ఈవారం ( 27/9-3/10) మహానుభావులు.
జయంతులు
28 సెప్టెంబర్
శ్రీ పైడి జైరాజ్ : వీరు సెప్టెంబర్ 28, 1909 న కరీంనగర్ లో జన్మించారు. భారత సినీరంగంలో ప్రసిద్ధ నటుడు, నిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత… 'మూకీ' సినిమా రోజులలో 11 సినిమాలలో, తరువాత సుమారు 156 'టాకీ' సినిమాలలో కథానాయకుడిగా, విలక్షణమైన నటుడిగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. హిందీ, ఉర్దూ భాషలతో పాటు, కొన్ని మరాఠీ, గుజరాతీ భాషా చిత్రాలలో కూడా నటించారు.
అక్టోబర్ 1
శ్రీ తిక్కవరపు వెంకట రమణారెడ్డి : వీరు అక్టోబర్ 1, 1921 న, జగదేవిపేటలో జన్మించారు. ప్రముఖ తెలుచిత్ర హాస్యనటుడు. వారి డయలాగ్గులు చాలాభాగం నెల్లూరు మాండలీకం లోనే ఉండేవి, అదే వారి ప్రత్యేకత.. వినోదపరచడానికి మాజిక్ కూడా నేర్చుకున్నారు.
అక్టోబర్ 2
1.శ్రీ కోదాడ రామకృష్ణయ్య : వీరు అక్టోబర్ 2,1891 న అమలాపురం లో జన్మించారు. ప్రముఖ భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు. ఎన్నో పుస్తకాలు రచించారు.
2. శ్రీ జోస్యం జనార్ధన శాస్త్రి : వీరు అక్టోబర్ 2, 1911 న, పాణ్యం లో జన్మించారు. రాయలసీమ కు చెందిన ప్రముఖ కవిపుంగవులలో ప్రముఖుడు. ఎన్నో పుస్తకాలు రచించారు. “ అభినవ వేమన “ అని ప్రసిధ్ధిచెందారు.
అక్టోబర్ 3
స్వామి రామానంద తీర్థ : వీరు అక్టోబర్ 3, 1903 లో గుల్బర్గా లో జన్మించారు. స్వాతంత్ర్యసమరయోధుడు, హైదరాబాద్ సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు, భారత పార్లమెంట్ సభ్యుడు, సన్యాసి.
వర్ధంతులు
28 సెప్టెంబర్
1.శ్రీ ఆదిరాజు వీరభద్రరావు : తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప బాషా శాస్త్రవేత్త.
తెలంగాణ లోని పలు చారిత్రక ప్రదేశాలు, శిలా శాసనాలు, తాళపత్ర గ్రంథాలు సేకరించి "తెలంగాణ శాసనాలు" పేరిట పెద్ద గ్రంథాన్ని ప్రచురించుటలో వీరి కృషి నిరుపమానమైనది. కాకతీయ రాజ్య పతనానంతరం ఓరుగల్లును ఏలిన సీతాపతి (షితాబుఖాను) చరిత్రను వెలువరించారు. తెలంగాణ 9 జిల్లాల చరిత్రను, భాగ్యనగరం గ్రంథాలను కూడా రచించారు.
వీరు సెప్టెంబర్ 28, 1973 న స్వర్గస్థులయారు.
2. శ్రీ పీసపాటి నరసింహ మూర్తి : పేరుపొందిన రంగస్థల నటుడు. తెలుగు నాటక రంగంపై శ్రీకృష్ణుడు పాత్రదారిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న నటుడు. పద్యగానంలో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్న నటుడు. పాండవోద్యోగవిజయాలతోపాటు గౌతమబుద్ధ, లవకుశ, తారాశశాంకం, చింతామణి లాంటి నాటకాలు అనేకం ఆడినా పీసపాటికి ఎనలేని కీర్తి కృష్ణుని పాత్ర వల్లే వచ్చింది.
వీరు సెప్టెంబర్ 28, 2007 న స్వర్గస్థులయారు.
సెప్టెంబర్ 29
శ్రీ దీవి గోపాలాచార్యులు : వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు, ఆయుర్వేద పండితులు, అఖిల భారత ఆయుర్వేద విద్యాపీఠానికి పూర్వాధ్యక్షులు. 1917లో ఆయన అఖిల భారతాయుర్వేద విద్యాపీఠానికి అధ్యక్షత వహించి దేశవ్యాప్తంగా ఆయుర్వేద అభివృద్ధికి కృషిచేశారు. వైద్యరత్న, ఆయుర్వేద మార్తాండ భిషఙ్మణి బిరుదు పొంది ప్రఖ్యాతిచెందారు. ఆయుర్వేద వైద్యానికి ప్రఖ్యాతిపొందిన గోపాలాచార్యులు దేశవ్యాప్తంగా ఆయుర్వేదాన్ని ప్రచారం చేయడంలోనూ, విస్తృతమైన వ్యాప్తికి కృషిచేయడంలోనూ ప్రశస్తిపొందారు.
వీరు సెప్టెంబర్ 29, 1920 న స్వర్గస్థులయారు.
అక్టోబర్ 1
శ్రీ వెన్నెలకంటి సుబ్బారావు : ఆంగ్లం లో తొలి స్వీయచరిత్ర రచయితగా పేరుపొందారు. తెలుగు, ఆంగ్ల భాషల్లోనే కాక ఇతర భాషల్లో నిష్ణాతులైనా సుబ్బారావు పంతులు గారు, వ్యాకరణ రచనలు, అనువాదాలు, స్వీయచరిత్ర రచన వంటివి సాగించారు..
వీరు అక్టోబర్ 1 , 1939 న స్వర్గస్థులయారు.
2. శ్రీ పాకాల వెంకట రమణారావు రాజమన్నార్ :
ప్రముఖ న్యాయవాది. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్ పదవులు నిర్వహించడమే కాక ప్రముఖ రచయిత కూడా. ర తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, ఫ్రెంచి భాషలలో పాండిత్యం సంపాదించారు.. తెలుగులో విప్లవాత్మక నాటకాలెన్నో వ్రాశారు. సమకాలీన నాటకరంగాన్ని, సాహిత్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విమర్శకునిగా కూడా పేరుతెచ్చుకున్నారు.
వీరు అక్టోబర్ 1, 1979 న స్వర్గస్థులయారు..