ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే జీవంతో ప్రేమ వ్యవహారం - ..

The spiritual process is a love affair with life

కొంతకాలం క్రిందట సింగపూర్ లో ఒక పెద్ద మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ అధ్యాపకులను ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. నేను ఒక కార్యక్రమం నుంచి మరో కార్యక్రమానికి పరుగెడుతుంటాను కాబట్టి, అక్కడకు వెళ్లే ముందు ‘నేను ఈ సభలో దేని గురించి మాట్లాడాలి?’ అని వారిని అడిగాను. వారు “లీడర్షిప్ కు సంబంధించినదేమైనా” చెప్పమన్నారు.

నేను ఆ కాలేజీలో ప్రసంగించడానికి వెళుతున్నప్పుడు, నేను నా బొమ్మతో ఉన్న ఒక పోస్టరు చూశాను. దానిలో ఏముందంటే ‘నాయకత్వం గురించి ఇండియా నుంచి వచ్చిన ఒక వక్త స్ఫూర్తిదాయకంగా మాట్లాడుతారు’ అని ఉన్నది. దానితో ఏదైనా చేయడానికి మనిషికి స్ఫూర్తినిచ్చేవి ఏవి? అసలు మనిషికి స్ఫూర్తి ఎప్పుడు, ఎందుకు అవసరం అవుతుంది? అని ఆలోచిస్తే, మీకు ఏదైనా నిజంగా చేయాలని లేకపోతేనే, మీకు స్పూర్తి అవసరమవుతుంది. మీరు నిజంగా ఏదైనా చేయదలుచుకుంటే మీకు మరొకరు ఇచ్చే స్ఫూర్తి అవసరం లేదు, కదా? ఉదాహరణకి ఇప్పుడు మీరు భోజనం చేయాలనుకుంటే, దానికి స్ఫూర్తి కావాలా? అక్కర్లేదు. కానీ మీలో కొందరికి, రేపు ఉదయం లేచి, మీ సాధన చేయటానికి, స్ఫూర్తి అవసర పడవచ్చు.

ప్రజలు ఎంతో స్ఫూర్తితో ఉంటే, వారు ఎన్నో గొప్ప పనులు చేయగలరు. అలాగే వారు మూర్ఖపు పనులు కూడా చేయవచ్చు. ఈ స్ఫూర్తి అనేది ఎప్పుడు వివేకమైనది కాకపోవచ్చు. మీరు ఏదైనా చాలా నిర్దిష్టమైనది, అవసరమైనది చేయాలనుకుంటే, మీకు మరింత వివేకం, ఏకాగ్రత ఉన్న మనుషులు కావాలి. వారికి ఎవరూ స్ఫూర్తిని ఇవ్వక్కరలేదు. ‘నేను చేయవలసిన ఇది’ అని వాళ్లకి స్పష్టంగా తెలియాలి. ఏమి చేయాలో అనేది స్పష్టంగా తెలిసి ఉంటేనే, ఎవరి నుంచో స్పూర్తి పొందిన వారి కంటే, ఆ పనిని చేయగల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఏదో చిన్న చిన్న పనులకై, మనం కొంతమందికి స్ఫూర్తిని కలిగించటం మంచిదే. కానీ, దీర్ఘకాలం పట్టే పనులు, దానిని నిజంగా పూర్తి చేయాలనే తపన ఉన్న వారి ద్వారానే అవి జరుగుతాయి.

లౌకికం, ఆధ్యాత్మికం: వాటిలో తేడా ఏమిటి?

లౌకికునికి, ఆధ్యాత్మికునికి ఉన్న తేడా ఇదే: లౌకికుడు అంటే, కుక్క లాంటి వాడు. పందెం గెలవడానికి ఎండిన ఎముక ముక్కను కుక్కకు ఆశ చూపుతారు, ఆ ఆశతో కుక్క వేగంగా పరిగెడుతుంది. కానీ అది ఎప్పుడూ దానిని అందు కోలేదు. అలాగే బాహ్య పరిస్థితులు ఎప్పుడూ లౌకికునికి చురకలు వేస్తూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మికునికి బయట పరిస్థితుల ప్రోద్బలం అక్కర్లేదు. ఎందుకంటే అతడికి నిజంగా కావలసింది అతడే చేస్తాడు.

ఆధ్యాత్మిక ప్రక్రియ మరింత మేధతో జీవిచడం అవుతుంది , ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే మీరు సృష్టికర్త మేధస్సుతో అనుసంధానం అయి ఉన్నారు. మీరు ఎంత గొప్పగా ఆలోచించగల వారైనా, సృష్టికర్త మేధస్సుతో, మీరు సరి తూగలేరు. మీరు ఎంత గొప్పగా ఆలోచించగల వారైనా, ఈ శరీరాన్ని నిర్మించిన, బురదలో నుంచి పువ్వులు తయారు చేస్తున్న, మన్నుని ఆహారంగా చేస్తున్న, ఆహారాన్ని మానవ శరీరంగా చేస్తున్న, అదే మన శరీరాన్ని మళ్లీ మట్టిలోకి చేరుస్తున్న, భూమిని గుండ్రంగా తిప్పుతున్న, నక్షత్ర మండలాలను నడుపుతున్న, సృష్టికర్త మేధస్సుతో సరి తూగలేరు.  ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే జీవితాన్నుంచి దూరంగా పోవడం కాదు. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే జీవంతో ప్రేమలో పడటం  మీరు ఎన్ని ఫార్ములాలు కనిపెట్టినా, ఎన్ని సమీకరణలు కనిపెట్టినా, అవన్నీ ఈ సృష్టికి మూలమైన ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవ టానికి చేసే ప్రయత్నాలే. మీరు శాస్త్రంగా భావించేది సృష్టికర్త మేధస్సుని అర్థం చేసుకునే ప్రయత్నమే. మీరు సాంకేతికత అనేది కూడా అప్పటికే ఉన్న సృష్టికర్త సాంకేతికతను, ఏదో కొంత అర్థం చేసుకునే చిన్న ప్రయత్నమే. అందుకే మీరు మానవుని తెలివి తేటలు అనుకునేది ‘తర్క బద్ధమైన తెలివి’ అనుకునేది, సృష్టికి కారణమైన మేధస్సు సరిపోల్చ తగినది కాదు. మీరు ఆ సృష్టికి కారణమైన మేధస్సు తో ఒకటిగా కావటానికి సుముఖులైతే, అప్పుడు మీరు ఆధ్యాత్మికులు.

సామాన్యంగా లౌకిక జీవితం అటువంటి మేధస్సు తో అనుసంధానంలో ఉండదు. మరి అది తప్పా, అంటే? మీరు భోజనం చేయటం, బట్టలు వేసుకోవడం, ఉండటానికి ఒక ఇల్లు కట్టుకోవడం, ఇంకా అదీ, ఇదీ చేయడం తప్పా? అంటే. అది కాదు అసలు విషయం. మీరు ఈ చిన్న చిన్న వాటిని ముఖ్యం చేసుకోవడం అనేది తెలివి తక్కువ తనం. మేమూ ఇల్లు కట్టుకుంటాము, మేమూ బట్టలు వేసుకుంటాము, మేమూ భోజనం చేస్తాము, ఇవన్నీ ఎందుకు చేస్తామంటే మేము బ్రతకాలి అనుకుంటున్నాము, సంపూర్ణంగా బ్రతకాలి అనుకుంటున్నాము. బ్రతకటమే కాదు మేము ఈ జీవనం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నాము.

మీరు జీవివం అనే పండు యొక్క పైతొక్క మాత్రమే తింటుంటే, అది తెలివి తక్కువ తనం అవుతుంది. ఆధ్యాత్మికత అంటే, జీవం అనేపండు పై తొక్కనే కాక, ఫలం మొత్తాన్ని, దాని మూలాన్ని అందుకోవటం. దానిని రుచి చూడటమే కాదు, ఆ అనుభూతిని సంపూర్ణంగా అనుభవించాలనుకుంటాం. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే జీవంతో ప్రేమ వ్యవహారం . ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే జీవితాన్నుంచి దూరంగా పోవడం కాదు. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే జీవంతో ప్రేమలో పడటం. అది జీవంతో తిరుగులేని విధంగా ప్రేమలో పడటం. అసలు దాని అవసరం ఏమిటి? ఎందుకంటే బ్రతకటానికి అది మరింత తెలివైన విధానం. ఏ మానవుడూ, తెలిసి తెలిసి మూర్ఖంగా బ్రతకాలి అనుకోడు. వేషాలు వేసేవాడు కూడా, తన తెలివిని ప్రదర్శించడానికే, ఆ పని చేస్తున్నాడు. కానీ సృష్టిలో మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనుకుంటే, మీరు అలా ఆలోచిస్తే, జీవితాన్ని మీరు అలా అనుభూతి చెందితే, అప్పుడు మీరు తెలివి అనుకునేది, మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

ఒక ఆధ్యాత్మిక ఉపదేశం అంటే, ఆ సృష్టికర్త తెలివి తేటలను మీలో రేకెత్తించి, పైకి తీసుకు వచ్చి, దానిని మీరు పనిచేసేలా చేయడం. మీరు మీ తెలివి తక్కువ బుర్రను ఉపయోగించకండి. ఒకసారి ఇలా జరిగింది ఫ్రెంచ్ విప్లవం అయిన తర్వాత, మనిషి తలలను నరికి వేయడానికి ‘గొల్లోటిన్’ అనే యంత్రాన్ని తయారు చేశారు. వారు ఆ యంత్రాన్ని తయారు చేశారు కాబట్టి, దానిని తరచుగా వాడాలనుకున్నారు. తల ఎక్కడ చూసినా, దానిని నరికి వేయాలి అనుకున్నారు. ఒకరోజు న్యాయవాది, ఒక ప్రీస్ట్, ఒక ఇంజనీరు, ఈ ముగ్గురినీ, మరణశిక్ష అమలు చేయడానికి తీసుకువచ్చారు. వారు ముందు ఆ లాయర్ని, బల్ల మీద పడుకోబెట్టి, ముసుగు కప్పి, కత్తి లాగారు, కానీ అది పడలేదు. అంటే ఆ సాంకేతికత అక్కడ పని చేయలేదు. అక్కడి చట్టప్రకారం, వారు వ్యక్తిని ఒక్కసారిగా చంపి వేయాలి, కానీ అతనిని వేచి ఉంచడం అనే హింసకి గురి చేశారు, అయినా శిక్ష అమలు కాలేదు. అంటే రేపు అతను లాయర్ కాబట్టి తమ మీదే ఫిర్యాదు చేయవచ్చు. అందువల్ల వారు అతనిని వదిలేశారు. తర్వాత ఆ ప్రీస్ట్ బల్ల మీద పడుకోబెట్టి, కత్తి లాగారు, అయినా ఏమీ జరగలేదు. అందువల్ల వారు ఇదేదో భగవంతుని లీల అనుకొని అతనిని కూడా వదలి పెట్టేశారు. ఇక ఇంజనీరు ముసుగు లేకుండానే మరణశిక్ష అమలు చేయించు కుంటానన్నాడు. అతను వెల్లకిలా పడుకొని, పైకి చూస్తూ, ఈ మెషిన్ ఎందుకు పని చేయడంలేదో తెలుసున్నాను, చెప్పనా అన్నాడు.

మనిషి తెలివి ప్రస్తుతం ఇలానే పనిచేస్తోంది. ఇది అన్నింటిలోనూ, మనలోనూ ఉన్న సృష్టి మూలం యొక్క మేధస్సుకు, వక్ర రూపము. మీరు కాస్త గమనిస్తే, అన్నింటిలోనూ, మీరు తినే ఆహారంలోనూ, మీరు పీల్చేగాలిలోనూ, మీరు నడిచే భూమి మీదా, సృష్టికర్త హస్తం మీరు చూడగలరు. మనిషి చేయగల అతి తెలివైన పని, ఆ తెలివితో మిళితం అవటం, సృష్టి కర్త పనిని వికృతం చేయకుండా ఉండడం. మరి ఇలా చేస్తే నేను నా జీవితాన్ని జీవించగలనా? కావాల్సింది చేయగలనా? అంటే, మీరు కేవలం సృష్టికర్త యొక్క తెలివితో ఉంటే, మీరు సృష్టికర్త యొక్క హస్తాన్ని వికృతం చేయకుండా, మీకు కావలసింది చేయగలరు. మీరు సృష్టికర్త యొక్క తెలివితో అనుసంధానం కాకుండా ఉంటే, మీది ప్రత్యేకమైన తెలివి అవుతుంది. కానీ, ఈ సృష్టి అటువంటి వాటికి అవకాశం ఇవ్వదు.

ఒక  ఆధ్యాత్మిక ఉపదేశం అంటే, ఆ సృష్టికర్త తెలివి తేటలను మీలో రేకెత్తించి, పైకి తీసుకు వచ్చి, దానిని మీరు పనిచేసేలా చేయడం. మీరు మీ తెలివి తక్కువ బుర్రను ఉపయోగించకండి. దీని అర్థం, నేను మీ తెలివితేటలకు వ్యతిరేకం అని కాదు. ఈనాడు ఈ ప్రపంచంలో ఎంతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేది ఉన్నది మీ కంప్యూటర్లు ఎంతో తెలివిగలవి అవుతున్నాయి. కానీ ఏ కంప్యూటరూ, ఎప్పటికీ ఒక మనిషికి సరితూగ లేవు. భవిష్యత్తులో మీరు చేస్తున్న అన్ని పనులూ చేయగల కంప్యూటర్ తయారు కావచ్చు. కానీ, ఆ కంప్యూటర్ కూడా, మానవుని మూర్ఖత్వంతో సరితూగ లేవు. అందుకే, మనం ఎప్పుడు సరి పోల్చదగిన వారం కాదు.

తెలివితో సమస్య లేదు. ఉన్న సమస్యల్లా, మీరు మీది ప్రత్యేకమైన తెలివితేటలు అనుకోవడమే. ఒకే తెలివితేటలు అనుకోవట్లేదు. యోగా అనే మాటకు అర్థం ‘ఐక్యం’. ఐక్యం అంటే ఏకత్వం. అంటే, మీలోని తెలివి తేటలు, మీలోనూ, అన్నింటిలోనూ ఉన్న, ఈ సృష్టికి మూలమైన తెలివితేటలను వికృతం చేయకుండా ఉండడం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

ఇషా ఫౌండేషన్ సౌజన్యం తో..  

 

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి