విధ్యార్ధులు చదువు ‘కొంటున్నారు’ తప్ప చదువుకోవడంలేదు - కొత్తపల్లి ఉదయబాబు

study

శ్రీ గురుభ్యోన్నమః

*శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

 ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే!

*సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ

 విద్యారంభం కరిష్యామీ సిద్ధిర్భవతు మే సదా!

*జ్ణానానందమయం దేవం నిర్మల స్పటికాకృతిమ్

 ఆధారం సర్వవిద్యానామ్ హయగ్రీవ ముపాస్మహే.!

ఏదైనా విద్యా ప్రారంభానికి ముందు విద్యాధిదేవతలైన ఈ ముగ్గురికీ మనస్ఫూర్తిగా ప్రార్ధనతో నమస్కరించి ముందుకు సాగడం ప్రతీ విద్యార్ధి లక్షణం. లక్ష్యం ఉంటేనే లక్ష్మి నిలబడుతుంది అంటారు పెద్దలు.అసలు లక్ష్యానికి లక్ష్మికి సంబంధం ఏమిటి? అన్న విషయాన్ని పరిశీలిస్తే -సమాజంలో తల్లి తండ్రుల అనురాగ ఫలంగా ఒక అబ్బాయో, అమ్మాయో జన్మించిన క్షణం నుంచే నేర్చుకోవడం అనేది ప్రారంభం అవుతుంది. సహజంగా పిల్లలు ఏడుస్తూ జన్మిస్తారు. ఒకవేళ అలా ఏడవకపోతే ఒక చిన్న చరుపు చరిచి మరీ ఏడవడం నేర్పుతారు డాక్టర్లు. అప్పటివరకూ తల్లి గర్బంలో ఉండగా ముడుచుకుపోయి ఉన్న శ్వాసకోశాలు ఒక్కసారిగా విచ్చుకుని బిడ్డ ఏడవడం నేర్చుకుంటాడు. అప్పటినుంచి తల్లికి కూడా బిడ్డ పట్ల బాధ్యత మొదలై  తనపాలు ఎలా తాగాలో నేర్పుతుంది. ఆకలి వేసినప్పుడు ఏడవడం, ఎవరైనా పలకరిస్తే బోసినవ్వులు నవ్వడం, కేరింతలు కొట్టడం, క్రమేపీ ముందుగా తల్లిని, తరువాత కుటుంబ వ్యక్తుల్ని గుర్తించడం నేర్చుకుంటాడు. చిన్న చిన్న సౌజ్ణలకు స్పదించి మనమ తిరిగి వల్లెవేస్తే ప్రతిస్పందిస్తాడు.మనం ఏదైనా చెబితే వూ..కొడతాడు.

బోర్లా పడటం, పాకడం, డేకడం, నెమ్మదిగా తలుపులు, గోడలు పట్టుకు నిలబడటం నేర్చుకుంటాడు. బుడిబుడి అడుగులు వేస్తూ పడుతూ లేస్తూ నడక నేర్చుకుని తరువాత తగిలేది తప్పేది చూసుకోకుండా పరుగెట్టడం నేర్చుకుంటాడు. మనం పెద్దవారుగా వాళ్ళకి ఎన్ని రకాలుగా నేర్పగలిగితే అన్నీ రకాలుగా వారు నేర్చుకోవడానికి సంసిద్ధులై ఉంటారు. అలా అలా  ఎదుగుతూ అక్షరాభ్యాసం చేసే దశకి వచ్చినప్పుడు మనం ఎంతో ఉల్లాసంగా నిర్వహిస్తాం ఆ కార్యక్రమాన్ని. బిడ్డ ఏ  వస్తువు పట్టుకుంటాడో అని బంగారపూ వస్తువులు ,  పుస్తకాలు,  పువ్వులు,  పెన్ను,  నోట్ల కట్టలు, కొత్త బట్టలు అన్నీ వాడికి ఎదురుగా ఉంచుతాము. వాడు పట్టుకున్న వస్తువుని బట్టి వారీ భవిష్యత్తు ఉజ్జాయింపుగా నిర్ణయిచేస్తాం. 

మనిషి జీవితాన్ని పరిపూర్ణంగా వికసింపచేసే  అత్యంత విలువైనది -  అతని ఆజ్ణానమ్ పోగొట్టి వీజ్ణానాన్ని అందించేది ‘’ విద్య ‘ . అని గుర్తెరిగి ఓర్పు సహనంతో ఆదిగురువుగా మన బాధ్యత నెరవేర్చిననాడు పిల్లవాడి మనసులో  విధ్యపట్ల నిజమైన బీజం పడి అది చిన్ననాటినుంచే అభిరుచిగా మారుతుంది. తన చుట్టూ సమాజంలో రకరకాల స్థాయిలలో ఉన్న వ్యక్ల్తుల్ని గుర్తించి తనకంటూ ‘’పెద్దయ్యాకా ఏమవుతావు ?’’ అని అడిగితే  తన బుల్లిమనసులో అప్పటికి తనకు నచ్చిన ఒక వృత్తి పేరు చెప్పడానికి ప్రయత్నిస్తాడు.అంటే అతను తనకు తెలియకుండానే ఒక లక్షాన్ని ఏర్పరచుకుంటున్నాడన్నమాట.

అలా ఏర్పరచుకోలేని పిల్లల పట్ల ప్రేమను కురిపిస్తూ మనమే రకరకాల లక్ష్యాలను సూచిస్తూ అడిగితే, వారికి దానిగురించి వారికి అర్ధమయ్యే భాషలో చెప్పినప్పుడు తప్పక వారిలో బీజం పడుతుంది. ఇక ఆ లక్ష్య  సిద్ధికి చిన్ననాటినుంచే పునాది వేయవలసిన బాధ్యత ఖచ్చితంగా తల్లి తండ్రులది, ఉపాధ్యాయులదే.. అయితే దురదృష్టవశాత్తూ ‘’డబ్బు కడుతున్నాం కదా...ఆ బాధ్యత కేవలం పాఠశాలలో విద్య బోధించే ఉపాధ్యాయులదే ‘’అని భావించే ఎక్కువ శాతం తల్లిదండ్రులను ఈనాటి సమాజం లో మనం చూస్తున్నాం.అందుకే ఎక్కువ శాతం విధ్యార్ధులు చదువు ‘కొంటున్నారు’ తప్ప చదువుకోవడంలేదు, నేర్వడం లేదు  అన్నది తెలిసిన రహస్యం.

తల్లితండ్రుల  కష్టం విలువ తెలుసుకుని, తామ ఏర్పరచుకున్న లక్షాన్ని సాధించి ఆర్ధిక సంపాదనలో ఆ వ్యక్తి స్థిరపడిననాడు ‘’లక్ష్యం (ఏర్పరచుకుని) ఉంటే లక్ష్మి (ధనం) నిలబడుతుందన్నది వాస్తవమని, ఆ రెంటికి గల సంబంధమే ఒక స్థిరమైన జీవితమని ఇటు విద్యార్ధులు అటు తల్లితండ్రులు గ్రహించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

‘’ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది ‘’ అన్న కొఠారీ కమిషన్ చెప్పిన వాక్యం విద్యని అభ్యసించే విద్యార్ధి దగ్గరనుంచి తల్లితండ్రులు, ఉపాధ్యాయులు అందరూ నిత్యసత్యం గా స్వీకరించి అనుసరించవలసిన వాక్యం.

అవును. వాస్తవం. ఒక దేశంలోని ప్రజలంతా ముందుగా విద్యావంతులు కావాలి. కనీసం తన మాతృభాష ను,  రాయడం,  చదవడం,  మాతృభాషలో  సంతకం చేయడం నేర్చుకోవాలి.ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నెన్నో అక్షరాస్యతా పధకాలను ప్రవేశపెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అయినా దేశంలో అన్నీ రాష్ట్రాలలోనూ సంపూర్ణ అక్షరాస్యతా సాధించలేక పోయింది.ఇంకా స్పష్టం గా చెప్పాలంటే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా కష్ట పడే తత్వం గల నిజాయితీ అధికారులు కొరవడటం వల్ల ఆ పధకం నీరుకారింది. కానీ మనిషి ఈ నాడు జీవిస్తున్న అవసరాల దృష్ట్యా విద్యా యొక్క ఆవశ్యకతను దారిద్ర్య రేఖకు దిగువ నున్న ఎక్కువ శాతం  ప్రజలు గుర్తించగలిగారు. అందుకే తాము పగలల్లా శ్రమకోర్చి కూలీ నాలి చేసి తమ పిల్లల్ని విద్యార్ధులు గా మలుచుకుంటున్నారు.

అయితే దురదృష్టవశాత్తూ  ఆంగ్ల విద్య మీద మోజుతో ప్రాధమిక విద్య అనగా  ఒకటవ తరగతి నుండి అయిదవతరగతి వరకు ఫీజు కట్టి చదివించుకుని, ఆపైన ఉన్నత  పాఠశాలలో అనగా ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు  ఫీజులు కట్టుకోలేక తెలుగు మాధ్యమాన్ని ఆశ్రయిస్తున్నారు తల్లితండ్రులు. దాంతో విద్యార్ధులు యే మాధ్యమం లోనూ కూడా అర్ధం చేసుకోలేక విధ్య పట్ల అయిష్టత చూపుతున్నారు.కొందరు  అయోమయస్థితిలో కొనసాగిస్తున్నారు. మరికొందరు మధ్యలో మానివేస్తున్నారు. దానికి తోడు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా తమకు అనుగుణం గా నిర్ణయాలు తీసుకుని అటు విద్యార్ధులను, ఇటు తల్లి తండ్రులను సంకటస్థితికి గురిచేస్తున్నాయి,. త్రీభాషా సూత్రాన్ని అనుసరిస్తున్నా యే భాషలోనూ కనీస సామర్ధ్యాలు సాధించలేక విధ్యార్ధులు అవస్థలు పడుతున్నారు.

వీటికి తోడు ప్రభుత్వ పాఠశాలలో సిబ్బంది కొరత, వనరుల కొరత, ఉపాధ్యాయుల కొరత, పర్యవేక్షణాలోపం, మొదలైన కారణాలు విధార్ధుల బాధ్యతారాహిత్యానికి మూలాలవుతున్నాయి.

ఏది యెమైనా విద్య అనేది మనిషి యొక్క అజ్నానాన్ని తొలగించి జ్నానజ్యోతి వెలిగిస్తుందన్నది నిత్యసత్యం. దాని యొక్క అవసరాన్ని ఆవశ్యకతని అభం శుభం తెలియని పిల్లలకు తెలియచెప్పాల్సిన బాధ్యత, అవసరం ముందుగా కన్నా, తల్లితండ్రులకు, ఆ తరువాత వారికి చదువుపట్ల అవగాహన, అభిరుచి కలిగించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దల్సిన బాధ్యత ఉపాధ్యాయులకు ఉన్నది అన్నది నిర్వివాదాంశం.

“అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా

చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవేనమ “ అని విద్యార్ధులు గురువును  నిరంతరం ప్రార్ధించుకునే దిశగా విద్యార్ధులు ఎదిగిననాడు ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుంది!!!

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు