ఎందరో మహానుభావులు - అందరికీ వందనాలు - భమిడిపాటి ఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ వారం ( 25/10 – 31/10 ) మహానుభావులు

జయంతులు.

అక్టోబర్ 25
శ్రీ తోటకూర వెంకట రాజు :  T V Raju  గా ప్రసిధ్ధి చెందిన వీరు, అక్టోబర్ 25, 1921 న రఘుదేవపురం లో జన్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు. ఎన్నో తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. 50 కి పైగా తెలుగుచిత్రాలలో అద్బుతమైన బాణీలు కూర్చారు.. “ జయ కృష్ణా ముకుందా మురారీ ..” పాట 50 సంవత్సరాల తరువాత కూడా అందరి కీ  ఓ మధుర జ్ఞాపకమే…

అక్టోబర్ 27
శ్రీ చలసాని ప్రసాద రావు :  వీరు అక్టోబర్ 27, 1939 న భట్ల పెనుమర్రు లో జన్మించారు. ప్రముఖ రచయిత , చిత్రకారుడు.  ఎన్నో ఏళ్లుగా తనలో నిబిడీకృతంగా ఉన్న చిత్రకళా సాహిత్యం మీద తన సర్వశక్తులూ కేంద్రీకరించి తెలుగులో చిత్రకళాసాహిత్యం లేని లోటు తీర్చారు. 1961లో వీరి సంపాదకత్వలో ‘కళ’ తొలి సంపుటి వెలుగు చూసింది. నిర్దిష్ట ప్రణాళికతో ప్రతి రెండేళ్లకు ఒక ‘కళ’ సంపుటి వంతున 1973నాటికి ఆరు సంపుటాలు ప్రచురించి కళాప్రియులకు తరగని సంపదనందించారు.

అక్టోబర్ 28
శ్రీమతి సూర్యకాంతం :  వీరు అక్టోబర్ 28, 1924 న వెంకటకృష్ణరాయపురం లో జన్మించారు. వీరి గురించి తెలియని తెలుగువారుండరు.. తెలుగు చలనచిత్రాలలో గయ్యాళి / అత్తగారి పాత్రలకుజీవంపోసినమహానటిహాస్యనటీమణిగా ముద్ర వెయ్యడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనే అనాలి. గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది.

అక్టోబర్ 29
శ్రీ నాయని సుబ్బారావు :  వీరు అక్టోబర్ 29, 1899 న పొదిలి లో జన్మించారు. తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు . ఆకాశవాణి కేంద్రంలో ఆయా ప్రసారాలకు అవసరమయ్యే విషయాలను వ్రాసే పనిని చేపట్టారు. ఎక్కువగా గ్రామస్థుల కార్యక్రమాలకు వ్రాస్తుండేవారు.

అక్టోబర్ 31
శ్రీ కొటారి కనకయ్య నాయుడు :  C K Nayudu  గా ప్రసిధ్ధిచెందిన వీరు, అక్టోబర్ 31, 1895 లో నాగపూర్ లో జన్మించారు. భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్. పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు మరియు 1933లో విస్‌డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నారు. 1955లో భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అందుకున్నారు. భారత క్రికెట్ చరిత్రలో రెండు దశాబ్దాలు (1916-1936) నాయుడు యుగం గా ప్రసిద్ధి గాంచాయి

వర్ధంతులు

అక్టోబర్ 25
శ్రీ సాలూరు రాజేశ్వరరావు :  తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించి, తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకులలో ఒకడు. ఎన్నో అజరామరమైన వెండితెర వెలుగులకు సంగీతపు మధురిమలు అందించినవారిలో ఆయనకు ప్రత్యేక స్థానముంది. శాస్త్రీయ సంగీత బాణీలు, కర్ణాటక హిందుస్తానీ రాగాలలో యుగళ్‌ బందీలు, పాశ్చాత్య సంగీత రూపాలు, … ఇలా చేపట్టిన ఏ ప్రక్రియలోనైనా అద్వితీయమైన సంగీతాన్ని విన్పించారు. అనేక సంగీత రీతుల్ని సమన్వయం చేయడంలో ఆయన సాధించిన విజయాలు మరెవ్వరూ సాధించలేదు. . వీరు అక్టోబర్ 25, 1999 న స్వర్గస్థులయారు.

అక్టోబర్ 27
శ్రీ కొసరాజు రాఘవయ్య చౌదరి : ప్రముఖ సినీ గేయ రచయిత. తెలుగు సినిమా పాటల రచయితగా వీరిది ప్రత్యేకపీఠం. ఆ రోజుల్లోని చాలా చిత్రాలు కొసరాజు ముద్రని బాగా వాడుకున్నాయి. వ్యంగ్యం, హాస్యం మిళాయించిన పాట ఒకటి చిత్రంలో వుండాలి, అది రాఘవయ్య చౌదరిగారు రాయాలి - అని అప్పట్లో సినిమా జనాలకు ఒక సూత్రం ఉండేది. ఆ సూత్రానికి తగ్గట్టుగానే  వారు వందలాది గీతాసుమాల్ని గుచ్చి ప్రకాశ పరిమళభరితం చేశారు..వీరు  అక్టోబర్ 27, 1986 న స్వర్గస్థులయారు.

అక్టోబర్ 28
శ్రీ గోవిందరాజుల సుబ్బారావు :  తెలుగు సినిమాలలో, నాటకాలలో తొలితరం నటుడు. నాటక రంగంపై కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లుగా, సినిమా రంగంలో మాలపిల్లలో సుందర రామశాస్త్రి పాత్రలోనూ, బాలనాగమ్మలో మాయల మరాఠీగానూ ప్రఖ్యాతుడయ్యారు. వీరు అక్టోబర్ 28, 1959 న స్వర్గస్థులయారు.

అక్టోబర్ 29
శ్రీ ఘంటసాల బలరామయ్య :   సుప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకులు. 1940లో ప్రతిభా పిక్చర్స్ సంస్థను నెలకొల్పి పార్వతీ కళ్యాణం సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. తరువాతి కాలంలో చిత్ర నిర్మాణం మరియు దర్శకత్వం రెండు నిర్వహిస్తూ గరుడ గర్వభంగం (1943), సీతారామ జననం (1944), ముగ్గురు మరాఠీలు (1946), బాలరాజు (1948), శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి మరియు చిన్న కోడలు (1952) మొదలైనవి తయారుచేశారు. తోటివారిలో పోటీపడి శ్రీ లక్ష్మమ్మ కథ చిత్రాన్ని కేవలం 19 రోజులలో నిర్మించి విడుదల చేశారు. వీరు అక్టోబర్ 29, 1953 న స్వర్గస్థులయారు.

అక్టోబర్ 30
శ్రీ వడ్డాది పాపయ్య :  . ప్రాచీన సాహిత్యాన్ని అకళింపు చేసుకొని తన కుంచెకు సాహితీ సౌరభాన్ని పులిమి చిత్రాలను చిత్రించిన ప్రత్యేక చిత్రకారుడు . ఈయన బొమ్మలు కేవలం రసాత్మకంగానే ముగిసిపోక రస జగత్తును అధిగమించాయి. లాలిత్యం కంటే గాంభీర్యం, అనుభూతి కంటే ఆలోచన ఎక్కువ.  వీరు అక్టోబర్ 30, 1992 న స్వర్గస్థులయారు.

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి