చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

chamatkaram

ఈ మధ్య దేశంలోని పారిశ్రామికరంగం లో జరుగుతూన్న మార్పులు చూస్తూంటే.. “ భూమి గుండ్రంగానే “ ఉంటుందన్న విషయం, నమ్మాల్సిందే కదా…  పరిశ్రమలు అభివృధ్ధి చెందుతూన్న రోజుల్లో ఉండే పరిస్థితికి వచ్చేసింది. స్వతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాలకి, ఆరోజుల్లో ఉండే ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుని, తమకు తామే కొన్ని సంస్థలు/ పరిశ్రమలూ స్థాపించారు.. ఆనాటి కాలమాన పరిస్థితులకి అవి బాగానే ఉన్నట్టనిపించేవి.. అసలు ఉద్దేశ్యం.. యువతకు ఉద్యోగాలు కలిపించి, జీవనోపాధి చూపించడం. గ్రామాల్లో వ్యవసాయం చేసేవారు.. అదేదో ఆర్ధిక వ్యవస్థట అది బలహీనపడ్డంతో, చాలా పరిశ్రమలు మూతబడుతున్నాయి, వాటిమీద ఆధారపడ్డ చిన్న చిన్న కంపెనీలు కూడా మూతబడుతున్నాయి…అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టుంది.. వీళ్ళదారిన వీళ్ళు, కొన్ని సంవత్సరాలపాటు జీవనోపాధి కలిపించిన ప్రభుత్వ కంపెనీలు మూసేయడం లో బిజీ గా ఉన్నారు. ప్రెవేటు రంగంలో ఉన్నవాటినే మూసేస్తూంటే, ఇప్పుడు ప్రభుత్వకంపెనీలని మూసేసి, ఈ ప్రెవేట్ వారికి కట్టబెట్టడంలో లాజిక్ ఏమిటో ఎవరికీ అర్ధవదు..

ఈ మధ్యన  పేపర్లలో చదువుతున్నాము—ఆటో రంగం కుదేలైపోయిందని, వాటితోపాటే స్పేర్ పార్ట్స్ తయారుచేసే ఎన్నో ఎన్నెన్నో చిన్నచిన్న పరిశ్రమలుకూడా మూతబడ్డాయి.. అలాగే ఏరంగం చూసినా ఇదేపరిస్థితి. అప్పటికీ ప్రభుత్వం, బడ్జెట్ లో ప్రకటించిన పన్నులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.. ఎంత తగ్గించినా కొనేవాళ్ళుండొద్దూ? ఈ పరిశ్రమలు మూతబడ్డంతో, అప్పటిదాకా లక్షలు జీతాలు తీసుకుంటున్న వారినే, ఉద్యోగాలనుండి తీసేస్తున్నారు, చివరకి ఐటీ రంగం లో కూడా.. మిగిలిన పరిశ్రమలు సరీగ్గా ఉంటేనే కదా, ఈ ఐటీ వాళ్ళకి బేరాలొచ్చేదీ.. దీనితో జరిగిందేమిటంటే అదేదో  Vicious Circle  లా , ఒకదానిమీద ఆధారపడ్డవాళ్ళందరూ రోడ్డున పడ్డారు.. ఇంత హడావిడి జరుగుతూన్నా ప్రభుత్వం మాత్రం , మన ఆర్ధిక వ్యవస్థ అద్భుతంగా ఉందనే ప్రకటనలు చేస్తారు…

 ఎన్ని వ్యాపారాలు మూతబడినా, దేశంలో మూడు వ్యాపారాలు మాత్రం ఎప్పటికీ మూతబడవు.. విద్య,  కార్పొరేట్ ఆసుపత్రులు, భక్తి.. ఈ మూడూమాత్రం నిత్యకల్యాణం పచ్చతోరణాల్లాగే ఉండడం ఖాయం. అదేదో రెసెషన్ అవనీయండి, లేకపోతే ఆర్ధిక మాంద్యం అవనీయండి పై వ్యాపారాలకి ఎటువంటి ఢోకా లేదు..

ఈ రోజుల్లో పేరెంట్స్ తలతాకట్టు పెట్టైనా సరే,తమ పిల్లల్ని ఖరీదైన కార్పొరేట్ స్కూలుకే పంపుతారు.. లేకపోతే సొసైటీలో తలెత్తుకోలేరుగా మరి. ఏమాత్రం ఛాన్స్ దొరికినా ఈ కార్పొరేట్ యాజమాన్యాలు కొండెక్కేస్తారు.. ఫీజులు ఎంత తక్కువలో ఉండాలని , ప్రభుత్వాలు   G O  లు పెట్టినా, వీళ్ళదారి వీళ్ళదే.కారణం—నూటికి నూరు పాళ్ళూ, ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నీ, ఏ రాజకీయనాయకుడికో చెందినవే.. .. ఆర్ధిక వ్యవస్థ ఏమైపోతే ఎవరికీ? వీళ్ళకేమాత్రం  డబ్బులొస్తాయి.

ఆ తరవాత వైద్య రంగం.. ఎంతైనా మనిషి ప్రాణానికి సంబంధించినది కూడానూ.. దిగువతరగతివాళ్ళకైతే అవేవో ఆరోగ్యశ్రీపథకాలూ వగైరాలుంటాయి.. కొద్దిగా ఆర్ధిక స్థోమతున్నవారైతే మెడికల్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది.. వచ్చిన వాడి ఆర్ధిక స్థోమతను బట్టి రోగాలు నిర్ధారణ చేయడం చూస్తూంటాం… ఓసారి పరిక్ష చేసి, అదేదో చాలా ప్రమాదకరమైన  రోగమూ, వెంటనే అదేదో స్టెంట్ వేయకపోతే ప్రాణానికే హానీ, అంటూ ఓ నాలుగైదు ఎక్స్ రేలు చూపించి హడలుకొట్టేయడం.. నిజమే కాబోసనుకుని హాస్పిటల్లో చేరి, అవేవో వేయించుకోవడం.. గ్యారెంటీ ఏమైనా ఉంటుందా అంటే అదీ ఉండదూ.. ఏదో ఊళ్ళోవాళ్ళు సరైనవైద్యసహాయం లేక, పెద్దాయన్ని చంపేసారూ అంటరేమో అని ఈ హడావిడంతా చేయడం.. ఆర్ధిక వ్యవస్థతో సంబంధం లేని రంగం ఇది…

మన దేశంలో  దేవుడి సెంటిమెంట్ చాలా ఎక్కువ.. దేవుడి పేరు చెప్పి ఏదైనా చేసేయొచ్చు..దైవభక్తి ఉండాలి కాదనం, కానీ మరీ ఇంతవిపరీతంగానా? అభిషేకాల పేరుతో కొన్ని లక్షల లీటర్ల పాలు పోస్తారు… అదేదో దీక్షల పేరుపెట్టి ఫలానా దీక్షకి ఫలానా రంగుబట్టలు కడితేనే పుణ్యం, లేకపోతే ఆ దేవుడికి కోపం వచ్చి శపిస్తాడూ అనడం తరవాయి, పొలోమంటూ వేసేసికోవడం. ఏశాస్త్రం లో ఇవన్నీ చెప్పారో మాత్రం ఎవరికీ తెలియదు.. ఈ దేవుళ్ళూ, పూజలూ యుగయుగాలనుండీ ఉన్నాయి..కానీ ఆరోజుల్లో ఇలాటి నిబంధనలుండేవి కావే..  అసలు వచ్చిన గొడవేమిటంటే,  నిజమైన భక్తికంటే, భక్తుందని చూపించుకోవడం ముఖ్యమైపోయింది, ఈ ప్రసారమాధ్యమాల ధర్మమా అని.. ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికైనా సరే, రంగురంగుల డిజైనర్ చీరల్లోనే కనిపిస్తారు…భక్తి వ్యాపారం ఉన్నన్నాళ్ళూ ఆర్ధికమాంద్యమైతేనేమిటి, మరోటైతేనేమిటీ…

సర్వేజనా సుఖినోభవంతూ…

 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు