( ధర్మస్థళ , కుకి సుభ్రమణ్య )
బెంగుళూరు కి సుమారు 300 కిలోమీటర్ల దూరంలోనూ మంగళూరుకి సుమారు 100 కిలోమీటర్ల దూరంలోనూ వున్న ధర్మస్థళ మంజునాధ ‘ కోవెల గురించి తెలియజేస్తాను .కర్నాటక రాష్ట్రం లో దక్షిణ కన్నడ జిల్లాలో వుంది ధర్మస్థళ వూరు . దక్షిణ కన్నడ జిల్లాకి చాలా సముద్రతీరం వుండడం వల్లను , పశ్చిమ కనుమలలో వుండడం వల్లనూ యిక్కడ వర్షపాతం చాలా యెక్కువనే చెప్పాలి , ఏ కాలమైనా రోజులో రెండుమూడు గంటలు వాన పడక తప్పదు . ఇక్కడ బయటకు వెళ్లే ప్రతీవారూ గొడుగు తప్పక తీసుకు వెళతారు .చాలా భాగం కొండలపై ప్రయాణం , వర్షపాత ప్రాంతం కాబట్టి యీ కొండలపై దట్టమైన అడవులు వున్నాయి , అక్కడక్కడ కృూరమృగాలు వున్నట్లుగా అక్కడక్కడ కనిపించే బోర్డుల ద్వారా తెలుస్తూ వుంటుంది . కీకారణ్యాలు అంటే యిలాగే వుంటాయేమో అనేంత దట్టమైన అడవులు . ఎన్నో రకాలైన పరాన్నబుక్కులను ( ఆర్కిడ్స్ ) లను చూడొచ్చు . నిత్యం కురిసే వర్షాలవల్ల నివాస స్థలాలపై మొలచిన మొక్కలను కూడా చూడొచ్చు .ప్రాశాంతమైన పరిసరాలలో సాగుతుంది ప్రయాణం . ఊరు మొదలులోనే బస్సు స్టాండు .ప్రతీరోజూ 20 వేలకి తక్కువలేకుండా వుండే భక్తులు .ఇక్కడ కోవెల గురించి కాకుండా వూరు గురించి కోవెల ట్రస్టు గురించి మనంముఖ్యంగా తెలుసుకోవాలి .
మంజునాధ మందిరంశైవమందిరం , గర్భగుడిలో శివుడు మంజునాధుడిగా పూజలందుకుంటున్నాడు .శివ మందిరంలో శైవులు , విష్ణుమందిరంలో వైష్ణువులు పూజలు చేసుకోడం చూస్తాం , కాని యిక్కడ గత 800 ఏళ్లగా జైనమతస్థుల ఆధ్వైర్యంలో మందిరం వుండడం ఓ విశేషయమైతే , మర్థ్వ పూజారులు శివకోవెలలో పూజారులుగా వుండి నిత్య పూజలు నిర్వహించడం మరో విశేషం . ఈ కోవెలను గురించిన వివరాలు యే పురాణాలలోనూ లేవు , కాని ఈ మందిరంలో న్యాయంకోరి వచ్చిన వారికి మంజునాథుడు న్యాయం చేస్తాడని భక్తుల నమ్మకం , అదే కాదండోయ్ యీ మందిర ధర్మకర్త ప్రతీరోజూ వచ్చి స్వయంగా అక్కడి పనులు పర్యవేక్షిస్తారు , కోవెల వెలుపలి ప్రాకారంలో ట్రస్టు వారి ఆఫీసు దగ్గర ఓ చిన్నగది వుంటుమది , అక్కడ యాత్రీకులకు యేకారణం వల్లనైనా రొక్కం అవుసర పడితే యెటువంటి పూచీకత్తు లేకుండా కావలసిన రొక్కం యిస్తారు , అలా రొక్కం తీసుకున్న యాత్రీకుడు సొమ్ముని తిరిగి మందిర ట్రస్టువారికి పంపించెస్తారు , ఇంతవరకు యివ్వకుండా యెగవేసినవారే లేరట , వింతగా లేదూ ? డబ్బు విషయంలో స్వంత భార్యాబిడ్డలే మోసం చేసే కాలంలో యే పూచీకత్తు లేకుండా డబ్బులివ్వడమే వింతగా వుంటే ఆ డబ్బులు తీసుకున్నవారు తిరిగి పంపించెయ్యడం మరీవింత . ఈ మందిరనిర్మాణం జరిగినప్పటినుండి యిదే ఆచారంగా వస్తోంది .
ధర్మస్థల మందిరంలో శివుడు , మంజునాధ , అమ్మవారు , నాలుగు ధర్మదేవతలు , కాలరాహు ,కలర్కాయి , కుమారస్వామి , కన్యాకుమారిలకు వేరేవేరే మందిరాలున్నాయి . ఈ కోవెలలోకి ఆడవారు సంప్రదాయ దుస్తులతోనూ మగవారుషర్టు లేకుండానూ దర్శనానికి వెళ్లవలసి వుంటుంది
గర్భగుడి పురాతనంగా వుంటుంది కాని మిగతా కట్టడాలు చాలా కొత్తగా వున్నాయి .
ముందుగా మనం చెప్పుకున్నట్లు యీ మందిరాన్ని గురించిన వివరణ పురాణాలలో లేదు . ఈ మందిరం తాలూకా చరిత్ర 800 సంవత్సరాలపాతది . ఆ కథేమిటో తెలుసుకుందాం . 800 సంవత్సరాల క్రిందట కుడుమ అనే గ్రామంలో ‘ పర్గాడే ‘ అనే జైనమత ధనవంతుడు అతని భార్య అమ్ము బాలల్త్తి ‘ నీలాది బీడు ‘ అనే యింట్లో నివసించేవారు . ఒకనాడు ధర్మదేవతలు భూమిమీద ధర్మాన్ని కాపాడే ధర్మపీఠస్థాపనకై భూలోకానికి వచ్చి బ్రాహ్మణ వేషాలలో తగిన ప్రదేశంకొరకు అన్వేషించసాగేరు . అలా తిరుగుతున్న ధర్మదేవతలు కుడుమ గ్రామానికి రాగా పర్గాడే దంపతులు వారికి సకలమర్యాదలు చేసి భోజనవసతులు కల్పించేరు . వారి శ్రద్దకు మెచ్చిన ధర్మదేవతలు పర్గాడే కలలో కనిపించి తాము వచ్చిన పని గురించి చెప్పి ధర్మపీఠ స్థాపనకు సరైన ప్రదేశం ‘ నీలాది బీడు ‘ అని చెప్పగా పర్గాడే మరునాడే నీలాద్రి బీడు ను ఖాళీ చేసి వేరే యింటికి వెళ్లపోయి నీలాద్రిబీడును ధర్మపీఠంగా మార్చి ధర్మదేవతల విగ్రహాలు ప్రతిష్టించి పూజలు చెయ్యసాగేడు , కాని పర్గాడే మనస్సులో యెన్నో సందేహాలు తన వొక్కడి వల్లా ధర్మపీఠం పనులు జరుగుతాయా ? సహాయకులు ధర్మబుధ్దితో వుంటారా ? తన తదనంతరం ధర్మపీఠం బాధ్యతలు చేపట్టేది యెవరు ? , తన సంతతివారు తనంత నిష్ఠగా కాపాడతారా ? , యిలాంటి ఆలోచనలతో సతమతమయేవాడట , ఓ రోజు ధర్మదేవతలు అతని కలలో వచ్చి ధర్మపీఠం పనులలో మంచి ప్రవర్తన కలిగిన యిద్దరిని సహాయకులుగా నియమించుకోమని , మరో నలుగురిని ఉప సహాయకులుగా నియమించుకొని ధర్మ సంస్థాపన చెయ్యమని , తమ నలుగురు పర్గాడే సంతతికి సహాయపడుతూ వుంటామని చెప్తారు , ధర్మపీఠంలో శివలింగ స్థాపన చెయ్యమని చెప్తారు . మతపరమైన గొడవలు తలెత్తుతాయేమో ననే పర్గాడే సందేహనికి తాము యెల్లవేళలా అతని కుటుంబానికి హానికలుగకుండా చూసుకుంటామని హామీ యిస్తారు .హిందూ మతం గురించి తెలియని ‘ పర్గాడే ‘ శివలింగం యెక్కడనుంచి తేవాలని ఆలోచిస్తూ వుంటే అతని వద్ద పనిచేసే ‘ వాసల్ అన్నప్ప స్వామి ‘ తాను శివలింగం తెస్తానని వెళ్లి ‘ కదరి ‘ లోని ‘ మంజునాథ ‘ కోవెలలోని శివలింగాన్ని తెచ్చి అంతర్ధనామయ్యాడట , ధర్మదేవతల మధ్యన శివలింగ ప్రతిష్ట చేసేడట పర్గాడె . శివలింగం చుట్టూరా మందిర నిర్మాణం చేసి మంజునాథ మందిరంగా పిలువసాగేరు .
పదహారవ శతాబ్దంలో అప్పటి ధర్మాధికారి శ్రీదేవరాజ హెగ్డే ఉడిపి లోని వైష్ణవ స్వామీజీ శ్రీ వదిరాజ స్వామిని ఆహ్వానించగా స్వామి మందిరాన్ని దర్శించుకొని భిక్ష స్వీకరించకుండా వెళ్లిపోతూ వుండగా దేవరాజహెగ్డే కారణం అడుగగా మందిరంలోని శివునికి వేదశాస్త్ర ప్రకారం ప్రతిష్ఠ జరుగలేదని అందుకే తాను భిక్ష స్వీకరించనని చెప్తాడు . దేవరాజహెగ్డే తనకు వేదశాస్రాలు తెలియవని స్వామివారినే ఆవిధులను నిర్వర్తించవలసినదిగా కోరుతాడు . స్వామివారు ధర్మాధికారి ద్వారా నిర్వహింపబడుతున్న న్యాయబధ్దమైన పనులను చూసి ప్రసన్నుడై ఆ ప్రదేశానికి ధర్మశ్థళ గా పేరుపెట్టి కోవెలలోని నిత్యపూజలకొరకు తన శిష్యులను నియమిస్తాడు , ఆనాటినుంచి నేటి వరకు యిక్కడ పూజాదులు వైష్ణవ పూజారులు నిర్వహిస్తున్నారు . ప్రతీ సంవత్సరం కార్తీక మాసంలో జరిపే లక్షదీపోత్సవం చాలా ప్రాముఖ్యత పొందింది . ధర్మాధికారి పదవి పర్గాడే ( కాలాంతరంలో యిది హెగ్డేవార్ గా మారింది ) వంశంలో మొదటి మగ సంతతికి చెందుతుంది . ప్రస్తుతం వున్న ధర్మాధికారి 21 సంతతికి చెందిన వీరేంద్ర హెగ్డె . ఇతను ప్రతీరోజూ అతని దగ్గరకు వచ్చే వందల క్రిమినల్ , సివిల్ తగాదాలకి తీర్పులిస్తారు . అతనిచ్చే తీర్పులు చాలాన్యాయంగా వుంటాయని ప్రజలనమ్మకం . ధర్మస్థళ ధర్మాధికారి అంటే సాక్షాత్తు శివుడే అని , అతని సహాయకులు ధర్మదేవతలని అంటారు .
ఈ మందిరానికి ప్రతీరోజూ సుమారుగా 20వేల పర్యాటకులు వస్తూవుంటారని అంచనా , అయితే యిక్కడ యే రెస్టరాంట్లు గాని భోజన హోటల్స్ కాని వుండవు . మేం యీ కోవెలని దర్శించుకున్నప్పుడు యిక్కడ వసతి మందిరం ట్రస్ట్ ద్వారా నడపబడుతున్న సత్రం లు తప్ప మరేవీ లేకపోవడంతో తప్పక వాటిలో దిగేం కాని అక్కడ వసతులు చాలా నీటుగా వుండడం ఆశ్చర్యాన్నిచ్చింది . అలాగే భోజనం కోసం రెస్టొరాంట్స్ కోసం తిరిగేం , ప్రతీవాళ్లూ మందిరంలో ఉచితభోజనం దొరుకుతుందంటే యెలా వుంటుందో అని అక్కడకి వెళ్లక బయటతిరిగేం యెక్కడా భోజనం దొరకకపోతే అప్పుడు ఉచిత భోజనం చెయ్యడానికి వెళ్లేం , ఆ భోజనం రుచి వంటశాల శుభ్రత , వడ్డించే వారి శ్రద్ద చాలానచ్చింది . తిరుపతిలోని ఉచితభోజన పథకం మీద చాలా కంప్లైంట్స్ వుండేవి . కాని ధర్మస్థళ లో భోజనం గురించి యెప్పుడూ కంప్లైంట్స్ రాలేదు .
1972 నుంచి ప్రతీ సంవత్సరం యీ ట్రస్టు ద్వారా సామూహిక వివాహాలు జరుపబడుతున్నాయి , సుమారుగా పదివేల వివాహాలు జరుగుతున్నట్లుగా అంచనా , పెళ్లి బట్టలు , మంగళ సూత్రాలు ట్రస్టు వారే యేర్పాటు చేస్తారు .మందిర ట్రస్ట్ వారి ఆధ్వైర్యంలో సుమారు 25 విద్యాసంస్థలు నడుపబడుతున్నాయి , ఇందులో గురుకులం నుంచి ఇంజనీరింగ్ , మెడికల్ , బిజినెస్ మేనేజ్ మెంట్ మొదలయిన కాలేజీలు వున్నాయి . సిద్దవన గురకులంలో సుమారు 250 మందికి ఉచిత నివాస భోజనాదులిచ్చి విద్య బోధిస్తున్నారు .వచ్చేవారం ధర్మస్థళ లోని మరికొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం , అంతవరకు శలవు .