ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు - భమిడిపాటి ఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

ఈవారం ( 1/11 – 7/11 ) మహానుభావులు.

జయంతులు.

నవంబర్ 1
శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి : వీరు నవంబర్ 1, 1897 న రావువారి చంద్రపాలెం లో జన్మించారు.  ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందారు.. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించారు…. రైలులో బళ్ళారి వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా "కృష్ణపక్షం కావ్యం" రూపు దిద్దుకొంది.  లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం - కృష్ణశాస్ర్తి పాటల్లోని ప్రధాన లక్షణాలు. భావోద్వేగాలకు, హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని రాసిన కవి. ఆత్మ నివేదన, ఆరాధన గల భక్తిగీతాలు కూడా అనేకం. .

నవంబర్ 2
శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహరావు :  వీరు నవంబర్ 2, 1865 న సీతానగరం లో జన్మించారు. ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావు గారిని పాఠకలోకం 'కవిశేఖరుడ'నీ, 'అభినవ కాళిదాసు' అనీ, 'ఆంధ్ర అడిసన్' అనీ, 'ఆంధ్ర షేక్ స్పియర్' అనీ బిరుదులతో అభినందించింది. వీరి రచన  విలక్షణమైనది. వీరు వ్యావహారికమునకు దగ్గఱగనుండు గ్రాంథికము వ్రాయుదురు. ప్రతిపదము పరిహాసగర్భితము. ఆక్షేపణ భరితము. చెప్పినదే మార్చి మార్చి భంగ్యంతరముగా జెప్పుట వీరి రచనలో కొత్తదనము.. చదివినకొలదిని జదువుట కుత్సాహము పుట్టించు రచనమే రచనము.

నవంబర్ 3
1.శ్రీ క్రొవ్విడి లింగరాజు : వీరు నవంబర్ 3 , 1904 న రాజమండ్రీ లో జన్మించారు. స్వాతంత్ర్య సమర యోధులు, పత్రికా సంపాదకుడు, పత్రికా రచయిత, అనువాద రచయిత, సంఘసంస్కరణాభిలాషి, రాజకీయ విశ్లేషకుడు. . వేదిక, గోదావరి పత్రికలకు సంపాదకత్వం వహించారు.. ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రికలలో అనేక వ్యాసాలు వ్రాశారు.. కృష్ణాపత్రికలో విదురుడు అనే కలం పేరుతో వారం వారం అనే శీర్షికను నిర్వహించారు.. వీరు అనేక సార్లు జైలుశిక్షను అనుభవించారు.. మాక్సిం గోర్కీ నవల  “ మదర్ “ ని తెలుగులో  “ అమ్మ “ పేరిట అనువదించారు..

2.శ్రీ ఏల్చూరి విజయరాఘవ రావు : వీరు నవంబర్ 3, 1925 న మద్రాస్ లో జన్మించారు. ప్రముఖ భారతీయ సంగీతకారుడు,వేణుగాన విద్వాంసుడు,సంగీత దర్శకుడు,కంపోజర్ రచయిత..ఆయన అత్యంత ప్రతిభావంతుడు. సంగీత లోకంలో చాలా గొప్పవాడు.. ప్రపంచంలోని ఐదు ఖండాలలో మూడు ఖండాలలో ఒకసారి కాదు ఎన్నోసార్లు ఆయన సంగీత కచేరీలు నిర్వహించారు..

నవంబర్ 7
శ్రీ గోగినేని రంగనాయకులు : వీరు   N G రంగా గా ప్రసిధ్ధులు. వీరు నవంబర్ 7 , 1900 లో నిడుబ్రోలు లో జన్మించారు. భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు .

వర్ధంతులు

నవంబర్ 2
శ్రీ త్రిపురనేని గోపీచంద్ :  సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు… వీరు తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించారు.. అనేక వాదాలతో వివాదపడుతూ, తత్త్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించారు.వీరి రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన వ్రాసిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. 1963లో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. వీరు నవంబర్ 2, 1962 న స్వర్గస్థులయారు.

నవంబర్ 4
శ్రీ K. సభా :   రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి.జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా, నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు. వీరు నవంబర్  4 ,  1980 న స్వర్గస్థులయారు..

నవంబర్ 5
శ్రీ దాశరధి కృష్ణమాచార్య  :  వీరు తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి . దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందించారు. వీరు నవంబర్ 5, 1987 న స్వర్గస్థులయారు.

నవంబర్ 7
శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి  :   తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా అచ్చ తెలుఁగు సాహిత్యంలో పేరెన్నికగన్న కవులలో ప్రముఖుడు. ఆంధ్ర కల్హణ, కళా ప్రపూర్ణ బిరుదాంకితుడు.  “ఆంధ్ర రచయితలు “ వీరి ప్రసిద్ధ రచనలలో ఒకటి. ఇందులో నీతి చంత్రిక, బాల వ్యాకరణం రచించిన చిన్నయసూరి నుండి తుమ్మల సీతారామమూర్తి చౌదరి వరకు నూరుగురి మహా రచయితలను గూర్చి సద్విమర్శతో వ్రాయబడిన గ్రంథం.. వీరు నవంబర్ 7,  1992 న స్వర్గస్థులయారు.

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు