చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండటాన్ని కార్తీకం అని అంటారు. హరిహరాదులకు ప్రీతికరమైన మాసం కార్తీకం. మన పురాణాల్లో ఈ మాసం ప్రస్తావన ఎంతో ప్రత్యేకం కార్తీకం హిందువులకు ఎంతో పవిత్రమైన మాసం .కార్తీక మాసం లో సోమ వారాలు , ఏకాదశి , ద్వాదశి , పౌర్ణమి విశేషమైన రోజులు . వీటిలో కార్తీక పౌర్ణమి అత్యంత విశిష్టమైనది అని పురాణ కధనం . కార్తీక మాసానికి ఐతిహాసిక మహత్యమే కాదు శాస్త్రీయ ప్రమాణాలు విలువలు ప్రయోజనాలు కూడా ఎన్నో కలవు .
కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. మాహా భారత కధనం ప్రకారం కార్తీక పౌర్ణమి నాడే తారకాసురుని కార్తికేయుడు సంహరించాడు. వెయ్యేళ్ళ రాక్షస పాలన తారకాసుర సంహారంతో అంతరించిపోయినందుకు ప్రజలు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు .ఇలాగా కూడా దీపాలు వెలిగించే ఆనవాయితీ మొదలైందని భావించ వచ్చు .కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగిస్తే మనం తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ తొలగి పోతాయని పురాణ కధనం . కార్తీక పౌర్ణమి నాడు హరునికి ప్రీతికరమైన రుద్రాభిషేకం , బిల్వార్చన చేయడం ఎంతో పుణ్యప్రదం . కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకోవడం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం .హరిహరాదులకు బహు ప్రీతికరమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి ఇంతటి పవిత్రమైన రోజున ఏ చిన్న దైవ కార్యం చేసినా దాని ఫలితం వెయ్యి రెట్లు ఉంటుందని పురాణ పురుషుల ఉవాచ .కార్తీక మాసం లో తెల్లవారు ఝామున చేసే స్నానం వలన ఎన్నో ఆరోగ్య మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలవు . కార్తీక మాసం లో వాతావరణం చల్లగా వుంటుంది . ఈ చలికాలం వలన మానవ శరీరం కొన్ని అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం వుంటుంది. తెల్లవారు ఝామున చన్నీళ్ళ స్నానం చేయడం వలన మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది . అందువలన శీతాకాలం లో వచ్చే అనారోగ్యాలు మన దరి దాపులకు కూడా రావు .
ఈ కలి కాలం లో వేగవంతమైన జీవనశైలి లో మానవులకు నిత్య పూజాదికాలు నిర్వహించే అవకాశాలు తగ్గిపోయాయి. పురాణాల్లో చెప్పినట్లు రోజూ పూజలు , దీపారాధనలు చేయలేని వారు కనీసం ఈ కార్తీక పౌర్ణమి రోజైనా దీపాలు వెలిగించి దైవ ప్రార్ధన చేస్తే నెలంతా పూజలు చేసినంత ఫలితం కలుగుతుందని మన పురాణ పురుషులు ప్రవచించారు . కార్తీక మాసం అంతా ఉపవాసం ఉండలేని వారు కనీసం ఈ ఒక్క రోజైనా ( పౌర్ణమి ) ఉప వాసం వుంటే ఎంతో ఫలితాన్ని పొందుతారని పురాణ కధనం .కార్తీక మాసం లో ఉపవాసం వుండటం వలన మానవ శరీరం లో ఉష్ణోగ్రత వుత్పన్నమై శీతాకాలపు చలిని తట్టుకునే శక్తిని పొందుతాడు . కార్తీక మాస దీక్ష వలన ( తెల్లవారు ఝామున స్నానాలు , దీపారాధన , కార్తీక పురాణం చదవడం / వినడం తప్పకుండా ౩౦ రోజులు చేయడం ) అక్షయ సిద్ది మాత్రమె కాదు ఎంతో ఆరోగ్య దాయకం కూడా అని మన శాస్త్ర ప్రమాణాలు విశదపరుస్తున్నాయి కార్తీక పౌర్ణమి నాడు గురునానక్ జయంతి కూడా కాబట్టి పంజాబీలు , జైనులు కూడా పౌర్ణమి నాడు ఎంతో భక్తీ శ్రద్ధలతో ప్రార్ధనలు దాన ధర్మాలు చేస్తారు . కార్తీక మాసం లో మరో ప్రత్యేకమైన విషయం కేదారేశ్వర వ్రతం .. ఈ వ్రతం ఎంతో మహిమ కలది . ఈ వ్రతం కార్తీక పౌర్ణమి నాడు భార్య భర్తలు ఇద్దరు కలిసి చేసుకోవడం వలన భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది పగలంతా ఉపవాసం వుండి చంద్రోదయం అయిన తర్వాత దీపారాధన చేసి చలిమిడి ( బియ్యం పిండి + బెల్లం + పాలు కలిపి చేసే పదార్ధం ) చంద్రునికి నైవేద్యం పెట్టి మనం స్వీకరించిన యెడల కడుపు చలవ అంటారు పెద్దలు . ఈ చలిమిడి స్వీకరించడం వలన గర్భాశయ సమస్యలు దరి చేరవని ఆయుర్వేద వైద్యుల ఉవాచ . కార్తీక పౌర్ణమి రోజున శివాలయాల్లో జరిపే జ్వాలా తోరణం మరో ప్రత్యేకం . జ్వాలా తోరణం అనగా వరిగడ్డితో శివాలయాల్లో తోరణం కట్టి దానికి అగ్ని పెట్టి అది రాజుకుంటూ వున్నప్పుడు కాని కింద నుండీ భక్తులు ఆలయ ప్రాంగణం లోకి ప్రవేశిస్తారు .
ఇలా చేయడం వలన మన పాపాలు తొలగి పోతాయని పురాణాల వల్ల భక్తుల నమ్మకం . ఈ జ్వాలా తోరణం వల్ల పాపలు తొలగి పోవడమే కాకుండా శీతాకాలం లో వచ్చే క్రిమి కీటకాలు నశిస్తాయి . మరియు ఈ జ్వాల తోరణం పొగ వలన శ్వాస కోశ సంబంధ వ్యాధులు నశిస్తాయి అని శాస్త్ర ప్రమాణం. కార్తీక మాస మరియు కార్తీక పౌర్ణమి యొక్క మరో విశిష్టత దీప దానం చేయడం ....కార్తీక పౌర్ణమి నాడు దీప దానం చేయడం వలన భక్తులు ముక్తి పొందుతారని పురాణ ప్రతీతి . కార్తీక మాస / కార్తీక పౌర్ణమి మరో ప్రత్యేకం దీపాలు వెలిగించడం ,,,సంవత్సరం అంతా నిత్య దీప రాదన చేయని / చేయలేని వారు కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులు ఆవు నేటితో తడిపి దీపం వెలిగించినట్లయితే సంవత్సర మంతా నిత్య దీపారాధన చేసినంత ఫలితం దక్కుతుందని పురాణ కధనం. కార్తీక మాస పవిత్రత , మహత్యం గురించి తెలుసుకోవాలనే తలంపు రావడం తోనే కొంత పుణ్యం దక్కుతుందని పెద్దల ఉవాచ .
సర్వేజనా సుఖినో భవంతు
లోకా సమస్తా సుఖినో భవంతు .