ప్రపంచంలో ఎలాటిపాపం చేసినా దానికి ప్రాయశ్చిత్తం, కనీసం ఒకటైనా విమోచనా మార్గం ఉంటుంది. కానీ తెలిసినవారితో కానీ, బంధువులతో కానీ, సగోత్రీకులతో కానీ, జ్ఞాతులతోకానీ, ఎటువంటి లావాదేవీలు చేసినా దానికి నిష్కృతి అనేది ఉండదు. జీవితాంతం ఆ బాధ అనుభవించాల్సిందే. సంబంధబాంధవ్యాలు ఉండడంలో తప్పులేదు. రాకపోకలవరకూ కూడా తప్పులేదు. కానీ లావాదేవీలు మాత్రం సుతారమూ చేయకూడదు. అసలు తెలియనివారితో చేయడమంత ఉత్తమం లేదు. ఎందుకంటే బయటివారితో ఏదో లావాదేవీ సందర్భంలో ఓ అంగీకారానికి వచ్చి, ఇచ్చిపుచ్చుకోడాలు పూర్తిచేసుకుంటాం. తరువాత, నీకు నువ్వూ, నాకు నేనూ అనుకుంటూ ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోవడం. కథ సమాప్తం. కానీ ఇవే లావాదేవీలు, తెలిసినవారితో కానీ, బంధువర్గంలోనివారితో కానీ చేసి చూడండి, కొరివితో తల గోక్కున్నట్టే.
ఏదో వస్తువో, ఓ ఇల్లో, ప్లాటో ఏవేవో కారణాలవల్ల అమ్ముదామనుకుంటే, ఏదో పత్రికల్లోనో, లేదా ఈరోజుల్లోలాగ ఏ అంతర్జాలం లోనో ప్రకటన ఇవ్వాలికానీ, తెలిసున్నవారిదగ్గర మాత్రం నోరెత్తకూడదు. అధవా ఎత్తేరా ఇంక అంతే సంగతులు. ఉదాహరణకి ఏ కారో కొనుక్కోవాలని, ఇంట్లో ఉండే బైక్కునో, స్కూటరునో అమ్ముదామనుకుని, కర్మ కాలి ఏ స్నేహితుడి దగ్గరో ప్రస్తావించారా, అయిపోయిందే. చవకలో ఎలా కొట్టేయగలనా అనే ఆలోచన ముందుగా వస్తుంది. ఏదో బేరం సెటిల్ చేసికుని, వాయిదాల్లో డబ్బులు ఇస్తే ఫరవాలేదుగా తో మొదలెడతాడు. ఈ అమ్ముకుందామనుకున్నాయన ఏదో అవసరం ఉండేకదా, ఆ స్కూటరుని బేరం పెట్టేడూ, ఆదిలోనే హంసపాదులా, మొత్తం డబ్బంతా ఒకే సారి వచ్చే అవకాశానికి మొదట్లోనే గండి పడింది. ఏదో తిట్టుకునీ, మొత్తుకునీ ఇంటావిడతో ఆలోచించీ, ఏదో మొహమ్మాటానికి ఒప్పుకున్నాడనుకుందాం. అప్పటినుంచీ మొదలూ కష్టాలు. అప్పుడు గుర్తుకొస్తుంది, దానికోసారి సర్వీసింగు చేయించేసి ఇచ్చేస్తావేమిటీ అంటాడు.. . ఏ పిఎఫ్ లోంచో ఎడ్వాన్సు తీసికుని మొదటి పేమెంటుదాకా ఇచ్చేస్తాడు. చేయించననడానికి ఈయనకి మొహమ్మాటం. ఇంక రెండో వాయిదా వచ్చేసరికి ఏవేవో కారణాలు చెప్పి ఎగ్గొడతాడు. పెట్రోల్ ఖర్చెందుకూ అనుకుని, ఇంట్లోనే ఆ బండి ఉంచుకుని, ఇదివరకటిలాగే సైకిలు మీదే లాగిస్తూంటాడు. ఎప్పుడైనా అడిగినా, మనమీదకే నెట్టేస్తాడు, " అదేమిటోనోయ్ ఆ బండి తీసికున్నప్పటినుండీ దానికి రిపేర్లతోనే వెళ్తోంది. మొన్నటికి మొన్న రెండు టైర్లు మార్పించేనా, ఇవేళ స్టార్టే అవలేదు. మెకానిక్ దగ్గరకు తీసికెళ్తే బ్యాటరీ డౌనైపోయిందన్నాడు, గ్యారేజ్ లో పడేసొచ్చాను.. . " ఇన్ని కబుర్లూ చెప్తాడుకానీ వాయిదా మాటమాత్రం ఎత్తడు.
ఇలా ప్రతీనెలా ఏదో ఒకవంక చెబుతూనే ఉంటాడు. డబ్బుల సంగతి అడగాలంటే ఈయనకి మొహమ్మాటం, పైగా ఎదుటి కట్నంలా అప్పటిదాకా అయిన ఖర్చంతా మనదగ్గర వసూలు చేస్తాడేమో అనో భయం. నోరుమూసుకుని, మనకెప్పుడు ప్రాప్తం ఉంటే అప్పుడే వస్తుందిలే అనే వైరాగ్యం లోకి వచ్చేస్తాడు. అక్కడితో అయిందా అంటే అదీ లేదూ, పొరుగింటివారితోనూ, అడిగినా అడక్కపోయినా పనికట్టుకుని మరీ చెప్పొస్తుంది ఆ కొనుక్కున్నాయన భార్య. "ఏదో తెలిసినవాడూ, ఎంతో అవసరం ఉంటేకానీ అమ్మకానికి పెట్టడూ, పోనీ చవకలో వస్తోందికదా అని కానీ.. . " అంటూ. హాయిగా ఏ గ్యారేజీవాడికో ఇచ్చేస్తే ఇన్ని గొడవలుండేవా?
ఊళ్ళో ఉండే ఏ ఇల్లో అమ్మాలంటే పడే కష్టాలు ఇంకోరకం. ఉద్యోగంలో ఉన్నప్పుడు స్వంత ఇల్లోటుండాలనే మహత్తర ఉద్దేశ్యంతో, ఏ మామగారి ప్రోద్బలంతోనో ఓ స్వంత ఇల్లు ఏర్పాటుచేసికుంటాడు. ఈయనకేమో పరాయి రాష్ట్రంలో ఉద్యోగమాయె, ఏదో శలవులకి భార్యాపిల్లలతో వెళ్ళినప్పుడు చూసుకోవడం కానీ, కట్టుకున్న ఆ ఇంట్లో ఒక్కరాత్రైనా గడిపిన యోగం పట్టలేదు. ఆ ఇల్లు కట్టడానికి తీసికున్న అప్పుతీర్చొద్దూ, ఆ ఇల్లు కాస్తా అద్దెకిచ్చేస్తాడు. అప్పటికి పిల్లల చదువులు పూర్తవుతాయి. ఈయనకేమో ఓ నాలుగైదు సంవత్సరాలు సర్వీసు మిగిలుంటుంది. అప్పుడు భార్యాభర్తలకి ఓ ఆలోచన వస్తుంది, అక్కడ కట్టుకున్న ఇల్లు ఖర్చుపెట్టేసి, హాయిగా ఈ ఊళ్ళోనే ఓ ఎపార్టుమెంటు కొని పడేస్తేనే బాగుంటుందేమో అని. తమ తరువాత పిల్లలు అంతంత దూరాలు వెళ్ళి ఎక్కడుంటారూ, మనకే దిక్కులేదూ, వైద్యసదుపాయాలా అంతంతమాత్రమే. పిల్లలు ఇంతంతదూరంలోనూ, మనమేమో అక్కడా, పైగా దగ్గరా దాపా, అనేసికుని యుగళగీతం పాడేసికుని, ఇంటికి ఎంతొస్తుందీ అమ్మితే అని ఆ ఊళ్ళోఉండే ఏ తెలిసినవాడిదగ్గరో, ఓ చుట్టం చెవిలోనో వేస్తారు. ఇలా చెప్పబడిన చుట్టమూ, తెలిసినాయనా ఎవరి ప్లాన్లు వాళ్ళు వేసికుంటారు. వాళ్ళకెలాగూ ముందరే తెలుసు, ఎప్పటికోఅప్పటికి ఈ ఇల్లు అమ్మాల్సిందే అని. పావులు చకచకా మని నడిపిస్తారు. అడిగినవాడికీ అడగని వాడికీ చెప్పడం, ఓ ఇల్లోటుంది అమ్మకానికీ అంటూ. ఎంత చెప్తున్నారేమిటీ అని అడిగితే. ఆయనకైతే ఓ పదిపదిహేను లక్షలదాకా బేరాలొస్తున్నాయండీ, అయినా తెలిసినవాళ్ళకిద్దామని మీతో చెప్పేను. అసలు ఆరోజుల్లో మార్కెట్ ప్రకారం, అయిదారులక్షలొచ్చినా గొప్పే. ఆ విషయం ఆ ఇల్లమ్మాలని ఉన్నాయనకీ తెలుసు. మరీ తక్కువచెప్తే వాడు కొనేస్తాడేమో అనే భయంతో, గిరాకీలు రాకుండా చేసే ఓ ట్రిక్కన్నమాట ఇది. ఇక్కడ నెలకీ ఓ రెండుమూడు సార్లు ఫోన్లు చేయడం వ్యవహారం ఎక్కడిదాకా వచ్చిందీ అని, అక్కడేమో వాళ్ళేదో ఉధ్ధరించేస్తున్నట్టుగా, "చూస్తున్నామండీ బేరాలూ, మొన్ననే ఒకరిద్దరు చూసుకుని వెళ్ళేరూ, ఏ సంగతీ చెప్తామన్నారూ.. " అంటూ. ఎమౌంటు విషయం వీళ్ళూ అడగరూ, వాళ్ళూ చెప్పరూ. చివరకి గతిలేక మనదగ్గరకే కాళ్ళ బేరానికి వస్తాడూ, చవకలో కొట్టేయొచ్చూ అని వాళ్ళ ప్లానూ. అప్పుడు అకస్మాత్తుగా జ్ఞానోదయం అయి, ఏ నెట్టులోనో ప్రకటన పెట్టి మొత్తానికి ఆ ఇంటిని అమ్ముకోవాలి. అప్పుడే ఎక్కడయిందీ, తీరా వెళ్ళి చెప్పేటప్పటికి, "ఆ మాత్రానికి మేమే కొనుక్కుందుంకదా, బయటి బేరాలు బాగానే వస్తున్నాయీ, నీకెందుకూ నష్టమూ అని కానీ.. తీరా ఇలా చేశావన్నమాట.. ", అని పుల్లవిరుపుమాటలు మిగులుతాయి.
అలాగే ఊళ్ళో ఉండే ఏ ఎపార్టుమెంటో అద్దెకు ఇవ్వాలంటే, ఏ ఏజంటుద్వారానో ఏర్పాటు చేసికోవాలికానీ, తెలిసినవాడుకదా అని ఏ స్నేహితుడికో, చుట్టానికో అద్దెకు ఇచ్చేరా, ఛస్తే ఖాళీ చేయడు. అదే ఏ బయటివారికో అయితే కనీసం రాతకోతలైనా చేసికోవచ్చు. ఇంక పెళ్ళిసంబంధాలైతే అడగనే అఖ్ఖర్లేదు. అంతా ముసుగులో గుద్దులాటే. వీళ్ళకి కావాల్సిన కట్నకానుకలా అడగడానికి మొహమ్మాటం. ఫరవాలేదూ మనవాడే సద్దుకుపోతాడూ అని పిల్లనిచ్చేవాళ్ళూ, చివరకి నానా గొడవానూ.
అందుకే అసలు ఏమీ తెలియనివారితో లావాదేవీలే హాయి. ఓ గొడవుండదూ, అన్నీ సవిస్తరంగా మాట్టాడుకోవచ్చు.