అమెరిగన్ సంస్కృతి! - టీవీయస్. శాస్త్రి

american gun culture

ఇటీవల పత్రికలలో చదివే వార్తలలో మనల్ని ఎక్కువుగా కలచివేసే విషయం -- అమెరికాలో ఉన్మాదుల విచ్చలవిడి కాల్పులు. వారు ఎందుకు కాల్చారో ప్రపంచ దేశాలకు తెలియనివ్వదు ఆ దేశపు ప్రభుత్వం. దేవాలయాల్లో కాల్పులు, గురుద్వారాలో కాల్పులు, షాపింగ్ మాల్స్ లో కాల్పులు, వైద్యశాలలో కాల్పులు, విశ్వవిద్యాలయాల్లో కాల్పులు, చిన్నారులు చదువుకునే స్కూల్స్ లో కాల్పులు, నివాస స్థలాలలో కాల్పులు, విమానాశ్రయాలలో కాల్పులు ఇలా ఎక్కడబడితే అక్కడ కారణమేమీ లేకుండా కాల్పులు జరుగుతుంటే, మహారాజశ్రీ ఒబామా గారు మీడియా ముందు కన్నీరుతో ప్రత్యక్షమై సానుభూతి చూపిస్తుంటారు. హింస, రక్తపాతం, బూతును వినోదం కోసం టీవీలలో, సినిమాలలో అమెరికా విచ్చలవిడిగా చూపిస్తుంది. అన్నిటితో పాటు ఆఖరికి వినోదాన్నికూడా వ్యాపారంగా మార్చగలిగిన అమెరికా స్వేఛ్ఛావిపణి నైతిక విలువలను పూర్తిగా విస్మరించింది.

సంపాదనే ముఖ్య ఆశయంగా ప్రసార మాధ్యమాలు పనిచేస్తున్నాయి ఆ దేశంలో. (మనం కూడా ఆ దిశలోనే పయనిస్తున్నాం అనుకోండి!) ప్రసారమాధ్యమాల పుణ్యమా అని అమెరికా పిల్లలు హింస, బూతును బాల్యంనుండే గమనిస్తున్నారు. దీని ఫలితంగా ఆ లేతమనసులలో క్రూరమైన భావాలు మొలకెత్తటంలో ఏ మాత్రం ఆశ్చర్య పడనవసరంలేదు! ఇంత ఘోరం జరుగుతున్నా ఆయుధాలు విచ్చలవిడిగా దొరకకుండా చేయటానికి తగిన మార్గాలను గుర్తించి, వాటిని అమలులోకి తీసుకొనిరాదు అ(ఉ)గ్రరాజ్యమైన అమెరికా. నిజానికి ఆ దేశం అలా చేయదలచుకుంటే, ఆపనిని క్షణంలో చేయగలదు. దానికి కావలసిన వనరులు వారికి పూర్తిగా ఉన్నాయి. అమెరికా ఆ పని ఎందుకు చేయదో ఒబామాకే ఎరుక! ఆ దేశ జనాభా మన దేశ జనాభా కన్నా చాలా తక్కువ. నిజానికి, మన దేశంలో కూడా అనుమతి లేని చాలామంది వద్ద ఆయుధాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే! కానీ, వీరు ఆ ఆయుధాలను కేవలం తమ ఆత్మరక్షణ కోసం, ప్రత్యర్ధుల మీద ఉపయోగించటానికి మాత్రమే వాడుతారు. అంతకు మించి అమెరికాలోలాగా విచ్చలవిడిగా కాల్పులు జరిగిన సంఘటనలు లేవు. ఒక్క టెర్రరిస్టులు మాత్రమే ఇలాంటి దుశ్చర్యల్యకు పాల్బడిన సంఘటనలు మాత్రమే మనకు తెలుసు. ఒక పది ఏళ్ళు అక్కడ ఉన్న మనవాళ్ళలో కొందరు కూడా, పరిసరాల ప్రభావాల వల్ల ఉన్మాదులుగా నెమ్మదిగా మారుతున్నారు.

చెప్పాలంటే, చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇందుకు. గతంలో, చిన్నారి సాన్వీని, ఆ పాప నాయనమ్మను దారుణంగా చంపిన కిరాతకుడు ఘనమైన మనవాడే!అక్కడి విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి, సంపాదించిన ధనాన్ని దుబారా చేసి అక్రమ మార్గాలు తొక్కటం తప్ప కొంతమందికి వేరే మార్గం లేక ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. అమెరికా దేశానికి ఉన్న యంత్రాంగానికి అక్రమ ఆయుధాలను వశపర్చుకోవటం పెద్ద సమస్య కాదు. కనీసం ఆ దేశపు భద్రత దృష్ట్యా కూడా అది ఆత్యవసరం. అలా చేయనిచో ఆ దేశపు ఉనికికే పెనుముప్పు వాటిల్లే ప్రమాదముంది. వీటన్నిటినీ మించి, ఆర్ధిక పరిస్థితులు బాగాలేని ఆ దేశ ప్రజలు చాలామంది నిరాశా, నిస్పృహలతో Psychics గా మారుతున్నారు. దీనిని భద్రతా సమస్యాగానే కాకుండా, సామాజిక సమస్యగా కూడా గుర్తించవలసిన అవసరం ఎంతో ఉంది. మరి ఆ దేశపు నేతలు ఈ విషయానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వరో అర్ధం కాదు. భారతీయుల మీద ఫలానా చోట కాల్పులు-అనే వార్తను విన్నప్పుడు ఆ ప్రదేశంలో ఉండే తమ పిల్లల క్షేమంకోసం ఇక్కడ తల్లితండ్రులు పడే మానసిక వేదన వర్ణనాతీతం.

ఒక 20 ఏళ్ళ క్రితం అమెరికాకు వెళ్లిన మనవారు, అక్కడే స్థిరపడ్డారు. ఇక్కడ 80 ఏళ్ళ వయసులో ఉన్న వారి తల్లితండ్రుల బాధలు చెప్పనలవి కాదు. అలాంటి వృద్ధులు ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నారో ప్రతివారికీ తెలుసు. విశాలమైన ఇళ్ళను బాగుచేయించుకోలేక, అనారోగ్యంచేత బాధపడుతున్న వీరి దురవస్థను గమనించి, అదే ఆసరాగా తీసుకొని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ ఇంటి స్థలాలను development పేరు మీద ఆ వృద్ధులకు తృణమో పణమో ఇచ్చి కాజేస్తున్నారు. అసలు అమెరికా అంటే తల్లితండ్రులకు, పిల్లలకు కూడా పిచ్చి వ్యామోహం. కారణం, దానిని ఒక భూతల స్వర్గంగా చిత్రీకరించటంలో ఆ దేశాధినేతలు కృతకృత్యులయ్యారు. పోనీలే, ఏదో మనవాళ్ళు'భూతల స్వర్గంలో' ఉన్నారని ఆనందించుదామా? అసలు ఆ దేశపు ఆర్ధిక స్థితిగతులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. చైనా, అమెరికా ఆర్ధిక వ్యవస్థలు ఏదో ఒక క్షణానికి హఠాత్తుగా కుప్పకూలిపోయే ప్రమాదముంది. అమెరికా మాత్రం, కేవలం తన కండబలాన్ని(సైనిక సంపదను)చూపించి ప్రపంచాన్ని భయభ్రాంతులను చేస్తుంది. ఆ దేశానికి ఉన్న అప్పులు నిప్పులై మండుతున్నాయి.

మనవాళ్ళు ప్రస్తుతం అక్కడ చాలామంది మంచి ఉద్యోగాలలోనే ఉన్నారు. అమెరికా దేశస్తులలో చాలామందికి ఇది కంటకింపుగా ఉంది. ఏదో ఒకనాటికి, మనవారి వద్దనే వారు, వారి స్వదేశంలోనే పనిచేసే రోజు రానున్నది. ఇది వాస్తవం. ఇది కూడా ఉన్మాదుల విచ్చలవిడి కాల్పులకొక ముఖ్య కారణం. నిజానికి అది 'భూతల స్వర్గం' అని భావించే వారికి అది ఒట్టి భ్రమేనని, అది'భూతాల నరకంగా' మారటానికి ఎంతో కాలం పట్టదని ప్రపంచపు ఆర్ధిక నిపుణుల విశ్లేషణ!

మనలోని క్రూరత్వాన్ని పాతరేస్తే, ఇతరులను ప్రేమించే శక్తి సహజంగానే వస్తుంది.

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి