ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు - భమిడిపాటి ఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

ఈవారం ( 8/11- 14/11 ) మహానుభావులు.

జయంతులు

8 నవంబర్

శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు :  వీరు నవంబర్ 8, 1893 న బెంగుళూరు లో జన్మించారు. ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు. కర్ణాటక సంగీతం వయొలిన్ మీద వినిపించొచ్చని, ప్రపంచానికి చూపిన మొదటి వ్యక్తిగా భావిస్తారు. ఎన్నో కచేరీలు చేసారు.

9 నవంబర్

శ్రీ దువ్వూరి రామిరెడ్డి : వీరు నవంబర్ 9, 1895 న గూడూరు లో జన్మించారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. వీరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది. కలకండ వంటి కమ్మని కావ్యాలు, పలకరిస్తే అశుధారాపాతంగా జాలువారే పద్యపూరిత ప్రబంధాలే కాకుండా సంస్కృత, అరబిక్ భాషల నుంచి ఎన్నో పుస్తకాలను ఆంధ్రీకరించిన నవ్యరీతి దువ్వూరి ప్రత్యేకం.

11 నవంబర్

శ్రీ సుసర్ల దక్షిణామూర్తి : వీరు నవంబర్ 11, 1921 న పెదకళ్ళేపల్లి లో జన్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు.  నిండైన గాత్రం ఉన్న దక్షిణామూర్తి తొలి రోజుల్లో సినీ నేపథ్య గాయకుడిగా పలు పాటలు పాడారు. నటుడి గా కూడా  వేసారు. ఓ సినిమా కూడా నిర్మించారు.

13 నవంబర్ 

శ్రీ పురిపండా అప్పలస్వామి :  వీరు నవంబర్ 13, 1904 న  సాలూరు  లో జన్మించారు. బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు పాత్రికేయులు. పత్రికా రంగంలో వీరు తన ప్రతిభను ప్రదర్శించారు. వీరు సాహిత్యరంగంలో సాధించిన కృషి పరిగణన పొందింది. కేంద్ర సాహిత్య అకాడమీ కోరికపై వీరు 'అమృత సంతానం', 'మట్టి మనుష్యులు' అనే ఒరియా నుండి తెనిగించారు. వంగసాహిత్య చరిత్ర, ఒరియా సాహిత్య చరిత్రలను వీరు తెలుగులో రచించారు. అలాగే ఆంధ్ర సాహిత్య చరిత్రను ఒరియా భాషలో రచించి తెలుగు సాహిత్యంతో పరిచయాన్ని ఒరియా పండితులకు కల్పించారు. శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి :  వీరు నవంబర్ 13, 1925 న రాజమండ్రీ లో జన్మించారు. అలనాటి తెలుగు సినిమా నటి మరియు ప్రసిద్ధ గాయకురాలు సినిమాల్లోకి వచ్చి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ నాలుగు భాషల్లోనూ మొత్తం ఇరవై ఆరు సినిమాల్లో నటించింది. లలిత గీతాలు యాభై, దేశభక్తిగీతాలు యాభై మొత్తం నూరు గ్రామఫోను రికార్డులు ఇచ్చింది. అలాగే ఒక యాభై దాకా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల సినిమాల్లో తన గొంతుతో పాడిన పాటల రికార్డులు ఉన్నాయి..

వర్ధంతులు

8 నవంబర్ 

శ్రీ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి :   ప్రముఖ సినీ దర్శక నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. ఆయన సృష్టించిన మల్లీశ్వరి బహుళ ప్రజాదరణ పొందిన చిత్రం. చిత్ర నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ క్వాలిటీ విషయంలో అంత కచ్చితంగానూ ఉంటారు బి.ఎన్. మాటల్లోనూ, పాటల్లోనూ ప్రతి అక్షరాన్నీ తరచితరచి చూసేవారు. వీరు నవంబర్ 8, 1977 న స్వర్గస్థులయారు.

10 నవంబర్

శ్రీ ఏటుకూరి వెంకటనరసయ్య :  క్షేత్రలక్ష్మి పద్యకావ్యంతో పేర్గాంచిన, హేతువాది, మానవతావాది, కవి. చందమామ మాస పత్రిక ఈయన నీతి వాక్యాలు ప్రచురించింది. వీరు నవంబర్ 8, 1949 న స్వర్గస్థులయారు. శ్రీ తెన్నేటి విశ్వనాధం  :ప్రముఖ  రాజకీయ నాయకుడు,  తంత్ర్యపోరాట యోధుడు, మాజీ న్యాయ, దేవాదాయ మరియు రెవిన్యూ శాఖామంత్రి. విశాఖ ఉక్కు కర్మాగారం నెలకొల్పటములో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తి. విశ్వనాధం గారు మంచి స్పురద్రూపి, వక్త గానే కాకుండా తెలుగు, సంస్కృత భాషలలో మంచి ప్రవేశము ఉన్న వ్యక్తి.  వీరు నవంబర్ 8, 1979 న స్వర్గస్థులయారు.

శ్రీ రాచకొండ విశ్వనాధ శాస్త్రి :  వృత్తి రీత్యా న్యాయవాది. రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన, కథల్లో కూడా న్యాయవాదే . నేటి సమాజంలో నిత్యమూ పై తరగతులవారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్ర హింసలు పడుతున్న దీన, హీన ప్రజల తరపున తన ప్రతి రచనలోను వకాల్తా పుచ్చుకుని సాంఘిక (ఆర్థిక)న్యాయం కోసం "వాదించాడు". సమాజం అట్టడుగు పొరల్లో, అనుక్షణం భయపడుతూ జీవించే అథోజగత్సహొదరుల సమస్యలను, వాటివలన కలిగే దుఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి "పిండ" గల ఏకైక ప్రతిభావంతుడు.విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల  మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో, సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా, పాఠకుల హృదయాలకు హత్తుకు పోయేలా పదునైన రచనలు చేసారు. వీరు నవంబర్ 8, 1993 న స్వర్గస్థులయారు.

13 నవంబర్

శ్రీ కాళోజీ నారాయణరావు :   ఆయన తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతారు. ఆయన రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తారు. ఆయన స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు. ఆయన 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పొందారు. వీరు నవంబర్ 13, 2002 న స్వర్గస్థులయారు.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు