యా ఓ చిన్న వూరికి వచ్చేమని మాత్రమే తెలుసు .ఆదివారం రాబర్ట్ సన్ పేట వెళ్తూ వుంటే దారిలో రేకులతో నిర్మించిన ఇళ్లు , కొన్ని బంగళాలు కనిపించేయి . రాబర్ట్ సన్ పేట లో చాలా బంగారం షాపులు కనిపించేయి , అక్కడ వున్న ప్రతీ మహిళ ఒంటిపైనా వందతులాలకి తక్కువలేకుండా బంగరం వుంది . సంగతి అడిగితే ప్రతీ వారు వాళ్లు కేజిఎఫ్ లో పనిచేసేవారు కదా ? అలాగే వుంటారు అని సమాధానం చెప్పేరు .ఈ కెజిఎఫ్ గురించి తెలుసుకోవాలనిపించింది , అప్పట్లో అంటే 1992 లో గూగులమ్మ లేదుకదా ? , అక్కడపనిచేసే వారిని అడిగి తెలుసుకొనేదాన్ని , ఆ వివరాలు మీకు తెలియ జేస్తాను తరవాత ఇప్పుడు గూగులమ్మ సమాచారం కూడా మీకందిస్తాను . కెజిఎఫ్ అని పొట్టిగా పిలిచే అసలు పేరు కోలారు గోల్డ్ ఫీల్డ్స్ బెంగుళూరు నగరానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో కోలారు జిల్లా ముఖ్యకేంద్రమైన కోలారుకి 30 కిలోమీటర్ల దూరంలో వుంది . ఈ ప్రదేశం గురించి యెక్కువ ప్రచారం జరగలేదు , మిగతా రాష్ట్రాలవారికి ఈ ప్రదేశం గురించి తెలియనే తెలియదనే చెప్పుకోవాలి .
తొమ్మిదవ శతాబ్దంలో కోలారు గంగేయులకి రాజధానిగా వుండేదట , తరువాత గంగేయరాజులు తమ రాజధానిని తలకావేరీకి మార్చడంతో కోలారు వైభవాన్ని కోల్పోయింది . హైదరాలి తండ్రి కోలారు ప్రాంతానికి జాగీరుదారుగా నియమింపబడ్డతరువాత కోట నిర్మించుకోడంతో కోలారు తిరిగి వెలుగులోకి వచ్చింది . హైదరాలీ చేసిన యుధ్దాలలో ఓడిపోయినప్పుడు ఈ చుట్టుపక్కల సరైన సమయం వరకు దాక్కొని వున్న ప్రదేశాలు ఈ వూరు చుట్టుపక్కల చాలా వున్నాయి . ఇక్కడ బంగారం ఎప్పటినుంచి లభిస్తోంది అనేది చెప్పడం కష్టం , చిన్నచిన్న గుంతలు తవ్వి బంగారం తియ్యడం అనేది ఒకటో శతాబ్దం నుంచి వున్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు కాని యంత్రాలసహాయంతో గనులు తవ్వి తీయడం మాత్రం 1880 లలో జరిగింది .
1871 లో 67 సంవత్సరాల ‘ లెఫ్టెనెంట్ లవెల్లి ‘ సుమారు 120 కిలోమీటర్లు ఎడ్ల బండీలో ప్రయాణించి ఇక్కడ మట్టిని పరిశోధనలకోసం తీసుకువెళ్లి ఆ మట్టిలో బంగారం వుందని నిర్ధారణకి వచ్చేక అప్పటి మైసూర్ రాజుకు గనుల త్రవ్వకాలకు కావలసిన అనిమతి కొరకు అర్జీ 1873 లో దాఖలు చేసేడు . అప్పటి వరకు దేశంలో బొగ్గు గనుల నుంచి తియ్యటం తెలుసుగాని బంగారం గనులలోంచి తియ్యడం గురించి రాజుకు తెలియదు . అనుమతి లభించక పోవడం తో కొంత భూమిని 20 సంవత్సరాలకి గుత్తకు యిమ్మని , గనుల త్రవ్వకాల ఖర్చులకు కావలసిన సొమ్ము తాను భరిస్తానని తిరిగి రాజుకు లేఖ పంపగా 1875 లో గనులలోంచి వచ్చే బంగారంతో రాజు మరింత సంపన్నుడు కావొచ్చు అనే ఆశ రాజుచేత అనుమతి మీద సంతకం చేయించింది .
తన తోటి నలుగురు ఆర్మీ ఆఫీసర్లని కలుపుకొని ఓ సిండికేట్ గా యేర్పడి ఆ సంస్థకు ‘ కూలర్ కంన్సెషనరీస్ కంపెనీ లిమిటెడ్ అనే పేరుతో జాన్ టేలర్ అండ్ సన్స్ అనే సంస్థతో కలిసి నార్విచ్ , ఇంగ్లాండ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో గనుల త్రవ్వకాలు చేపట్టేరు . గనుల త్రవ్వకాలకి కావలసిన యంత్రాలను విదేశాలనుంచి దిగుమతి చేసుకున్నారు , కాని యంత్రాలు నడవడానికి కావలసిన విద్యుత్ ఉత్పాదన మనదేశంలో లేదు . విద్యుత్ ఉత్పాదన కోసం విద్యుత్ కేంద్రాన్ని స్థాపించేరు . మనదేశంలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పాదన కేంద్రం అలా బంగారం గనులకోసం మొదలుపెట్టబడింది . ఇది ఆసియా ఖండపు రెండో విద్యుత్. కేంద్రం కూడా .
గనుల పనులు పర్యవేక్షించేందుకు వచ్చిన విదేశీ ఇంజనీర్ల కోసం బంగ్లాలు , స్కూల్స్ , క్లబ్ మొదలయినవి ప్రారంభించబడ్డాయి . అలా పుట్టిన ఊరికి అప్పటి మైసూర్ ప్రాంతపు గవర్నరుగా నియమితుడైన ‘ సర్ రాబర్ట్ సన్ ‘ జ్ఞాపకార్ధం దీనికి రాబర్ట్ సన్ పేట గా నామకరణం చేసేరు . ఈ ప్రాంతాన్ని లిటిల్ ఇంగ్లాండు గా కూడా వ్యవహరించేవారు .
ఒక వైపు సర్వసదుపాయాలతో వుండే విదేశీయుల ఇళ్లు మరో వైపు గనులలో పనిచేసేవారి రేకుల షెడ్డులు ఒకో షెడ్ లోకనీసం 20 , 30 మంది వుండడం పాములు , ఎలుకలు యెక్కువగా వుండడంతో పాముకాటు మరణాలు యెక్కువగా వుండేవి . గనులలో వేడికి తట్టుకోలేక లోపల ప్రమాదాలవల్ల చావులు యెక్కువగా వుండేవి .
మన దేశంలో మొట్టమొదటి విద్యుత్ దీపం వెలిగినది రాబర్ట్ సన్ పేటలోనే .
950 లో అప్పటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ గారిచే జాతికి సమర్పింబడి భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ ( BGML ) గా వ్యవహరింప బడసా గింది .. సుమారు 120 సంవత్సరాలు పనిచేసి కొన్ని లక్షల టన్నుల బంగారాన్నిచ్చిన గనులు 2001 ఫిబ్రవరి 28 న మూతవేయబడ్డాయి . ఓపెన్ మైనింగ్ ద్వారా సుమారు 30 లక్షల టన్నుల బంగారం తీయొచ్చని కొన్ని విదేశీ సంస్థలు తిరిగి గనుల పనులు మొదలు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర అనుమతి కోసం పత్రాలు సమర్పించడం జరిగింది , కాని ఓపెన్ మైనింగ్ వల్ల ముడి బంగారం నుండి బంగారం విడగొట్టే ప్రక్రియలో వాడే రసాయనాలవల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలుగుతాయని వైద్యులు అభిప్రాయపడడం వల్ల ప్రభుత్వం అంగీకారం తెలుపలేదు .
మేము 1992 నుంచి 1996 వరకు అక్కడవున్నాం , BEML సంస్థ కూడా చాలా పెద్దది , సుమారు పదివేలమంది పనిచేసేవారు , ఉద్యోగాన్ని బట్టి అందరకీ ఇళ్లు , పిల్లలకి స్కూలు , క్లబ్ , పెద్ద ఆసుపత్రి లాంటి సౌకర్యాలు వుండేవి . ప్రతీయింటికీ చుట్టూరా ఖాళీ స్థలం అందులో రకరకాల పూల,పండ్ల చెట్లు వుండేవి .అప్పటికే బంగారు గనులలో ఒక షాఫ్ట్ మాత్రమే పనిచేసేది , దీనిని గోల్కొండ షాఫ్ట్ అనేవారు . బంగారు గనులలోకి పర్యాటకులను అనుమతించరు , కాని స్పెషల్ పర్మిషన్ పొందితే పంపేవారు , అలా రెండుమార్లు గనులలోకి వెళ్లేను . మన బేగులు గట్రా సెక్యూరిటీలో యిచ్చి వారిచ్చిన హెల్మెట్ ( పైన బాటరీలైటు వుంటుంది ) , జాకెట్ ధరించి , శ్వాససంబంధమైన ఇబ్బందులు లేవని నిర్ధారించుకున్న తరువాత ఇద్దరు సెక్యూరిటీ వారి సహాయంతో లోనికి పంపుతారు . త్రవ్వకం పనులు యెక్కడ జరగటం లేదో అక్కడకి మనని తీసుకు వెళతారు .
ఈ గనులలో ప్రతీ 200 అడుగులకు ఓ సొరంగం చొప్పున , సుమారు 10500 అడుగుల క్రింద వరకు త్రవ్వకాలు జరిగేయి , పనివారు తప్ప మిగిలిన వారికి వెయ్యి అడుగుల లోతు వరకే అనుమతిస్తారు . మేం 800 అడుగుల లోతుకి వెళ్లేం . లిఫ్ట్ లో 800 అడుగులు చాలా వేగంగా దిగుతాం ఆ వేగానికి చెవులలో హోరు మొదలయి ఆ చీకటికి గుండె దడదడ మంటుంది . బయట వుండే ఆపరేటరు ఆఫీసర్లు విజిటర్లు వస్తే లిఫ్ట్ వేగాన్ని బాగా తగ్గించి పంపుతాడట , పనివారు వెళ్లేటప్పుడు లిఫ్ట్ చాలా వేగంగా పంపుతారట . సామాను మాత్రమే వస్తూ వుంటే అతి వేగంగా ఆపరేట్ చేస్తారట . ఆపరేటర్ దగ్గర రంగురంగుల బల్బులు వుంటాయి , వాటిద్వారా లిఫ్టను యే వేగంతో నడపాలో తెలుసుకుంటాడు 800 అడుగుల లోతున చాలా చల్లగా , నేలంతా నీరు , అక్కడక్కడా మీద నుంచి పక్కలనుంచి నీరు కారుతూ చీకటిగా వుంది . వంగి నడవాలి , లోపల బండి నడపడానికి వీలుగా పట్టాలు పరచి వున్నాయి , గనులలో తవ్వే ముడి సరుకును లిఫ్ట్ వరకు తరలించే బండి లను తొయ్యడానికి ఉపయోగిస్తారు . బండి అనగానే రైలు బండీ అనో గూడ్స్ బండీకి వుండేవనో ఊహించుకోవద్దు , నాలుగు చక్రాలు వుండే పాత సామానులు తీసుకువెళ్లడానికి పనికి వచ్చే తొట్టె , చాలా పాతవి కాబట్టి పదిమంది కలిపి తొయ్యాలి . కిందన అడ్డదిడ్డంగా తవ్విన రాళ్లు , సరైన జోళ్లు లేకపోతే కాలు చీరుకు పోడం గ్యారంటీ , అక్కడక్కడ వెలుగుతున్న గుడ్డి దీపాలకాంతిలో పనిచెయ్యడం , సరైన ఆక్సిజన్ లేకపోడం , దుమ్ముధూళి వీటన్నటికీ మించి ప్రాసెసింగ్ లో వాడే రసాయనాలు శరీరం మీద ప్రభావం చూపడం వల్ల మైనింగ్ పనివారి ఆయిష్షుని సగానికి తగ్గిస్తోంది .
లోపల గోడలకి బంగారు రంగులో వున్న చారలను చూపించేరు , అలా లోపల కొంతదూరం వెళ్లి గోడలకు పై భాగానికి వున్న బంగారు రంగు చారలను చూసి , చేత్తో తడిమి ఆనందించేము . సగంరాయి బంగారం రంగులోను సగం రాయిరంగులోనూ వున్న రాయిని చూసేం , అక్కడ వున్న రాళ్లని తీసుకోకూడదు , బయట సెక్కూరిటీ వారు చెక్ చేస్తారని మాతో వచ్చిన వారు హెచ్చరించేరు. చూసి ఆనందించేం , కాని మాతో తెచ్చుకొనే ప్రయత్నం చెయ్యలేదు .
ఈ సొరంగాలు సుమారు వెయ్యి కిలోమీటర్ల పొడవున వున్నాయట . అంటే పదివేల అడుగుల లోతున తవ్విన ప్రతీ 200 అడుగుల సొరంగాలను కలుపితే వెయ్యి కిలోమీటర్లన్నమాట .
గనులలోకి స్పెషల్ పర్మిషన్తో వెళ్లొచ్చుకాని ప్రాసెసింగ్ యూనిట్ కి అలాంటి అనుమతులు లేవు .ముడి బంగారం నుండి మేలిమి బంగారం చేసే ప్రాసెస్ లో వచ్చే మట్టిని కొన్ని కిలోమీటర్లమేర బయట పారేయడంతో కురిసిన వాన నీటికి కోత యేర్పడి యేదో ఆకృతులతో వున్న కొండగుహలుగా కనిపిస్తాయి , వీటిని చాలా హిందీ సినిమాలలో పాటల చిత్రీకరణకి వుపయోగించుకున్నారు . బ్రిటిష్ వారి కాలంలో యీ గనులలో పనిచేసే కూలీలకు మాత్రమే చెకింగ్ వుండేది , సూపర్ వైజర్లు , ఆ పై ఆఫీసర్లకు చెకింగ్ వుండేది కాదు , బ్రిటిష్ వారికాలంలో బంగారం దొంగతనం అయేదో కాదో తెలీదు కాని జాతీయం చెయ్యబడ్డ తరువాత కూడా సూపర్ వైజర్లు , ఆపై ఆఫీసర్లకు తనిఖీ వుండేది కాదు , అక్రమంగా యెంతో బంగారం బయటకి వచ్చేది అనేదానికి లెక్క వుండేది కాదు . రాబర్ట్ సన్ పేట లో వున్న వేల బంగారం షాపులను చూస్తే చాలా బంగారం అక్రమంగా వచ్చేదని తెలుస్తుంది . మైనింగ్ జరిగిన చాలా ప్రాంతం చారిత్రాత్మకంగా కూడా పేరుపొందింది . హైదరాలి , టిప్పు సుల్తానుల కాలంలో ఆంగ్లేయులతో జరిగిన యుధ్దాలలో వారు కొన్ని నెలలు యీ ప్రాంతాలలో రహస్యంగా దాక్కొన్నారని అంటారు . కెజిఎఫ్ కి చుట్టుపక్కల వున్న దర్శనీయ స్థలాలు చూద్దాం . ముందుగా రాబర్ట్ సన్ పేట కి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో వున్న ‘ కోటిలింగేశ్వర ‘ మందిరం గురించి తెలుసుకుందాం .
కోటిలింగేశ్వర మందిరం ‘ కమ్మసంద్ర ‘ అనే చిన్న గ్రామంలో వుంది . ఈ గ్రామం సుమారు క్రీస్తుశకం 770 ప్రాంతాలలో రాష్ట్రకూటుల పరిపాలనలో ‘ ధర్మస్థల ‘ గా పిలువబడేది . ఆకాలంలో సదాచార శైవ బ్రాహ్మణ దంపతులకు మంజునాథుడనే పుతృడు కలుగుతాడు . అతడు విగ్రహారాధనకు వ్యతిరేకిగా పెరుగుతాడు . గ్రామప్రజలకు కావలసిన సహాయం చేస్తూ వుంటాడు , తల్లితండ్రుల అభీష్ఠానికి వ్యతిరేకంగా కులవృత్తైన వంటలు చేయక కుస్తీపట్లు నేర్చుకొని కాలంగడుపుతూ వుంటాడు . కొంతకాలానికి తప్పుతెలుసుకొని శ్రీమంజునాధుని భక్తుడుగా మారుతాడు . ఓరోజు మంజునాధుడు శివసన్నిధిలో వుండగా గర్భగుడిలోని దీపాలు ఆరిపోతాయి , అది చూసి గ్రామప్రజలు మంజునాధుని నానా దుర్భాషలాడి అతనివంటి నాస్థికుడు మందిరంలో వుండటంవల్లనే దీపాలారిపోయేయని నిందవేస్తారు . ఆ కోవెలలో పూజకైవచ్చిన రాష్ట్రకూటుల సామంతరాజు ప్రజలను వారించి తిరిగి దీపాలను వెలిగిస్తాడు . మంజునాథుడు శివుని మన్నించమని వేడుకొనగా మందిరంలోని దీపాలు దేదీప్యమానంగా వెలగడం చూసిన ప్రజలు మంజునాథుడుని శివుని భక్తునిగా అంగీకరిస్తారు .
భక్త మంజునాధుడు తెలియనితనంతో శివుని కోటి సార్లు దూషించిన పాప పరిహారంకొరకు కోటిలింగాలను ప్రతిష్ఠించేడట . అందుకు ఈ మందిరం కోటిలింగాలుగా పిలువబడసాగింది .
ముస్లిమ్ రాజులపాలనలో మందిరం చాలా దీనస్థితికి చేరుకుంది . అలానే ప్రతిష్ఠించిన లింగాలను తీసివేయడం కూడా జరిగివుంటుంది . మేం ఈ మందిరం దర్శించినప్పటికి చాలా శిధిలస్థితిలో వుండేది , కోటిలింగాలు లేవు గాని సుమారు లక్ష లక్షన్నర వుండివుంటాయి , మేం తరచుగా ఈ కోవెలకి వెళ్లేవారం , 1996 కెజిఎఫ్ నుంచి ఢిల్లి వెళ్లేటప్పటికి కొత్త లింగాల ప్రతిష్ఠలు జరగుతున్నాయి . మొత్తం కోటి పూర్తిచేయాలని అనేవారు . తరవాత మధ్యలో ఓ సారి వెళ్లినప్పుడు పెద్ద శివలింగం ప్రతిష్ఠించి వుండడం చూసేం . ఆ తరువాత మంజునాథ సినిమా రావడంతో మందిరం చాలా ప్రసిధ్ది పొందింది . కోటిలింగాలు ప్రతిష్ఠించేరని విన్నాం .
BEML ఆఫీసర్స్ క్వార్టర్స్ వెనుకవైపునుంచి వెళితే చిన్నకొండపైన అమ్మవారి కోవెలవుండేది . ఏడాదికొకసారి పదిరోజుల జాతర జరిగేది , చుట్టుపక్కల పల్లెలనుంచి జనాలు వచ్చేవారు . ఆ తరవాత చాలా నిర్జనంగా వుండేది . మామూలు రోజులలో కోవెలలో మనుషులే వుండరు , ఆ కోవెలలో హైదరాలి ఆంగ్లేయులతో యుధ్దం చేసేటప్పుడు ఓడిపోతే టిప్పుసుల్తాను , అతని సోదరు లను ఈ కోవెలలో దాచి తాను మారువేషంలో పారిపోయేడట , అక్కడకు దగ్గరగా వున్న పల్లెలోని ఓ ముదుసలి ఎవరో అనాధపిల్లలని వారిని దగ్గరకు తీసి సాకిందట , తరవాత హైదరాలి ఆంగ్లేయులమీద విజయం సాధించి తిరిగి అక్కడకు వచ్చి టిప్పుసుల్తాని అతని సోదరు లను రాజమహల్ కి తీసుకొని పోయేడట . వచ్చేవారం ‘ బంగారు తిరుపతి ‘ గురించి చదువుదాం , అంతవరకు శలవు