యాప్స్ గురూ.. యాప్స్.. అంటూ ఎప్పుడో, ఎక్కడో పుట్టిన రకరకాల యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుని వాడుకునే స్థాయి నుండి సొంతంగా యాప్స్ తయారు చేసే స్థాయికి వచ్చేశాం. యాప్స్ తయారు చేయడంలో తలలు పండిపోయిన వాళ్లే ఉంటారనుకుంటే తప్పులో కాలేసినట్లే. స్కూల్ స్థాయి పిల్లలే ఇప్పుడు యాప్స్ తయారీలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రాజెక్టుల పేరు చెప్పి స్కూళ్లలో పిల్లలకు మెదడుకు మేత బాగా పెడుతున్నారు. దాంతో వినూత్నమైన ఆలోచనల వైపు పిల్లల మనసు వేగంగా పరుగులు పెడుతోంది.
ఆ క్రమంలోనే ఆ చిన్న మెదడుల్లోంచే కొత్త కొత్త యాప్స్ వెలుగు చూస్తున్నాయి. కొందరు యాప్స్ తయారీలో ఇంట్రెస్ట్ చూపిస్తుంటే, మరికొందరు బ్లాగ్స్‌పై దృష్టి పెడుతున్నారు. ఇంకొందరు షార్ట్ ఫిలింస్ అంటూ, చిన్న వయసు నుండే, వినూత్న ఆలోచనలు చేస్తూ తమ టాలెంట్‌కి పదును పెడుతున్నారు. ఇది స్మార్ట్ యుగం. అంతే ఇక్కడ టాలెంట్ చిన్న వయసు నుండే ఇంప్రూవ్ అయిపోతోంది. ఆ టాలెంట్‌ని ఊరికే వృధా చేయడానికి ఇష్టపడడం లేదు పిల్లలు. సంపాదన మార్గాలుగా మలచుకుంటున్నారు. కొందరు పిల్లలైతే, తల్లి తండ్రుల్ని మించిన సంపాదన ఆర్జిస్తున్నారంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ, ఇది నిజం. విదేశాలకు మాత్రమే పరిమితమైన చిన్న వయసు సంపాదన మెల్ల మెల్లగా ఇప్పుడు మన దేశానికీ పాకింది. చిన్న వయసులో ప్రపంచం గుర్తించిన వ్యాపార వేత్తలుగా ఎదిగిన పిల్లల గురించి ఈ మధ్య విన్నాం. తెలుసుకున్నాం.
ఎనిమిదో క్లాస్ పిల్లాడు, ఏకంగా ఇంటర్మీడియట్ క్లాసులు చెబుతున్నాడనేలాంటి వార్తలు కూడా ఈ మధ్య చాలానే వింటున్నాం. అంటే వయసుతో సంబంధం లేకుండా, పిల్లల నాలెడ్జ్ ఆ స్థాయిలో డెవలప్ అవుతోంది. వీలు చిక్కితే చాలు మొబైల్ ఫోన్స్‌తోనే గడిపే పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా.? లేటెస్ట్‌గా తేలిన అధ్యయనాల ప్రకారం, నిన్న మొన్నటి వరకూ గేమ్స్ ఆడడం పైనే ఆసక్తి చూపిన పిల్లలు, ఇప్పుడు వాటిపై బోర్ ఫీలవుతున్నారట. కొత్త ఆవిష్కరణల దిశగా కసరత్తులు చేస్తున్నారట. గేమ్స్ కోసమే కాదు, కొత్త కొత్త గ్యాడ్జిట్స్‌ని కనిపెట్టే దిశగా వారికి అందుబాటులో ఉన్న గ్యాడ్జెట్స్‌ని వినియోగించి అబ్బుర పరుస్తున్నారని తెలుస్తోంది. అంటే పిల్లలు కేవలం ఆన్‌లైన్ గేమ్స్ కోసమే మొబైల్స్‌ని వాడుతున్నారనుకుంటే పొరపాటే. తక్కువ టైంలో ఎక్కువ పని చేసే గ్యాడ్జెట్స్‌ని కనిపెట్టడం వంటి సక్రమ మార్గాల్ని అన్వేషించడంలో సక్సెస్ అవుతున్నారు. అంటే ఇది సద్వినియోగమే కదా. అయితే, ఈ సద్వినియోగంలోనూ కొంత అబ్జర్వేషన్ ఉండాలండోయ్.
ఇకపోతే, స్మార్ట్ యుగం విచక్షణను కోల్పోయేలా చేస్తుందనడం నిర్వివాదాంశం. అయితే, కొంచెం వైజ్‌గా ఆలోచిస్తే, స్మార్ట్ ప్రపంచంలో అద్భుతాలు సాధించొచ్చని చిచ్చర పిడుగులు ప్రయోగాత్మకంగా నిరూపిస్తున్న రోజులివి. సో బాగపడడమా.? చెడిపోవడమా.? అనేది మన చేతుల్లోనే ఉంది. థింక్ వైజ్ బిఫోర్ యూజ్.. అంతే.!