అమ్మ...అమృతం - మీగడ. వీరభద్రస్వామి

amma amrutam

"అమ్మా! ఈ రోజు మా తెలుగు మాస్టారు ఒక మంచికథ చెప్పారమ్మా! కథ ఎంత బాగుందో...క్షీరసాగర మథనం గురుంచి చెప్పారు" అని అమ్మ అమృతతో చెప్పాడు కొడుకు బాబూరావు.

"నిజమా! ఆ కథ నిజంగా బాగుంటుంది, దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికితే ముందు విషం పుడుతుంది, దానివల్ల లోకానికి ఆపద రాకుండా శివుడు స్వీకరించి తన కంఠంలో ఉంచుకొని నీలకంఠుడు అనిపించుకుంటాడు, లక్ష్మీ దేవి పుడితే విష్ణువు స్వీకరిస్తాడు, కామధేనువు, కల్పవృక్షం ఇలా చాలా అద్భుతాలు సాగర మథనం సమయంలో పుడతాయి వాటిని దేవతలు తీసుకుంటారు, చివరగా అమృత కలశం వస్తుంది, అమృతం పంచుకోడాని దేవతలూ రాక్షసులూ ఎదురెదురుగా కూర్చుంటారు, ఒకవేళ రాక్షసులు అమృతం త్రాగితే చావు పుట్టుకలు లేని అమరులు అయిపోతారని, ఇంకా వారి అరాచకాలు, ఆగడాలు, దుర్మార్గాలు ఎక్కువ అయిపోతాయని విష్ణువు ఆలోచించి మాయా మోహిని రూపంలో వచ్చి అమృతం దేవతలకు పోసి, మద్యం అంటే సారాయి రాక్షషులకు పోస్తాడు, ఈ మాయను గమనించి రాహుకేతువులు అనే ఇద్దరు రాక్షసులు దేవతల రూపంలోకి మారిపోయి దేవతల వరుసలో కూర్చొని కొంచెం అమృతాన్ని త్రాగేస్తారు, అది గమనించి కోపంతో విష్ణువు రాహుకేతువుల తలలు ఖండిస్తాడు, అప్పటికే అమృతం తాగేసిన రాహుకేతువులు తలలు సజీవంగా ఉంటాయి, అవి కోపంతో సంవత్సరంలో అప్పుడప్పుడు చంద్రుణ్ణి మింగి కొంత సమయం తరువాత  కక్కిస్తే చంద్రగ్రహణం అని సూర్యుణ్ణి మింగి కాసేపటి తరువాత వదిలేస్తే సూర్యగ్రహణం అని అంటారు ఇది పురాణ గాధ మాత్రమే ఖగోళ శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడటానికి కారణాలు వేరేగా ఉంటాయి అది మీకు సోషల్ టీచర్ చెప్పే వుంటారు, ఏది నిజమో ఏది కల్పితమో పక్కన పెడితే పూరణగాధలు వినడానికి బలే గమ్మత్తుగా ఉంటాయి కదా బాబూరావ్, మా నాన్నగారు కూడా తెలుగు మాష్టారే కాబట్టి ఇలాంటి కథలు బోలెడు చెప్పేవారు, నాకు జ్ఞాపకం ఉన్నంతవరకూ నీకు చెప్పాను, సరే బాగా పొద్దుపోయింది బూస్ట్ కలిపి ఇస్తాను త్రాగేసి నిద్రపో... రేపు "అమ్మ-అమృతం"అనే అంశంపై డిబేటింగ్ ఉందని అన్నావు కదా" అని బాబూరావుకి బూస్ట్ కలిపి ఇచ్చింది అమ్మ అమృత.

"అమ్మా... అందుకేనా నీకు మీ నాన్నగారు 'అమృత' అన్న పేరుపెట్టారు" అన్నాడు బాబూరావు నవ్వుతూ "కావొచ్చు....అంటే మంచిగా ఉండాలని, కలకాలం నేను జీవించాలని మా అమ్మా నాన్న ఆశ" అంది అమృత నవ్వుతూ...   

****    ****  ****  ****

బాబూరావు ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు, మంచి విద్యార్థి, కథలు, కవితలు ఆసక్తిగా వింటుంటాడు, చిన్న చిన్న కవితలు రాస్తుంటాడు, మొన్నామద్య బాబూరావు రాసిన కవితలు విని ముచ్చటపడి స్కూల్ వాళ్ళు వాటిని "అమ్మ-అమృతం" అనే శీర్షికతో పుస్తక రూపంలో అచ్చుకూడా వేయించి, బాబూరావు తలిదండ్రుల్ని పిలిచి విద్యాశాఖ పెద్దలు సమక్షంలో పుస్తకాన్ని ఆవిష్కరించారు, ఎందుకంటే బాబూరావు రాసిన కవితల్లో ఎక్కువ అమ్మగురుంచే ఉంటాయి కనుక.అమృతకూడా తెలుగు పండిట్ ట్రైనింగ్ అయ్యింది, అయితే బాబూరావు తండ్రి రైల్వే ఉద్యోగి, దేశంలో ఎక్కడకెక్కడకో బదిలీపై వెళ్ళవలసి వస్తుంటాది, ఒక్కగానొక్క కొడుకు బాబూరావు ఆలనా పాలనా చూసే వారెవ్వరూ లేక అమృత ఉద్యోగానికి వెళ్లడం లేదు కాకపోతే ఎవరైనా తెలుగు భాష గురుంచి, భారతీయ సంప్రదాయం గురుంచి పురాణాలు గురుంచిగానీ కదిపితే తనకు తెలిసింది, వినేవారికి ఆసక్తి కలిగించే విధంగా వినసొంపుగా చెబుతుంటుంది.రేపటి డిబేటింగ్ టాపిక్ అమ్మ-అమృతం గురుంచి తల్లీ కొడుకులు చాలా సేపు చర్చించుకున్నారు... చర్చమద్యలోనే నిద్రలోకి జారుకున్నాడు బాబూరావు. అమృత బాబురావు తలక్రింద తలగడ సరిగ్గా సర్ది దుప్పటి సరిగ్గా కప్పి , "నేను టెన్త్ చదివే రోజుల్లో చదువుకోసం విద్యార్థులుపై ఇంత ఒత్తిడి ఉండేదికాదు. ఈ పోటీ ప్రపంచంలో వీళ్లకు తప్పని తిప్పలు ఎదురౌతున్నాయి"అని మనసులో అనుకుంటూ కొడుకు తలనిమురుతూ కొడుకు గాఢ నిద్రలోకి వెళ్లాడనుకొని సంతృప్తిగా నిట్టూర్పు విడుస్తూ తానూ నిద్రపోయింది అమృత.

****      ****    ****   *****

ఆ రోజు శనివారం బాబూరావు స్కూల్ కి యూనిఫామ్ అక్కర్లేదు సివిల్ డ్రెస్ వేసుకోవచ్చు లేటెస్ట్ జీన్స్ పై  ఇంద్రధనుస్సు రంగులన్నీ కలిసివున్న పువ్వులు టీషర్ట్ వేసుకున్నాడు.రంగు రంగులలోకంలోకి ఒక సీతాకోక చిలుకలా బడికి వెళ్ళాలని బడిబస్సు కోసం బయలుదేరాడు.అయితే ఇంటిముందు ఒక పుష్పక విమానం ఆగివుంది, అందులోనుండి ఇద్దరు పురాణ పురుషులు దిగారు,"బాలకా రమ్ము నీ గమ్యానికి చేరుస్తాము" అంటూ పౌరాణిక నాటకీయత నటిస్తూ బాబూరావుకి స్వాగతం పలికారు,"వినాయక చవితి. .మొహారం... దసరా... దీపావళి వరస పండగలు రావడంతో ఈ ఆటోలు వాళ్ళు రిక్షాలు వాళ్ళుట్రెండ్ మార్చారు కాబోలు చూడటానికి బాగుంది,

అమ్మ ఇచ్చిన పాకెట్ మనీ బాగానే వుంది, దీనిలో బడికి పోతే ఆ మాజాయే వేరు, నా ఫ్రెండ్స్ ముందు దర్జాగా డాబు కొట్టొచ్చు" అనుకుంటూ పుష్పక విమానం ఎక్కేసి "టికెట్ ఎంత, షేర్ ఆటో కాదా" అని అడిగాడు అమాయకంగా,"లేదు బాలకా ఇది ఉచితం కేవలం మీ కొరకే దివి నుండి భువికి వచ్చింది అంటూ..బాబూరావుని ఒక వజ్రవైఢూర్య ఆసనం మీద కూర్చో బెట్టారు."పోనివ్వండి ముందు స్కూల్ కి టైం అయిపోతుంది" అని బాబూరావు అన్న వెంటనే పుష్పక విమానం గాలిలో ఎగిరింది.బాబూరావు ఆశ్చర్యపోయి "ఏంటి మన ఊర్లో గాల్లో ఎగిరే ఆటోలు కూడా ఉన్నాయా! "ఓరి నాయినో... నేను ఎక్కువ డబ్బులు ఇవ్వలేను" అని  అంటుండగానే పుష్పక విమానం గగన మార్గంలో వాయు వేగంతో దూసుకుపోయింది.బాబూరావు హడిలిపోయి "ఓయ్ దీనికి బ్రేక్ ఫెల్యూర్ లా ఉంది,

నేను ఎక్కడ దించమన్నాను, మీరెక్కడి తీసుకుపోతున్నారయ్యా బాబూ అంటూ ఖంగారు పడిపోయాడు."బాలకా నీ గమ్యస్థానం చేరుకునే సమయం వచ్చింది"అంటూ ఇంద్రభవనం ముందు పుష్పక విమానం ఆపారు ఆ దేవదూతలు,"స్వర్గలోకం బాబూరావుకి స్వాగతం పలుకుతుంది" అంటూ ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు మొదలగు సకల దేవతలూ బాబూరావుకి ఎదురు వచ్చారు, "ఓర్నీ ఇది నిజంగానే స్వర్గలోకంలా ఉంది, సినిమాల్లో స్వర్గలోకం సెట్టింగ్ చూడటం, కథలు చదివి స్వర్గాన్ని ఊహించుకోవడం తప్ప నేరుగా చూడలేదు నేను అంటూ, కాస్తా సందేహంగా..."సార్ నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారు,నాకు ఈ రోజు మా స్కూల్లో డిబేటింగ్ కాంపిటీషన్ ఉంది అనవసరంగా నన్ను ఇక్కడకు తీసుకొచ్చారు, అక్కడ నూకాచారి నేను లేని సమయం చూసి అమ్మ కన్నా అమృతమే మిన్న అని వాదించి ప్రైజ్ కొట్టేస్తాడు,వాడిని ఢీకొట్టి అమృతం కన్నా అమ్మే గొప్పది అని వాదించే సత్తా మా టీమ్ లో నాకు తప్ప మరొకడకి లేదు, నూకాచారిగాడి టీమ్ గెలిచేస్తాది సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ నన్ను అర్జెంటుగా మా స్కూల్లో దించేయండి సార్ టైం అయిపోతుంది, మా టీచర్స్ నన్ను దెబ్బలాడతారు నేను లేట్ అయితే" అంటూ ఇంద్రుడు చెయ్యి పట్టుకొని బ్రతిమిలాడటానికి చూసాడు బాబూరావు.బాబూరావు పట్టుకోడానికి ఎంత ప్రయత్నించినా ఇంద్రుని చెయ్యి దొరకలేదు,"విఫల యత్నం చెయ్యకు బాలకా మేము అమృతం త్రాగుతున్న అమరులం మేము మీకు దొరకం మీరు మమ్ములను ఎప్పుడూ తాకలేరు" అని అన్నాడు ఇంద్రుడు భుజాలు ఎగరేస్తూ,"సారీ సర్ మీరు గ్రేట్ సార్ కానీ నన్ను మా బడికి పంపే ఏర్పాట్లు చెయ్యండి సార్ ప్లీజ్" అని అక్కడున్న వారందరినీ బ్రతిమిలాడాడు బాబూరావు."లేదు బాలకా నువ్వు కొన్నాళ్లు పాటు, ఇక్కడే మాకు అతిధిగా ఉండిపోతావు,

భూలోకంలో అమృతం కన్నా అమ్మ గొప్పదని వాదించేవారిని మేము అక్కడ వుండనివ్వం, అలా వాదించే నవ యువకుల్లో నువ్వే బాగా మాటకారివని తెలిసింది, అందుకే, నిన్ను మాదారిలోకి తెచ్చుకొని అమ్మ కన్నా అమృతమే గొప్పదని ఒప్పుకునేటట్లు చేసి నిన్ను మీ లోకానికి పంపుతాం" అన్నాడు ఇంద్రుడు."అలగయితే భూలోకంలో ఎవడూ మిగలడు మీకు తెలుసా నూటికి తొంభై తొమ్మిది మంది అమృతం కన్నా అమ్మే గొప్పది అంటారు, మా నూకాచారికి కూడా తెలుసు అమృతం కన్నా అమ్మే గొప్పదని, కేవలం పోటీకే డిబేటింగ్ గురుంచి వాడు అమృతం గొప్పది టాపిక్ తీసుకున్నాడు"అని అన్నాడు బాబూరావు."నన్ను భూలోకం పంపివేయండి " అని అతను మొరపెట్టుకుంటున్న సమయంలోనే "బాలకా నువ్వు స్వర్గలోకం వచ్చి కొన్ని క్షణాలే అని నువ్వు అనుకుంటున్నావు, మీ భూలోకం నువ్వు వీడి ఇప్పటికే వారం రోజులు గడిచిపోయింది,మీ లెక్కన. ఇక్కడ ఒక్క క్షణం మీ లోకంలో కొన్ని రోజులు"అని చక్కగా చెప్పాడు సూర్యుడు. "బాబోయ్ కొంప ముంచేశారు,నా స్కూల్ మాటకేమి మా అమ్మ నాగురుంచి బెంగపెట్టుకొని ఏడుస్తాది, నేను ఒక్కరోజు కనిపించకపోయినా మా అమ్మ ఉండలేదు, ఈపాటికి అమ్మ మంచం పట్టేసి ఉంటుంది" అని ఏడుపు మొదలుపెట్టాడు బాబూరావు. దేవతులందరూ అతన్ని సముదాయించి."నీకు ఇష్టం లేకపోతే నిన్ను ఇక్కడ వుంచం కానీ, అమృతం కన్నా అమ్మ ఎలా గొప్పది చెప్పు ముందు "అని అన్నారు. "అయ్యో మీకు ఎంతచెప్పినా అర్ధం కావడం లేదు నాకు అమ్మ గురుంచి తెలుసు అమృతం గురుంచి చాలా కథలు ,విషయాలు విన్నాను, ఎన్ని రకాలుగా చూసినా అమృతం కన్నా అమ్మే గొప్ప గొప్ప గొప్ప "అని ఏడుస్తూ కోపం కోపంగా చెప్పాడు బాబూరావు.ఇంద్రసభ కొలువుతీరింది, సమయానికి నారదుడు వచ్చాడు, "బాలకా ముందు అమ్మ గొప్పతనం ఈ దేవతలకు వివరించు...

వీళ్లకు అమ్మ ఉండదు అందుకే అమృతమే గొప్ప అనుకుంటారు" అని బాబూరావుకి హింట్ ఇచ్చాడు నారదుడు.ఈలోగా అప్సరసలు వచ్చి దేవతలకు అమృతాన్ని పాత్రల్లో వేసి ఇస్తున్నారు."ఇంద్రా సార్ మీకు అమ్మ లేదు కాబట్టి ఈ బొమ్మల చేతి అమృతాన్ని త్రాగుతున్నారు మీకు గతిలేక.మీకు ఓపిక ఉంటే ఇప్పుడు అమ్మలు పిల్లల గురుంచి ఏమి చేస్తున్నారో చూడండి భూలోకంలో"అని అన్నాడు.ఒక అమ్మ వేకువనే లేచి ఇంటి పనులు ముగుంచుకొని స్నానం సంధ్యా వందనాలు అయిపోయిన తరువాత బిడ్డను నిద్రలేపి బ్రతిమిలాడి బుజ్జగించి, లాలించి పాలించి, లాలిపోసి, పాలు ఇచ్చి,అక్షరాలు దిద్దించి బడికి స్వయంగా వెళ్లి గురువులకు అప్పగించి, హడావుడిగా ఇల్లుచేరి,వంటచేసి, మధ్యాహ్నం స్వయంగా బడికి వెళ్లి బిడ్డకు గోరుముద్దలు తినిపించి, ఒప్పించి, మెప్పించి,బడిలో బుద్దిగా ఉండమని చెప్పి వచ్చింది, ఇంట్లో అంట్లు తోమి,బుట్టలు ఉతికి,ఇంటి శుభ్రం పనులుచేసి,సాయింత్రం బడికి వెళ్లి బిడ్డను ఎత్తుకొని ఇంటికి తెచ్చి,అల్పాహారం ఇచ్చి బిడ్డతో చాలా సమయం గడిపి పిల్లల్లో పిల్లలా పరకాయ ప్రవేశంచేసి బిడ్డకు వినోదం ఆనందం కలిగించి, చదువు చెప్పి, బుజ్జగించి బువ్వ తినిపించి, పిల్ల కోరికలన్నీ తీర్చి, రాత్రి నిద్రపుచ్చి, సుఖంగా నిద్ర పోతున్న బిడ్డ నిదుటన ముద్దాడి, సంతృప్తిగా నిద్రపుచ్చి, ఇంట్లో ఇతర సభ్యుల ఆలనా పాలనా చూసి, పెద్దలకు సేవలు చేసి, ఇంటిపనులు యంత్రములా ముగుంచుకొని, అర్ధరాత్రి నిధురపోయింది.

మరలా రెండో దినం వేకువ తొలిజామునే నిధురలేచింది, లేచిన వెంటనే బిడ్డను చూసి బిడ్డ నుదుటన ముద్దాడి, తన నిత్యకృత్యాలకు సిద్ధమయ్యింది.సగటున అమ్మ చేసిన కృత్యాలు రెప్పవేయకుండా చూసి దేవతలు ఆశ్చర్యపోయారు, "అద్భుతం, మహాద్భుతం" అని చప్పట్లు కొట్టారు."మీరు ఒక అమ్మనే చూసారు, పేద నిరుపేద అమ్మలు పిల్లలకు, పెద్దలకు సేవలు చేస్తూ కుటుంబపోషనకు కూలికి పోయి కుటుంబాలకు అండగా వుంటారు.కర్షకులు, కార్మికులు, కూలీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా రకరకాల వర్గాల అమ్మలను చూపి వారి గొప్పతనం వివరించాడు బాబూరావు దేవతలకు."ఇవన్నీ మాకు తెలీదు, అమ్మ అద్భుతమైన దేవతని మాకు తెలీదు" అని అన్నారు దేవతలు. "మీకు అమ్మ లేదుగా... మహిమల వల్ల పుట్టి, మహిళలు ఆటపాటలతో గడిపి, అమృతాన్ని మద్యం మాదిరి త్రాగుతూ చావు పుట్టుకలు, శరీర ఈతిబాధలు లేకుండా ఆకలి దప్పిక లేకుండా, కష్టం, నష్టం తెలుసుకోకుండా సోమరితనంతో కాలం గడిపేవేయడమే మీకు తెలిసిన విద్య, ఆడది అంటే మీ దృష్టిలో రంబా, ఊర్వశి, మేనకా వగైరా"అని తనకు తెలుగు మాస్టారు అప్పుడప్పుడు చెప్పిన విషయాలను అనేశాడు, "మాకూ కుటుంబాలు ఉంటాయి" అని అన్నాడు ఇంద్రుడు కోపంగా. "అమ్మ మాత్రం లేదని విన్నాను...అమ్మ లేకుంటే స్వర్గమైనా నరకం కన్నా హీనమే అమ్మ లేకుంటే సంపద ఎంత వున్నా చిత్తు కాగితం లాంటిదే సంతృప్తి ఉండని సంపద " అని అన్నాడు బాబూరావు దైర్యంగా.నరకం నుండి స్వర్గాన్ని తొంగిచూస్తున్న యమధర్మరాజు, కుబేర సామ్రాజ్యం రారాజు కుబేరుడు బాబూరావు దెబ్బకు ముఖం మాడ్చుకున్న ఇంద్రుడు మోము చూసి హేళనగా పక్కున నవ్వారు. నారదుడు, బృహస్పతి కోరగా, బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు కుటుంబాల సమేతంగా వచ్చి దేవతలకు  అమ్మ గొప్పతనం మరింత గొప్పగా వివరించారు. ఇంద్రుడు బాబూరావుకి తన సింహాసనం చూపి "ఒక్కసారి దానిపై కూర్చో, అప్సరసలు ఇచ్చిన అమృతం త్రాగి చావు లేని జీవితం భూలోకంలో అనుభవించు, మీ అమ్మను మాత్రం మా లోకం పంపు మాకు అమ్మగా" అని వరాన్ని ఆఫర్ చేసాడు.

బాబూరావు ఇంద్రుడికి దండం పెట్టి," వెటకారమా, నేనే కాదు, బుద్ది ఉన్న ఏ పిల్లలూ మీ ఆఫర్ తీసుకోరు, అమ్మని వదులుకోరు, అవకాశముంటే ఆ వరాన్ని ముందు మా అమ్మకు ఇవ్వండి,అమ్మని మా లోకంలోనే ఉంచండి. అమ్మకి చావు లేకుంటే ఏ బిడ్డకూ చావు ఉండదు, అమ్మ అండ ఉండగా హరిహారాదులు ఏకమైనా పిల్లల ప్రాణాలను హరించలేరు" అని అన్నాడు బాబూరావు. దేవతలు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి బాబురావు ముందు లెంపలేసుకొని "అమృతం కన్నా అమ్మే గొప్ప" అని నినాదాలు ఇచ్చారు. త్రిమూర్తులు, జగన్మాతలు, ముఖ్యంగా, వినాయకుడు, కుమారస్వామి, నారదుడు, మన్మధుడు, బాబూరావు భుజం తట్టి" సెహబాస్ అమ్మలు గురుంచి అద్భుతంగా చెప్పావు, మీలోకంలో కూడా డిబేటింగ్ లో మన టీమే నెగ్గింది,దేవతల అమృతం గురుంచి గొప్పగా మాట్లాడిన నూకాచారి గాడి టీమ్ ఓడిపోయింది" అని అన్నారు. త్రిమూర్తులు ఆదేశాలు ప్రకారం హనుమంతుడు, స్వయంగా బాబూరావుని భుజానికెత్తుకొని భూలోకం తీసుకొచ్చాడు.

భూలోకం చేరి, బాబూరావు హిప్ హిప్ హుర్రే అంటూ ఎగిరి గెంతులు వేశాడు తిరిగి అమ్మ దగ్గరకు వచ్చాననే సంతోషంలో. కళ్ళు తెరచి చూసేసరికి, బాబూరావు మంచం మీదనుండి  దబ్భున క్రింద పడిపోయాడు.అమ్మ వచ్చి గాబరా పడి ,"నిద్రలో కలవరింతలు, ఏంటి, నిద్రలో కూడా డిబేటింగ్ గురుంచి ఆలోచేస్తున్నావా" అని అడిగింది. అప్పుడర్ధమయ్యింది బాబురావుకి,పుష్పక విమానం, స్వర్గం, అక్కడ డిబేటింగ్, అభినందనలు,కేవలం 'కల' అని, అమ్మ వంటిట్లో హడావుడిగా ఉండగా అమ్మకు తన కలను పూస గుచ్చినట్లు వివరించాడు బాబూరావు, అమ్మ పక్కున నవ్వి, "ఒక వేళ నేను స్వర్గం వెళ్లిపోయి, నువ్వు భూలోకంలో ఉండిపోతే "అని ఆగిపాయింది చిలిపిగా కనుబొమ్మలు ఎగరవేస్తూ... బాబూరావు కన్నీళ్లు దారలయ్యాయి, "అమ్మా అలా ఎప్పుడూ అనకే" అంటూ బోరుమంటూ... అమ్మను హత్తుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు, అమ్మ కూడా ఏడుస్తూ... అంతలోనే నవ్వేస్తూ..." నెవ్వర్ బాబూ... నిన్ను వదిలి నేనూ ఎక్కడికీ వెళ్ల లేను, ఒకే కమాన్ ఈ రోజు కొంచెం వేగంగా బడికి వెళ్లు, అమ్మ గురుంచి గొప్పగా చెప్పి అమృతాన్ని ఓడించు, మర్చిపోకుండా వచ్చేటప్పుడు, నూకాచారిని మనఇంటికి తీసుకొనిరా...అతని అమ్మకూడ మనఇంటికి వస్తుంది, చిన్న పార్టీ ఉంది సరదాగా సెలబ్రేట్ చేసుకుందాం" అని అంది. బాబూరావు హుషారుగా బడికి బయలుదేరాడు."కలలో... వినాయకుడు తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి అల్ థీ బెస్ట్ మామా... హేవ్ గ్రేట్ డేజ్" అని విషెస్ చెప్పడం, అది, భ్రమ, కల అయినా... బాబూరావు గుండెల్లో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి