వివాహ బంధనాలతో చిక్కుకుపోకుండా ఉండడం ఎలా - ..

How to Avoid Getting Married

సద్గురూ, మీరు మమ్మల్ని మా గుర్తింపులు వదిలేయమని చెప్పారు. అంటే మేమందరం బ్రహ్మచారులం కావాలా? వివాహితులై భర్తతో/భార్యతో గుర్తింపు పొందకుండా ఉండడం ఎలా?

సద్గురు: లేదు, లేదు. నేనీ ప్రశ్నకు సమాధానం చెప్పను. మీరు విడాకులు కోరుకుంటున్నారు, దానికో  మార్గం కోసం వెదుకుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నదేమంటే మీరెవరితోనైనా గుర్తింపబడితే మీరు వివేకవంతంగా ఎలా జీవించగలరు? మీరు దేనితోనో, ఎవరితోనో అతిగా గుర్తింపబడితే మీరు ఇంగితంతో జీవించలేరు. అందువల్లే అత్యద్భుతమైన సంబంధాలు కూడా కొంతకాలం తర్వాత నరక ప్రాయంగా మారుతున్నాయి; మీరెందుకు కలిసి ఒక్కటయ్యారో కూడా మరచిపోతారు. సంబంధంవల్ల  ప్రయోజనంకంటే కూడా సంభంధంలోని గుర్తింపే మీకు ప్రధానమైపోతుంది. ‘బ్రహ్మచారి’ అన్న బిరుదు పుచ్చుకోవడం కూడా, మంచి గుర్తింపుకాదు. కేవలం బయటి వారు మాత్రమే, ‘అతను బ్రహ్మచారి’ అనాలి. అతను కేవలం ఉండవలసిన విధంగా ఉండాలి అంతే.

బ్రహ్మచర్యం అంటే మీరు దైవ మార్గంలో ఉన్నారన్నమాట. అంటే మీరు లౌకిక ప్రయత్నంలో లేరు. మీరు బ్రహ్మమార్గంలో ఉన్నారు. మీరు మీ కోసం ప్రణాళికలు ఏవో రచించకుండా కేవలం, మీరక్కడున్నారంతే. సృష్టికర్త మీకోసం నిర్దేశించిన కార్యంలో మీరుండదలచుకున్నారన్నమాట.  జీవ పరిణామ సిద్ధాంతం మీరంతా కోతుల నుండి వచ్చారని చెప్తుంది. మీరు కోతిగా ఉన్నప్పుడు కూర్చుని మనిషిగా ఎలా మారాలో పథకం వేశారా? ఈశా యోగా కేంద్రానికి చేరడమెలాగో, మీ తరువాతి పరిణామాన్ని ఎలా సాధించాలో పథకం వేసుకున్నారా? మీరిదంతా పథకం వేసుకోలేదు. సృష్టికర్త పథకం ప్రకారం నడిచారు. తన సొంత పథకాలూ, ప్రణాళికలూ తననెక్కడికీ తీసికొని వెళ్లలేవని తెలుసుకోవడమే ‘బ్రహ్మచార్యాని’కి అర్థం. తన సొంత పథకాలు తనని అక్కడక్కడే చుట్టూ గానుగెద్దులా తిప్పుతుంటాయి తెలిసినవాడు; ‘‘కోతిని నన్నుగా మార్చగల సృష్టికర్త నన్నెక్కడికో చేరుస్తాడు’’ అన్న విశ్వాసంతో బ్రహ్మచారి జీవిస్తాడు. తనకిచ్చిన దాన్ని సంపూర్ణంగా పెంపొందించుకోవడమే అతనైనా, మీరైనా చేయవలసిన పని.

మీ జీవితంలో మీరు ఏ స్థితిని తీసుకున్నారన్నది ముఖ్యం కాదు. అది అత్యుత్తమ జీవన విధానం, ఎందుకంటే మీ సొంతతెలివి మీ జీవిత మార్గంలో దిశా పరిణామాన్ని కలిగించలేదు.  ఈ మార్గంలో మీరు జీవించడంలో మీ తెలివి సరిపోవచ్చు. కాని, దీన్ని దాటడానికి అది సరిపోదు. అది ఈ కోణాన్ని అధిగమించాలంటే ఈ కోణానికీ, మరో కోణానికీ కూడా మూలమైన ఆ మేధస్సుతో ముందుకు వెళ్లవలసి ఉంటుంది. మీరు ఆ మేధస్సు చేతుల్లో మిమ్మల్ని మీరు పెట్టండి, అప్పుడు మీరు ప్రవహిస్తారు.  అది ఎక్కడ ఉంది? అది సర్వత్రా ఉంది. వెలుపల, లోపల అంతటా అది ఒకటే. ఈ కోణంలో కూడా మీ మూత్ర పిండాల కార్యాన్ని మీరు నిర్వహించలేరు, అది చాలా సంక్లిష్టమైన పని. ఒక చిన్న మూత్రపిండం కూడా ఈ మెదడుకు అర్ధంకావడం చాలా సంక్లిష్టమైందే. ఎవరైతే ఈ విషయం అర్థం చేసుకుంటారో, అప్పుడు వారు గానుగెద్దులా తమ ఇష్టం వచ్చినట్లు ఒకేచోట గుండ్రంగా తిరగడం వ్యర్థమని గ్రహించి, బ్రహ్మచారులవుతారు. బ్రహ్మచారులు కూడా ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. వాళ్లకు ఏర్పాటు లేకుండా ఉండదు, కాని అది మరింత సాదాసీదా  ఏర్పాటు.  మీరొక స్త్రీనో, పురుషుణ్ణో వివాహమాడతారు. కొందరు తమ వృత్తినో, సంపదనో, ఇంటినో, కారునో వివాహమాడతారు. ఒక్కొక్కరు ఒక్కోదాన్ని పెళ్లాడతారు. బ్రహ్మచారులు మెల్లగా యోగా కేంద్రంతో వివాహ బంధం ఏర్పరచుకోవచ్చు. నేనిలా ఎందుకంటున్నానంటే భౌతికమైన ఏర్పాట్ల విషయంలో, ప్రతివ్యక్తీ ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటాడు. బ్రహ్మచారులు కూడా ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. వాళ్లకు ఏర్పాటు లేకుండా ఉండదు, కాని అది మరింత సాదాసీదా  ఏర్పాటు.

మీ వివాహం, మీ వృత్తి, మీ సంపద అన్నీ మీ జీవితంలో మీరు చేసుకున్న ఏర్పాట్లని మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాని ఇవన్నీ మన జీవితాలను పరిమితం చేసుకోవడానికో, నాశనం చేసికోవడానికో కాదు. మనకు ఇంతమాత్రం తెలిస్తే మనం ఏలాంటి ఏర్పాటును ఎంచుకున్నా పరవాలేదు. ఒకవేళ మీరు చేసుకున్న ఏర్పాట్లు పనిచేయకపోతే ఏం చేయాలో మీకు తెలియాలి. అందులో నన్ను ఇరికించకండి. కాని మీరు గుర్తుంచుకోవలసిందేమిటంటే మీ జీవితాన్ని పెంపొందించుకునే, మెరుగు పరచుకొనే ఉద్దేశంతో మీరీ ఏర్పాట్లు చేసుకున్నారు తప్ప, మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేయడానికి కాదు. మీకు అంతమాత్రం తెలిస్తే ఇక సమస్యలుండవు. మీరు వివాహం చేసుకున్నారు కాబట్టి, మీరు గుర్తింపబడాలన్నదేమీ లేదు, అటువంటిదేమీ ఉండదు. ఆ బంధం అందంగా ఉండడానికి కారణం దానిలో ఉన్న గుర్తింపు కాదు.  గుర్తింపువల్లే అది అసహ్యంగా తయారవుతుంది. మీ జీవిత మాధుర్యాన్ని పెంపొందించుకోవడానికే ఈ సంబంధమూ, ఈ ఏర్పాటు అని గుర్తించినప్పుడు అది మెరుగ్గా పనిచేస్తుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు

మరిన్ని వ్యాసాలు