అలనాటి దీపావళి ముచ్చట్లు...!!! - కొత్తపల్లి ఉదయబాబు

alanati deepavali mucchatlu

‘’దిబ్బు దిబ్బు దీపావళి - మళ్ళీ వచ్చే నాగులచవితి’’

దీపావళి పండుగ వస్తోందంటేనే ఏదో ఉత్సాహం, ఉద్వేగం. సుమారు నెలరోజులముందు నుంచే ప్రయత్నాలు.ఆరునుంచి పదోతరగతి చదువుకునే పిల్లలందరం సిసింద్రీలు, ఇంటర్ నుంచి డిగ్రీ చదివే అన్నయ్య లందరూ తారాజువ్వలు , 45 సంవత్సరాల గృహస్తులందరూ ఇంట్లో పటాసు నూరి తాటాకు టపాకాయలు కట్టేఎర్ప్లాట్లు ప్రారంభించేసేవాళ్ళం. పిల్లలందరికీ పెద్దవాళ్ళు డబ్బులివ్వల్సిందే.’’ అనవసర ప్రయత్నాలు చేసి ఇల్లు వొళ్ళు కాల్చుకోకండి. కొనుక్కుంటే సరిపోతుంది’’ అని అడమాయింపబడిన పిల్లలు ఆ ప్రయత్నాలు మొదలెట్టిన మాచుట్టూ చేరి ఎలా చేస్తున్నామో గమనిస్తూ మాకు సాయం చేసేవారు.

మందుల షాపుల్లోనే, లేదా ఎవరి ఇంట్లో అయినా దేవదారు చెక్క పెట్టె అడిగి తీసుకునేవాళ్ళం. ఓ శుభ ముహూర్తాన ఒక గొయ్యి తీసి అందులో ఆ చేక్కల్ని వేసి నిప్పంటించి పూర్తిగా నుసి కాకుండా మట్టి చల్లేవాళ్ళం. చల్లారాకా వచ్చిన బొగ్గు మామూలు కర్ర బొగ్గుతో పోలిస్తే చాలా తేలికగా ఉండేది. సిసింద్రీ తేలికగా ఎగరడానికి అన్న అంతఃసూత్రం అర్ధంయ్యాకా మన పెద్దవాలు ఎంత గొప్ప వాళ్ళో అనిపించేది.

సిసింద్రీ తయారీలో దాని పాత్ర అతిముఖ్యం. ఆ బొగ్గును బాగా ఎండబెట్టి స్కూళ్ళకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాకా కల్వం రాయిలో మెత్తగా నూరి వస్త్రకాళితం చేస్తే సుతిమెత్తని బొగ్గు వచ్చేది. అలాగే సురేకారం, గంధకం కొని తెచ్చి సూరేకారాన్ని నీళ్ళల్లో ఉడికించి చల్లారాకా కల్వం లో వేసి నూరి ఎందబెట్టి వస్త్రకాళితం పట్టేవాళ్ళం. గంధకాన్నయితే డైరెక్ట్ గా ఎండబెట్టి కల్వంలో నూరి వస్త్ర కాళితం చేసి ఆరబెట్టేవాళ్ళం. ఆరోజుల్లో ‘’సోవియట్ భూమి’’ అనే మాస పత్రిక వచ్చేది. ఆ మాసపత్రిక పాత కాపీలు సంపాదించి వాటిని చతురస్రాకారపు ముక్కలుగా చించి, మైదా ఉడకబెట్టి ఆ జిగురుతో సిసింద్రీ గుల్లలు శంకువు (కోన్) ఆకారం లో  చేసి  ఎండబెట్టేవాళ్ళం. 

బొగ్గు 7 వంతులు, సూరేకారం 2 వంతులూ, గంధకం 1 వంతు కొలతలప్రకారం ఒకే కాగితం లో కలిపితే సిసింద్రీ మందు  తయారయ్యేది. అంతే. రోజూ సాయంత్రం పాఠశాలనుంచి రాగానే  ఎండబెట్టిన సిసింద్రీ గుల్లల్లో ఆ మందు వేసి  ఒక రెండంగుళాల ఇనప మేకుతో కూరేవాళ్ళం. చివర తుపాకి బిళ్ళ ఒకటి పెట్టి గుల్ల కాగితంతోనే మూసేసేవాళ్ళం. సిసింద్రీ మొన నోటితో తుంచి కొవ్వొత్తి మంటలో గాని, వెలుగుతున్న ప్రమిద మంట మీద గాని అంటించి వెంటనే నెల మీద పడేసేవాళ్ళం.అంటే అది రకరకాలుగా తిరుగుతూ జివ్వున ఎగిరిపోతుంటే ఆ ఆనందమే వేరు. ఒక్కోసారి చుట్టూ ఆవిన్యాసాలు చూస్తున్న కుర్రాళ్ళ నిక్కర్లలోకి దూరిపోతే ఒకటే నవ్వు వాళ్ళ గింగిరాలు చూసి. ఇంట్లో తల్లితండ్రులు పిల్లలకు డబ్బులు ఇస్తే వాటితో వెయ్యి, రెండువేలు సిసింద్రీలు తయారు చేసి వంద సిసింద్రీలు అయిదు రూపాయలకు అమ్మేవాళ్ళు కొందరు.

పిల్లలకు అలా డబ్బులు ఇస్తే చెడిపోతారు అనే  అభిప్రాయం ఆరోజుల్లో తల్లితండ్రులకు చాలా ఉండేది.అందుకని డబ్బులు ఇచ్చేవారు కారు. అయతే బంధువులు ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదైనా కొనుక్కో నాయనా అని ఏకంగా ‘’పదిపైసలు ‘’ ఇచ్చేవాళ్ళు. ఇంకా చిన్నపిల్లలకి అయిదు పైసలబిళ్ళ ఇచ్చేవారు. టీనేజ్ కుర్రాళ్ళకి రూపాయి ఇచ్చేవారు. ఆరోజుల్లో ఒక రూపాయి బంధువులు ఇచ్చారంటే వాడి చాతీ ఐదు అంగుళాలు ముందుకు వచ్చేసేది.

మా అన్నయ్య మాత్రం బంధువులు డబ్బులు ఇస్తే, ఆ సాయంత్రం ‘’ఒరేయ్. ఈ నాణేలని గొయ్యితీసి పాతితే డబ్బులచెట్టు మొలుస్తుంది రా.’’ అని మమ్మల్ని బులిపించి నాకు, తమ్ముడికి, తనకి మూడు గోతులు గునపంతో పెరట్లో తవ్వించేవాడు. మాకు నమ్మకం కలిగించడం కోసం ముందుగా వాడి నాణేన్నిగోతిలో ఉంచి మట్టి కప్పి నీళ్ళు పోసేవాడు. మాచేత కూడా అలాగే చేయించేవాడు. రోజూ శ్రద్ధగా నీళ్ళు పోసేవాళ్ళం. వారం రోజులైనా మొక్కరాదే?

‘ఏమిట్రా అన్నయ్య’ అని అడిగితె ‘’బంధువులు  ఇచ్చినవి పుచ్చిపోయిన నాణేలురా. అందుకే మొక్కలు రాలేదు.’’ అని చెప్పేవాడు. ఆతర్వాత తెలిసింది.మేము గోతులలో నీళ్ళు పోసి ఆడుకోవడానికి వెళ్ళిన వెంటనే ఆ డబ్బులు వాడు తీసేసుకున్నాడని, తారాజువ్వల తయారీకి వాడుకున్నాడని.

ఇక నాన్నగారి సంగతి. ఆయనే స్వయంగా కాలవల గట్ల పక్కన ఉన్న తాటిచెట్టుల లేత మొవ్వ మట్టలు కత్తితో కొట్టుకు వచ్చి తాటాకులుగా ఎండబెట్టేవారు. ముందుగా మేము చేసిన సిసింద్రీ మందుతో టపాకాయ కాల్చడానికి అవసరమైన వత్తులు తయారుచేసి ఎండబెట్టేవారు. పటాసు, సూరేకారం, ఎలక్ట్రిక్ పౌడర్   విడివిడిగా నూరి వస్త్ర కాళితం చేసి నిష్పత్తి  ప్రకారం కలిపి నాన్నగారు టపాకాయలు కట్టి పాతికేసి తీసుకుని ఒక కట్టగా కట్టేవారు.ఆరోజుల్లో ఇంటిని ఆనుకుని ఉన్న పెద్ద బాదం చెట్టు మీదకు కోతుల గుంపు వచ్చి వారమేసిరోజులు దానిమీద గడిపి పెరడంతా పాడు చేసేవి. ఒక్క టపాకాయ వేస్తె చాలు అరకిలోమీటర్లో కోటి కనిపించేది కాదు.భయంతో పారిపోయేవి. అంత బాగా టపాకాయలు పేలేవి.

అలాగే కేజీబీడు, అరకేజీ సూరేకారం, గంధకం, కొంచెం ముగ్గు అన్నింటిని కలిపి మాతాబా గొట్టాలలో కూరి ఎందబెట్టేవారు. చిచ్చుబుడ్డి గుల్లలు కొని వాటికి మేకుతో పైన రంధ్రం చేసి ప్రతీదానికీ పైన చిన్న కాగితం అంటించి

అవి ఎండాకా ప్రతీదానిలో సిసింద్రీ మందువేసి నొక్కి పెట్టేవారు. అనంతరం మతాబులకు తయారుచేసిన మందును ప్రతీ దానిలో సగానికి కూరి ఆపైన ఒక చిన్న కాగితం అందులో ఉంచి పండుగ నాడు రాత్రి కాల్చడానికి రెడీగా పెట్టుకునేవాళ్ళం. పెరట్లోని మెత్తని మట్టిని తవ్వి ఒక గమేలాలో సిద్ధం చేసుకునేవాళ్ళం. చిచ్చుబుడ్డిలో ముందుగానే మట్టి కూరేస్తే ఆ తడికి లోపలి మతాబా మందు తడిసిపోయి చిచ్చుబుడ్డిసరిగా కాలేదని నాన్నగారు చెప్పేవారు.

అమావాస్య పూట  తలంటు పోసుకోకూడదని అమ్మ నరకచతుర్ది నాదే పిల్లలందరికీ వొంటికి నూనె రాసి నలుగు పెట్టి తలంటు పోసేది. ఆ చిన్న వయసులో గోచీలు పెట్టుకుని ఒళ్ళు నలుచుకోగా వచ్చిన పిండిని పోగు చేసి ఎదో ఒక బొమ్మ చేసి ఎవరి బొమ్మ బాగుందో అమ్మని అడిగేవాళ్ళం. తల్లికి బిడ్డలు అందరూ సమానమే. ఆమె నాయనాలనిండా వాళ్ళే. కాబట్టి ఎవరినీ నొప్పించకుండా ‘ఇక్కడ ఇలా దీద్దితె నీ బొమ్మ ఇంకా బాగుంటుంది’ అని బొమ్మలోని లోపాలను చూపించి స్నానం అయ్యాకా పండుగకు రెండు రోజుల ముందుగా చేసిన స్వీట్ తినిపించేది.

కొత్తబట్టలకు పసుపు బొట్టు పెట్టి కట్టుకుని అమ్మ, నాన్నగార్లకు నమస్కరించేవాళ్ళం.వారం రోజుల ముందే నాన్నగారు కాకరపువ్వొత్తులు, వెన్నముద్దలు, భూచక్రాలు, విష్ణు చక్రాలు, పాముబిళ్ళలు, తీగలు, పెద్ద ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, సీమటపాకాయల గుత్తులు, లక్ష్మి ఔట్లు కొని తెచ్చేవారు. వాటిని రోజూ ఎండబెట్టి  జాగ్రత్తగా ఇంట్లోకి తెచిపెట్టేది పనిమనిషి. ఆ రోజు ఉదయం అమ్మ మడి కట్టుకుని వంటలో ఆధరవులతో పాటు సగ్గుబియ్యం పాయసం, కుంచెడు (నాలుగు కేజీలు) పులిహోర, కేజీ సెనగపప్పు తో బొబ్బట్లు చేసి నాన్నగారు పనిచేసే ఆఫీసు స్టాఫ్ వారికి, ఇంటికి ఎవరు వచినా వారికి, పనిమనిషికి, బట్టలు ఉతికే  చాకలికి రెండు బొబ్బట్లు, దోసెడు పులిహోర అరిటాకులో పెట్టి మాచేత అందరికి ఇప్పించేది.వాళ్ళు సంతృప్తిగా తిన్నప్పుడు మాకు ఎంతో ఆనందం  అనిపించేది.

ఇక దీపావళి నాడు సాయంత్రం దీపాల వేళ కాబోతుండగా పెరట్లోని గోగు కాడలు పీకి వాటికి కొత్త కాటన్ తువ్వాలు ముక్కలను పెద్ద వత్తులుగా పేని శ్రేష్ఠమైన గానుగ నూనెలో తడిపి రెండేసి కాడలకు నాలుగేసి వత్తులు కట్టేది. ఇంట్లోని నలుగురు పిల్లల చేత ‘’దిబ్బు దిబ్బు దీపావళి – మళ్ళీ వచ్చే నాగుల చవితి ‘’ అని పాడిస్తూ వీధిగుమ్మం దివిటీలు కొట్టించి ఒక పక్కగా పడవేయించేది. అలా దివిటీలు కొట్టిస్తే పిల్లలకు నర ద్రుష్టి సోకదని పెద్దల నమ్మకమట. వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్లి కాళ్ళు కడుక్కోమనేది.కాళ్ళు కడుక్కున్నాకా చేసిన స్వీట్ తినిపించేది. కాటన్ బట్టలు ఇచ్చేది బాణసంచా కాల్చడానికి.

మేము బట్టలు కట్టుకుని స్లిప్పేర్స్ వేసుకుని రెడీ అయ్యేలోపుగా తానూ దేవునిదగ్గర సాయంత్రం దీపం వెలిగించి వచ్చాకా  బాణసంచా సామాను మా నలుగురు పిల్లలకు సమానంగా పంచేది. సాయంత్రం సుమారు ఆరున్నరకు మొదలుపెట్టిన వాళ్ళం రాత్రి పది అయినా మా పళ్ళాల లోని సామాను సగం కూడా అయ్యేది కాదు. చిచ్చుబుడ్లకు అడుగున నాన్నగారు మట్టి బలంగా కూరి ఇచ్చేవారు. తమ్ముడు నేలమీద పెట్టి వెలిగించేవాడు. నిలిచి  మూడు నిముషాలు సగం కొబ్బరి చెట్టు ఎత్తుకు మెరుపులతో వేలిగేవి.

మొదటిసారి భయం, ఆశ్చర్యం.నాన్నగారు చిచ్చుబుడ్డి వెలిగించి కుడి బొటనవేలు, చూపుడువేలు-మధ్యవేళ్ళతో అడుగున గట్టిగా పట్టుకుని వెలుగుతున్న దానిని ఏటవాలుగా ఆకాశంలోకి తిప్పుతున్న దృశ్యం నా జీవితంలో మరువలేనిది.

‘’మగవాడికి భయం  అన్నది ఉండకూడదు. సాధన ఉంటె సాధించలేనిది లేదు.’’ అని ఎలా పట్టుకోవాలో ఎలా వెలిగించాలో, వెలిగించాకా ఆ నిప్పు ముత్యాలు మీదకు రాకుండా ఎలా తిప్పాలో అన్నీ నేర్పించారు. అప్పటివరకు నేలమీద వెలుగుతున్న చిచ్చుబుడ్డిని చూసి ఆనందించిన నేను రెండు చేతులతో రెండు చిచ్చుబుడ్లు ఒకేసారి వెలిగించి గాలిలో తిప్పుతుంటే నా స్నేహితులందరూ ఆశ్చర్యంతో వింతగా చూడటం నాకెంతో సంతోషమనిపించేది.అదేపని నా పిల్లలు ధైర్యంగా చేసినప్పుడు తండ్రిగా ఆనందించాను.

సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం చేసిన బాణాసంచాకార్యక్రమము రాత్రి పదిగంటలవరకు కాల్చినా ఇంకా సగం మిగిలేవి. వాటిని భద్రంగా దాచి కార్తీక మాసంలో ప్రతీరోజు సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించాకా రెండేసి వస్తువులు అమ్మ దగ్గరుండి  కాల్పించేది.అలా అవి నాగులచవితి నాటికి పూర్తయ్యేవి.

అలా ప్రతీ సంవత్సరం దీపావళి ఆనాటి మా తరంలో నిత్యవసంత జ్ఞాపకాల పండుగగా మిగిలిపోయింది. పాఠకులందరికీ దీపావళి శుభాకాంక్షలతో...సర్వేజనా సుఖినోభవంతు.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు