చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

chamatkaram

ఈ రోజుల్లో మార్కెట్టుల్లో చూస్తూంటాము, కూరగాయలనండి, పళ్ళనండి ప్రతీ చోటా ఏదో మందూ మాకూ ఉపయోగించి, అనవసరమైనవన్నీ వాడేసి, పండ బెట్టేయడం. ఒకటికి రెండు సార్లు పాలిష్ చేసేసి, తాజా గా ఉన్నట్లు మనల్ని నమ్మించేయడం. ఎక్కడ చూసినా ఫెర్టిలైజర్లూ, కెమికల్సూనూ. చివరకి ఇదివరకటి రోజుల్లోలాగ ఉండే కూరగాయలూ, పళ్ళూ కావాలంటే అవేవో “organic variety” అని ఖరీదెక్కువైనవేవో కొనుక్కోడం. ఎక్కడ చూసినా hybrid. మన జీవితాలుకూడా అలాగే అయిపోయాయి ! ప్రతీ దాంట్లోనూ పోటీ,అవతలివాడికంటే మనం, మన పిల్లలూ ఓ ఆకు ఎక్కువే ఉండాలీ అనే కానీ, ఈ పోటీ ప్రపంచం లో మనం పోగొట్టుంటున్నదేదో ఒక్కళ్ళైనా ఆలోచించారా? జవాబు–NO–ఇది వరకటి రోజుల్లో, ఓ పసిపాప ని చూస్తే ముద్దొచ్చేది. ఇప్పుడూ వస్తోంది, కానీ ఏ వయస్సొచ్చేదాకా? ఏదో నోట్లో ఓ మాటొచ్చేదాకానూ. ఇంక అక్కడనుంచి కష్టాలు ప్రారంభం పాపం ఆ పసిపాపకి. రెండు మూడేళ్ళొచ్చేదాకా ఏదో ఫరవాలేదు. అక్కడనుంచి ప్లేస్కూళ్ళూ, కేజీలూ, డాన్సులూ, పాటలూ ఒకటేమిటి, తల్లితండ్రులకి తాము తీర్చుకోలేని ambitions అన్నీ, ఆ పిల్లలద్వారా తీర్చుకోడం. టి.వి. లలో వచ్చే ఏ చిన్న పిల్లల ప్రోగ్రామైనా చూడండి, అందులో పాల్గొనే చాలామంది పిల్లలు, తమ వయస్సు కంటె, ఎక్కువ వయస్సులా కనిపిస్తారు. పైన చెప్పినట్టు, మార్కెట్ లో దొరికే కూరలకీ, పళ్ళకీ, వీళ్ళకీ తేడా ఏమీ కనిపించదు. అయిదారేళ్ళ పిల్ల పదేళ్ళ పిల్లలా కనిపించడంలో ఆశ్చర్యం లేదు.

ఆ రోజుల్లో ,చిన్న పిల్లల హావభావాల్లో ఉండే పసితనం, అమాయకత్వం అన్నీ ఎక్కడకి మాయం అయిపోయుంటాయంటారు ? They just vanished.. మనలో చాలామందికి చిన్నప్పటి మధుర జ్ఞాపకాలుండాలి, కానీ మన పిల్లలకి మాత్రం ఉండకూడదు. వాళ్ళని robots లా తయారుచేసి, ఇంటికి ఎవరైనా వస్తే, బాబూ/అమ్మా ఓ ఇంగ్లీషు పద్యం పాడమ్మా అనడం. ఇంకవాళ్ళుకూడా, ప్లేస్కులుకి వెళ్ళేదాకా రోజంతా టి.వి. ముందరే కూర్చోడం. ఆ పసిపాపకి ఆకలేసినప్పుడు చెప్పడం రాదుకానీ, టి.వి. లో ఏదైనా “షీలాకీ జవానీ” లాటి పాటల మ్యూజిక్కొచ్చే టప్పటికి మాత్రం గుర్తుపట్టేయడం, వాళ్ళ అమ్మా నాన్నలు అబ్బో మావాడికి ఎంత తెలివితేటలో అనుకుంటూ సంబరపడి పోవడం!  వాణ్ణి ఏ కోచింగు స్కూల్లోనో చేర్పించేయడం, వీలైనన్ని కార్యక్రమాల్లో పోటీ చేయించేయడం.అలాగే ఆటల్లో కూడానూ. ఇవన్నీ ఉండకూడదనడం లేదు. But at what cost…? ఆటల్లో వివిధ రకాల categories లలో ( under 15, under 19,…) ఉంటాయి. దేంట్లోనూ, వాటిలో పాల్గొనే పిల్లలు వారి వయస్సుకి తగ్గట్టుండరు. ఇదివరకటి రోజుల్లో, పధ్ధెనిమిదేళ్ళొచ్చినా ఇంకా మూతి మీద మీసం ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో ఎవరిని చూసినా ఓ ఇద్దరు ముగ్గురు పిల్లల తండ్రిలాగే కనిపిస్తారు! దీనికంతటికీ కారణం, మనం పిల్లలకి పెట్టే తిండి కూడా ఓ కారణం.  ఇంకోటి, ఇదివరకటి రోజుల్లో, ఎవరింటికైనా వెళ్తే, అక్కడుండే చిన్నపిల్లాడిని పలకరించడం ఓ ముచ్చటగా ఉండేది, కారణం వాళ్ళు మాట్లాడే ముద్దుమాటలూ అవీనూ. కానీ ఇప్పుడు ఎవరినైనా పలకరించాలన్నా భయమే! ఏం మాట్లాడితే ఎటువంటి retort వస్తుందో అనే భయమే! దానికి మన సినిమాలు కూడా, వాళ్ళకి చేతనైనంత చేస్తున్నారు. పిల్లలు చేసేది తల్లితండ్రులు చూస్తునే ఉన్నా, వాళ్ళకీ భయమే, ” అలా అనకూడదమ్మా…” అంటే , తను చూసిన ఏ ఎపిసోడ్ లోంచి రిఫరెన్సిస్తాడో అని!

టి.వి.ల్లో వచ్చే ఏ కార్యక్రమం చూడండి, ఊరికే పేరుకే ” చిన్నపిల్లలు” అంటారు. కానీ వాళ్ళల్లో ఎవరూ చిన్నపిల్లల్లా కనిపించరు. అంతదాకా ఎందుకూ, ఓ పెళ్ళికూతుర్ని చూస్తే, ఆ సమయం లో ఆ పిల్ల పడే సిగ్గూ, అవీ ఇప్పుడు మచ్చుకైనా కనిపిస్తాయా? ఎప్పుడు పెళ్ళవుతుందా, ఎప్పుడు వీడి పని పడదామా అనే కనిపిస్తుంది.

ఈ రోజుల్లో చిన్న పిల్లల వయస్సుకీ, వారు మాట్లాడే మాటలకీ పొంతే లేదు. ఇంక తల్లితండ్రులు కూడా వహ్వా మనవాడి ఐక్యూ ఎంతుందో అనే మురిసిపోవడమే కానీ, Are we on the right track అని ఆలోచించే టైమే లేదు. వాళ్ళని అనీ ఏం లాభం లెండి? వాళ్ళుమాత్రం ఏం చేస్తారు? నూటికి తొంభై మార్కులొచ్చినా, సీటొస్తుందో లేదో తెలియదు. తీరా చదువు పూర్తైన తరువాత ఉద్యోగం వస్తుందో లేదో తెలియదు. Adolescence అనే మాటకి అర్ధం ఏ డిక్షనరీలోనూ కనిపించదు, కారణం అసలు అదేమిటో తెలిస్తే కదా !!!

మరిన్ని వ్యాసాలు