మొగ్గలు పుస్తకసమీక్ష - మంజు

moggalu book review

ముచ్చటైన మూడు పాదాల మెరుపులు ఈ " మొగ్గలు "..!!

తెలుగు సాహిత్యంలో విభిన్న ప్రక్రియలకు లోటు లేదు. లఘు కవిత్వం ఆదరణ పొందుతున్న ఈరోజుల్లో ఎన్నో లఘు కవితా ప్రక్రియలు ప్రాచుర్యంలోనికి వచ్చాయి. ఏక్ తారలు, మణి మాలికలు, రెక్కలు, నానీలు, హైకూలు, రుబాయిలు ఇలా ఎన్నో కొత్త కొత్త ప్రక్రియలు తెలుగు సాహిత్యంలో వెలువడుతున్నాయి. శతక పద్యాలు చాలా వరకు నాలుగు పాదాల్లో ఉంటాయి. వేమన, సుమతి శతకాల ప్రాచుర్యం ఎంత అనేది మనకు తెలుసు. అలానే ఈ  మొగ్గలు తెలుగు లఘు కవిత్వ సాహిత్య ప్రక్రియ కూడా ముచ్చటగా మూడు పాదాల్లో మనల్ని మురిపిస్తాయి.  మొదటి రెండు పాదాలు వస్తు, శిల్పాలకు ప్రాధాన్యతనిస్తే మూడవ పాదం చక్కని అభివ్యక్తితో మొదటి రెండు పాదాలకు ముక్తాయింపునిస్తుంది. డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ చేతిలో పురుడు పోసుకున్న సరికొత్త లఘు కవితా ప్రక్రియ

" మొగ్గలు "

డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ రాసిన మొదటి మొగ్గ

" కొన్ని అక్షరాలు చాలు కవిత్వాన్ని ఆవిష్కరించడానికి      అక్షరం రసాత్మక కావ్యం " వాక్యం రసాత్మకం కావ్యం నుండి అక్షరం రసాత్మక కావ్యాన్ని  తొలి మొగ్గగా అందించి మొగ్గకు చక్కని అలంకరణ చేసారు.  మొదటి రెండు పాదాలకు ఓ చమక్కుతో మెరిపించడం ఈ మొగ్గల ప్రత్యేకత. అడుగులతో చివరి మజిలి చేరడాన్ని, కోరణం లోకానికి వెలుగునివ్వడాన్ని, కొన్ని మధుర జ్ఞాపకాల అనుభూతులు జీవితానికి, మానవత్వపు విలువలు మనిషికి ఆభరణమని, కొన్ని బంధాలు అనురాగ బంధాలు కావడాన్ని, మనిషి వ్యక్తిత్వపు లక్షణాలు, నవ్వుల ఉపయోగాన్ని, విజయం ఇచ్చే శక్తిని, మంచి పనులతో అందరి మనస్సులో చిరస్థాయిగా మిగిలిపోతామని, పుట్టినప్పుడు తొలి కేరింత ఆనందాన్ని, పిల్లల అల్లరి సంతోషాలను, తప్పటడుగులు నేర్పే గుణపాఠాలను, పట్టుదలతో చదువు ఇచ్చే గౌరవాన్ని, మూడుముళ్ళ బంధం గొప్పదనాన్ని, బాధ్యతల బంధాలను, కుటుంబ సంబంధాలను, కష్టనష్టాలను ఇలా జీవితంలో ప్రతి అనుభూతిని అలతి పదాల్లో, సరళ మైన  భాషలో సున్నితంగా మూడు పాదాల మధుర వచనాల్లో ఆవిష్కరించడం అరుదైన విషయమే. ఈ చక్కని ప్రక్రియను తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ అభినందనీయులు.

" మట్టి చివరికి మనల్ని ఆహ్వానించనిదే
మన జీవితం అప్పుడే ముగిసిపోదు
 జీవితం ఒక మహాప్రస్థానం "మరణం గురించి ఎంత అద్భుతమైన మొగ్గ ఇది. కవితైనా, కథైనా పుంఖానుపుంఖాలుగా రాసినంత మాత్రాన గొప్పగా ఉండదు. చెప్పదల్చుకున్న విషయాన్ని అర్థవంతంగా, సూటిగా, స్పష్టంగా చదువరుల గుండెల్లోనికి దూసుకుపోయేటట్లుగా వచనమైనా, కవిత్వమైనా ఉంటే చాలు. పది కాలాలు ప్రజల మనస్సులో చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎంత ఎక్కువ వాక్యాల్లో చెప్పామన్నది కాకుండా లోతైన భావాన్ని కూడా తక్కువ పదాల్లో ఎంత  భావయుక్తంగా చెప్పామన్నది ముఖ్యం.

 " ఆలోచనలు వెంటాడినప్పుడల్లా
అక్షరాలు మొలకెత్తుతూనే ఉంటాయ్
అక్షర సంగమం కవిత్వం "

కవిత పుట్టుక కష్టమైనా ఎంత సుళువుగా చెప్పేసారో తన ముచ్చటైన మొగ్గలో. స్నేహాన్ని, గమ్యాన్ని, గమనాన్ని, అనుభవాల జ్ఞాపకాలను, మనసు, మమతలను, నదీ, సాగర సంగమాలను, ప్రకృతి అందాలను, పక్షుల కిలకిలరావాలను, జీవితమంటే కష్టసుఖాలని, రైతుకు వాన ఎంత ముఖ్యమో, చినుకు అందాన్ని ముత్యమని, గేయం గాయపడిన అక్షరమని, విత్తు, చెట్టు ఉపయోగాలను, జాబిలి, వెన్నెల అందాలను, పరోపకారం ఆవశ్యకతను, స్వేచ్ఛ గురించి, చరిత్ర పాఠాలను, కవిత్వం చదువుతుంటే మనసు పొందే హాయిని, కవి తీరని దాహాన్ని, జీవమున్న అక్షరాలు సమాజ వికానికి దోహదపడతాయని, అక్షరాలను ప్రేమలో ముంచితే కాని పదాలు ప్రేమ కవిత్వాన్ని ఆవిష్కరించలేవని, కష్టాలను గెలిస్తే కాని సుఖాలు తెలియవని, సమాజాన్ని చదివితే కాని  లోకం తీరు తెలియదని, జీవితం ఓ తెరచిన పుస్తకమని, వేదన, బాధలు, కన్నీరు, ఆనందం, ఆహ్లాదం, జీవితపు అనుభవాలు, పసితనపు అమాయకత్వాలు, కలం విలువ, కాలం గొప్పదనం, రాజకీయపు రంగులు,

" దుఃఖాన్ని ఎన్నిసార్లు ఒంపుకున్నా
 బాధలు ఎప్పటికి ఉంటాయి
కన్నీటికి తడి ఎక్కువ "  ఇలా చెప్తూనే.. గుండె గాయపడితేనే కవిత్వమంటారు. అమ్మను, అమ్మ చేతి వంటను, ఆడపిల్లను, అంతరాలను, అసమానతలను, ప్రశంసలను, గుండె లోతుల్లో విషాదాలను, ఎన్నో ప్రశ్నల సమాధానాలను, కళలను, కల్లోలాను, ప్రేమను, ఆర్తిని ఇలా ప్రతి హృదయపు అనుభూతిని తన మొగ్గల్లో అక్షరాలకు అద్దుతూ, మన మనసులను వికసిమజేయడానికి, సమాజంలో మానవత్వపు పరిమళాలు వెదజల్లడానికి సాహిత్యపు సేద్యాన్ని కొత్తగా చేయదానికి ఈ మొగ్గలు కవితా ప్రక్రియ రూపొందించిన డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారికి హృదయపూర్వక అభినందనలు.

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి