కర్నాటక తీర్ధయాత్రలు - కర్రా నాగలక్ష్మి

karnataka teerdhayatralu

( బృందావనం గార్డెన్స్ , మైసూర్ పేలస్ )

బృందావన్ గార్డెన్స్ అంటే తెలీని భారతీయుడు వుండడు అనడంలో అతి శయోక్తిలేదు . ఇప్పుడు సినిమాలలో పాటలంటే యూరోపు పరిగెడుతున్నారు కాని 1960 ల నుంచి 1980 ల వరకు సినిమాలలో పాటల చిత్రీకరణ బృందావన్ గార్డెన్స లో జరిగింది అంటే అదో గొప్పవిషయంగా వుండేది . తరవాత మనవారు సిమ్ల , కశ్మీరు లలో చిత్రీకరించసాగేరు , ఇప్పుడు విదేశీ లొకేషన్లు సర్వసాధారణం అయిపోయింది . అలాగే 60 లలో రొమేంటిక్ డెస్టినేషన్ అంటే మైసూరు బృందావన్ గార్డెనే . అప్పట్లో పెళ్లవగానే హానీమూనులు పెద్దగా వుండేవి కావు , తరువాత యెప్పుడో పిల్లాడి పుట్టుజుత్తులకో తిరుపతి వెళితే తరువాత అక్కడ నుండి మైసూరు యెలోగోలావీలుచేసుకు వెళ్లేవారు , వెసులుబాటు వున్న వాళ్లు హానీమూన్ కి బెంగుళూరు మైసూరు వెళ్లేవారు . సినిమాలలో చూస్తేనే యెంతో అందంగా కనిపించే ఆ ఉద్యావనం నిజంగా చూస్తే , కలనిజమైనంత ఆనందం కాదూ ?      ఇంత  అందమైన  ఈ  ఉద్యానవనం  నిర్మాణం వెనుకవున్న చరిత్రేమిటో తెలుసుకుందాం . కర్నాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాలో కావేరీ నదీ తీరాన నిర్మింపబడింది యీ వుద్యానవనం .

కావేరీ నది మీద నిర్మింపబడ్డ కృష్ణసారగ డామ్ పక్కన నిర్మించడం వల్ల ఉద్యానవనం పెంచడానికి , పౌంటెన్స్ వాడకానికి కూడా నీటి కొరతలేదు  1927 లో అప్పటి మైసూర్ దీవాన్ మీర్జా ఇస్మైల్ వుద్యానవన నిర్మాణం చేపట్టి 5 ఏళ్లల్లో అంటే 1932 లో పూర్తిచేసేడు . సుమారు 60 ఎకరాలలో నిర్మింపబడింది . ఇందులో పండ్ల పూల తోటలు , లతలతో చేసిన రకరకాల ఆకృతులు , జలపాతాలు , పౌంటెన్లు వున్నాయి . శ్రీనగరులోని ‘ మొఘల్ గార్డెన్స్ ‘ వున్నట్లే జలపాతాలు అవీ వున్నా వైశాల్యంతో పోల్చుకుంటే యీ వుద్యానవనం చాలా పెద్దది . ఈ వుద్యానవనానికి పక్కగా వున్న 70 ఎకరాల పండ్లతోట అదనపు ఆకర్షణ అని చెప్పుకోవచ్చు . ఈ వుద్యానవనం లో నాగవనం , చంద్రవనం అని రెండు వుపవుద్యానవనాలు , మూడు అంతస్థులలో జలపాతాలు , లెక్కకు మించి రంగురంగుల పూలమొక్కలు కనువిందు చేస్తాయు . అయితే అక్టోబరునుంచి ఫిబ్రవరి వరకు యిక్కడ పూచే గులాబీలు కనువిందు చేస్తాయి , ఆ సమయంలో అయితేనే యెండ యెక్కువగా వుండదు కాబట్టి తిరగడానికి బాగుంటుంది . ఆకుపచ్చని లాను , రంగురంగుల పూలు రంగురంగుల జలపాతాలు ఓహ్ స్వర్గం అంటే యిక్కడే వుందేమో అనిపిస్తుంది .సాయంత్రం బృందావన్ గార్డెన్స్ కి చేరేటట్లుగా వెడితే చీకటి పడ్డాక దీపాలకాంతిలో బృందావన్ గర్డెన్స్ అందం పదిరెట్లు పెరుగుతుంది . జలపాతాలలో రంగులుమారే దీపాలు అలంకరించడం వల్ల రంగునీరు ప్రవహిస్తున్నట్లు కనబడుతుంది . మైసూరు టూరు ఆపరేటర్లు సాయంత్రం బృందావన్ గార్డెన్స్ చేరేట్లుగానే ఎరేంజ్ చేస్తారు . మొత్తం అరవై యెకరాలు తిరగడం యెవరివల్లా అయే పనికాదుగాని తక్కువలో తక్కువ 5 లేక ఆరు కిలోమీటర్లైనా నడవక తప్పదు . ఉద్యానవనం మధ్యలో వున్న సరస్సులో బోటింగ్ సౌకర్యం వుంది . మొత్తం బృందావన్ గార్డెన్స్ చూడాలనుకొనేవారు పగలు వచ్చి మొత్తం వుద్యానవనం తిరిగి , బోటింగ్ చేసుకొని , సాయంత్రం అయేక దీపాలకాంతిలో పౌంటెన్స్ , జలపాతాలు చూసుకొని మ్యూజికల్ ఫౌంటెన్స్ చూసుకొని రావొచ్చు .

టూరులో వెళ్లేటప్పుడు మనకి సమయం చాలా తక్కువగా వుంటుంది , పరుగుపరుగున మ్యూజికల్ పౌంటెన్ చేరుకుంటాం ఆ హడావిడిలో చాలావరకు వుద్యానవనం చూడ్డమే అవదు . మ్యూజికల్ ఫౌంటెన్స్ నిర్ణీత సమయాలలోనే మొదలుపెడతారు , రోజూ ఒకటో రెండో షోలు వుంటాయి . బృందావన్ గార్డెన్స్ లో ముఖ్యమైన ఆకర్షణ మ్యూజికల్ ఫౌంటెన్స్ . పాటకి అణుగుణంగా నాట్యమాడేటట్లుగావీటిని పనిచేసేటట్లుగా చెయ్యడం వల్ల పాటకి తగ్గట్టుగా నాట్య మాడుతున్నట్లుగా అనిపిస్తుంది . ఈ మధ్య చాలా నగరాలలో యిలాంటివి పెట్టేరుగాని యింతపెద్దవి అలాగే యెక్కువసమయం వుండే మ్యూజికల్ ఫౌంటెన్స్ మాత్రం లేవనే చెప్పొచ్చు . ఈ వుద్యావనం ‘ కావేరీ నీరవారి నిగమ ‘ వారి ఆధ్వైర్యంలో వుంది . మైసూర్ మహారాజా

పేలస్ —-

మైసూర్ నగరాన్ని ‘ సిటీ ఆఫ్ పేలసెస్ ‘ అని అంటారు , పాతకోటలో వున్న రాజభవనంకాక మరో ఆరు రాజభవనాలుండటమే మైసూర్ ని సిటీ ఆఫ్ పేలసెస్ అనడానికి కారణం , కాని మహారాజా పేలస్ అంటే మాత్రం పాతకోటలోవున్న భవనమనే అర్దం . వడయార్ రాజులు పాలనలో రాజా ‘ యడురాయ ‘ వచ్చేక అంటే సుమారు 14వ శతాబ్దంలో పాత కోటలో రాజభవనాన్ని నిర్మించుకొని అందులో నివాసముండి రాజ్యభారాన్ని నిర్వహించేరు  . అయితే అప్పటి రాజభవనం కర్రతో నిర్మింపబడిందట , 1896లో దశరా సంబరాల సమయాన సంభవించిన అగ్ని ప్రమాదంలో రాజభవనం పూర్తిగా కాలిపోయింది . 1896 లో అప్పటి రాజైన కృష్ణరాజవడయార్ -4 చే మొదలుపెట్టబడి 1912 లో నిర్మాణం పూర్తయింది . ఈ భవన నిర్మాణంలో హిందు , రాజపుత్ , గోతిక్ , మొఘల్ సాంప్రదాయ శిల్పకళలని వుపయోగించేరు . ఈ భవన నిర్మాణ సమయంలో దివాన్ కలకత్తా , బొంబాయి , ఢిల్లి , జయపూర్ వెళ్లి అక్కడి భవనాలను అధ్యయనం చేసి వచ్చేరట . ఈ భవన నిర్మాణానికి సుమారు 41 లక్షల రూపాయలు ఖర్చుచేసేరట . 1930 లో ఈ భవనంలో మరికొన్ని గదులు , హాలులు నిర్మించేరు . రాజభవనంలో 3 ప్రధానమైన మందిరాలు , 18 వరకు చిన్న మందిరాలుకూడా వున్నాయి .

రాజమందిరానికి మూడు దారులు వున్నా యి , సందర్శకులకోసం దక్షిణ ద్వారం తెరచివుంటుంది , మిగతాద్వారాలు దశరా సంబరాలలో మాత్రమే తెరుస్తారు . లోపలకి ప్రవేశించగానే చుట్టూరా చాలా శ్రద్దగా తీర్చిదిద్దిన వుద్యానవనం , పచ్చని లాను సందర్శకులని ఆకట్టుకుంటుంది . లోపల కూడలి ద్వారం , ఆ వెనుక నున్న మూడంతస్థుల రాజభవనం చూడముచ్చటగా వుంటుంది .కూడలి ద్వారం సుమారు 245 అడుగుల పొడవు 156 అడుగుల వెడల్పుతో  చక్కని శిల్పతోరణాలతో వుంటుంది . దీనిని గులాబి రంగు చలువరాతితో నిర్మించేరు .దీనిమీద చెక్కబడిన గజలక్ష్మి మైసూర్ రాజవంశస్థులకు సిరిసంపదలను ప్రసాదిస్తున్నట్లుగా వుంటుంది . రాజభవనం సుమారు 72 ఎకరాలలో నిర్మించబడింది . దర్బారా హాలు వాటి పైకప్పులపై గల నఖాషీ చాలా బాగుంటుంది . ఈ భవనంలో వడయార్ వంశస్థుల దుస్తులు , ఆభరణాలు , తలపాగాలు , వారు వాడిన సామానులు , కత్తులు మొదలయిన ఆయుధాలను చూడొచ్చు .మైసూరు అని మొదలు పెట్టినప్పటి నుంచి ఈ వూరికి దశరా సంబరాలతో వున్న బంధం గురించి చెప్పుకుంటూనే వున్నాం .

ఆ దశరా సంబరాలు యీ భవనం నుంచే మొదలవుతాయి , ఊరేగింపులో ‘ పత్తాడ కత్తి ‘ అంటే రాజుగారి కత్తిని ఒంటెలు , ఏనుగలతో తీసుకు వెళతారు . రాజుగారి నవరత్న సింహాసనాన్ని కూడా ప్రదర్శిస్తారు . మిగతా సమయాలలో సింహాసనం ప్రదర్శనలో వుండదు . ఈ సింహాసనాన్ని కెజిఎఫ్ గనులలోంచి తీసిన బంగారంతోనే నిర్మించినట్లుగా చెప్తారు .ఛాముండీ అమ్మవారిని 750 కిలోగ్రాముల బంగారంతో నిర్మించిన సింహసనం మీద అలంకరించి ఏనుగుమీద ఊరేగిస్తారు .ఈ రాజభవనం దేశవిదేశ పర్యాటకులలో బాగా పేరు పొందింది . పర్యాటకులకు మొదటి ఆకర్షణ ఆగ్రా లోని తాజమహల్ కాగా రెండవది మైసూర్ రాజభవనమని గణాంకాలు చెప్తున్నాయి . రాజభవనాలను చూసేటప్పుడు మన దేశపు పూర్వ వైభవం కళ్లకు కడుతుంది . ప్రతీరోజూ రాజభవనంలో లైట్ అండ్ సౌండు షొ నిర్వహిస్తారు . ఇది తప్పకుండా చూడవలసింది . ప్రతీరోజూ సాయంత్రం కొద్ది గంటలు సుమారు పదివేల దీపాలతో రాజభవనం వెలిగిపోతూవుంటుంది , ఆ సమయంలో రాజభవనపు అందం పదిరెట్లు పెరిగినట్లుంటుంది . మైసూర్ రాజభవనంలో ఓ స్త్రీ విగ్రహం రాజ కుటుంబీకుల పూజలందుకుంటూ వుంటుంది దానికి సంబంధించిన కథ యిక్కడ చెప్పుకోడం అవుసరమేమో అనిపించి చెప్తున్నాను . ఇది కట్టుకథ కాదు , చరత్రలో లిఖించబడింది . 1612 లో విజయనగర సామ్రాజ్య ఆఖరి రాజు తిరుమలరాయ ని చంపి మైసూర్ సామ్రాజ్యానికి రాజౌతాడు రాజా వడయార్ , తిరుమలరాయ ధర్మపత్ని అలమేలమ్మ రహస్యమార్గం గుండా విలువైన నగలు తీసుకొని పారిపోయి తలకావేరి ప్రాంతంలో మలంగి అనే గ్రామంలో తలదాచుకుంటుంది .

రాజావడయార్ సైనికులు అలమేలమ్మ ఆచూకి తెలుసుకొని బంధించి రాజుగారి దగ్గరకి తీయుకు వెళ్లడానికి రాగా అలమేలమ్మ తలకావేరీ ప్రాంతం ఇసుకమేటలు వెయ్యాలి , మలంగి ప్రాంతం సుడిగుండాలతో వుండి జనావాసయోగ్యం కాకుండా పోవాలి అని , వడయార్ వంశం నిర్వంశం కావాలని శపించి కావేరీలో దూకి ప్రాణ త్యాగం చేస్తుంది . విషయం తెలుసుకున్న రాజు ఆమె విగ్రహాన్ని రాజభవనంలో ప్రతిష్ఠించి పూజించసాగేడు . కాని ఆమె యిచ్చిన శాప ఫలితంగా తలకావేరీలో కావేరీనదిలో యిసుకమేటల వేసింది , మలంగి కావేరీలో మునిగిపోయింది , ఆ ప్రాంతం సుడిగుండాలతో నిండిపోయింది , ప్రాణహాని  యెక్కువగా వుండడంతో కావారీనదిలోని ఆ ప్రాంతంవైపు రాకపోకలు చెయ్యనివ్వరు . ఇక రాజవంశం నిర్వంశం కావాలనే శాపం కూడా నిజమైంది , రాజా వడయార్ కి మగసంతతిలేకపోతే అతని తమ్ముని కుమారుని పెంచుకొని అతనిని రాజుని చేసేడు , అలా ప్రతీ రెండోతరంలోనూ జరుగుతూ వచ్చింది , ప్రస్తుతం శ్రీకాంత దత్త వడయార్ మరణానంతరం మైసూర్ సింహాసనం వారసులు లేని రాజవంశమైంది . కన్నడిగులు అలమేలమ్మ శాప ఫలితమే యిది అని అంటారు .

ఇదండీ యీ వారపు వివరాలు , వచ్చేవారం మరో ప్రదేశం గురించి చదువుతాం ,అంతవరకు శలవు  

మరిన్ని వ్యాసాలు