" ఆత్మయానం ఈ బుద్ధయానం..."
తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు వచ్చాయి, వస్తున్నాయి. కొందరు లఘు కవితా ప్రక్రియలను ఆదరిస్తున్నారు. మరి కొందరు విమర్శిస్తున్నారు. మెచ్చుకోలు, విమర్శ అన్నవి ఏ రంగంలోనైనా సహజమే. మన తెలుగు సాహిత్యంలో ఒకప్పుడు పద్య సాహిత్యానికి పెద్ద పీట వేశారు. రాను రాను కాలానుగుణంగా ఎన్నో మార్పులు సాహిత్యంలో చోటు చేసుకున్న సందర్భాల్లో దీర్ఘ కవిత్వాలు, ప్రాకృత సంబంధిత సాహిత్యమూ వెనుకబడుతూ వచన సాహిత్యం ముందుకొచ్చింది అదీ వాడుక భాషలో. ఈ ఒరవడిలో మొదలైనదే లఘు కవితా ప్రక్రియ. దీనిలో నానీలు, హైకూలు, రెక్కలు, ఏక్ తారలు, ద్విపద మాలికలు, త్రిపదలు ఇలా ఎన్నో రూపాలు నేడు మనకు అందుబాటులో ఉన్నాయి. అన్య భాషల నుండి వచ్చిన ప్రక్రియలను ఆదరించే మనవాళ్ళు మన భాషలో ఎవరైనా కొత్త ప్రక్రియకు శ్రీకారం చుడితే ప్రోత్సహించడం పక్కనబెడితే విమర్శించడం ధ్యేయంగా పెట్టుకున్నారు. భాష, భావం రెండూ మనుషులకు, మనసులకు త్వరగా చేరడానికి ఏ ప్రక్రియైనా ఒకటే.
ఈ లఘు కవితా ప్రక్రియల్లో ఒకటైన రెక్కల గురించి నాలుగు మాటలు చెప్పి తరువాత బుద్ధయానం సమీక్ష చూద్దాం. తేలికగా అలతి పదాలతో నాలుగు పాదాలు వాటికీ జతగా కొసమెరుపుగా మరో రెండు పాదాలు కలిపితే ఓ రెక్క. ఈ రెక్కల సృష్టికర్త యం కె సుగం బాబు గారు. వారి తోలి రెక్క
" మట్టిని ప్రేమించేవాడు
మనిషినీ
మనిషిని ప్రేమించేవాడు
మట్టినీ ప్రేమిస్తాడు -
అమ్మానాన్న
మట్టి మనుషులు ! " మట్టికి మనిషికి ఉన్న అనుబంధాన్ని ఇంతకన్నా బాగా ఎవరు చెప్పగలరు అదీ అలతి పదాల్లో. ఇదీ రెక్కల రూపకల్పన. డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ గారి గురించి తెలియని వారు దివిసీమ సాహిత్యకారుల్లో లేరంటే అతిశయోక్తి కాదు. వారి నాన్నగారి నుండి సంక్రమించిన పద్య కవిత్వాన్ని అందిపుచ్చుకుని ఎన్నో బాల సాహిత్యం పుస్తకాలూ, గేయాలు రచించి, మరెన్నో శతక పుస్తకాలు, దివిసీమ మీద అపారమైన ప్రేమతో దివిసీమ గురించి, ఆ దివిసీమ సాహిత్యకారులు గురించి లోతైన అధ్యయనం చేసి వాటికీ పుస్తక రూపమివ్వడమంటే సామాన్యమైన విషయం కాదు. విష్ణుప్రసాద్ గారు నిత్య సాహిత్య కృషీవలుడు. తనకెంతో మక్కువైన పద్య సాహిత్యం నుండి వచన సాహిత్యానికి అదీ ఈ రెక్కల వైపు మొగ్గు చూపి తొలుతగా కృష్ణాజిల్లాలో పుస్తకం తేవడం అభినందనీయం. తన మనసు చెప్పిన భావాలకు రెక్కల రూపాన్ని అందంగా దిద్ది మన ముందుకు తీసుకువచ్చిన పుస్తకమే ఈ " బుద్ధయానం ". తోలి రెక్క అధికారం ఉన్నా లేకున్నా కాలగమనంలో తేడా ఉండదు, అన్నింటికన్నా మానవసేవే అమూల్యమైనది అంటూ చక్కని మాట చెప్తారు. మరో రెక్కలొ సేవకు రెండు, హ్యాండు ఉండదు, శాంతి మార్గమే బుద్ధయానం అంటూ శాంతి సందేశం వినిపిస్తారు. వేదం నుండి వేదన పుట్టింది, తరాల ఆస్థి అంతరంగం అంటారు
మరో చోట. బాల్యమూ, వార్ధక్యమూ రెండు ఒకటే చేయి పట్టుకు నడిపించాల్సిన దశలని చెప్పడం చాలా బావుంది. చెరగని ముద్ర చరిత్ర మరక నిన్నైనా నేదైనా రేపైనా అంటారు మరో రెక్కలొ. బ్రతుకు గీత, కన్నీరు, పన్నీరు వెదురు పలికే వేణువు అంటూ చక్కని జీవిత సత్యాన్ని చెప్పడం, పెరట్లో మొక్కలు విరిసిన అక్షర కుసుమాలు పరిమళించేదే కవిత్వ పుస్తకమంటూ కవిత్వాన్ని సింహాసనంపై కూర్చోబెట్టారు. సంసారమంటే సరాగము విరాగము కాదు, సాధితేనే సుగంధం అంటారు. నేలమ్మ సహనాన్ని, విశ్వాసాన్ని, విజ్ఞానాన్ని, రక్త సంబంధాలను, పలకరింపులు పరమౌషధాలని ఇలా సమాజంలోని ప్రతి చిన్న విషయాన్ని అర్థవంతమైన పదాలతో చక్కని రెక్కలుగా మనముందుకు తెచ్చిన ఈ బుద్ధయానంలో ఎన్నో కనిపిస్తాయి. ఇది చూడండి ఎంత బావుందో.
" ఒణుకుడు
రోగికి
చలి
ఒక లెక్కా -
వరదనీరు...
చేపపిల్ల ! "
ఇలాంటి జీవిత సత్యాల రెక్కలు వందకుపైగా పొందుపరచి మనకు అందించిన అపురూప అక్షర తూణీరం ఈ " బుద్ధయానం ". అందరు చదవాల్సిన పుస్తకం. ఇంత మంచి పుస్తకాన్ని అందించిన డాక్టర్ గుడిసేవ విష్ణుప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు.