భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగినది మనదేశం. అంటే సర్వమతాల, సర్వకులాల, సర్వవర్గాల సమ్మేళనమే మన భారతం. ఏ కుల ప్రాతిపదికనో, ఏ మత ప్రాతిపదికనో లేక ఫలానా వర్గ ప్రాతిపదికనో నిర్మించబడినది కాదిది. ఇక్కడి సామాజిక జీవనాలు చిన్నాభిన్నం కాకుండా నిరోధించడంలో, సంఘ సంస్కర్తలతో పాటు బహుభాషా ప్రవీణులు/రచయితలూ తమవంతు కృషి చేశారు. ఎక్కడెక్కడ తప్పు జరుగుతుందో, దాన్ని ఎత్తి చూపారు. ఎక్కడెక్కడ మంచి జరుగుతుందో, దాన్ని ఎలుగెత్తి చాటారు. సమాచారాన్ని జనాల హృదయాల్లోకి చేరవేయడంలో రచయితల పాత్ర ప్రశంసనీయం. అటువంటి ప్రశంసనీయులు ‘అచ్చంగా తెలుగు కథలు’ సంపాదకులు.
ఇందులోని కథలు కూడా ఏ మతానికో, ప్రాంతానికో, కులానికో సంబంధించినవి కావు. ఆ అక్షరాలు తెలుగు భాషను ఆపాదించుకుని, పాఠకుల హృదయాల్లోకి చొరబడ్డాయి. ఆయా రచయితల మనస్సుల్లో రగిలి, కలాల్లోకి జాలువారి మనముందు ప్రత్యక్షమయ్యాయి. వీరు అపురూపంగా అందించిన 52 కథల సంకలనమిది. ‘అచ్చంగా తెలుగు కథలు’ పేరుపెట్టి, అచ్చమైన తెలుగువారి మనస్సును దోచుకున్నారు. ‘ఈ చరిత్ర మీ గుండెల్లో’ అంటూ మన ముందుకొచ్చారు.
పత్రికకు పంపే అక్షరాలు కేవలం అంతర్జాలానికే పరిమితం కాకుండా, అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకుగాను, గత ఐదేళ్ళుగా అంతర్జాలంలో ప్రచురించబడిన 300 పైగా కథల్లో ఆణిముత్యాల వంటి కథలను ఎంపిక చేసి ‘అచ్చంగా తెలుగు కథలు’ అనే సంకలనంగా తీసుకొచ్చారు. ఈ ప్రచురణకు ఉదారంగా ముందుకు వచ్చి విరాళమిచ్చిన ‘శ్రీ నగుడు సుధాకర్’ గారితో పాటు, ఇతరులకూ మనఃస్పూర్తిగా అక్షరాంజలి సమర్పించారు. ఈ 52 కథలూ దేనికవే భిన్నమైనవి. ఏ ఒక్కదాన్ని వేరుగా చూడలేం. స్థూలంగా ఇందులో 52 అంశాలు ప్రస్తావించబడ్డాయని చెప్పొచ్చు.
ఒకప్పటి జమీందారుల్లా జీవించిన కుటుంబం, ఇప్పటి యాంత్రిక జీవనానికి అలవాటుపడి తల్లీదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్చినప్పుడు, తనకు మరణం ముంచుకొస్తుందని గ్రహించిన అన్నపూర్ణ, స్వగ్రామంలోనే కన్ను మూయాలని చివరి కోరిక కోరినప్పుడు, అక్కడకు తీసుకొచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు హృద్యంగా మలచబడ్డాయి ‘అన్నపూర్ణ’ కథలో.!
మనది సనాతన ధర్మం. భర్త కట్టిన తాళికి విలువిచ్చే భార్యలు ఉండబట్టే మనది వసుధైక కుటుంబంగా విరాజిల్లుతుంది. తన మెడలో మంగళసూత్రం కనిపించకపోయేసరికి కంగారుపడిపోతూ మొత్తం వెతుకుతుంది. దొరక్కపోయేసరికి చాలా బాధపడుతుంది. చింతిస్తూ కూర్చొన్న ఆమెకు ఒకచోట ఉందని తెలిసి వెళ్తుంది. అక్కడే రెండో దేవుడిని గుర్తెరుగుతుంది. ఇటువంటి సందర్భంలో గృహిణుల మనోవేదన ‘ఈ గుడిలో ఇద్దరు దేవుళ్ళు’ కథలో కన్పిస్తుంది.!
ఇప్పుడంటే ఎవరికి నచ్చిన వృత్తిని వారు ఎన్నుకుంటున్నారు కాని, ఒకప్పుడు మాత్రం కులవృత్తినే నమ్ముకునేవారు. అలాంటి వ్యక్తే మునెయ్య. అంత పెద్ద కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి తండ్రి నుంచి వచ్చిన చెక్కరిక్షా ఎలా సహాయపడిందో మనవడితో పంచుకునే కబుర్లు ‘చెక్క రిక్షా’ కథలో వినిపిస్తాయి. మనల్ని ఒకసారి గత జ్ఞాపకాల్లోకి వెనక్కి తీసుకెళ్తాయి.! చదువుకోవాల్సిన వయసులో ప్రేమంటూ తిరిగే వాళ్లకు, పెద్దలు ఏవన్నా మంచి మాటలు చెప్తే, తరాల అంతరం అడ్డొస్తుందని కొట్టిపడేస్తుంటారు. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియని వయస్సులో ప్రేమనే మైకం నుండి బయటపడడం కష్టం. తన ప్రేమెందుకు ఫెయిలయ్యిందని బాధపడుతూ, పార్కులో కూర్చొన్న శాంతిరాజుకు రూపేష్ ద్వారా ఎలాంటి జ్ఞానబోధ లభించిందో, ఈ అంతరాలు అర్ధమైతే ఎలా ఉంటుందో ‘తరాల అంతరం’ కథ తెల్పుతుంది.! పాశ్చాత్య కంపెనీలతో టై-అప్ పెట్టుకుని, బిజినెస్ చేస్తున్న మనదేశ కంపనీలు వారికి అనుగుణంగా ఉండాలని పాష్ కల్చర్ ను ఉద్యోగులకు అలవాటు చేస్తున్నాయి. పెళ్లైందా లేదా అనేది ముఖ్యం కాదు. అందరూ ఒకటేనంటూ, భేదాభిప్రాయాలు లేవంటూ, విచ్చలవిడితనం పెరిగింది. ఎక్కువ జీతంతో పాటు కావాల్సిన అలవెన్సులూ ప్రతిఫలంగా దక్కుతాయని, అదే కంపనీలో ఉద్యోగం చేస్తున్న శ్రీమతి లాస్య, సహోద్యోగి మనోజ్ తో అక్రమ సంబంధం నడుపుతుంది. అటువంటామె తన కూతురు, భర్త ప్రేమ విలువను తెలుసుకుని, ఎలా వెనక్కి రాగలిగింది అనేదే ‘నాతి చరామి’ కథలో కళ్ళకు కట్టినట్లు అక్షరీకరించారు.!
మధ్యతరగతి కుటుంబంలోని తల్లీదండ్రుల ఆశలన్నీ బిడ్డలమీదే ఉంటాయి. ఒక్కోసారి అవే అతి జాగ్రత్తై పిల్లల్ని కట్టిపడేస్తాయి. వారిని ఒక పట్టాన నచ్చింది చేయనివ్వరు. పిల్లల్ని పిల్లల్లా ఉండనివ్వరు. ఆంక్షలు మొదలవుతాయి. పిల్లలు బెదిరిపోతారు. అటువంటప్పుడు వారు సమాజానికి విరోధంగా పెరుగుతారు. అలాంటి సమయంలో తల్లీదండ్రులు గుర్తెరగాల్సిన బాధ్యతను ‘విచ్చుకుంటున్న మొగ్గలు’ కథ వివరిస్తుంది.!
మనిషి ఆర్ధిక జీవన విధానంలో మార్పులు కోసం మనకి కావాల్సిన దానిని చదవడం మానేసి, పరాయి దేశాలకు కావాల్సింది చదివి, అటువైపుగా ప్రయాణిస్తున్నాడు. అక్కడే పుట్టి పెరుగుతున్న పిల్లలు మాతృభాష తెలీక పరాయి భాషే మాతృభాషనే భ్రమలో ఉంటున్నారు. తన మనవరాలు అలాంటి భ్రమలో పెరగకూడదని తలచిన తాత, విదేశీయానం మొదలెడతాడు. మాతృభాషను మనవరాలికి నేర్పించి, తనతో వేదికపై నాట్యం చేయించిన వైనం ‘స్వభాష’ కథలో కనిపిస్తుంది.!
ఇవే కాక ఈ పుస్తకంలో ప్రస్తావించబడిన కథలన్నీ మన మనస్సుని హత్తుకునే అంశాలే. శ్రీ పెయ్యేటి రంగారావు, శ్రీ కట్టుపల్లి ప్రసాద్, శ్రీ పిన్నలి గోపీనాథ్, శ్రీ ఆలూరి కృష్ణ ప్రసాద్ నిర్వాహణలో రూపుదిద్దబడిన ఈ సంకలనం శ్రీ పరావస్తు నాగసాయి సూరి కవర్ డిజైన్ తో అద్భుతమనిపిస్తుంది. 119వ పేజీలో సర్ప్రైజ్ ఉంది. ఈ సంకలనంలోని 52 కథలకు ఆర్టిస్ట్ శ్రీ బి.వి.నాగేంద్రబాబు అందించిన బొమ్మలు అపురూపం. అద్భుతం. ఆయన బొమ్మలతో కూడిన ఈ కథలు కేవలం కథలు కాదు. సమకాలీన సమాజంలో నేడు జరుగుతున్న పలు సంఘటనలకు, తెలుగుదనానికి, సంస్కృతికి దర్పణాలు.
‘ఒక్కొక్క పూవేసి ఓ చందమామ’ అన్నట్లుగా ఒళ్లో రాలిపడిన అపురూప కుసుమాల్లో కొన్నింటిని గుదిగుచ్చి పుస్తక రూపంలో తీసుకురావాలన్న అభిలాష, మెచ్చదగిన చక్కని ప్రయోగం. ఫరవాలేదు, తెలుగుకు వచ్చిన ఢోకా ఏమీ లేదు అనే భరోసా కలిగిందని సీనియర్ పాత్రికేయులు భండారు శ్రీనివాసరావు గారు వ్యాఖ్యానించారు.
నాకు తెలిసి ఇదో పార్కులాంటిది. ఇందులో ఒంటరిగా వాకింగ్ చేయొచ్చు. ఇతరులతో కలిసి పిచ్చాపాటి చేస్తూ నడవొచ్చు. కింద కూర్చుని ఇంకొకరిని గమనించవచ్చు. నడవడికను, అందులోని లోపాలని సరిచేసుకోవచ్చు. నల్లని అక్షరాలతో తెల్లని హృదయాన్ని తాకవచ్చు.
అక్షరాలే మార్గాదీపికలై వెలిగే చోట దివిటీలు ఎందుకు.? కలం స్వేచ్ఛగా గళమెత్తి పాడే చోట స్తుతులు, ప్రస్తుతులు ఎందుకు.? పసగలిగిన విభిన్నమైన 52 కథల పదునేమిటో చదవండి..! తెలుసుకోండి..! ఈ పుస్తకాన్ని మీ ఆత్మీయులకు అమెజాన్ ఆన్-లైన్లో ‘acchamgaa telugu’ అని టైపు చేసి ఆర్డర్ ఇవ్వండి.
ప్రతులకు: సతీష్ - 7702244463
Email : [email protected]