మతి' పోగొడుతున్న 'యాప్‌': మానసిక సమస్యకు మందేస్తుందా.? - ..

Failing 'App': Mental problem?

ఈ స్మార్ట్‌ ప్రపంచంలో యాప్స్‌కి కొదవే లేదు. రోజుకో కొత్త యాప్‌ పుట్టుకొస్తోంది. ఆఖరికి మన తిండి మనం తిననవసరం లేకుండానే కడుపు నిండిపోవడానికి ఓ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.. అనే రోజులు ముందు ముందు చూస్తామేమో. అలా తయారైంది పరిస్థితి. తాజా అధ్యయనాల ప్రకారం ఒత్తిడిని తగ్గించేందుకు కొత్తగా ఓయాప్‌ని సృష్టించారట కొందరు విదేశీ మానసిక నిపుణులు. ఇదెలా ఉందంటే, అదేదో సామెత చెప్పినట్లుందన్న మాట. అసలు ఆ ఒత్తిడికి కారణమే ఆ రకరకాల యాప్స్‌రా భగవంతుడా..! అంటుంటే, ఒత్తిడిని తగ్గించే యాప్‌ ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు జనం. అలా అని దాన్నేమైనా లైట్‌ తీసుకుంటారా.? చెప్పండి. అరె.. ఒత్తిడిని తగ్గించే యాప్‌ అట. అదేంటో చూసేద్దాం అని ముందూ వెనకా చూడకుండా చక్కగా డౌన్‌లోడ్‌ చేసేసుకుంటారు. నిజానికి మానసిక సమస్యల బారిన పడుతున్నది ఎక్కువగా యువతే. స్మార్ట్‌ ఫోన్లకు అడిక్ట్‌ అయిపోయిన యువత, కొత్తగా పుట్టుకొస్తున్న యాప్స్‌ పేరు చెప్పి అనవసర ఒత్తిడికి, కుంగుబాటుకీ లోనవుతోంది.

ఒత్తిడికి కారణాలు అనేకం. ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారిలో యువత అత్యధిక శాతం ఉంటే, అందులో సగం శాతం వయసుతో సంబంధం లేకుండా అందర్నీ దహించి వేస్తోంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆడా, మగా కలిసి కష్టపడితే కానీ, ఇల్లు గడవని పరిస్థితి. ఆడవాళ్లు ఇంటి పట్టునుండి కష్టపడి పని చేసి ఇంటికొచ్చే మగాడి ఆలనా పాలనా చూసుకుంటే, ఇటు మగాడికీ, అటు ఆడవాళ్లకీ కూడా ఒత్తిడి అనే మాటకు అర్ధమే తెలీదు. కానీ, ఇది గతం. నేడు ఇలాంటి పరిస్థితి లేదు. ఇంటి పట్టునుండే ఆడవాళ్లూ అరుదే. ఒకవేళ ఉన్నా, పెరిగిన టెక్నాలజీ పుణ్యమా అని ఇంట్లోంచే సవాలక్ష వ్యాపకాలతో ఆదాయం ఆర్జిస్తున్నారు మహిళలు. అలా వారి బుర్రను ప్రెజర్‌ కుక్కర్‌లా మార్చేస్తున్నారు. తద్వారా, ఒత్తిడి, అసహనం, కుంగుబాటు, నిద్రలేమి, కోపం తదితర ఎమోషన్స్‌కి ఇట్టే లోనయిపోతున్నారు. మరి ఈ సమస్యలకు రిలాక్స్‌డేషన్‌ ఎక్కడి నుండి వస్తుంది.?

ఒక్కోదానికి ఒక్కో యాప్‌. మేకప్‌కి ఓ యాప్‌, ఛాటింగ్‌కి ఓ యాప్‌, షాపింగ్‌కి ఓ యాప్‌.. షాకింగ్‌ ఎక్స్‌ప్రెషన్‌కీ యాపే. ఇలా మనుషులతో సావాసం మర్చిపోయి, యాప్స్‌తో సావాసం మొదలెట్టేశారు. తిండి లేకున్నా ఉండగలుగుతున్నారేమో కానీ, నేటి యువత యాప్స్‌ లేకుండా ఉండలేకపోతోంది. మార్కెట్‌లోకి ఏ కొత్త యాప్‌ వచ్చినా ముందు తమ మొబైల్‌లో ఉండాల్సిందే. ఇలా మారిపోయింది పరిస్థితి. ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి యాప్స్‌లో ఫోటోలు, పోస్ట్‌లు పెట్టడం వాటికి లైకులు, కామెంట్లు చేయలేదని ఒత్తిడి ఫీలయిపోవడం, ఒక్కోసారి ఆ ఒత్తిడి శృతి మించి ఆత్మహత్యలకు కూడా దారి తీస్తోంది. అంతలా మతులు పోగొట్టేస్తున్నాయి ఈ మొబైల్‌ యాప్స్‌. అలాంటిది మానసిక సమస్యల్ని తగ్గించే 'యాప్స్‌' అంటే వినడానికి హాస్యాస్పదంగా అనిపిస్తున్నా.. అయినా, తప్పదు, అలాంటి యాప్స్‌నీ అంగీకరించాలేమో. ముందు ముందు ఇంకెలాంటి పరిణామాల్ని చూడాల్సి వస్తుందో తెలీదు కదా.! ఈ 'మాయ'దారి యాప్స్‌ మూలంగా.

చదువు ఎక్కువైతే ఉన్న మతి పోయిందన్నట్లు, టెక్నాలజీ పుణ్యమా అని మనిషి మెదడును హరించేస్తూ ఉన్న మతులు పోగొడుతున్న ఈ యాప్స్‌ విషయంలో యువత కొంచెం విచక్షణతో మెలగాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ ఆవశ్యకతను గుర్తించి మసలుకుంటే, యాప్స్‌తో మతులు పోగొట్టుకోవడం కాదు, మానసిక ఉల్లాసానికి ఖచ్చితంగా మందు అవుతుందనడం అతిశయోక్తి కాదేమో. సో మై డియర్‌ యూత్‌ తస్మాత్‌ జాగ్రత్త.!  

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు