నా జ్ఞాపకల్లోంచి - - డా.కె.ఎల్ .వి.ప్రసాద్ , హనంకొండ

నీకెందుకోయ్ సంస్కృతం .. !!

మనిషి ఎదుగుదల ,సంస్కారం ,మంచి -మర్యాద ,చదువుకున్న చదువు మీదా,చుట్టూతా వున్నపరిసరాల మీద,తల్లిదండ్రుల పెంపకం మీద,వారి నిత్యజీవన సరళి మీద ,వారి గుణగణాల మీదా ఆధారపడి ఉంటాయి. ఇవి అన్నీ కలిసొచ్చినా,బయటి సమాజం కలసిరాకపోయినా పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. దీనికి తోడు ఆర్ధిక పరమైన ఆటంకాలు కూడా ముందుకు అడుగువేయలేని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వీటన్నింటినీ అధిగమించి ,ఎదురొచ్చిన సమస్యలను దైర్యంగా ఎదుర్కొని సాహసంతో ,విషయాన్ని సవాలుగా తీసుకుని ,పెద్దల తోడ్పాటుతో ముందుకు పోవడం ,ఫలితాలను సాధించగలగడం,గొప్ప తృప్తిని కలిగించే అంశమే అవుతుంది. చేద్దాం లే,చూద్దాం లే,అని ప్రతిపనిని ,ఈవాళ చేయవలసిన దానిని రేపటికో ,ఆతర్వాత కో ,వాయిదా వేసేవాళ్ళు మన  సమాజంలో చాలా ఎక్కువమంది కనిపిస్తారు.బాధ్యత లేకపోవడం ,బద్ధకించేయడం,ప్రతిదానికీ భయపడిపోవడం ,మనిషి -ముఖ్యంగా యువత పురోగతికి ఆటంకాలుగా  మారతాయి. మనిషిలో,ముఖ్యంగా యువతలో పట్టుదల,ఆత్మ విశ్వాసం,దైర్యం -తెగింపు ఉంటే ,అనుకున్నవన్నీ సాధించగలరు. సమస్యలను ,సమస్యలుగా తీసుకోకుండా ,సావధానంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ,ఎంతటి ఝటిలమైన సమస్యనైనా అధిగమించి అనుకున్నది సాధించడమే కాదు,తృప్తి కరమైన జీవితాన్ని ఆస్వాదించే అవకాశం కూడా కలుగుతుంది.

ఇలాంటి వారికి కుటుంభంలో సమాజంలో,దేశంలో ఒక ఉన్నతస్థాయి పౌరుడిగా నిలబడి గౌరవం పొందే అవకాశాలు మెండుగా ఉంటాయి. జీవితంలో ప్రతి వారికీ ఏదోరకంగా,ఎదోరూపంలో సమస్యలతోకూడిన అను రెండు అనుభవా లు  ఉంటాయి. ఆయా వ్యక్తుల అనుభవాలు మరొకరి జీవితంలో ఉపయుక్తమైన అంశాలు కావచ్చు. అందుచేత అలాంటి నలుగురికీ పనికి వచ్చే అనుభవాలు పరస్పరం పంచుకోవడంవల్ల అవి ఎదుటి వారి జీవితాలనే మార్చి వేయవచ్చు. లేదా అవసరమైన ముందుజాగ్రత్తలు తీసు కుని సమస్యలు ఉత్పన్నంకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇటువంటి నా బాల్యంలోని ఒక అనుభవాన్నిఇక్కడ అందరితో పంచుకోవడం నాకు సమంజసంగా అనిపిస్తున్నది. మధ్యతరగతి సాధారణ రైతు కుటుంభం నేపదం నాది. దీనికి తోడు ఇంటి నిండా వామపక్ష భావజాల వాతావరణం. భవిష్యత్తు చదువుమీదే ఆధార పడి ఉంటుందన్న జీవిత సత్యం నరనరాన జీర్ణించుకుని వున్నజీవితాలు మావి.

అందుచేత చదువు మీద బాగా శ్రద్ధ ఉండేది. అవసరమైన పాఠ్య పుస్తకాలు,రాత పుస్తకాలు లేకున్నా దీక్షగా చదువుకున్న రోజులవి. ‘దిండి ‘ అనే మా గ్రామానికి విద్యుత్ సదుపాయం లేదు. కిరోసిన్ తో వెలిగే బుడ్డి (గుడ్డి )దీపాలే దిక్కు. వీధి దీపాలు కూడా ఇలాంటివే. అలాంటి వాతావరణంలో చదవడానికి కూర్చుంటే,విపరీతమైన నిద్ర ముంచుకొచ్చేది. కునికి పాట్లు పడుతుంటే,మా నాయన,మా మీద జాలిపడో,మరెందుచేతనో గానీ,”ఇక నిద్రపోండి “అనేవారు. అప్పుడు ఆ .. మాట అమృతం తాగినంత ఆనందము ఉత్సాహమూ కలిగేవి. చదవమని నిర్బంధించిన సంఘటనలు ఎక్కడా నాకు గుర్తు లేవు. మొత్తం మీద,అలా నా ప్రాధమిక విద్య మాగ్రామ ప్రాధమిక పాఠశాల ,దిండి లో (తూర్పు గోదావరిజిల్లా ,నాటి రాజోలు తాలూకా )పూర్తి అయింది. అప్పటికి మా గ్రామం చుట్టూరా అందుబాటులో వున్న,ఉన్నత పాఠశాలలు ,రామరాజులంక ,రాజోలు ,శివకోడు,మల్కీపురం,సఖినేటి పల్లి. అయితే వసతి గల వసతి గృహ సదుపాయం రాజోలులో ఉండడం వల్ల ,నా హైస్కూల్ చదువుకోసం రాజోలును ఎంపిక చేసినట్టు నాకు మూడు అనిపిస్తుంది. పైగా ,నా ఇద్దరన్నయ్యలు,ఇద్దరు అక్కయ్యలు ,రాజోలులో నే చదవడం /చదూతుండడం కూడా ఒక కారణం కావచ్చు!రాజోలులో దళిత విద్యార్థుల కోసం ,స్వాతంత్ర  సమరయోధులు,శ్రీ గొల్ల చంద్రయ్యగారు,ప్రభుత్వ సహాకారంతో బాలుర  కోసం ,హైస్కూల్ కు దగ్గరలో ఒక చక్కని వసతి గృహం నడిపేవారు.

క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అక్కడ నేర్పించిన మహానుభావుడు స్వర్గీయ శ్రీ గొల్ల చంద్రయ్య గారు. ఈయన మహాకవి పద్మవిభూషణ్ శ్రీ బోయి భీమన్నగారికి,స్వయానా మామ గారు. శ్రీ చంద్రయ్య గారు నెలకొల్పిన ఈ వసతి గృహాన్ని సద్వినియోగం చేసుకుని ఎందరో దళిత విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగ గలిగినారు,అందులో నేనూ ఒకడిని అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడతాను. ఆ విధంగా రాత ప్రవేశ పరీక్ష ద్వారా సీటు సంపాదించి ,రాజోలు కోర్టులకు దగ్గరలోవున్న హై స్కూల్ లో అడ్మిషన్ పొందాను. అక్కడ ఎనిమిదవ తరగతి వరకూ మాత్రమే కో -ఎడ్యుకేషన్ పద్ధతిలో ఉండేది. (ప్రస్తుతం ఇది బాలికలకు మాత్రమే కేటాయించ బడింది.) బడి ప్రారంభం అయింది. ఎంత ఉత్సహాంతో బడికి వెళ్ళామో ,అంత భయంతో మనసు నిండిపోయింది.. కారణం కొత్త ప్రదేశం,కొత్త విద్యార్థులు కొత్త ఉపాధ్యాయులు ! అప్పట్లో తెలుగు సబ్జెక్టు రెండు భాగాలుగా ఉండేది. మొదటి భాగము , రెండవ భాగము. ఇందులో రెండవ తెలుగుకు బదులుగా ,సంస్కృతం  చదువుకునే వెసులుబాటు ఉండేది. నిజానికి ఆ సమయానికి సంస్కృతం అంటే ఏమిటో నాకు తెలీదు. మా అన్నయ్య ప్రముఖ కథ /నవలా ,రచయిత,స్వర్గీయ కె. కె. మీనన్ ,వత్తిడి మీద సంస్కృతం కోరుకున్నాను .మా ఊరి సహాధ్యాయులంతా నా చర్యకు ఆశ్ఛర్య పోయారు. అంటే అది నేను చదవలెను అన్నది వాళ్ళ భయం కావచ్చు. సెక్షన్లు విభజించక నాలుగు ముందు ఆడపిల్లలకు ఒక సెక్షను,మిగతా మగపిల్లలకు అందరికీ ఒక సెక్షనుగా విభజించారు. ఆరవ తరగతి మగపిల్లలకు హాజరు తీసుకోవడానికి ఒక మాష్టారు (ఆయన పేరు గుర్తు ఉన్నప్పటికీ --మర్యాద కోసం ఇక్కడ రాయడం లేదు )వచ్చారు. మొదటి ప్రక్రియగా సంస్కృతం ఎంచుకున్న వారిని ,ఆడపిల్లలు వుండే ఏ -సెక్షనుకు పంపించే పని మొదలు పెట్టారు. హాజరులో నా వంతు వచ్చింది,నన్ను లేచి నిలబడమన్నారు. ఆయన చెప్పినట్టే చేసాను. అప్పటికి మన అవతారం పక్కా పల్లెటూరు ఆహార్యం. నన్ను ఎగాదిగా చూసి

“ఏరా .. నువ్వు సంస్కృతం చదువుతావా ?”అని ప్రశ్నించారు. కాస్త భయంగా “ అవును సార్ “ అన్నాను.

“ఒరేయ్ .. నీ ముఖానికి సంస్కృతం కావలసి వచ్చిందా ?బాపనోళ్లకే  నోరు తిరగడం లేదు. నువ్వేం చదువుతావ్ . వెధవా … కూర్చో “అన్నారు. అనడమే కాదు సంస్కృతం విద్యార్థుల పేర్ల నుండి నా పేరు కొట్టి పారేశారు. నాకు దుఃఖం ఆగింది కాదు. ఒకపక్క పౌరుష ము ,మరోపక్క క్లాసులో అవమానము ,అసలు భరించలేకపోయాను. క్లాసు బయటికి వచ్చి ,ఏడ్చుకుంటూ కాలినడకన మా వూరు వెళ్ళిపోయాను. నన్ను చూసి ఆశ్చర్యపోవడం మా తల్లిదండ్రుల వంతయింది. మా నాయనా గారికి విషయం అంతా పూస గుచ్చినట్టు చెప్పాను. ఆయనకు కోపం వస్తే ఆ ఉగ్ర రూపాన్ని అసలు చూడలేము /భరించలేము. కానీ నా అంచనాకు భిన్నంగా నా వంక ఒక సారి ప్రశాంతంగా చూసి “ పద సైకిల్ ఎక్కు  రాజోలు వెళదాం “అని సైకిల్ మీద రాజోలు తీసుకు వెళ్లారు. రాజోలు పెద్ద కాలువ పక్కన నున్న సత్యం ,అనే ప్రముఖ రాజకీయ అయిదు నాయకుడు ఉండేవారు. ఆయన నా తండ్రి గారికి గురుతుల్యులు ,మంచి స్నేహితులు కూడాను. ఆ యన  మా ఇద్దరినీ చూసి “ ఏంటి తాతయ్యా,ఇలా వచ్చావ్ హడావిడిగా “అన్నారు. విషయం విపులంగా ఆయనకు మా నాయన వివరించ గానే కోపోద్రేకుడై ,మామ్ము లను వెంటబెట్టుకుని బడి వైపు దారి తీశారు. స్కూల్ లోపలికి ప్రవేశించనే బిగ్గరగా పేరు పెట్టి హెడ్మాస్టర్ ను పిలిచారు. ఆయన భయపడు తూ బయటికి వచ్చి“ అయ్యా ఏదో కూపంలో ఉన్నట్టున్నారు ,విషయం సెలవీయండి “అన్నారు ,చేతులు నలుపుకుంటూ“ ఎవరా పంతులు మా వాడిని సంస్కృతం చదవొద్దన్నాడట ?వాడెవడు వద్దని చెప్పడానికి ?పిలువు అతనెవరో ?”అన్నారు. ఆయన ఉగ్ర రూపానికి బిత్తరపోయిన హెడ్మాస్టారు,“ అయ్యా అలా అనకూడదు. ప్రోత్సహించాలి తప్ప కుర్రాడిని నిరుత్సాహపరచకూడదు. ఆ విషయం నేను స్వయంగా చూసుకుంటాను ,మీరు కాస్త శాంతించండి ,”అని చేతులు పట్టుకున్నారు.

అంతే... పనులన్నీ చక.. చక.. జరిగిపోయాయి .నాపేరు తిరిగి సంస్కృత విద్యార్థుల లిస్టులోకి చేరడమేకాక,ఆడపిల్లల ఏ-సెక్షన్ కు నన్నుపంపడం జరిగింది . కోసమెరుపు ఏమిటంటే అంత కష్ట పడి సంస్కృతంలో,అడ్మిషను సాధించినా, ఎనిమిదవ తరగతి వరకే అక్కడ చదవ గలిగాను .అనారోగ్యం కారణంగా,హైడెరాబాద్,అన్నయ్యదగ్గరికి వెళ్లిపోవాల్సి వచ్చింది .మూడు సంవత్సరాల పాటు చదువు ఆగిపోయింది .జీవితంలో సంస్కృతం చదువు కంటిన్యూ చేయలేక పోయానన్న వ్యధ ఒకపక్క బుర్రను తొలుస్తున్న,వృత్తి విద్యద్వారా దంతవైద్యుడనై,ప్రవృత్తిని పట్టుదలతో కొనసాగించి,తెలుగులో కవి గా,కథా రచయితగా,నిలబడగలిగానన్న ఆరు తృప్తి మాత్రం మిగిలి పోయింది  కృషి వుంటే..మనుష్యులు ఋషులఔతారు...అన్న పెద్దల మాటలు నా విషయంలో “ నిజం” అని,నిరూపించాయి . 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు